Special Purpose Vehicles
-
జేఎస్‌డబ్ల్యూ నియో రూ.10,530 కోట్ల డీల్
న్యూఢిల్లీ: విద్యుత్ రంగంలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ భారీ డీల్‌కు తెరలేపింది. సంస్థ అనుబంధ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ 1,753 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పలు ప్రాజెక్టులను మిత్రా ఎనర్జీ నుంచి కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. డీల్ విలువ రూ.10,530 కోట్లు. వీటిలో 17 స్పెషల్ పర్సస్ వెహికిల్స్ (ఎస్పీవీ), మరొకటి అనుబంధ ఎస్పీవీ ఉంది. 1,331 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 10 పవన విద్యుత్ ప్రాజెక్టులు, 422 మెగావాట్ల ఏడు సోలార్ ప్రాజెక్టులు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ చేతికి రానున్నాయి. దక్షిణ, పశ్చిమ, మధ్య భారత్‌లో ఈ ప్రాజెక్టులు నెలకొన్నాయి. వీటి విద్యుత్ కొనుగోలు ఒప్పంద కాలపరిమితి సగటున మరో 18 ఏళ్లు ఉంది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ఖాతాలో ఇదే పెద్ద డీల్. తాజా కొనుగోలు ద్వారా జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ విద్యుత్ ఉత్పత్తి సాగిస్తున్న ప్రాజెక్టుల సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 4,784 నుంచి 6,537 మెగావాట్లకు చేరింది. నిర్మాణ దశలో ఉన్న 2,500 మెగావాట్ల పవన, జల విద్యుత్ ప్రాజెక్టులు రెండేళ్లలో జతవనున్నాయి. దీంతో జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ సామర్థ్యం 9.1 గిగావాట్స్‌కు చేరుతుంది. -
అమ్మకానికి రహదారి ప్రాజెక్టులు
ముంబై: గత కొన్నాళ్లుగా పలు రహదారి ప్రాజెక్టులు అమ్మకానికి వస్తున్నాయి. నిధుల కొరత తదితర కారణాలతో ప్రమోటర్లు లేదా వాటి నిర్మాణం కోసం ఏర్పాటైన స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ) వీటిని విక్రయిస్తున్నాయి. 2015–18 మధ్యకాలంలో ఏకంగా 52 రహదారి ప్రాజెక్టులను ప్రమోటర్లు విక్రయించారు. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదిక ప్రకారం వీటి విలువ సుమారు రూ. 37,019 కోట్లుగా ఉంటుంది. 52 ప్రాజెక్టుల్లో ఆరు డిస్కౌంటుకే అమ్ముడు కాగా.. మిగతా ప్రాజెక్టులు 2–21 శాతం ప్రీమియంకి అమ్ముడయ్యాయి. ‘చాలా మటుకు రహదారి ప్రాజెక్టులు..ప్రమోటర్లకు చాలా తక్కువ రాబడులే ఇచ్చాయి. ఆర్థికంగా బలంగా లేని డెవలపర్లు నిధుల సంక్షోభం కారణంగా నష్టానికే తమ అసెట్స్‌ను అమ్ముకున్నారు‘ అని ఇక్రా పేర్కొంది. మెరుగుపడిన ప్రాజెక్టుల రేటింగ్.. యాజమాన్యం చేతులు మారడంతో ఆయా ప్రాజెక్టులకు నిధుల లభ్యత మెరుగుపడిందని ఇక్రా వివరించింది. చాలా ప్రాజెక్టులకు మరింత తక్కువ వడ్డీ రేటుపై, మరింత దీర్ఘకాలానికి రుణాల రీఫైనాన్సింగ్ సదుపాయం లభించిందని పేర్కొంది. మూడో వంతు ప్రాజెక్టుల రేటింగ్స్ గణనీయంగా పెరిగాయి. 2014 – 2018 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ప్రాజెక్టుల అమలు వృద్ధి రేటు వార్షికంగా 23 శాతం మేర నమోదైందని ఇక్రా తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో 6,715 కి.