ప్రధాన నగరాల్లో ఎస్‌పీవీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 16 ప్రధాన నగరాల్లో ప్రజా రవాణా కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్స్(ఎస్‌పీవీ) కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఇకపై వాటి ఆధ్వర్యంలో ఆ నగరాల్లోని ప్రజలకు రవాణా సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఈ ఎస్‌పీవీలన్నీ ఆర్టీసీకి అనుబంధంగానే ఉంటాయి. అయితే స్వతంత్రంగా వ్యవహరిస్తూ, నిర్వహణ వ్యయాన్ని అవే భరిస్తాయి. ఉదాహరణకు హైదరాబాద్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి సిటీ బస్సులను దాని పరిధిలోకి తీసుకుని రానున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం(జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) కింద నగరాలకు ఆధునాతన బస్సుల కొనుగోలుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిధులు కేటాయిస్తోంది. అందులో భాగంగా మొదటి దశగా రూ. 340 కోట్లను మంజూరు చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది.
అయితే మిషన్ సిటీస్ అయిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, గ్రేటర్ విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలకు బస్సులు ఇవ్వాలంటే ఈ నగరాల్లో ఎస్‌పీవీలు ఏర్పాటు చేసి, వాటి నిర్వహణను స్వతంత్రంగా ఉండేలా చూడాలని కేంద్రం ఆదేశించింది. ఎస్‌పీవీల ఏర్పాటుపై మంగళవారం ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శితో జరిగిన సమావేశంలో ఆర్టీసీ మేనేజింగ్ డెరైక్టర్ ఏకే ఖాన్, ఏపీయూఐఎఫ్‌డీసీ మేనే జింగ్ డెరైక్టర్ మధుసూధన్‌రెడ్డి పాల్గొన్నారు. విశాఖ, విజయవాడల్లో ఎస్‌పీవీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినా ఇప్పటివరకు అది ఆచరణలోకి రాలేదని, వాటిని ఆచరణలో పెట్టాలని కేంద్రం స్పష్టం చేసింది. వరంగల్, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, నిజామాబాద్, కరీంనగర్-రామగుండం, ఏలూరు, అనంతపురం, నెల్లూరుతోపాటు మరో రెండు నగరాల్లో ఎస్‌పీవీలు ఏర్పాటుకు ఆర్టీసీ ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ ఎస్పీవీలకు ఆర్టీసీకి చెందిన ఉన్నతాధికారులు మేనేజింగ్ డెరైక్టర్లుగా వ్యవహరిస్తే.. సభ్యులుగా కలెక్టర్, ఎస్పీ, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఆర్టీవో సహా మరికొందరు అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారు.
కేంద్రం ఇచ్చే నిధులు పోగా, మిగతా నిధులను ఆర్టీసీ, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం భరించాల్సి ఉంటుంది. కానీ నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఇప్పటికే రూ.నాలుగు వేల కోట్ల అప్పుల్లో ఉన్న ఆర్టీసీకి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నిరాకరిస్తున్నాయి. ఆస్తులు తనఖా పెడితేనే రుణాలిస్తామని తేల్చి చెప్పాయి. ఈ నేపథ్యంలో.. తనఖా పెట్టడానికి అవసరమైన ఆస్తుల గుర్తింపు బాధ్యతను యాజమాన్యం ఒక ఈడీకి అప్పగించింది.