mega deal
-
Reliance-Disney: త్వరలో రిలయన్స్–డిస్నీ స్టార్ ఇండియా విలీనం
న్యూఢిల్లీ: దేశీయంగా మీడియా రంగంలో కన్సాలిడేషన్‌కు తెరతీస్తూ డిస్నీ–స్టార్ ఇండియాను విలీనం చేసుకునే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మెగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన నాన్–బైండింగ్ టర్మ్ షీటుపై సంతకాల కోసం లండన్‌లో జరిగిన భేటీలో డిస్నీ ప్రతినిధి కెవిన్ మేయర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన మనోజ్ మోదీ తదితరులు పాల్గొన్నారు. ఒప్పందం కుదరడంతో వ్యాపార విలువ మదింపు తదితర ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం 45–60 రోజుల గడువు విధించుకున్నారు. అవసరమైతే దీన్ని పొడిగించే అవకాశం ఉంది. జనవరి ఆఖరు నాటికి ఈ డీల్‌ను పూర్తి చేయాలని రిలయన్స్ ఆసక్తిగా ఉన్నప్పటికీ ఫిబ్రవరి ఆఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ పూర్తిగా స్టాక్, నగదు రూపంలో ఉండగలదని వివరించాయి. ఇరు సంస్థలు టర్మ్ షీటుపై చాలాకాలంగా కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రతిపాదన ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన వయాకామ్18, స్టార్ ఇండియా కార్యకలాపాలను విలీనం చేస్తారు. విలీన సంస్థలో రిలయన్స్‌కు 51 శాతం, డిస్నీకి 49 శాతం వాటాలు ఉండనున్నాయి. ఇందులో స్టార్ ఇండియాకు చెందిన 77 చానల్స్, వయాకామ్18కి చెందిన 38 చానల్స్ కలిపి మొత్తం 115 చానల్స్ ఉంటాయి. వీటితో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా అనే రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు కూడా భాగమవుతాయి. జీ ఎంటర్టైన్మెంట్, కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ (గతంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా) విలీన ప్రక్రియ జరుగుతుండగా కొత్తగా రిలయన్స్, డిస్నీ–స్టార్ డీల్ కూడా కుదిరితే దేశీయంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
గుడ్ న్యూస్: టీసీఎస్ వేల కోట్ల రూపాయల మెగా డీల్
TCS deal with JLR దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మెగా డీల్ కుదుర్చుకుంది. టాటామోటార్స్ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ, లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR)తో మెగా డీల్‌ను గెలుచుకున్నట్లు ప్రకటించింది. భవిష్య డిజిటల్ సేవల కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు తెలిపింది. (మోడ్రన్ కార్లలో సెక్స్ నుంచి పాలిటిక్స్ దాకా మొత్తం లీక్: షాకింగ్ రిపోర్ట్) జేఎల్ఆర్తో రానున్న ఐదేళ్లకుగాను రూ.8,300 కోట్ల( 1 బిలియన్ డాలర్ల) కొత్త భాగస్వామ్య డీల్ జరిగినట్లు టీసీఎస్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. కొత్త భవిష్యత్-సిద్ధమైన, వ్యూహాత్మక సాంకేతిక నిర్మాణాన్ని రూపొందించే క్రమంలోఈ డీల్ 'రీఇమాజిన్' వ్యూహానికి మద్దతు ఇస్తుందని పేర్కొంది. (క్షీణిస్తున్న బంగారం, వెండి ధరలు: ఈ వివరాలు చూడండి!) టీసీఎస్ సేవల్లో అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్, ఎంటర్ప్రైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, క్లౌడ్ మైగ్రేషన్, సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా సర్వీసెస్ లాంటివి ఉన్నాయి. ఈ డీల్‌పై ఇదరు సంస్థలు సంతోషాన్ని ప్రకటించాయి. అనిశ్చిత డిమాండ్ వాతావరణం, కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు లేక ఐటీ మేజర్లు అష్టకష్టాలు పడుతున్న తరుణంలో టీసీఎస్ ఐరోపాలో ఈ క్యాలెండర్ సంవత్సరంలో గెలిచిన ఆరవ ప్రధాన ఒప్పందం కావడం విశేషం. -
టెకీలకు గుడ్ న్యూస్: ఇన్ఫోసిస్ మెగా డీల్
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీ డీల్ ప్రకటించింది. లండన్‌కు చెందిన టెలికాం సంస్థ లిబర్టీ గ్లోబల్‌తో కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు ఒకపెంనీలు మంగళవారం సంయుక్త ప్రకటన జారీ చేసాయి. ఎనిమిదేళ్లు లేదా అంతకు మించి పొడిగించే ఎంపికతో ప్రారంభ ఐదేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఇన్ఫోసిస్ ఈ ఏడాది చేసుకున్న మూడో మెగా వ్యాపార ఒప్పందం కావడం విశేషం. దీంతో దేశీయ ఐటీ పరిశ్రమకు మంచి రోజులు రాబోతున్నాయనే ఆనందం ఐటీ వర్గాల్లో నెలకొంది. టెలికాం డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కనెక్టివిటీ ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేయడానికి , స్కేల్ చేయడానికి ఐదేళ్లపాటు 1.64 బిలియన్ డాలర్ల (రూ. 13,673 కోట్లు) ఒప్పందంపై సంతకం చేశాయి. అంతేకాదు కాంట్రాక్టును ఎనిమిదేళ్లకు పొడిగిస్తే, ఇన్ఫోసిస్ లిబర్టీ గ్లోబల్‌కు 2.5 బిలియన్ల డాలర్లు(రూ. 20,970 కోట్లు) సేవలను అందిస్తుంది. ఇన్ఫోసిస్ కోబాల్ట్‌ను ఉపయోగించి లిబర్టీ గ్లోబల్ కోసం తాము ఏర్పాటు చేసిన క్లౌడ్-ఫస్ట్ డిజిటల్ ఫౌండేషన్‌ను పూర్తి చేయడానికి ట్రాన్స్ఫార్మేటివ్ ఏఐ-ఫస్ట్ సామర్థ్యాలను ప్రారంభించేలా ఈ డీల్ సంతోషంగా ఉందని కంపెనీ సీఈవో సలీల్ పరేఖ్ తెలిపారు. అటు లిబర్టీ గ్లోబల్ సీఈఓ మైక్ ఫ్రైస్ కూడా ఈ ఒప్పందంపై సంతోషాన్ని ప్రకటించారు. కాగా ఇన్ఫోసిస్ మేలో, బ్రిటిష్ చమురు గ్యాస్ కంపెనీ బీపీ తో 1.5 బిలియన్ల డాలర్ల డీల్కుదుర్చుకుంది. అలాగే జూన్‌లో డాంక్సే బ్యాంక్‌తో 454 మిలియన్ డాలర్లు విలువైన ఒప్పందాన్ని చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఇన్ఫోసిస్ జాక్‌పాట్! రూ.16,400 కోట్ల మెగా డీల్..
