Wallmart
-
సుమారు 5 వేలమంది సీనియర్లకు షాకిచ్చిన ఈ కామర్స్ దిగ్గజం
సాక్షి,ముంబై: వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ-కామర్స్ దిగ్గజం వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. గ్లోబల్‌గా లేఫ్స్ ఆందోళనల మధ్య ఉద్యోగుల జీతాల పెంపుపై ఫ్లిప్‌కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. టెక్ కంపెనీలు తమ లాభదాయకతను పెంచుకోవడానికి ఖర్చులను తగ్గించుకుంటున్న తరుణంలో ఫ్లిప్‌కార్ట్ వార్షిక వేతనాల పెంపును కేవలం 70 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది, అంటే ఈ ఏడాది దాదాపు 5వేల మంది సీనియర్ సిబ్బంది వేతనాల్లో ఎటువంటి పెంపుదల ఉండదు. కేవలం 70 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే బేసిక్ జీతాల పెంపును పరిమితం చేస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితంగా సుమారు 5000 ఉద్యోగులకు ప్రభావితం కానున్నారని సమాచారం. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ ఫిబ్రవరి 22 మెయిల్లో గ్రేడ్ 10 అంతకంటే ఎక్కువ ఉన్నవారి వేతనాల్లో ఎలాంటి పెంపుదల ఉండదని పేర్కొంది. అయితే సంస్థ ఉద్యోగుల కోసం బోనస్ చెల్లింపులు ,ద్యోగుల స్టాక్ ఆప్షన్ కేటాయింపులు ప్లాన్ ప్రకారం ఉంటాయని స్పష్టం చేసింది. -
రిటైల్ మార్కెట్లో దూసుకెళ్తున్న రిలయన్స్ రిటైల్
ముంబై: బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ ప్రపంచ రిటైల్ పవర్ హౌస్‌ల 2021 ర్యాంకింగ్‌లో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండవ రిటైలర్‌గా నిలిచింది. గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్ జాబితాలో గత ఏడాది 56వ స్థానంలో ఉంటే ఈ ఏడాది 53వ స్థానంలో ఉంది. డెలాయిట్ నివేదిక ప్రకారం, ఈ జాబితాలో యుఎస్ దిగ్గజం వాల్ మార్ట్ ఇంక్ అగ్రస్థానంలో ఉంది. మరోసారి ప్రపంచంలోని అగ్రశ్రేణి రిటైలర్ గా తన స్థానాన్ని నిలుపుకుంది. అమెజాన్.కామ్ రెండవ స్థానంలో నిలిచింది. కాస్ట్కో హోల్‌సేల్ కార్పొరేషన్ ఆఫ్ యుఎస్ మూడో స్థానంలో నిలిచింది, స్క్వార్జ్ గ్రూప్ ఆఫ్ జర్మనీ నాలుగో స్థానంలో నిలిచింది. టాప్ 10లో ఏడుగురు యుఎస్ రిటైలర్లు, ఒకరు యుకె(టెస్కో పిఎల్సి 10వ స్థానంలో) ఉన్నారు. టాప్ 10లో ఉన్న ఇతర యుఎస్ రిటైలర్లలో ది క్రోగర్ కో(5 వ ర్యాంక్), వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయన్స్ ఇంక్ (6వ), సీవీఎస్ హెల్త్ కార్పొరేషన్ (9వ ర్యాంక్) ఉన్నాయి. జర్మనీకి చెందిన ఆల్డి ఐంకాఫ్ జిఎమ్‌బిహెచ్ & కో.ఓహెచ్జి మరియు ఆల్డి ఇంటర్నేషనల్ సర్వీసెస్ జిఎమ్‌బిహెచ్ & కో.ఓహెచ్జీ 8వ స్థానంలో ఉన్నాయి. 250 మంది రిటైలర్ల ప్రపంచ జాబితాలో రిలయన్స్ రిటైల్ మాత్రమే భారతీయ సంస్థగా గుర్తింపు పొందడం విశేషం. గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్, ప్రపంచంలోని వేగవంతమైన రిటైలర్ల జాబితాలో ఇది వరుసగా 4వ సారి ప్రవేశం పొందింది. "రిలయన్స్ రిటైల్ కంపెనీ 41.8 శాతం వృద్ధిని నమోదు చేసింది, ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, జీవనశైలి, కిరాణా రిటైల్ గొలుసులలోని దుకాణాల సంఖ్య 13.1 శాతం పెరిగింది. ఆర్థిక సంవత్సరాంతంలో(ఎఫ్వై 20) భారతదేశంలోని 7,000 పట్టణాలు, నగరాల్లో 11,784 దుకాణాలకు చేరుకుంది" అని డెలాయిట్ ప్రతినిధులు తెలిపారు. "వాట్సాప్ ఉపయోగించి జియోమార్ట్ ప్లాట్ఫామ్లో రిలయన్స్ రిటైల్ డిజిటల్ కామర్స్ వ్యాపారాన్ని మరింత వేగవంతం చేయడానికి మరియు వాట్సాప్‌లో చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి కంపెనీ వాట్సాప్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది" అని తెలిపింది. చదవండి: ప్రమాదంలో లక్షల క్వాల్కామ్ స్మార్ట్ఫోన్లు -
ఫ్లిప్‌కార్ట్ చేతికి ట్రావెల్ బుకింగ్ క్లియర్‌ట్రిప్
ఆన్లైన్ ట్రావెల్, టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ క్లియర్‌ట్రిప్‌ను కొనుగోలు చేయనున్నట్లు వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గురువారం(ఏప్రిల్ 4) ప్రకటించింది. క్లియర్ ట్రిప్ 100 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ఈ-కామర్స్ సంస్థ తెలిపింది. ఒప్పందం ప్రకారం, క్లియర్‌ట్రిప్ కార్యకలాపాలు అన్ని ఫ్లిప్‌కార్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతాయి. అలాగే, ఇది ఇలాగే ప్రత్యేక బ్రాండ్‌గా కొనసాగుతుంది. క్యాష్, ఈక్విటీల రూపంలో మొత్తం 40 మిలియన్ డాలర్లను ఫ్లిప్‌కార్ట్ క్లియర్ ట్రిప్‌కు చెల్లించనుంది. 2006లో స్థాపించబడిన క్లియర్‌ట్రిప్ తన మొబైల్ యాప్, వెబ్సైట్ నుంచి విమాన, రైళ్లు, హోటళ్లను టికెట్లను బుక్ చేసుకోవడానికి అవకాశం కలిపిస్తుంది. క్లియర్‌ట్రిప్‌లో ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ ట్రావెల్ అండ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్, డిఎజి వెంచర్స్, గండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడర్ కాంకర్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు పెట్టుబడి దారులుగా ఉన్నాయి. క్లియర్ ట్రిప్ చివరిసారిగా 2016లో నిధుల సమీకరణను చేపట్టింది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ 300 మిలియన్ డాలర్లుగా ఉంది. కరోనాతో విమాన ప్రయాణాలు రద్దవ్వడంతో క్లియర్ ట్రిప్ లాభాలను అందుకో లేకపోయింది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు క్లియర్‌ట్రిప్‌లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకోవడంతో భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందనున్నట్లు కంపెనీ భావిస్తుంది. చదవండి: గడప గడపకి జియో మార్ట్ సేవలు -
ఫ్లిప్‌కార్ట్ నష్టం రూ. 3,150 కోట్లు
ముంబై, సాక్షి: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గత ఆర్థిక సంవత్సర(2019-20) ఫలితాలు ప్రకటించింది. గ్లోబల్ రిటైల్ కంపెనీ వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ గతేడాది రూ. 12 శాతం అధికంగా రూ. 34,610 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఈ కాలంలో నష్టాలను సైతం 18 శాతంమేర తగ్గించుకోగలిగింది. రూ. 3,150 కోట్లకు పరిమితం చేసుకోగలిగింది. అంతక్రితం ఏడాదిలో రూ. 4,455 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ టోఫ్లర్ అందించిన వివరాల ప్రకారం ఫ్లిప్‌కార్డ్ ప్రయివేట్ లిమిటెడ్(సింగపూర్)కు గతేడాది రూ. 4,455 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేసింది. కాగా.. గతేడాది మొత్తం వ్యయాలు రూ. 37,760 కోట్లకు చేరాయి. వీటిలో ఉద్యోగుల(బెనిఫిట్) వ్యయాలు రూ. 246 కోట్ల నుంచిరూ. 309 కోట్లకు పెరిగాయి. 