న్యూఢిల్లీ: విద్యుత్ రంగంలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ భారీ డీల్‌కు తెరలేపింది. సంస్థ అనుబంధ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ 1,753 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పలు ప్రాజెక్టులను మిత్రా ఎనర్జీ నుంచి కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. డీల్ విలువ రూ.10,530 కోట్లు. వీటిలో 17 స్పెషల్ పర్సస్ వెహికిల్స్ (ఎస్‌పీవీ), మరొకటి అనుబంధ ఎస్‌పీవీ ఉంది.
1,331 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 10 పవన విద్యుత్ ప్రాజెక్టులు, 422 మెగావాట్ల ఏడు సోలార్ ప్రాజెక్టులు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ చేతికి రానున్నాయి. దక్షిణ, పశ్చిమ, మధ్య భారత్‌లో ఈ ప్రాజెక్టులు నెలకొన్నాయి. వీటి విద్యుత్ కొనుగోలు ఒప్పంద కాలపరిమితి సగటున మరో 18 ఏళ్లు ఉంది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ఖాతాలో ఇదే పెద్ద డీల్. తాజా కొనుగోలు ద్వారా జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ విద్యుత్ ఉత్పత్తి సాగిస్తున్న ప్రాజెక్టుల సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 4,784 నుంచి 6,537 మెగావాట్లకు చేరింది. నిర్మాణ దశలో ఉన్న 2,500 మెగావాట్ల పవన, జల విద్యుత్ ప్రాజెక్టులు రెండేళ్లలో జతవనున్నాయి. దీంతో జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ సామర్థ్యం 9.1 గిగావాట్స్‌కు చేరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment