Mitra Energy
-
జేఎస్‌డబ్ల్యూ నియో రూ.10,530 కోట్ల డీల్
న్యూఢిల్లీ: విద్యుత్ రంగంలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ భారీ డీల్‌కు తెరలేపింది. సంస్థ అనుబంధ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ 1,753 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పలు ప్రాజెక్టులను మిత్రా ఎనర్జీ నుంచి కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. డీల్ విలువ రూ.10,530 కోట్లు. వీటిలో 17 స్పెషల్ పర్సస్ వెహికిల్స్ (ఎస్పీవీ), మరొకటి అనుబంధ ఎస్పీవీ ఉంది. 1,331 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 10 పవన విద్యుత్ ప్రాజెక్టులు, 422 మెగావాట్ల ఏడు సోలార్ ప్రాజెక్టులు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ చేతికి రానున్నాయి. దక్షిణ, పశ్చిమ, మధ్య భారత్‌లో ఈ ప్రాజెక్టులు నెలకొన్నాయి. వీటి విద్యుత్ కొనుగోలు ఒప్పంద కాలపరిమితి సగటున మరో 18 ఏళ్లు ఉంది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ఖాతాలో ఇదే పెద్ద డీల్. తాజా కొనుగోలు ద్వారా జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ విద్యుత్ ఉత్పత్తి సాగిస్తున్న ప్రాజెక్టుల సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 4,784 నుంచి 6,537 మెగావాట్లకు చేరింది. నిర్మాణ దశలో ఉన్న 2,500 మెగావాట్ల పవన, జల విద్యుత్ ప్రాజెక్టులు రెండేళ్లలో జతవనున్నాయి. దీంతో జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ సామర్థ్యం 9.1 గిగావాట్స్‌కు చేరుతుంది. -
గిగావాట్ మైలురాయి చేరిన మిత్రా ఎనర్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక విద్యుత్ రంగ సంస్థ మిత్రా ఎనర్జీ తాజాగా పవన విద్యుదుత్పత్తికి సంబంధించి 1 గిగావాట్ మైలు రాయిని అధిగమించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆస్పరిలో 220 మెగావాట్ల ప్రాజెక్టును ఏర్పాటుతో తమ పవన విద్యుత్ స్థాపిత సామర్ధ్యం మొత్తం 1,000 మెగావాట్లకు (1 గిగావాట్) చేరిందని కంపెనీ తెలిపింది. ఆరేళ్ల వ్యవధిలోనే ఇది సాధించగలిగామని సంస్థ చైర్మన్ రవి కైలాస్ పేర్కొన్నారు. -
మిత్రా ఎనర్జీకి 175 మిలియన్ డాలర్ల ఏడీబీ రుణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక విద్యుత్ రంగానికి చెందిన మిత్రా ఎనర్జీ (ఎంఈఐఎల్) తాజాగా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) నుంచి 175 మిలియన్ డాలర్ల మేర రుణ సదుపాయం పొందింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో పవన విద్యుత్ ప్రాజెక్టులకు .. తెలంగాణ, పంజాబ్‌లలో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ఇది ఉపయోగపడనుందని కంపెనీ చైర్మన్ రవి కైలాస్ తెలిపారు. రాబోయే 12 నెలల్లో 1,000 మెగావాట్ల సామర్ధ్యాన్ని సాధించాలన్న మధ్యకాలిక లక్ష్యాలకు తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. పునరుత్పాదక విద్యుదుత్పత్తి విభాగంలో మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా ఎంఈఐఎల్కు రుణ సదుపాయానికి ఆమోదం తెలిపినట్లు ఏడీబీ జేఎండీ సీనియర్ ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ మయాంక్ చౌదరి తెలిపారు. -
తెలంగాణకు పవనకాంతులు