మీ. మేర రహదారుల నిర్మాణం జరిగినట్లు పేర్కొంది. నిల్చిపోయిన ప్రాజెక్టుల సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారించడం, క్లియరెన్సుల కోసం ఆన్లైన్ సదుపాయం అందుబాటులోకి తేవడం, దాదాపు 80% స్థల సమీకరణ పూర్తయ్యాకే కేటాయించడం వంటి విధానపరమైన చర్యలతో ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతమైనట్లు ఇక్రా తెలిపింది. 2014 ఆర్థిక సంవత్సరంలో 3,621 కి.మీ. ప్రాజెక్టులను కేటాయించగా.. 2018 ఆర్థిక సంవత్సరానికి ఇది 47% వృద్ధితో 17,055 కి.మీ.కు చేరినట్లు వివరించింది. ఇందులో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) 7,397 కి.మీ. ప్రాజెక్టులను గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించింది. రహదారుల రంగంపై స్థిరమైన అంచనాలు.. త్వరలో పెద్ద సంఖ్యలో ప్రాజెక్టుల కేటాయింపులతో రహదారి డెవలపర్లు, ఈపీసీ కాంట్రాక్టర్లకు పెద్ద సంఖ్యలో ఆర్డర్లు రాగలవని ఇక్రా అంచనా వేస్తోంది. దీంతో ఈ రంగం భవిష్యత్ స్థిరంగా ఉండగలదని పేర్కొంది. ఇక లాభదాయకత విషయానికొస్తే ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం గణనీయంగా తగ్గే అవకాశాలు ఉండటం.. ఈపీసీ కాంట్రాక్టర్లకు సానుకూలమని వివరించింది. మొత్తం మీద చూస్తే 2020 ఆర్థిక సంవత్సరంలో టోల్ వసూళ్లు కనిష్టంగానైనా రెండంకెల స్థాయిలో ఉండొచ్చని ఇక్రా పేర్కొంది. అయితే, భారీ రుణాలపై అధిక వడ్డీ వ్యయాల కారణంగా కాంట్రాక్టర్ల నికర లాభాలపై ఒత్తిడి నెలకొనవచ్చని వివరించింది. -
ఆర్టీసీ ఎండీకే ఎస్పీవీల చైర్మన్ పగ్గాలు
సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం) నిధులతో కొనుగోలు చేసే బస్సుల నిర్వహణకు స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటులో ఆర్టీసీ అధికారుల ఆజమాయిషీనే ఉండాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు పట్టుపట్టాయి. మున్సిపల్ కార్పొరేషన్లలో మున్సిపల్ కమిషనర్, జిల్లాల్లో కలెక్టర్ల అధ్యక్షతన ఎస్పీవీలు ఉండాలనే నిబంధనను వ్యతిరేకించాయి. ఆర్టీసీ ఎండీనే ఎస్పీవీలకు చైర్మన్‌గా ఉండాలని, ఆర్టీసీ ఈడీ ఎండీగా కలిపి ఏడుగురు సభ్యులకుగాను ఐదుగురు ఆర్టీసీ అధికారులే ఉండేలా చూడాలని, ఇద్దరు మాత్రమే ప్రభుత్వ అధికారులుండాలని డిమాండ్ చేశాయి. ఇందుకు బెంగళూరులో విజయవంతంగా అమలవుతున్న ఎస్పీవీల విధానాన్ని అనుసరించొచ్చేమో పరిశీలించేందుకు అక్కడికి వెళ్లిరావాలని సూచించాయి. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్ పక్షాన ప్రధాన కార్యదర్శి పద్మాకర్ ఈ మేరకు బోర్డుకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్పీవీల ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదముద్ర పడింది. జేఎన్ఎన్యూఆర్ఎం నిధులను పట్టణ ప్రాంతాలకే వినియోగించాల్సి ఉన్నందున ఆ నిధులతో కొనే బస్సులను పట్టణాల్లోనే తిప్పాల్సి ఉంది. దీంతో 4 ఎస్పీవీలు ఏర్పాటు చేసి వాటి పరిధిలోకి వీలైనన్ని ప్రాంతాలను తీసుకురావాలని నిర్ణయించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలను కలిపి హైదరాబాద్ ఎస్పీవీ, విజయవాడ, విశాఖ, విజయనగరం, గుంటూరు, ఏలూరు, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలతో విజయవాడ ఎస్పీవీ, వరంగల్ ఆర్టీసీ జోన్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలతో వరంగల్ ఎస్పీవీ, రాయలసీమ జిల్లాలతో కడప ఎస్పీవీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
ప్రధాన నగరాల్లో ఎస్పీవీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 16 ప్రధాన నగరాల్లో ప్రజా రవాణా కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్స్(ఎస్పీవీ) కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఇకపై వాటి ఆధ్వర్యంలో ఆ నగరాల్లోని ప్రజలకు రవాణా సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఈ ఎస్‌పీవీలన్నీ ఆర్టీసీకి అనుబంధంగానే ఉంటాయి. అయితే స్వతంత్రంగా వ్యవహరిస్తూ, నిర్వహణ వ్యయాన్ని అవే భరిస్తాయి. ఉదాహరణకు హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి సిటీ బస్సులను దాని పరిధిలోకి తీసుకుని రానున్నారు. జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం(జేఎన్ఎన్యూఆర్ఎం) కింద నగరాలకు ఆధునాతన బస్సుల కొనుగోలుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిధులు కేటాయిస్తోంది. అందులో భాగంగా మొదటి దశగా రూ. 340 కోట్లను మంజూరు చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది. అయితే మిషన్ సిటీస్ అయిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, గ్రేటర్ విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలకు బస్సులు ఇవ్వాలంటే ఈ నగరాల్లో ఎస్పీవీలు ఏర్పాటు చేసి, వాటి నిర్వహణను స్వతంత్రంగా ఉండేలా చూడాలని కేంద్రం ఆదేశించింది. ఎస్పీవీల ఏర్పాటుపై మంగళవారం ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శితో జరిగిన సమావేశంలో ఆర్టీసీ మేనేజింగ్ డెరైక్టర్ ఏకే ఖాన్, ఏపీయూఐఎఫ్‌డీసీ మేనే జింగ్ డెరైక్టర్ మధుసూధన్‌రెడ్డి పాల్గొన్నారు. విశాఖ, విజయవాడల్లో ఎస్పీవీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినా ఇప్పటివరకు అది ఆచరణలోకి రాలేదని, వాటిని ఆచరణలో పెట్టాలని కేంద్రం స్పష్టం చేసింది. వరంగల్, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, నిజామాబాద్, కరీంనగర్-రామగుండం, ఏలూరు, అనంతపురం, నెల్లూరుతోపాటు మరో రెండు నగరాల్లో ఎస్పీవీలు ఏర్పాటుకు ఆర్టీసీ ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ ఎస్పీవీలకు ఆర్టీసీకి చెందిన ఉన్నతాధికారులు మేనేజింగ్ డెరైక్టర్లుగా వ్యవహరిస్తే.. సభ్యులుగా కలెక్టర్, ఎస్పీ, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఆర్టీవో సహా మరికొందరు అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారు. కేంద్రం ఇచ్చే నిధులు పోగా, మిగతా నిధులను ఆర్టీసీ, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం భరించాల్సి ఉంటుంది. కానీ నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఇప్పటికే రూ.నాలుగు వేల కోట్ల అప్పుల్లో ఉన్న ఆర్టీసీకి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నిరాకరిస్తున్నాయి. ఆస్తులు తనఖా పెడితేనే రుణాలిస్తామని తేల్చి చెప్పాయి. ఈ నేపథ్యంలో.. తనఖా పెట్టడానికి అవసరమైన ఆస్తుల గుర్తింపు బాధ్యతను యాజమాన్యం ఒక ఈడీకి అప్పగించింది.