న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికానికి(క్యూ1) నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 48 శాతం క్షీణించి రూ. 290 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 560 కోట్లు ఆర్జించింది. ఇందుకు అనూహ్య(వన్‌టైమ్) నిర్వహణేతర వ్యయాలు ప్రభావం చూపాయి. దివాలా చట్ట మార్గంలో కంపెనీ ఇటీవల సొంతం చేసుకున్న మిత్రాతోపాటు, 700 మెగావాట్ల ఇండ్–బరత్ థర్మల్ ప్లాంటు లావాదేవీ లాభాలను దెబ్బతీసినట్లు కంపెనీ పేర్కొంది.
కాగా.. మొత్తం ఆదాయం 3 శాతం నీరసించి రూ. 3,013 కోట్లకు చేరింది. ఈ కాలంలో నికరంగా 6,699 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. ఇది 14 శాతం అధికంకాగా.. మిత్రా, పునరుత్పాదక ఇంధన(ఆర్‌ఈ) సామర్థ్య విస్తరణ ఇందుకు దోహదం చేశాయి. 2023 జూలై 14 నుంచి మూడేళ్ల కాలానికి రాజీవ్ చౌధ్రిని అదనపు, స్వతంత్ర డైరెక్టర్‌గా బోర్డు ఎంపిక చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.6% బలపడి రూ.304 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment