న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం ప్రెస్టీజ్ గ్రూప్ తాజాగా రుణ భారం తగ్గించుకునేందుకు, భవిష్యత్ వృద్ధి ప్రణాళికల్లో భాగంగా వివిధ వాణిజ్య అసెట్స్‌ను విక్రయించే ప్రయత్నాల్లో ఉంది. ఇందుకోసం అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ బ్లాక్‌స్టోన్‌తో చర్చలు జరుపుతోంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 12,000 కోట్ల నుంచి రూ.13,500 కోట్ల దాకా ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ భారీ ఒప్పందం ప్రస్తుత త్రైమాసికంలోనే పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ప్రెస్టీజ్ ఎస్టేట్ సుమారు 8 మిలియన్ చ.అ. విస్తీర్ణమున్న ఆఫీస్ పార్క్‌లు (నిర్మాణం పూర్తయినవి), దాదాపు 4 మిలియన్ చ.అ. విస్తీర్ణమున్న తొమ్మిది మాల్స్ (ఇప్పటికే కార్యకలాపాలు జరుగుతున్నవి) విక్రయించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక నిర్మాణంలో ఉన్న మరో 3–4 మిలియన్ చ.అ. విస్తీర్ణమున్న ఆఫీస్ ప్రాజెక్టుల్లో 50 శాతం దాకా వాటాలను కూడా విక్రయించవచ్చని వివరించాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఈ అసెట్స్ ఉన్నాయి. మొత్తం 16 మిలియన్ చ.అ. విస్తీర్ణమున్న ఆఫీస్ పార్కులు, తొమ్మిది మాల్స్, రెండు హోటళ్లతో కలిపి ఉన్న పోర్ట్‌ఫోలియో విలువ దాదాపు 1.6–1.8 బిలియన్ డాలర్ల మేర ఉండవచ్చని పేర్కొన్నాయి.
భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి..
ప్రెస్టీజ్ ఎస్టేట్స్ రుణభారం ప్రస్తుతం రూ. 8,000 కోట్ల స్థాయిలో ఉంది. ప్రతిపాదిత లావాదేవీ ద్వారా వచ్చే నిధుల్లో కొంత భాగాన్ని రుణాలను తీర్చివేసేందుకు కంపెనీ ఉపయోగించనుంది. అలాగే, భవిష్యత్ వృద్ధి అవకాశాల కోసం మిగతా నిధులను వినియోగించనుంది.
భారీ విలువ డీల్..: ఒకవేళ ప్రెస్టీజ్ గ్రూప్, బ్లాక్‌స్టోన్ మధ్య డీల్ కుదిరితే రియల్టీలో వేల్యుయేషన్‌పరంగా అత్యంత భారీ ఒప్పందంగా నిలవనుంది. కొన్నాళ్ల క్రితం డీఎల్‌ఎఫ్ తమ కమర్షియల్ పోర్ట్‌ఫోలియోలో 33% వాటాను సింగపూర్ సార్వభౌమ ఫండ్ జీఐసీకి రూ. 9,000 కోట్లకు విక్రయించింది. అమెరికాకు చెందిన బ్లాక్‌స్టోన్ ఇప్పటిదాకా భారత రియల్ ఎస్టేట్ రంగంలో 8 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment