న్యూఢిల్లీ : దేశీయ ఈ- కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ సొంతమైన విషయం తెలిసిందే. 16 బిలియన్ డాలర్లతో కుదిరిన ఈ మెగా ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కూడా ఇటీవలే ఆమోదం తెలిపింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన షేర్ల బదలాయింపు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలకు సంబంధించిన ప్రక్రియ మరికొన్ని రోజుల్లో పూర్తి కానుందని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బిన్నీ బన్సల్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎంప్లాయి స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ కింద 126- 128 డాలర్ల(ఒక్కో యూనిట్) విలువైన షేర్లను విక్రయించేందుకు అనుమతినిస్తూ లేఖ రాసింది. దీంతో ఫ్లిప్‌కార్టు ఉద్యోగులు మిలియనీర్లుగా మారనున్నారు.
ఎకనమిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్.. ఫ్లిప్‌కార్ట్‌లోని 6, 242, 271 షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందులో ఈఎస్‌ఓపీ కింద ఉన్న షేర్లవిలువ సుమారు 1.5 బిలియన్ డాలర్లు. దీంతో ఒక్కో యూనిట్ 126- 128 డాలర్ల చొప్పున వాల్‌మార్ట్ కొనుగోలు చేయనుంది. ఈ నేపథ్యంలో ‘ఈఎస్‌ఓపీ కింద ఉన్న షేర్లను నగదుగా మార్చుకునేందుకు ఉద్యోగులకు అవకాశం దక్కింది. మా ఉద్యోగుల శ్రమకు ఫలితంగా ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు అందిస్తాం. ప్రస్తుతం ఈ కొనుగోలు ద్వారా ఉద్యోగులు సుమారు 800 మిలియన్లు ఆర్జించనున్నారు’ అని ఫ్లిప్‌కార్ట్ కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
ఈ రెండు ఆన్‌లైన్ దిగ్గజాల మధ్య లావాదేవీలు పూర్తయ్యే రెండేళ్లలోగా ఉద్యోగులు ఈఎస్‌ఓపీ కింద 100 శాతం వాటాను విక్రయించవచ్చు. అయితే ఈ ఏడాది 50 శాతం, వచ్చే ఏడాది 25 శాతం, 2020లో మరో 25 శాతం వాటాను నగదుగా మార్చుకునే వీలు కల్పించింది కంపెనీ యాజమాన్యం. కాగా తాము పనిచేస్తున్న కంపెనీలో షేర్లను ఉద్యోగులు కొనుగోలుచేసేందుకు ఈఎస్‌ఓపీ అనేది ఒక ప్రయోజనకర ప్లాన్.
Comments
Please login to add a commentAdd a comment