JSW Energy
-
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికానికి(క్యూ1) నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 48 శాతం క్షీణించి రూ. 290 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 560 కోట్లు ఆర్జించింది. ఇందుకు అనూహ్య(వన్‌టైమ్) నిర్వహణేతర వ్యయాలు ప్రభావం చూపాయి. దివాలా చట్ట మార్గంలో కంపెనీ ఇటీవల సొంతం చేసుకున్న మిత్రాతోపాటు, 700 మెగావాట్ల ఇండ్–బరత్ థర్మల్ ప్లాంటు లావాదేవీ లాభాలను దెబ్బతీసినట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. మొత్తం ఆదాయం 3 శాతం నీరసించి రూ. 3,013 కోట్లకు చేరింది. ఈ కాలంలో నికరంగా 6,699 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. ఇది 14 శాతం అధికంకాగా.. మిత్రా, పునరుత్పాదక ఇంధన(ఆర్ఈ) సామర్థ్య విస్తరణ ఇందుకు దోహదం చేశాయి. 2023 జూలై 14 నుంచి మూడేళ్ల కాలానికి రాజీవ్ చౌధ్రిని అదనపు, స్వతంత్ర డైరెక్టర్‌గా బోర్డు ఎంపిక చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ షేరు ఎన్ఎస్ఈలో 1.6% బలపడి రూ.304 వద్ద ముగిసింది. -
జేఎస్‌డబ్ల్యూ నియో రూ.10,530 కోట్ల డీల్
న్యూఢిల్లీ: విద్యుత్ రంగంలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ భారీ డీల్‌కు తెరలేపింది. సంస్థ అనుబంధ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ 1,753 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పలు ప్రాజెక్టులను మిత్రా ఎనర్జీ నుంచి కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. డీల్ విలువ రూ.10,530 కోట్లు. వీటిలో 17 స్పెషల్ పర్సస్ వెహికిల్స్ (ఎస్పీవీ), మరొకటి అనుబంధ ఎస్పీవీ ఉంది. 1,331 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 10 పవన విద్యుత్ ప్రాజెక్టులు, 422 మెగావాట్ల ఏడు సోలార్ ప్రాజెక్టులు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ చేతికి రానున్నాయి. దక్షిణ, పశ్చిమ, మధ్య భారత్‌లో ఈ ప్రాజెక్టులు నెలకొన్నాయి. వీటి విద్యుత్ కొనుగోలు ఒప్పంద కాలపరిమితి సగటున మరో 18 ఏళ్లు ఉంది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ఖాతాలో ఇదే పెద్ద డీల్. తాజా కొనుగోలు ద్వారా జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ విద్యుత్ ఉత్పత్తి సాగిస్తున్న ప్రాజెక్టుల సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 4,784 నుంచి 6,537 మెగావాట్లకు చేరింది. నిర్మాణ దశలో ఉన్న 2,500 మెగావాట్ల పవన, జల విద్యుత్ ప్రాజెక్టులు రెండేళ్లలో జతవనున్నాయి. దీంతో జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ సామర్థ్యం 9.1 గిగావాట్స్‌కు చేరుతుంది. -
జీఎంఆర్ చేజారిన నాగ్‌పూర్ విమానాశ్రయ ప్రాజెక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మరో ఎదురుదెబ్బ. కంపెనీ గతేడాది దక్కించుకున్న నాగ్‌పూర్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్టు కాంట్రాక్టును మిహాన్ ఇండియా రద్దు చేసింది. జీఎంఆర్ కాంట్రాక్టును రద్దు చేశామని మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కంపెనీ ఎండీ అనిల్ పాటిల్ తెలిపారు. తిరిగి టెండర్ల ప్రక్రియను త్వరలో మొదలుపెడతామని చెప్పారు. కాగా, కరోనా ఎఫెక్ట్‌తో జీఎంఆర్ కమలాంగ ఎనర్జీ డీల్ ప్రస్తుతానికి నిలిచిపోయింది. జీఎంఆర్ కమలాంగ ఎనర్జీని రూ.5,321 కోట్లకు దక్కించుకోవడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ షేర్ పర్చేజ్ ఒప్పందం జీఎంఆర్‌తో చేసుకున్న సంగతి తెలిసిందే. -
జెఎస్డబ్ల్యు ఎనర్జీ చేతికి జెఎస్పిఎల్ యూనిట్