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వరుస డీల్స్‌తో దూసుకుపోతోంది. తాజాగా 2 బిలియన్ డాలర్ల మెగా డీల్‌ను దక్కించుకుంది. ఇది వరకే కొనసాగుతున్న ఓ క్లయింట్‌తో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమెషన్ ఆధారిత అభివృద్ధి, ఆధునికీకరణ, నిర్వహణ సేవల కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్లకు ఇన్ఫోసిస్ తెలియజేసింది. ఐదేళ్ల పాటు కొనసాగే డీల్ విలువ 2 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. రూ.16,400 కోట్లు) అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ డీల్ పాతదా.. కొత్తదా.. క్లయింట్ కంపెనీ ఏదీ అన్న విషయాలను ఇన్ఫోసిస్ వెల్లడించలేదు. అయితే ఈ డీల్ ఇదివరకే ఉన్నదిగా తెలుస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఇన్ఫోసిస్ రెండు మెగా ఒప్పందాలను ప్రకటించింది. వీటిలో ఒకటి బ్రిటిష్ చమురు, గ్యాస్ కంపెనీ బీపీతో 1.5 బిలియన్ల డాలర్ల ఒప్పందం మరొకటి డాన్స్కే బ్యాంక్‌తో 454 మిలియన్ల డాలర్ల డీల్. ఇదీ చదవండి ➤ ఇలా చేస్తే జాబ్ పక్కా! ఐఐటీయన్, స్టార్టప్ ఫౌండర్ సూచన.. కంపెనీ మొదటి త్రైమాసిక ఫలితాలను వెల్లడానికి కొన్ని రోజుల ముందే ఈ మెగా గురించి ఇన్ఫోసిస్ స్టాక్ ఎక్స్ఛేంజ్లకు తెలియజేయడం గమనార్హం. అంతర్జాతీయంగా ఐటీ పరిశ్రమ ఆర్థిక అనిశ్చితి, వృద్ధి మందగమనం వంటి పరిస్థితులతో ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఇన్ఫోసిస్ మాత్రం ఈ త్రైమాసికంలో వృద్ధిని నమోదు చేస్తుందని నిపుణులు అంచనా వేశారు. అనుకున్నట్లుగానే ఇన్ఫోసిస్ వృద్ధిలో సహచర కంపెనీల కంటే ముందుంది. -
ఎయిరిండియా మెగా డీల్: భారీ ఉద్యోగాలు, సీఈవో కీలక ప్రకటన
సాక్షి, ముంబై: వ్యాపార దిగ్గజం టాటా గ్రూపు సొంతమైన ఎయిరిండియా దూసుకుపోతోంది. ముఖ్యంగా విమానాల కొనగోలులో రికార్డ్ సృష్టిస్తోంది. బోయింగ్, ఎయిర్‌బస్‌తో మెగా డీల్‌గా ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ సోమవారం మాట్లాడారు.సంస్థ వాణిజ్య విమానయాన చరిత్రలో అతిపెద్ద ఒప్పందాన్ని ప్రకటించిన కొన్ని వారాల తర్వాత, విల్సన్, ఈ డీల్ ప్రాముఖ్యత, భవిష్యత్తు మార్కెట్ వ్యూహంఅభివృద్ధిలో దాని పాత్ర గురించి వివరాలను బిజినెస్ టుడేతో పంచుకున్నారు. ప్రపంచ స్థాయి విమానయాన కేంద్రంగా దేశం ఆవిష్కారమయ్యే క్రమంలో విమానయాన చరిత్రలో ఇదొక గొప్ప పరిణామమని పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో 470 విమానాల కొనుగోలు డీల్ విలువ 70 బిలియన్లని సీఈవో తెలిపారు. ఈ సంవత్సరం చివరి నుండి దశాబ్దం చివరి వరకు విమానాల సేవలను ప్రారంభిస్తామని, కొత్త విమానాల ఫ్లీట్, పవర్ ముఖ్యమైన నెట్వర్క్ , సామర్థ్య విస్తరణ రెండింటినీ మార్చడానికి చారిత్రాత్మక మెగా డీల్‌కు కట్టుబడి ఉన్నామన్నారు. 5వేల పైలట్లు, ప్రతి నెలా 500మంది క్యాబిన్ ఈ నెల ప్రారంభంలో, విమానయాన సంస్థ తన విమానాలకు 470 విమానాలను చేర్చుకోనున్నట్లు సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.. దీని ప్రకారం ఈ 470 విమానాల్లో 220 విమానాలను బోయింగ్ నుంచి, 250 విమానాలను ఎయిర్‌బస్ నుంచి కొనుగోలు చేయనుంది. అలాగే గత వారం, విమానయాన సంస్థ 5వేల పైలట్లు , క్యాబిన్ సిబ్బందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. నెలకు 100మంది పైలట్లు, 500 మంది క్యాబిన్ సిబ్బంది,ఇతర గ్రౌండ్ స్టాఫ్‌ను చేర్చుకుంటున్నామని ఆయన తెలిపారు. నాన్‌ఫ్లైయింగ్ పొజిషన్లతో సహా 1,500 మందికి పైగా సంస్థలో చేరారని విల్సన్ చెప్పారు. ఎయిరిండియా- విస్తారా విలీనం ఎయిరిండియా, విస్తారా విలీనం మొదటి దశలో ఉందని కూడా సీఈవో ప్రకటించారు. తదుపరి దశ విలీనానికి డీజీసీఏ, సీసీఐ ఆమోదం తెలిపాల్సి ఉందన నారు. తక్కువ ధరల్లో సంపూర్ణమైన సేవలు అందించాలని టాటా గ్రూప్ లక్క్ష్యంగా పెట్టుకుంది. ఫ్యూచర్ ప్లాన్స్‌పై సీఈవో కీలక ప్రకటన ♦ 470 నారో, వైడ్‌బాడీ ఎయిర్‌బస్, బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ మెగా-డీల్‌తో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏవియేషన్ మార్కెట్లో విమాన ప్రయాణసేవల్ని, వస్తువుల రవాణా రూపురేఖలను పూర్తి మారిపోనున్నాయి. ♦ ప్రపంచంలోని ప్రముఖ విమానాల తయారీదారుల నుండి మరో 370 విమానాలను కొనుగోలు చేసి, ఆర్డర్ పరిమాణాన్ని 840 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు తీసుకువెళ్లే అవకాశాన్ని ఎయిరిండియా పరిశీలిస్తోంది. ♦ 2025 మధ్యకాలం నుండి పదేళ్లలో గణనీయమైన సంఖ్యలో డెలివరీలు షురూ చేయాలని ప్లాన్. ♦ఎయిరిండియా గ్రూప్ క్యారియర్లు ఎయిరిండియాఎక్స్‌ప్రెస్ ఏకీకరణ తర్వాత అత్యంత సమన్వయంతో కూడిన కార్యకలాపాలు. ♦ విమానయాన సంస్థ అంతర్జాతీయ , దేశీయ రూట్ నెట్వర్క్ రెండింటినీ పెంచడంపై సమానంగా దృష్టి ♦ మూడు ప్రధాన కేంద్రాల ఏర్పాటు వీటిలో దక్షిణ భారతదేశంలో ఒకటి ♦పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ స్పెషలిస్ట్‌ల కోసం శిక్షణ సౌకర్యాల ఏర్పాటు, అలాగే భవిష్యత్తుకార్యకలాపాలు,సేవల నిమిత్తం నిర్వహణ, మరమ్మత్తు, సమగ్ర (MRO) సామర్థ్యాల నిర్మాణం -
మెగా డీల్ జోష్: ఎయిరిండియాలో ఉద్యోగాలు, పైలట్‌కు జీతం ఎంతంటే?
సాక్షి,ముంబై: టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా ఎయిర్‌బస్, బోయింగ్ 470 విమానాలు కోనుగోలు తరువాత 2 లక్షలకు పైగ ఉద్యోగావకాశాలు లభించ నున్నాయంటూ ఇప్పటికే పలువురు నిపుణులు అంచనాలు వేశారు. ఈ నేపథ్యంలో ఎయిరిండియాలో నియామకాల జోష్ కని పిస్తోంది. కంపెనీ వెబ్‌సైట్‌లోని ఓపెనింగ్స్ ప్రకటన మేరకు పైలట్లకు ఏడాదికి రూ.2 కోట్ల వరకు చెల్లించనుంది. బోయింగ్, ఎయిర్‌బస్ విమానలు డెలివరీకి సిద్ధంగాఉన్న నేపథ్యంలో నియామకాల ప్రక్రియను ప్రారంభించింది. ఎయిరిండియాలో ఎయిర్‌లైన్ 'B777 కెప్టెన్ల' కోసం వెతుకుతోందని, వీరికి సంవత్సరానికి రూ. 2 కోట్లకు పైగా చెల్లించనుందని బిజినెస్ టుడే నివేదించింది. "B737 NG/MAX రకం రేటింగ్ ఉన్న పైలట్ల నుండి B777 ఫ్లీట్ కోసం ఫస్ట్ ఆఫీసర్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఎయిరిండియా వెబ్సైట్లో పేర్కొంది. ఆసక్తిగల అభ్యర్థులకు నెలవారీగా 21 వేల డాలర్లు వేతనం. అంటే వార్షిక ప్రాతిపదికన, రూ.2,08,69,416 పైమాటే. దీంతోపాటు క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ, ఇతర సిబ్బంది సహా అనేక ఓపెనింగ్లను ప్రకటించింది. నిపుణులైన పైలట్లు లేకపోవడం వల్ల ఈ పాత్ర చాలా ఎక్కువ జీతాన్ని ఆఫర్ చేస్తోంది. ఎయిర్‌లైన్ కన్సల్టింగ్ సంస్థ మార్టిన్ కన్సల్టింగ్ సీఈవో మార్క్ మార్టిన్ వాదించారు. ప్రపంచవ్యాప్తంగా పైలట్ కొరత ఉందనీ, నిర్దిష్ట విమానంలో కనీసం 5000 నుండి 7000 గంటల పాటు క్వాలిఫైడ్ పైలట్లకు చాలా డిమాండ్ ఉందన్నారు. ఎయిరిండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేంద్ర భార్గవ అభిప్రాయం ప్రకారం ప్రతి విమానానికి కనీసం 10 మంది పైలట్లు అవసరం, వారి షిఫ్ట్ మారుతూ ఉంటుంది కాబట్టి. అలాగే ప్రతి విమానానికి 50 కంటే తక్కువ క్యాబిన్ సిబ్బంది అవసరం. వీరితోపాటు చెక్అవుట్ కౌంటర్లో, బ్యాగేజీ హ్యాండ్లర్లు, మెయింటెనెన్స్ ఇంజనీర్లు మొదలైన సిబ్బంది కూడా అవసరమే. -
జోరుగా కార్పొరేట్ డీల్స్..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా దేశీయంగా విలీనాలు, కొనుగోళ్లు (ఎంఅండ్ఏ).. ఇతరత్రా కార్పొరేట్ డీల్స్ మాత్రం గతేడాది భారీగానే జరిగాయి. కోవిడ్ పూర్వ స్థాయిని మించి 159 బిలియన్ డాలర్ల విలువ చేసే 2,103 లావాదేవీలు నమోదయ్యాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే విలువపరంగా 29 శాతం పెరిగాయి. 2022 వార్షిక నివేదికలో పీడబ్ల్యూసీ ఇండియా ఈ అంశాలు వెల్లడించింది. దీని ప్రకారం మొత్తం డీల్స్‌లో ఎంఅండ్ఏ తరహా ఒప్పందాల వాటా అత్యధికంగా ఉంది. 20పైగా భారీ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ 2021తో పోలిస్తే రెట్టింపై 107 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదైంది. అయితే, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీన డీల్ (సుమారు 60 బిలియన్ డాలర్లు)ను మినహాయిస్తే మాత్రం ఎంఅండ్ఏ ఒప్పందాల విలువ 2021తో పోలిస్తే 15 శాతం తగ్గిందని నివేదిక తెలిపింది. ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులూ 2021తో పోలిస్తే 22 శాతం తగ్గి 52 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు పేర్కొంది. అయితే, అంతకన్నా ముందు మూడేళ్ల వ్యవధితో పోలిస్తే విలువ, పరిమాణంపరంగాను 20 శాతం ఎక్కువగానే నమోదైనట్లు వివరించింది. ఇన్వెస్టర్లు భారత్‌ను దీర్ఘకాలిక దృష్టితో చూస్తున్నారని, ప్రస్తుత మార్కెట్ మందగమనం కాస్త కష్టతరంగానే ఉన్నా చాలా మందికి పెద్దగా ఆందోళకరమైన అంశం కాకపోవచ్చని ఈ ధోరణుల ద్వారా తెలుస్తోందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ దినేష్ ఆరోరా తెలిపారు. ఆకర్షణీయంగా ఆర్థిక సేవలు, టెక్నాలజీ.. దేశీయంగా ఆర్థిక సేవలు, టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఇంధనం, విద్యుత్, ఇండస్ట్రియల్స్ మొదలైన విభాగాలు ఆకర్షణీయంగా ఉండగలవని నివేదిక పేర్కొంది. గతేడాది కంపెనీలు తమ స్థానాలను పటిష్టపర్చుకోవడం, పోటీని కట్టడి చేయడం, కొత్త వినూత్న విభాగాల్లోకి ప్రవేశించడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పేర్కొంది. దీనితో బ్యాంకింగ్, సిమెంట్, విమానయాన రంగాల్లో కొన్ని భారీ డీల్స్ చోటు చేసుకున్నాయని నివేదిక వివరించింది. -
జేఎస్‌డబ్ల్యూ నియో రూ.10,530 కోట్ల డీల్
న్యూఢిల్లీ: విద్యుత్ రంగంలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ భారీ డీల్‌కు తెరలేపింది. సంస్థ అనుబంధ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ 1,753 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పలు ప్రాజెక్టులను మిత్రా ఎనర్జీ నుంచి కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. డీల్ విలువ రూ.10,530 కోట్లు. వీటిలో 17 స్పెషల్ పర్సస్ వెహికిల్స్ (ఎస్పీవీ), మరొకటి అనుబంధ ఎస్పీవీ ఉంది. 1,331 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 10 పవన విద్యుత్ ప్రాజెక్టులు, 422 మెగావాట్ల ఏడు సోలార్ ప్రాజెక్టులు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ చేతికి రానున్నాయి. దక్షిణ, పశ్చిమ, మధ్య భారత్‌లో ఈ ప్రాజెక్టులు నెలకొన్నాయి. వీటి విద్యుత్ కొనుగోలు ఒప్పంద కాలపరిమితి సగటున మరో 18 ఏళ్లు ఉంది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ఖాతాలో ఇదే పెద్ద డీల్. తాజా కొనుగోలు ద్వారా జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ విద్యుత్ ఉత్పత్తి సాగిస్తున్న ప్రాజెక్టుల సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 4,784 నుంచి 6,537 మెగావాట్లకు చేరింది. నిర్మాణ దశలో ఉన్న 2,500 మెగావాట్ల పవన, జల విద్యుత్ ప్రాజెక్టులు రెండేళ్లలో జతవనున్నాయి. దీంతో జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ సామర్థ్యం 9.1 గిగావాట్స్‌కు చేరుతుంది. -
బ్లాక్‌స్టోన్‌తో ‘ప్రెస్టీజ్’ మెగా డీల్!
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం ప్రెస్టీజ్ గ్రూప్ తాజాగా రుణ భారం తగ్గించుకునేందుకు, భవిష్యత్ వృద్ధి ప్రణాళికల్లో భాగంగా వివిధ వాణిజ్య అసెట్స్‌ను విక్రయించే ప్రయత్నాల్లో ఉంది. ఇందుకోసం అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్లాక్‌స్టోన్‌తో చర్చలు జరుపుతోంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 12,000 కోట్ల నుంచి రూ.13,500 కోట్ల దాకా ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ భారీ ఒప్పందం ప్రస్తుత త్రైమాసికంలోనే పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ప్రెస్టీజ్ ఎస్టేట్ సుమారు 8 మిలియన్ చ.అ. విస్తీర్ణమున్న ఆఫీస్ పార్క్‌లు (నిర్మాణం పూర్తయినవి), దాదాపు 4 మిలియన్ చ.అ. విస్తీర్ణమున్న తొమ్మిది మాల్స్ (ఇప్పటికే కార్యకలాపాలు జరుగుతున్నవి) విక్రయించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక నిర్మాణంలో ఉన్న మరో 3–4 మిలియన్ చ.అ. విస్తీర్ణమున్న ఆఫీస్ ప్రాజెక్టుల్లో 50 శాతం దాకా వాటాలను కూడా విక్రయించవచ్చని వివరించాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఈ అసెట్స్ ఉన్నాయి. మొత్తం 16 మిలియన్ చ.అ. విస్తీర్ణమున్న ఆఫీస్ పార్కులు, తొమ్మిది మాల్స్, రెండు హోటళ్లతో కలిపి ఉన్న పోర్ట్‌ఫోలియో విలువ దాదాపు 1.6–1.8 బిలియన్ డాలర్ల మేర ఉండవచ్చని పేర్కొన్నాయి. భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి.. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ రుణభారం ప్రస్తుతం రూ. 8,000 కోట్ల స్థాయిలో ఉంది. ప్రతిపాదిత లావాదేవీ ద్వారా వచ్చే నిధుల్లో కొంత భాగాన్ని రుణాలను తీర్చివేసేందుకు కంపెనీ ఉపయోగించనుంది. అలాగే, భవిష్యత్ వృద్ధి అవకాశాల కోసం మిగతా నిధులను వినియోగించనుంది. భారీ విలువ డీల్..: ఒకవేళ ప్రెస్టీజ్ గ్రూప్, బ్లాక్‌స్టోన్ మధ్య డీల్ కుదిరితే రియల్టీలో వేల్యుయేషన్‌పరంగా అత్యంత భారీ ఒప్పందంగా నిలవనుంది. కొన్నాళ్ల క్రితం డీఎల్ఎఫ్ తమ కమర్షియల్ పోర్ట్‌ఫోలియోలో 33% వాటాను సింగపూర్ సార్వభౌమ ఫండ్ జీఐసీకి రూ. 9,000 కోట్లకు విక్రయించింది. అమెరికాకు చెందిన బ్లాక్‌స్టోన్ ఇప్పటిదాకా భారత రియల్ ఎస్టేట్ రంగంలో 8 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసింది. -
జియో మ్యానియా : క్యూలో టాప్ ఇన్వెస్టర్
సాక్షి, ముంబై: ఆసియా అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం దిగ్గజం జియో ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడుల మ్యానియా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచంలోని టాప్ కంపెనీలు జియోలో పెట్టుబడులకు క్యూ కట్టాయి. తాజాగా ఈ వరుసలో మరో టాప్ కంపెనీ నిలవనుంది. వరుస మెగా డీల్స్ తో దూకుడుగా ఉన్న జియో శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన టాప్ ఇన్వెస్టర్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ క్యాపిటల్ తో మరో భారీ ఒప్పందానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య చర్చలు చురుగ్గా సాగుతున్నట్టు సమాచారం. (రిలయన్స్ జియోలో ఏఐడీఏ పెట్టుబడి) రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియోలో టీపీజీ క్యాపిటల్ 1 నుంచి 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టనుందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ విషయంలో అధికారిక ప్రకటన మరి కొద్ది రోజుల్లో రానుందని తెలిపింది. 1992లో ఏర్పాటైన టీపీజీ ప్రైవేట్ ఈక్విటీ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 45కి పైగా స్టార్టప్‌లలో 70 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. ప్రధానంగా ఎయిర్ బీఎన్బీ, నైకా, లివ్‌స్పేస్, లెన్స్‌కార్ట్ , బుక్‌మైషో , సర్వేమన్కీ తదితరాలున్నాయి. (జియోలో రెండోసారి) కాగా గత ఏడు వారాల్లో జియోలో 21 శాతం వాటాల విక్రయం ద్వారా ఇప్పటికే రూ. 97,885.65 కోట్ల పెట్టుబడులను సాధించింది. ఫేస్బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ (రెండుసార్లు), జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబదాలా, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ) కంపెనీలతో మెగా డీల్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జియో మరో మెగా డీల్‌కు సిద్ధం!
సాక్షి, ముంబై : రిలయన్స్ సొంతమైన డిజిటల్ సంస్థ జియో ప్లాట్‌ఫామ్ మరో మెగా డీల్ ను తన ఖాతాలో వేసుకోనుంది. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలనుంచి పెట్టుబడులను సాధించిన జియో త్వరలోనే గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ తో మరో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. (రిలయన్స్ సామ్రాజ్యంలోకి మరో వారసుడు) ముకేష్ అంబానీ నేతృత్వంలోని జియోలో సత్య నాదెళ్ల సీఈవోగా ఉన్న టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ 2.5 శాతం వాటాను కొనుగోలు చేయనుందనే ఊహాగానాలు ఉన్నాయని మింట్ నివేదించింది. ఈ చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయనీ, తుది ఒప్పంద వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయని తెలిపింది. ఫిబ్రవరిలో భారతదేశ పర్యటన సందర్భంగా తన సేవలను మరింత విస్తరించ నున్నామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు. ప్రధానంగా అజూర్ క్లౌడ్ సేవలను క్యాష్ చేసుకోవటానికి భారతదేశం అంతటా డేటా సెంటర్లను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో తాజా అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. (ప్రత్యర్థులకు గుబులు : దూసుకొచ్చిన జియో మార్ట్) కాగా ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తోపాటు సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, కేకేఆర్ అండ్ కో, జనరల్ అట్లాంటిక్ వంటి దిగ్గజ సంస్థల నుండి 10 బిలియన్ డాలర్ల (రూ. 78,562 కోట్లు) పెట్టుబడులను జియో సాధించిన సంగతి తెలిసిందే. చదవండి : శాశ్వతంగా ఇంటినుంచేనా? నో...వే.. విమానం ఎక్కుతానని ఎప్పుడూ అనుకోలేదు -
నోకియా దూకుడు : భారీ డీల్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్ తయారీదారు నోకియా దూకుడు పెంచింది. భారతదేశపు అతిపెద్ద మొబైల్ ఆపరేటర్లలో ఒకటైన భారతి ఎయిర్టెల్ తో భారీ ఒప్పందాన్ని చేసుకుంది.1 బిలియన్ డాలర్ల (రూ.7,636 కోట్లు) విలువైన ఒప్పందాన్ని ఫిన్లాండ్కు చెందిన నోకియా మంగళవారం ప్రకటించింది. ఎయిర్టెల్ కంపెనీతో బహుళ సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ డీల్ ద్వారా దేశంలో వినియోగదారులకు నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, 5జీ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2022 వరకు భారత్‌లో 3 లక్షల కొత్త మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా నోకియా, ఎయిర్‌టెల్‌లు కలిసి పనిచేయనున్నాయని నోకియా ఒక ప్రకటనలో తెలిపింది. 4జీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంతో పాటు, 5జీ సామర్థ్యాలనుపెంచే ప్రయత్నంలో ఎయిర్టెల్ కు చెందిన దేశంలోని తొమ్మిది సర్కిల్‌లలో ఈడీల్ చేసుకుంది. అతిపెద్ద టెలికాం మార్కెట్లలోకనెక్టివిటీ భవిష్యత్తుకు ఇది చాలా ముఖ్యమైన ఒప్పందమని, భారతదేశంలో తన స్థానాన్ని ఇది మరింత పటిష్టం చేస్తుందని నోకియా సీఈవో రాజీవ్ సూరి అన్నారు. 1.3 బిలియన్ల జనాభాతో, ప్రపంచంలో రెండవ అతిపెద్ద టెలికాం మార్కెట్ భారతదేశంలో ఆన్లైన్ డిమాండ్ పెరిగేకొద్దీ రానున్న ఐదేళ్లలో మొబైల్ వినియగదారుల సంఖ్య 920 మిలియన్లకు పెరుగుతుందని నోకియా అంచనా వేస్తోంది. అంతేకాదు హువావే, ఎరిక్సన్ లాంటి కంపెనీల నుండి తీవ్రమైన పోటీ నేపథ్యంలో 5జీ మొబైల్స్ మార్కెట్లోకి ప్రవేశించే ప్రయత్నాలు విఫలమై, గత అక్టోబర్‌లో 2020 ఆదాయ అంచనాను తగ్గించిన ఆరు నెలల శిక్ష విధించిన తరువాత ఈ ఒప్పందం చేసుకోవడం విశేషం. మరోవైపు సీఈవో మార్పును ఇటీవల ప్రకటించింది. దీనికి ముందు ప్రకటించిన ఫలితాల్లో నోకియా 2015 తరువాత 2019 ఏడాదిలో మొదటిసారి లాభాలను నమోదు చేసింది. 7 మిలియన్ యూరోల లాభంతో అంచనాలను అధిగమించింది. కాగా 25 ఏళ్ల పాటు సేవలందించిన నోకియా ప్రెసిడెంట్, సీఈవో పదవికి భారత సంతతికి చెందిన రాజీవ్ సూరి రాజీనామా చేశారు. ఈ ఏడాది ఆగస్ట్ 31వ తేదీతో ఆయన పదవీ కాలం ముగియనుంది. రాజీవ్ సూరి స్థానంలో పెక్కా లుండామర్క్ పేరును కంపెనీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. (ఎకానమీని కాపాడే అత్యవసర చర్యలు కావాలి) -
ఆసియాలో అపర కుబేరుడుగా అంబానీ
సాక్షి, ముంబై : ఫేస్బుక్ , రిలయన్స్ జియో మెగా డీల్ అనేక సంచలనాలకు నాంది పలికింది. అతిపెద్ద డీల్ గా నిలిచిన రిలయన్స్ జియోలో 10 శాతం వాటాను ఫేస్బుక్ రూ.43,574 కోట్లు(570 కోట్ల డాలర్లు) కొనుగోలు చేయనున్నదన్న వార్త రిలయన్స్ తోపాటు పలు రంగాల్లో జోష్ నింపింది. దీంతో బుదవారంనాటి మార్కెట్ లో రిలయన్స్ షేరు పది శాతానికి పైగా ఎగిసింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికే అపర కుబేరుల జాబితాలో నిలిచిన అంబానీ తాజా పరిణామంతో చైనా బిలియనీర్ అలీబాబా అధినేత జాక్ మాను అధిగమించి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాకివ్వనున్న జియో మార్ట్) రిలయన్స్ అంబానీ సంపద 4.69 బిలియన్ డాలర్లు పెరిగి 49.2 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ గురువారం తెలిపింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ యజమాని ముకేశ్ అంబానీ సంపద జాక్ మా కంటే సుమారు 4 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. జాక్ మా సంపద 46 బిలియన్ డాలర్లు. ఈ ఒప్పందానికి ముందు, 2020 లో అంబానీ సంపద 14 బిలియన్ డాలర్ల క్షీణతను చూసింది. ఇది ఆసియాలో ఎవరికైనా డాలర్ పరంగా అతిపెద్ద పతనం. దీన్ని బట్టే ఫేస్బుక్, జియో డీల్ సృష్టించిన సునామీని అర్థం చేసుకోవచ్చు. అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ మంగళవారం నాటికి 1 బిలియన్ల డాలర్లను కోల్పోయింది. 29 సంవత్సరాలలో చమురు అతిపెద్ద పతనాన్ని నమోదు చేయడంతో మార్చి ప్రారంభంలో, జాక్ మా, అంబానీని అధిగమించి అత్యంత ధనవంతుడిగా నిలిచారు. క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు, మొబైల్ అనువర్తనాల డిమాండ్ తగ్గడంతో అలీబాబా హోల్డింగ్స్ నష్టాలను చవి చూస్తోంది. (కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త వ్యాపారాలు: అంబానీ) మరోవైపు రిలయన్స్ జియోలో ఫేస్బుక్ పెట్టుబడులతో దేశంలోనే తొలి 5 సంస్థల్లో ఒకటిగా జియో స్థానం సంపాదించుకుంది. అంతేకాకుండా కొన్ని దేశాల జీడీపీ కన్నా జియో మార్కెట్ మూలధనం ఎక్కువ ఉండటం విశేషం. జింబాబ్వే జీడీపీ 19.4 బిలియన్ డాలర్లు, మారిషస్ జీడీపీ 14 బిలియన్ డాలర్లు, ఐలాండ్ జీడీపి 26.6 బిలియన్ డాలర్లు కాగా జియో కంపెనీ విలువ ఏకంగా 65.95 బిలియన్ డాలర్లు వుందని తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది -
మెగా డీల్ : భారీ లాభాల్లోకి సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. ఫేస్బుక్ , రిలయన్స్ జియో మెగాడీల్ తో ఒక్కసారిగా ఇన్వెస్టర్లలో ఉత్సాహం పుంజుకుంది. దీంతో ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ (ఆర్ ఐఎల్) సేరు 8 శాతానికి పైగా లాభపడింది. ఒంటిచేత్తో రిలయన్స్ మార్కెట్ ను లాభాల్లోకి మళ్లించిందనే చెప్పాలి. రిలయన్స్ లాభాల మద్దతుతో సెన్సెక్స్ 680 పాయింట్లు ఎగిసి 31318 వద్ద, నిఫ్టీ 175పాయింట్లు లాభపడి 9157 వద్ద ట్రేడ్ అవుతోంది. తద్వారా సెన్సెక్స్ 31 వేల,300 స్థాయిని, నిఫ్టీ9150 స్థాయికి ఎగువన స్థిరంగా కొనసాగుతున్నాయి. మిడ్ స్మాలక క్యాప్ రంగాలు నష్టాలనుంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాకివ్వనున్న జియో మార్ట్) అలాగే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు (యుఎస్ ఆయిల్ ఫ్యూచర్స్) 20 శాతానికి పైగా పెరిగాయి. రెండు రోజుల ధరల పతనం తరువాత బ్రెంట్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో ఆటో స్టాక్స్ కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎం అండ్ ఎం, హీరో మోటోకార్ప్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో 3.7 శాతం ఎగిసాయి. ఓఎన్ జీసీ , వేదాంతా, బీపీసీఎల్, ఐవోసీ, పవర్ గ్రిడ్, లార్సెన్ , టాటా మోటార్స్, గ్రాసిం, ఐసీఐసీఐ బ్యాంకు నష్టపోతుండగా, జీ ఎంటర్టైన్మెంట్ అసియన్ పెయింట్స్, నెస్లే, భారతి ఇన్ ప్రాటెల్, బ్రిటానియా, అదానీ పోర్ట్స్, ఐటీసీ లాభపతున్నాయి. నిఫ్టీ బ్యాంకు మాత్రం ఒడిదుడుకులమధ్య ట్రేడ్ అవుతోంది. (కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త వ్యాపారాలు: అంబానీ) మరోవైపు డాలరు బలంతో దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం మరో రికార్డు కనిష్టానికి దిగజారింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఆల్ టైం కనిష్ట స్థాయి 76.88 పతనమైంది. చమురు ధరలు, త్రైమాసిక ఆదాయాలు, దేశంలో కోవిడ్-19 సంక్రమణ వ్యాప్తిపై ఇన్వెస్టర్ల దృష్టి వుంటుందని విశ్లేషకులు తెలిపారు. (ఫేస్బుక్ - జియో డీల్ : జుకర్ బర్గ్ సందేశం) -
ఐబీఎం - హెచ్‌సీఎల్ మెగా డీల్
సాక్షి,ముంబై: ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ కార్పొరేషన్(ఐబీఎం) తన సాఫ్ట్వేర్ ఉత్పత్తుల వ్యాపారాన్ని భారతీయ టెక్ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు విక్రయించ నుంది. ఐబీఎం ఇందుకు1.80 బిలియన్ డాలర్లను (సుమారు రూ.12,700కోట్లు) వెచ్చించనుంది. ఈ మేరకు ఒక తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెచ్‌సీఎల్ మార్కెట్ ఫైలింగ్‌లో వెల్లడించింది. 2019 తొలి అర్ధభాగానికల్లా డీల్ పూర్తిచేసే అవకాశమున్నట్లు హెచ్‌సీఎల్ ప్రకటించింది. డీల్‌లో భాగంగా అధిక వృద్ధికి వీలున్న సెక్యూరిటీ, మార్కెటింగ్, కామర్స్ విభాగాలకు చెందిన సాఫ్ట్వేర్ ప్రొడక్టులను ఐబీఎం నుంచి సొంతం చేసుకోనున్నట్లు హెచ్‌సీఎల్ సీఈవో సి.విజయకుమార్ తెలిపారు. సాఫ్ట్వేర్ ఉత్పత్తుల పరిధిలో తమకు మొత్తం 50 బిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ ఉన్నట్లు ఐబీఎం ఒక ప్రకటనలో తెలిపింది. బిగ్ ఫిక్స్, మార్కెటింగ్ ఆటోమేషన్ ప్రొడక్ట్ యూనికా తదితర ఏడు ఉత్తులను హెచ్‌సీఎల్‌కు విక్రయించనున్నామని తెలిపింది. కాగా ఐబీఎం కూడా అమెరికాకు చెందిన ఐటీ సంస్థ రెడ్ హ్యాట్‌ను 34 బిలియన్ డాలర్ల( రుణంతో సహా) కొనుగోలు చేస్తోంది. మరోవైపు ఈ మెగా డీల్ వార్తలతో ఇన్వెస్టర్లు హెచ్‌సీఎల్ టెక్ కౌంటర్లో అమ్మకాలకు తెరతీశారు. దీంతో ఈ షేరు ఒక దశలో దాదాపు 7శాతం పతనాన్ని నమోదుచేసింది. -
మెగా డీల్ : హెచ్‌యూఎల్ చేతికి హార్లిక్స్
నెస్లేకు దక్కని హార్లిక్స్ హిందుస్థాన్ యూనీలీవర్ చేతికి దక్కింది. ఎట్టకేలకు హార్లిక్స్ డీల్ పూర్తయింది. వివిధ అంచనాలు, ఊహాగానాలు మధ్య మెగా ఎఫ్ఎంజీ డీల్‌కు శుభం కార్డు పడింది. జీఎస్కేకు చెందిన హార్లిక్స్ ఇతర ఉత్పత్తులు యూనీలీవర్ ఆధ్వర్యంలోకి రానున్నాయి. ఆంగ్లో డచ్ దిగ్గజం యూనీలీవర్ ఈ ఒప్పంద వివరాలను సోమవారం వెల్లడించింది. దీంతో గ్లాక్సోస్మిత్‌క్లైన్ (జీఎస్కె) ఇండియాకు పోషకారహార వ్యాపారం త్వరలో యూనీలీవర్ (హెచ్‌యూఎల్) పరం కానుంది. ఈ మేరకు ఇరు సంస్థలు బోర్డులు ఆమోదం లభించినట్టు యూనీలీవర్ వెల్లడించింది. ప్రముఖ ఎఫ్ఎంసీజీ హిందుస్థాన్ యూనీలీవర్, జీఎస్కె సంస్థకు చెందిన హార్లిక్స్‌ను దక్కించుకునేందుకు 3.3 బిలియన్ల యూరోలను చెల్లించనుంది. ఈ మేరకు ఒప్పందాన్ని ఖరారు చేసింది. రానున్న 12నెలల్లో (4.39 నిష్పత్తి ప్రకారం) ఈ డీల్ పూర్తికానుందని కంపెనీ తెలిపింది. కాగా హార్లిక్స్ రేసులో యునిలీవర్‌తో పాటు కోకకోలా, క్రాఫ్ట్ హైంజ్, నెస్లే వంటి ఇతర దిగ్గజ కంపెనీలూ పోటీ పడ్డాయి. ముఖ్యంగా సుమారు 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.28000 కోట్లు) జీఎస్కె ఇండియాకు చెందిన 72.5 శాతం వాటాను చేజిక్కించుకోవాలని నెస్లే భారీ వ్యూహాలను రచించిన సంగతి తెలిసిందే. -
మిలియనీర్లుగా మారనున్న ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు
న్యూఢిల్లీ : దేశీయ ఈ- కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ సొంతమైన విషయం తెలిసిందే. 16 బిలియన్ డాలర్లతో కుదిరిన ఈ మెగా ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కూడా ఇటీవలే ఆమోదం తెలిపింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన షేర్ల బదలాయింపు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలకు సంబంధించిన ప్రక్రియ మరికొన్ని రోజుల్లో పూర్తి కానుందని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బిన్నీ బన్సల్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎంప్లాయి స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ కింద 126- 128 డాలర్ల(ఒక్కో యూనిట్) విలువైన షేర్లను విక్రయించేందుకు అనుమతినిస్తూ లేఖ రాసింది. దీంతో ఫ్లిప్‌కార్టు ఉద్యోగులు మిలియనీర్లుగా మారనున్నారు. ఎకనమిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్.. ఫ్లిప్‌కార్ట్‌లోని 6, 242, 271 షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందులో ఈఎస్ఓపీ కింద ఉన్న షేర్లవిలువ సుమారు 1.5 బిలియన్ డాలర్లు. దీంతో ఒక్కో యూనిట్ 126- 128 డాలర్ల చొప్పున వాల్‌మార్ట్ కొనుగోలు చేయనుంది. ఈ నేపథ్యంలో ‘ఈఎస్ఓపీ కింద ఉన్న షేర్లను నగదుగా మార్చుకునేందుకు ఉద్యోగులకు అవకాశం దక్కింది. మా ఉద్యోగుల శ్రమకు ఫలితంగా ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు అందిస్తాం. ప్రస్తుతం ఈ కొనుగోలు ద్వారా ఉద్యోగులు సుమారు 800 మిలియన్లు ఆర్జించనున్నారు’ అని ఫ్లిప్‌కార్ట్ కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ రెండు ఆన్లైన్ దిగ్గజాల మధ్య లావాదేవీలు పూర్తయ్యే రెండేళ్లలోగా ఉద్యోగులు ఈఎస్ఓపీ కింద 100 శాతం వాటాను విక్రయించవచ్చు. అయితే ఈ ఏడాది 50 శాతం, వచ్చే ఏడాది 25 శాతం, 2020లో మరో 25 శాతం వాటాను నగదుగా మార్చుకునే వీలు కల్పించింది కంపెనీ యాజమాన్యం. కాగా తాము పనిచేస్తున్న కంపెనీలో షేర్లను ఉద్యోగులు కొనుగోలుచేసేందుకు ఈఎస్ఓపీ అనేది ఒక ప్రయోజనకర ప్లాన్. -
ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులకు జాక్‌పాట్
సాక్షి, ముంబై: ప్రపంచ ఈ కామర్స్దిగ్గజం వాల్‌మార్ట్ , దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మెగా డీల్ నేపథ్యంలో ఉద్యోగులు భారీగా లాభపడనున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.లక్ష కోట్లకు పైగా వెచ్చించి 77 శాతం వాటాను వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన సంగతి విదితమే. ఈ డీల్‌లో భాగంగా స్టాక్ బై బ్యాక్ ఆప్షన్ కింద ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులకు జాక్ పాట్ తగిలినట్టయింది. దీంతొ ప్రస్తుత, మాజీ ఉద్యోగులు కోటీశ్వరులుగా మారిపోనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ డీల్ పిలుస్తున్న ఈ కొనుగోలు ఒప్పందం ద్వారా ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ప్రస్తుత, మాజీ ఉద్యోగుల నుంచి షేర్లను తిరిగి కొనుగోలు చేయడం కోసం 50 కోట్ల డాలర్లు (సుమారు రూ.3300 కోట్లు) కేటాయించింది. ఈ డీల్ పూర్తవగానే ఈఎస్ఓపీ (ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్) ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత, మాజీ ఉద్యోగులు లాభాపడనున్నారు. తాజా ఒప్పందంతో సీనియర్ సభ్యుల కొందరు కోటీశ్వరులు కాబోతున్నారని మార్కెటింగ్ టీంలోని సీనియర్ ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ ఇంకా రాలేదనీ, బహుశా శుక్రవారం ఒక ప్రకటన వచ్చే అవకాశ ఉందని భావించారు. ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు మూడేళ్ల వ్యవధిలో తమ షేర్లను నగదు రూపంలోకి మార్చుకోవచ్చని ఆయన వెల్లడించారు. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన 200-250మంది, మింత్రాకు చెందిన 150మందికి, జబాంగ్‌లోని మరో 50 మంది ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు చేకూరనున్నట్టు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ కో ఫౌండర్ గ్రూప్ సీఈవో బిన్ని బన్సాల్ ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్లను 100శాతం బై బేక్ చేస్తామని బుధవారం జరిగిన ఒక సమావేశంలో వెల్లడించారు. షేర్ ధర సుమారు 10వేల రూపాయల వద్ద ఈ కొనుగోలు ఉండవచ్చని భావిస్తున్నారు. -
ఖరారైన వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ మెగా డీల్
-
ఈ-కామర్స్ మార్కెట్లో అతిపెద్ద డీల్
ముంబై : గత ఎన్నో రోజులుగా ఈ-కామర్స్ మార్కెట్లో చక్కర్లు కొడుతున్న ఫ్లిప్‌కార్ట్ -వాల్‌మార్ట్ అతిపెద్ద డీల్ ఖరారైపోయింది. ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా నేటితో వాల్‌మార్ట్ సొంతమైపోయింది. ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను,16 బిలియన్ డాలర్లకు తాను కొనుగోలు చేయబోతున్నట్టు వాల్‌మార్ట్ బుధవారం ప్రకటించింది. మొత్తంగా ఫ్లిప్‌కార్ట్ వాల్యుయేషన్ 20 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. ఈ ఏడాది చివరి వరకు డీల్‌ను పూర్తి చేయనున్నట్టు వాల్‌మార్ట్ తెలిపింది. వాల్‌మార్ట్ అధికారికంగా ప్రకటించడానికి ముందు సాఫ్ట్‌బ్యాంకు సీఈవో మయవోషి సన్ కూడా ఈ డీల్‌ను ధృవీకరించారు. ప్రపంచంలో అతిపెద్ద ఈ-కామర్స్ కొనుగోలు ఇదే కావడం విశేషం. అమెరికాకు చెందిన ఈ కంపెనీకి అతిపెద్ద డీల్ కూడా ఇదే. దీంతో 2016 సెప్టెంబర్ నుంచి ప్రారంభమైన కొనుగోలు చర్చలకు వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్‌లు నేటితో ముగింపు పలికాయి. ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన రిటైల్ మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉందని వాల్‌మార్ట్ అధ్యక్షుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆపీసర్ డౌ మెక్‌మిల్లన్ అన్నారు, తమ పెట్టుబడులు భారత కస్టమర్లకు నాణ్యత కలిగి ఉత్పత్తులను, సరసమైన ధరల్లో అందించేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అదేవిధంగా కొత్త ఉద్యోగాలు కల్పన, చిన్న సప్లయర్లకు, వ్యవసాయదారులకు, మహిళా వ్యాపారవేత్తలకు కొత్త కొత్త అవకాశాలు అందనున్నాయని తెలిపారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న 20 శాతం వాటాను విక్రయించేసి ఇప్పటి వరకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రధాన పెట్టుబడిదారుగా ఉన్న సాఫ్ట్‌బ్యాంకు పూర్తిగా ఈ ఈ-కామర్స్ దిగ్గజం నుంచి వైదొలుగుతోంది. సాఫ్ట్‌బ్యాంక్‌తో పాటు అస్సెల్, నాస్పర్స్లు కూడా పూర్తిగా ఫ్లిప్‌కార్ట్ నుంచి తప్పుకుంటున్నాయి. టెన్సెంట్, టైగర్ గ్లోబల్, బిన్సీ బన్సాల్, మైక్రోసాఫ్ట్‌లు మాత్రం కొంత వాటాను కలిగి ఉంటున్నాయి. వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ చేసుకున్న ఈ డీల్ దేశీయ ఈ-కామర్స్ మార్కెట్లో సంచలనంగా మారింది. భారత మార్కెట్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల మధ్య పోటీ ఈ డీల్‌తో మరింత తీవ్రతరంగా మారనుందని తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు పడబోయే ఈ పోటీ కేవలం సప్లయి చైన్‌లో ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ పెరగడమే కాకుండా.. పెద్ద మొత్తంలో ఉద్యోగాలను సృష్టించనుంది. అమెరికా దిగ్గజం వాల్‌మార్ట్‌కు తక్కువ ధరలకు, విభిన్నమైన ఉత్పత్తులను ఆఫర్ చేస్తూ... వినియోగదారులను ఆకట్టుకోవడంలో ప్రపంచవ్యాప్తంగా మంచి అనుభవముంది. దీంతో అమెజాన్‌కు, వాల్‌మార్ట్‌కు రెండింటికీ ధరల పరంగా తీవ్ర పోటీ నెలకొననుంది. -
ఇ-కామర్స్ ట్రేడ్‌వార్: భారీ నిధులు
సాక్షి, న్యూఢిల్లీ: ఒక్కపక్క ఈ కామర్స్ వ్యాపారంలో మెగా డీల్‌కు రంగం సిద్ధమైంది. మరోపక్క ఈ ట్రేడ్‌వార్ లో పోటీని తట్టుకునే నిలబడే వ్యూహంలో భాగంగా అమెజాన్ ఇండియాలో భారీగా నిధుల వెల్లువ. దేశంలో అతిపెద్ద ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ డీల్ ఈ సాయంత్రం అధికారికంగా వెల్లడికానున్న నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ ప్రధాన ప్రత్యర్థి అమెజాన్ కూడా ఇందుకనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. మాతృసంస్థ అమెజాన్ అమెజాన్ ఇండియాలో మరోసారి భారీగా నిధులు సమకూర్చుతోంది. తాజాగా 2,600 కోట్ల రూపాయల (385.7మిలియన్ డాలర్లు) నిధులు అందజేసింది. దీనిపై అమెజాన్ ఇండియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇ-కామర్స్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడానికి, కస్టమర్లకు విశ్వసనీయమైన సేవలను అందించేందుకు భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు సమకూర్చనున్నట్టు వెల్లడించారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సమర్పించిన సమాచారం ప్రకారం, అమెజాన్ సంస్థ భారతీయ మార్కెట్లో రూ .2,600 కోట్ల పెట్టుబడును సమకూర్చి పెట్టింది. ఈ మేరకు 2018 ఏప్రిల్ 26 న అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ డైరెక్టర్ల బోర్డు తీర్మానాన్ని ఆమోదించింది. ఫ్లిప్‌కార్ట్‌ను వాల్ మార్ట్ కొనుగోలు చేస్తున్న తరుణంలో పోటీని ఎదుర్కొనేందుకు అమెజాన్ ఇండియాకు తాజా నిధులు ఉపయోగపడనున్నాయి. తాజా నిధులతో పెట్టుబడుల మొత్తం విలువ రూ.20,000 కోట్లకుపైమాటే. కాగా గతేడాది నవంబర్ లో రూ.2,990 కోట్లు , ఈ ఏడాది జనవరిలో అమెజాన్ మాతృ సంస్థ ద్వారా రూ .1,950 కోట్ల నిధులను అందుకుంది. తాజా పెట్టుబడులు తమ సాధారణ ప్రక్రియలో భాగమేనని, ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ మెగాడీల్‌కు ఎలాంటి సంబంధం లేదని కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. -
ఫ్లిప్‌కార్ట్ కోసం అమెజాన్ భారీ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కి సంబంధించిన భారీ ఒప్పందం గురించి ప్రస్తుతం మార్కెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో 60 శాతం వాటాను కొనుగలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారిక ప్రకటన చేసింది. అంతేకాక 2 బిలియన్ డాలర్ల టర్మినేషన్ / బ్రేకప్ ఫీని కూడా ప్రతిపాదించింది. అయితే ఇది గతంలో వాల్‌మార్ట్ ప్రతిపాదించిన భారీ డీల్‌కు సమానమైన మొత్తం. ఇదిలా ఉండగా కొన్ని రోజుల కిందట ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ రీటైలర్ వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌లో 51 శాతానికి పైగా వాటాను కొనుగలు చేయనుందనే వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం విలువ 80 వేల కోట్ల రూపాయలు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ విలువ రూ.లక్షా 20 వేల కోట్లుగా ఉండనుందని సమాచారం. ఈ ఒప్పందం జరిగితే ఇదే ఈ దశాబ్దానికి గాను పెద్ద ఒప్పందంగా రికార్డు నెలకొల్పుతుంది. రెండు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఫ్లిప్‌కార్ట్ కోసం పోటీ పడుతుండటంతో చివరకు ఫ్లిప్‌కార్ట్‌ను ఎవరు చేజిక్కించుకోనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు మాత్రం వాల్‌మార్ట్ వైపే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్ బన్సాల్ ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. అలానే అమెజాన్ కూడా ఎటువంటి పోటికి ఆస్కారం లేకుండా ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకునేలా ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. త్వరలోనే వాల్‌మార్ట్ గ్లోబల్ టీం భారతదేశానికి వచ్చి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని తెలిసింది. అయితే ఈ వార్తల గురించి వాల్‌మార్ట్ కానీ, అమెజాన్ కానీ స్పందించలేదు. -
బ్లాక్‌స్టోన్‌తో మెగా డీల్
సాక్షి, ముంబై: రియల్టీ సంస్థ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ భారీ డీల్ చేసుకుంది. గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ బ్లాక్‌స్టోన్ గ్రూపునకు తన అనుబంధ సంస్థల్లో 50 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించింది. కమర్షియల్ ప్రాపర్టీస్‌లో మేజర్‌వాటాను విక్రయించేందుకు ఈ మేరకు ఒక నిశ్చయాత్మక ఒప్పందంపై సంతకాలు చేసింది. తన అనుబంధ సంస్థలలోని మొత్తం హోల్డింగ్స్‌ను విక్రయించనుంది. ఇండియాబుల్స్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ లో 50 శాతం వాటాను పరోక్షంగా ఉపసంహరించుకుంది. దాదాపు రూ. 9,500 కోట్లకు ఈ డీల్ చేసుకుంది. ఈ నిధుల ద్వారా అప్పులను తీర్చడానికి ఉపయోగిస్తామని మార్కెట్ ఫైలింగ్‌లో తెలిపింది. దీంతో ఐబీ రియల్ 4శాతానికి పైగా నష్టపోయింది. -
ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్ మెగా డీల్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణల వ్యూహంలో మెగా మెర్జర్‌కు పునాది పడింది. ముఖ్యంగా 2018 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని చేరుకునే లక్ష్యంలో భాగంగా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ లో మెగా డీల్ కుదిరింది. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లో (హెచ్‌పీసిఎల్) లో ప్రభుత్వం మొత్తం వాటాను కొనుగోలు చేసేందుకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఒఎన్జీసీ) ఆమోదం తెలిపింది. అంతేకాదు గతంలో ప్రకటించిన 25 వేలకోట్ల రూపాయల ఆఫర్‌ను 35వేల కోట్ల రూపాయలకు పెంచి మరీ ప్రభుత్వ వాటాను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు బోర్డు ఆమోదం లభించిందని ఓఎన్జీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శశి శంకర్ తెలిపారు. ఈ డీల్ భాగంగా మొత్తం 51.11 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఒఎన్జీసీ అంగీకరించింది. ఇందుకు రూ. 36,915 కోట్లను చెల్లించనున్నామని ఓఎన్జీసీ వర్గాలు రెగ్యులైటరీ ఫైలింగ్‌లో ప్రకటించాయి. మొత్తం నగదు రూపంలో జరిగే ఒప్పందం ఈ నెలాఖరుకు పూర్తికానుందని, ఒక్కో షేరుకు రూ. 473.97 చొప్పున ప్రభుత్వానికి చెల్లిస్తామని ఓఎన్జీసీ తెలిపింది. ఈ డీల్ ప్రభావంతో ఓఎన్జీసీ కౌంటర్ భారీగా లాభపడుతోంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో 4.93 శాతం లాభంతో ట్రేడవుతోంది. మరోవైపు హెచ్‌పీసీఎల్ 2 శాతం నష్టపోతోంది. -
తెలంగాణతో గ్లోబల్ దిగ్గజం మెగా డీల్
గ్లోబల్ రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్, తెలంగాణ ప్రభుత్వంతో మెగా డీల్ కుదుర్చుకుంది. తెలంగాణలో 10 వాల్ మార్ట్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు, ఒక్కో స్టోర్ కు 10 మిలియన్ డాలర్ల నుంచి 12 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టున్నట్టు తెలిపింది. అంటే మొత్తంగా 100 మిలియన్ డాలర్ల నుంచి 120 మిలియన్ డాలర్ల వరకు ఉండనున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఎంఓయూపై రాష్ట్రప్రభుత్వంతో కలిసి సంతకం చేసింది. వాల్ మార్ట్ కు దేశవ్యాప్తంగా 21 స్టోర్లు ఉన్నాయి. దీనిలో ఒకటి హైదరాబాద్ లో కూడా ఉంది. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో మరో 50 కొత్త స్టోర్లను భారత్ లో ఏర్పాటుచేయాలని కంపెనీ నిర్ణయించింది. వాటిలో 10 తెలంగాణలోనే ఏర్పాటుచేయనుంది. రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీ రామారావు, వాల్ మార్ట్ కెనడా, ఆసియా సీఈవో, ప్రెసిడెంట్ డిర్క్ వాన్ డెన్ బెర్గె, వాల్ మార్ట్ ఇండియా సీఈవో ప్రెసిడెంట్, సీఈవో క్రిష్ అయ్యర్ సమక్షంలో వాల్ మార్ట్ ఎగ్జిక్యూటివ్ లు, తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఎంఓయూపై సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్ తో కూడా వాల్ మార్ట్ ఎంఓయూ కుదుర్చుకుంది. ఉత్తరభారత్ లో ఎక్కువగా ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలపై దృష్టిపెట్టింది. హర్యానా, పంజాబ్ లతో కూడా వాల్ మార్ట్ డీల్ కుదుర్చుకుంది. తెలంగాణలో ఏర్పాటుచేయబోయే 10 వాల్ మార్ట్ స్టోర్లలో నాలుగు హైదరాబాద్ లోనే ఏర్పాటుచేయనున్నట్టు క్రిష్ అయ్యర్ చెప్పారు. వరంగల్, కరింనగర్, నిజామాబాద్ లో కూడా కొత్త స్టోర్లను ఏర్పాటుచేస్తామని తెలిపారు.