♦ రూ.600 కోట్లతో రంగారెడ్డి జిల్లా పరిగిలో విండ్ పవర్ ప్రాజెక్టు ♦ ఈ నెలాఖరున అందుబాటులోకి.. రోజుకు 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ♦ వెయ్యి కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన బహుళజాతి సంస్థలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యుత్‌ను సాధించే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో మొట్టమొదటి పవన విద్యుత్ ప్రాజెక్టు రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటవుతోంది. పరిగి నియోజకవర్గంలో 100.5 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన పవన విద్యుత్ ప్రాజెక్టు ఈ నెలాఖరుకు అందుబాటులోకి రానుంది. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంటు కొన్ని రోజులుగా ‘నెడ్‌క్యాప్’ సంస్థ ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టును మిత్రా ఎనర్జీస్ పూర్తి చేసింది. కాగా హీరో గ్రూపు సంస్థ ఇదే ప్రాంతంలో 31.5 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతోంది. నిజామాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా మీదు గా మహబూబ్‌నగ ర్ వరకు గల క క్ష్యలో గాలి ఉధృతి అధికం గా ఉంటుంది. ఈ మేరకు ఈ పరిధిలో పవన విద్యుత్ ప్లాంట్లను స్థాపించేందుకు బహుళజాతి కంపెనీలు ముందుకొచ్చాయి. సుమారు రూ. వెయ్యి కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి. నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని భావిస్తున్న సర్కారు.. సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే పవన విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తోంది. 120 మీటర్ల ఎత్తులో.. 120 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేస్తున్న ప్రతి టవర్ రోజుకు కనిష్టంగా 2 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. వీచేగాలి సాంద్రతపై విద్యుత్ ఉత్పత్తి ఆధారపడుతోంది. రుతుపవనాల రాక మొదలు.. వర్షాకాలం మొదలయ్యే వరకు విండ్ సీజన్‌గా పరిగణిస్తారు. సాధారణ రోజుల కంటే ఈ సమయంలో పవనాల ఉధృతి (ఫ్రీక్వెన్సీ) ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే 48 టవర్లను నిర్మించిన ఈ సంస్థ.. ప్రతి టవర్ సామర్థ్యాన్ని పరిశీలిస్తోంది. ఒక్కో టవర్ నిర్మాణానికి రూ.6.5 కోట్లు వెచ్చించించింది. ప్రతి టవర్ ఉత్పత్తి చేసే కరెంట్‌ను ప్రత్యేకంగా నెలకొల్పిన పవర్ స్టేషన్‌కు పంపిణీ చేస్తాయి. అక్కడి నుంచి ఎస్పీడీసీఎల్ గ్రిడ్‌కు విద్యుత్‌ను అనుసంధానం చేస్తారు. ఇప్పటికే రూ.600 కోట్ల అంచనా వ్యయంతో పరిగి మండలం కాళాపూర్, ఖుదావన్‌పూర్, సయ్యద్‌పల్లి, రాపోలు, తొండపల్లి, చిట్యాల్, మాదారం, పూడూరు మండలం సోమన్గుర్తి, కేరవెళ్లి.. మహబూబ్‌నగర్ జిల్లా పద్మారం గ్రామాల్లో ఇప్పటికే విండ్ పవర్ కేంద్రాలను ప్రైవేట్ సంస్థలు నెలకొల్పాయి. మరికొన్నింటి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ పవన విద్యుత్‌ను పంపిణీ చేయడానికి వీలుగా 132/33 కేవీ సబ్ స్టేషన్‌ను అక్కడ నిర్మిస్తున్నారు. రోజుకు 2.5 మిలియన్ యూనిట్లు పవన విద్యుత్ ఉత్పాదనలో కీలకంగా పనిచేసే గాలిమరలు 24 గంటలు పనిచేస్తే దాదాపు 2.5 మిలి యన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉం ది. పవన విద్యుత్ ప్రాజెక్టులో గాలి వేగాన్ని బట్టి ఉత్పత్తి సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. కీలకమైన పీక్ అవర్స్ (విద్యుత్ వినియోగం అధికంగా ఉండే ఉదయం, సాయంత్రం) వేళ ల్లో కరెంట్‌ను బాగా ఉత్పత్తి చేస్తాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో పవనాల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాల్లో విద్యుత్ ఉత్పత్తి వల్ల గృహ, వాణిజ్య, పరిశ్రమలకు విద్యుత్‌ను పంపిణీ చేయడానికి వీలవుతుంది. -