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా స్టీల్ పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో సుమారు రూ 46,000 కోట్ల రుణభారంతో ఉన్న సోదరుడు నవీన్ జిందాల్ ను ఆదుకోవడానికి జెఎస్డబ్ల్యు ఎనర్జీ అధిపతి సజ్జన్ జిందాల్ ముందుకొచ్చారు. దేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ విద్యుత్ సంస్థ గా రూపొందే వ్యూహంలో బాగంగా భారత అగ్రశ్రేణి ఉక్కు సంస్థ జెఎస్డబ్ల్యు ఎనర్జీ ఈ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో నవీన్ నేతృత్వంలోని అగ్రగామి సంస్థ జిందాల్ స్టీల్ అండ్ పవర్ (జెఎస్పిఎల్) ను ఆదుకోవడానికి రంగం సిద్దం చేశారు. చత్తీస్‌గఢ్ లోని పవర్ ప్లాంట్ ను జెఎస్డబ్ల్యు ఎనర్జీ యూనిట్ ను రూ .6,500 కోట్లకు జెఎస్డబ్ల్యు ఎనర్జీ సొంతం చేసుకోనుంది. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోనున్నట్టు ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. రాయపూర్ లోని జెఎస్పిఎల్ చెందిన 1,000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ను కొనుగోలు చేయనున్నట్లు జెఎస్ డబ్ల్యూ అధిపతి సజ్జన్ జిందాల్ తెలిపారు. ఆస్తులను విక్రయించడానికి చూస్తున్న నేపథ్యంలో మోనేటిజేషన్ లో భాగంగా ద్రవ్య సరఫరా, ఉత్పత్తి ప్రణాళికలను రూపొందించే ప్రణాళికతో ఈ ఒప్పందం జరిగిందన్నారు. ఒప్పందం విలువ రూ .4,000 కోట్లు, సంస్థ ప్రస్తుత నికర ఆస్తులు మొత్తం రూ .6,500 కోట్లకు చేరిందని జిందాల్ ప్రతినిధి తెలిపారు. ఈ ఒప్పందం 2018 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ పవర్ ప్లాంట్ కొనుగోలు ద్వారా బొగ్గు ఉత్పత్తిలో తూర్పు భారతదేశం లో పట్టు సాధించాలనేది ప్లాన్. అటు జెఎస్పిఎల్ దాని అప్పులను తీర్చేందుకు కూడా ఈ డీల్ సహాయం చేస్తుంది. మరోవైపు రెండు సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్న టాప్ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ( ఎస్బిఐ ) కు కూడా ఇది ఒక వరంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ తాజా ఒప్పందంతో జెఎస్ డబ్ల్యు ఎనర్జీ మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం 5,531 మెగావాట్లకు పెరగనుంది.అటు ఈ ప్రకటన ఫలితంగా షేర్ మార్కెట్ లో జిందాల్ స్టీల్ అండ్ పవర్ భారీగా లాభపడింది. 3.5 శాతం లాభాలతో షేర్ ధర రూ 71. 45 దగ్గర ట్రేడ్ అవుతోంది. గతంలో జిందాల్ సోదరులు విదేశీ ఆస్తులను కొనుగోలులో పోటీ పడ్డారు , కానీ సుప్రీంకోర్టు బొగ్గు గనుల లైసెన్సులు రద్దు చేయడం, కమోడిటీ మార్కెట్ల బలహీనత జేఎస్సీఎల్ లాభాలను ప్రభావితం చేశాయి. అటు రష్యా, చైనా నుంచి దిగుమతి అవుతున్న స్టీల్ పై దిగుమతి సుంకం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల కొన్ని సూచనలు కూడా చేశారు. దీంతో జిందాల్ సోదరులు తమ వ్యాపార ఎత్తుగడలను సమీక్షిస్తున్నట్టు కనిపిస్తోంది. -
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ చేతికి జేపీ బీనా పవర్ ప్లాంటు
- ఒప్పందం విలువ రూ. 3,500 కోట్లు న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తాజాగా జేపీ గ్రూప్‌నకు చెందిన బీనా థర్మల్ పవర్ ప్లాంటును కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. దీనికి ఎంత వెచ్చిస్తున్నదీ కంపెనీ నిర్దిష్టంగా వెల్లడించనప్పటికీ.. సుమారు రూ. 3,500 కోట్లు చెల్లించేందుకు సంస్థ సిద్ధమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్‌కు సంబంధించి జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. 500 మెగావాట్ల సామర్థ్యం గల బీనా థర్మల్ పవర్ ప్లాంటు మధ్యప్రదేశ్‌లో ఉంది. మరోవైపు, రూ. 9,700 కోట్లతో జేపీ గ్రూప్‌కే చెందిన హిమాచల్ బాస్పా పవర్ కంపెనీ (హెచ్‌బీపీసీఎల్) కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసినట్లు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తెలిపింది. హెచ్‌బీపీసీఎల్‌కి హిమాచల్ ప్రదేశ్‌లో రెండు పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ డీల్‌ను గతేడాది నవంబర్‌లో కంపెనీ ప్రకటించింది. దేశీ విద్యుత్ రంగంలో ఇది భారీ ఒప్పందం అని జేపీ గ్రూప్ చైర్మన్ మనోజ్ గౌర్ పేర్కొన్నారు. మంగళవారం బీఎస్ఈలో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ షేరు దాదాపు 10 శాతం లాభంతో రూ. 74.25 వద్ద, జేపీవీఎల్ షేర్లు 5 శాతం పెరిగి రూ. 5.85 వద్ద ముగిశాయి.