తెలంగాణతో గ్లోబల్ దిగ్గజం మెగా డీల్
తెలంగాణతో గ్లోబల్ దిగ్గజం మెగా డీల్
Published Sat, Apr 29 2017 7:30 PM | Last Updated on Tue, Sep 5 2017 9:59 AM
గ్లోబల్ రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్, తెలంగాణ ప్రభుత్వంతో మెగా డీల్ కుదుర్చుకుంది. తెలంగాణలో 10 వాల్ మార్ట్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు, ఒక్కో స్టోర్ కు 10 మిలియన్ డాలర్ల నుంచి 12 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టున్నట్టు తెలిపింది. అంటే మొత్తంగా 100 మిలియన్ డాలర్ల నుంచి 120 మిలియన్ డాలర్ల వరకు ఉండనున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఎంఓయూపై రాష్ట్రప్రభుత్వంతో కలిసి సంతకం చేసింది. వాల్ మార్ట్ కు దేశవ్యాప్తంగా 21 స్టోర్లు ఉన్నాయి. దీనిలో ఒకటి హైదరాబాద్ లో కూడా ఉంది. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో మరో 50 కొత్త స్టోర్లను భారత్ లో ఏర్పాటుచేయాలని కంపెనీ నిర్ణయించింది. వాటిలో 10 తెలంగాణలోనే ఏర్పాటుచేయనుంది.
రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీ రామారావు, వాల్ మార్ట్ కెనడా, ఆసియా సీఈవో, ప్రెసిడెంట్ డిర్క్ వాన్ డెన్ బెర్గె, వాల్ మార్ట్ ఇండియా సీఈవో ప్రెసిడెంట్, సీఈవో క్రిష్ అయ్యర్ సమక్షంలో వాల్ మార్ట్ ఎగ్జిక్యూటివ్ లు, తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఎంఓయూపై సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్ తో కూడా వాల్ మార్ట్ ఎంఓయూ కుదుర్చుకుంది. ఉత్తరభారత్ లో ఎక్కువగా ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలపై దృష్టిపెట్టింది. హర్యానా, పంజాబ్ లతో కూడా వాల్ మార్ట్ డీల్ కుదుర్చుకుంది. తెలంగాణలో ఏర్పాటుచేయబోయే 10 వాల్ మార్ట్ స్టోర్లలో నాలుగు హైదరాబాద్ లోనే ఏర్పాటుచేయనున్నట్టు క్రిష్ అయ్యర్ చెప్పారు. వరంగల్, కరింనగర్, నిజామాబాద్ లో కూడా కొత్త స్టోర్లను ఏర్పాటుచేస్తామని తెలిపారు.
Advertisement
Advertisement