మిత్రా ఎనర్జీకి సుజ్లాన్ టర్బైన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మిత్రా ఎనర్జీ ఏర్పాటు చేస్తున్న 98.7 మెగా వాట్ల పవన్ విద్యుత్ కేంద్రానికి అవసరమైన టర్బై న్లను సుజ్లాన్ గ్రూపు సరఫరా చేయనుంది. ఒకొక్కటి 2.1 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన మొత్తం 47 టర్బైన్లను సరఫరా చేయనున్నట్లు సుజ్లాన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 2010లో 1,000 మెగావాట్ల టర్బైన్లను సరఫరా చేసే విధంగా మిత్రా ఎనర్జీతో సుజ్లాన్ ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా సుజ్లాన్ సహాయంతో ఇప్పటికే 310 మోగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండగా, మరో 205 మెగా వాట్ల యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రస్తుతం మిత్రా ఎనర్జీ తెలంగాణతో సహా మొత్తం ఆరు రాష్ట్రాల్లో 543 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. -
2016 నాటికి 1,500 మెగావాట్లు
పవన విద్యుత్‌లో మిత్రా ఎనర్జీ లక్ష్యం ఏపీ, తెలంగాణలో కొత్తగా 200 మెగావాట్లు: కంపెనీ చైర్మన్ రవి కైలాస్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పవన విద్యుత్ రంగ సంస్థ మిత్రా ఎనర్జీ 2016 నాటికి 1,500 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోవాలని లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లో కంపెనీ 527 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. వచ్చే ఏడాదికల్లా పూర్తి చేసేలా మరో 300 మెగావాట్లను జత చేస్తామని మిత్రా ఎనర్జీ చైర్మన్ రవి కైలాస్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఇందుకు రూ.2,000 కోట్ల దాకా వ్యయం అవుతుందని చెప్పారు. మిత్రా ఎనర్జీ తెలంగాణలో కొత్తగా 100 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే అనంతపూర్, కర్నూలులో కలిపి 100 మెగావాట్ల ప్రాజెక్టులుండగా, మరో 100 మెగావాట్లు చేరుస్తున్నారు. ఏపీలోనే ధర తక్కువ..: పవన విద్యుత్‌కు ఒక్కో యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.4.70 మాత్రమే చెల్లిస్తోంది. బొగ్గు ఆధారిత విద్యుత్‌కు రూ.5.50, సోలార్కు రూ.6.50 చెల్లిస్తోంది. పవన విద్యుత్‌కు రాజస్థాన్ రూ.5.63, మహారాష్ట్ర రూ.5.70, మధ్యప్రదేశ్ రూ.5.94 చెల్లిస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లోనే తక్కువగా ఉందని కంపెనీ ఎండీ విక్రమ్ కైలాస్ అన్నారు. బొగ్గు ఆధారిత విద్యుత్ మాదిరిగా పవన విద్యుత్‌కూ యూనిట్‌కు రూ.5.50 ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతున్నామని చెప్పారు.‘భారత్‌లో 2 లక్షల మెగావాట్ల పవన విద్యుత్‌కు అవకాశముంది. ప్రస్తుతం 20 వేల మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. నాలుగైదు పెద్దవి, ఐదారు చిన్న కంపెనీలు ఈ రంగంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 10 వేలు, తెలంగాణలో 2 వేల మెగావాట్ల ఉత్పత్తికి ఆస్కారం ఉంది’ అని విక్రమ్ అన్నారు. విజేతకు లక్ష డాలర్లు.. ఇన్స్పైరింగ్ సొల్యూషన్ పేరుతో స్టార్టప్ విలేజ్, ఇండియన్ ఏంజెల్ నెట్వర్క్, విల్‌గ్రో సహకారంతో ఒక కార్యక్రమానికి మిత్రా ఎనర్జీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉత్తమ ప్రణాళికను ఎంపిక చేసి, వ్యాపారం ప్రారంభించేందుకు ఒక లక్ష డాలర్లను (రూ.60 లక్షలు) సీడ్ క్యాపిటల్‌గా అందిస్తారు. విజేతను ఆగస్టు 30న ప్రకటిస్తారు. అత్యుత్తమమైతే మరో రెండు ఐడియాలకూ సీడ్ క్యాపిటల్ ఇచ్చేందుకు సిద్ధమని మిత్రా ఎనర్జీ తెలిపింది.