2018లో ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను వాల్‌మార్ట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇతర ప్రాంతాలకూ సెప్టెంబర్‌లో టోకు విక్రయాలకుగాను ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ పేరుతో డిజిటల్ బీటూబీ ప్లాట్‌ఫామ్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రవేశపెట్టింది. తద్వారా స్థానిక కిరాణా, చిన్న, మధ్యతరహా దుకాణదారులకు రిటైలర్లతో కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పించింది. అంతేకాకుండా వీటి ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్‌ను డిజిటైజ్ చేసేందుకు అవకాశం ఏర్పడినట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ప్రధానంగా ఫుట్‌వేర్, దుస్తులు తదితర ఫ్యాషన్ రిటైలర్లకు అనుగుణంగా హోల్‌సేల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించినట్లు ఈకామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ తెలియజేసింది. తొలి దశలో గురుగ్రామ్, ఢిల్లీ, బెంగళూరులలో ఏర్పాటు చేయగా.. ఇకపై మరో 20 పట్టణాలకూ సర్వీసులను విస్తరించనున్నట్లు వెల్లడించింది. ప్రాథమిక దశలో రెండు నెలల్లో 300 మంది వ్యూహాత్మక భాగస్వాములు, 2 లక్షల ప్రొడక్టుల లిస్టింగ్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది జులైలో వాల్‌మార్ట్‌కు దేశీయంగా గల బెస్ట్‌ప్రైస్ హోల్‌సేల్ స్టోర్లతోసహా ఇతర బిజినెస్‌లనూ ఫ్లిప్‌కార్ట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తద్వారా దిగ్గజ కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్, అమెజాన్ తదితరాలతో ఎదురవుతున్న పోటీలో నెగ్గుకు వచ్చేందుకు సన్నద్ధమైనట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
టిక్‌టాక్‌పై సోషల్ వీడియో దిగ్గజం కన్ను
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద చైనా షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ కొనుగోలు రేసులో అమెరికాకు చెందిన మరో దిగ్గజ సంస్థ నిలిచింది. ప్రముఖసోషల్ వీడియో ప్లాట్‌ఫామ్ ట్రిల్లర్ చైనాకు చెందిన బైట్‌డాన్స్‌ను సంప్రదించినట్టు తెలుస్తోంది. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రసిద్ధ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సెంట్రికస్ ద్వారా 20 బిలియన్ డాలర్ల బిడ్‌తో సంప్రదించినట్లు రాయిటర్స్ శనివారం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారతదేంలోని టిక్ టాక్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు యోచిస్తున్నట్టు పేర్కొంది. (టిక్‌టాక్ : రేసులో మరో దిగ్గజం) టిక్‌టాక్ కాకుండా టిక్‌టాక్ యజమాన్య సంస్థ బైట్‌డాన్స్‌కు నేరుగా బిడ్ చేసినట్లు ట్రిల్లర్ వెల్లడించింది. సెంట్రికస్ ద్వారా బైట్‌డాన్స్ ఛైర్మన్‌కు నేరుగా ఆఫర్‌ను సమర్పించామనీ, స్వీకరణ ధృవీకరణ కూడా తమకు చేరిందని ట్రిల్లర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాబీ సర్నెవెష్ట్ చెప్పారు. డైరెక్టుగా ఛైర్మన్తోనే సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అయితే, ఈ వార్తలను టిక్‌టాక్ తోసిపుచ్చింది. అలాంటి ఆఫర్‌ను అందుకోలేదని తెలిపింది. దీంతో ఈ వ్యవహారంలో గందరగోళం నెలకొంది. (వీచాట్ బ్యాన్ : డ్రాగన్ టిట్ ఫర్ టాట్ వార్నింగ్) టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ తన అమెరికా, కెనడియన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కార్యకలాపాలను విక్రయించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన 90 రోజుల గడువు లోపల ఒక ఒప్పందానికి రావాలని భావిస్తోంది. సుమారు. 20-30 బిలియన్ల డాలర్ల పరిధిలో డీల్ ఖాయం చేసుకోవాలని భవిస్తోంది. అటు రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ మైక్రోసాఫ్ట్ తో జతకడుతున్నట్లు ధృవీకరించింది. దీంతో మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, వాల్ మార్ట్ మూడు దిగ్గజ కంపెనీలతో బైట్‌డాన్స్ చర్చలు జరుపుతోంది. కాగా జాతీయ భద్రతా సమస్యలరీత్యా టిక్‌టాక్ ను నిషేధిస్తామని ఇప్పటికే హచ్చరించిన ట్రంప్ అమెరికా కార్యకలాపాలను విక్రయించాలని ఒత్తిడి పెంచారు. ఇందుకు 45 రోజుల్లోపు అమెరికాలో బైట్‌డాన్స్ ఎటువంటి లావాదేవీలు జరపకుండా నిషేధిస్తూ ట్రంప్ ఆగస్టు 6న ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తరువాత దీన్ని 90 రోజులకు పెంచుతూ ఆగస్టు 14 న మరో ఉత్తర్వుపై సంతకం చేశారు. మరోవైపు ట్రంప్ మొదటి ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై టిక్‌టాక్ దావా వేసిన సంగతి తెలిసిందే. -
టిక్‌టాక్ : రేసులో మరో దిగ్గజం
వాషింగ్టన్ : చైనా సోషల్ మీడియా దిగ్గజం టిక్‌టాక్ అమెరికా బిజినెస్ కు సంబంధించి మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. టిక్‌టాక్ కొనుగోలు రేసులో మరో దిగ్గజం వాల్‌మార్ట్ చేరింది. మైక్రోసాఫ్ట్ సంస్థతో కలిసి టిక్‌టాక్ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకోనున్నామని వాల్‌మార్ట్ తాజాగా ప్రకటించింది. పదవిలో చేరిన మూడు నెలల కాలంలోనే టిక్‌టాక్ సీఈఓ కెవిన్ మేయర్ రాజీనామా చేసిన గంటల అనంతరం వాల్‌మార్ట్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. (చదవండి : టిక్‌టాక్ సీఈవో కెవిన్ రాజీనామా) టిక్‌టాక్ విక్రయానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సెప్టెంబర్ 15 లోగా ఒప్పందాన్ని పూర్తి చేయాలని టిక్‌టాక్ యజమాన్య సంస్థ బైట్‌డాన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో బిడ్డర్లతో ప్రత్యేక చర్చలు జరపనుందని రాయిటర్స్ నివేదించింది. అయితే ఈ అంచనాలపై వ్యాఖ్యానించడానికి బైట్‌డాన్స్ నిరాకరించింది. అమెరికాలోని టిక్‌టాక్ విభాగం కొనుగోలుకు టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతోంది. మరోవైపు టిక్‌టాక్ కొనుగోలుకు ఒరాకిల్ గ్రూప్ అయితే బావుంటుందని ట్రంప్ ఇటీవల హింట్ ఇచ్చారు. ఈ వైపుగా ఒరాకిల్ చర్చల్లో ఉన్నట్టు సమాచారం. (టిక్‌టాక్ : ట్రంప్ మరో ట్విస్టు) కాగా జాతీయ భద్రతకు ముప్పు, అమెరికా యూజర్ల సమాచారాన్ని చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందంటే ట్రంప్ టిక్‌టాక్‌పై తీవ్రంగా మండిపడున్నారు. అమెరికాలోని టిక్‌టాక్ వ్యాపారాన్ని అమెరికాలోని ఏదేని సంస్థకు విక్రయించాలని లేదంటే నిషేధం తప్పదని టిక్‌టాక్‌ను హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై సంతకం కూడా చేసిన ఆయన విక్రయానికి సమయాన్నిచ్చారు. మరోవైపు భారత చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం టిక్‌టాక్ సహా చైనా యాప్ లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
జియోమార్ట్‌కు షాక్ : ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్
సాక్షి, ముంబై: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రూపు వాల్‌మార్ట్ ఇండియాలో 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. బిజినెస్-టు-బిజినెస్ విభాగాన్ని రివర్స్ అక్విజిషన్‌లో భాగంగా వాల్‌మార్ట్ ఇండియా హోల్‌సేల్ వ్యాపారాన్ని సొంతం చేసుకున్నట్టు గురువారం ప్రకటించింది. ఈ కొనుగోలు ద్వారా సరికొత్త డిజిటల్ ప్లాట్‌ఫాం‘ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్’ను ప్రారంభించినట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. తద్వారా భారతదేశంలో కిరాణా రీటైల్ వ్యాపార స్వభావాన్ని మార్చి వేయనున్నామని వెల్లడించింది. ప్రస్తుతం ఆన్లైన్ కిరణా వ్యాపారంలో ఉన్నపోటీ, జియోమార్ట్ పేరుతో రిలయన్స్ రీటైల్ రంగంలో దూసుకువస్తున్న తరుణంలో ఫ్లిప్‌కార్ట్ తాజా డీల్ విశేషంగా నిలిచింది. ‘ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్’ ను ఆగస్టులో లాంచ్ చేయనున్నామని, కిరాణా, ఫ్యాషన్ వర్గాలకు పైలట్ సేవలను అందిస్తామని పేర్కొంది. దీనికి ఫ్లిప్‌కార్ట్ మాజీ ఉద్యోగి, అనుభవజ్ఞుడు ఆదర్శ్ మీనన్ నేతృత్వం వహిస్తారు. అలాగే వాల్‌మార్ట్ ఇండియా సీఈఓ సమీర్ అగర్వాల్ కొంతకాలంవరకు సంస్థతోనే ఉంటారు. ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ సంస్థ కిరాణా దుకాణాలు, చిన్నవ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. భారతదేశ రిటైల్ వ్యాపారంలో కిరణాల దుకాణాలు, ఎంఎస్ఎంఈలు కీలకంగా ఉన్నాయని చెప్పారు. టెక్నాలజీ నైపుణ్యాలు, లాజిస్టిక్ అవసరాలు, ఆర్థికంగా చిన్న వ్యాపారాలకు ఊతమివ్వడంతోపాటు, వినియోగదారుల అవసరాలను తీర్చడంపై ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ దృష్టి సారిస్తుందని అని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి అన్నారు. ఇదొక కీలక ముందడుగు అని వాల్‌మార్ట్ ఇండియా సీఈవో జుడిత్ మెక్కెన్నా వ్యాఖ్యానించారు. ఒకరి బలాలు, నైపుణ్యాలు పరస్పరం పెంచుకోవడం ద్వారా, కొత్త ఒరవడికి నాంది పడుతుందని పేర్కొన్నారు. -
ఫ్లిప్‌కార్ట్‌కు కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్ బై
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్ బై చెప్పారు. దీంతో సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా శ్రీరామ్ వెంకటరమణను నియమించినట్లు వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ మంగళవారం ప్రకటించింది. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. (లాక్డౌన్ 3.0 : ఈ కామర్స్ కంపెనీలకు ఊరట) సెప్టెంబర్ 2018 నుండి ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఎఫ్ఓగా ఉన్న ఎమిలీ మెక్నీల్ తన పదవికి రాజీనామా చేశారు. వాల్‌మార్ట్ గ్రూప్ వెలుపల మెరుగైన కెరీర్ అవకాశాల కోసం అమెరికాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో తాజా పరిణామం చోటుకుంది. ఫ్లిప్‌కార్ట్‌లో సీఎఫ్ఓ, సీవోవోగా పనిచేసిన వెంకట రమణ ఇప్పుడు వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీఎఫ్ఓక్రిస్ నికోలస్‌కు రిపోర్టు చేయాల్సి వుంటుంది. ఫ్లిప్‌కార్ట్ కామర్స్ (ఫ్లిప్‌కార్ట్, మింత్రా) సీఎఫ్ఓ శ్రీరామ్ పన్ను, రిస్క్ మేనేజ్మెంట్, ట్రెజరీతో సహా ఫ్లిప్‌కార్ట్, మింత్రాకు సంబంధించి కీలకమైన ఫైనాన్స్ కార్యకలాపాలు బాధ్యతలను నిర్వహించనున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో కార్పొరేట్ అభివృద్ధికి కూడా ఆయన బాధ్యత వహిస్తారని, ప్రొక్యూర్మెంట్, ప్లానింగ్ అండ్ ఎనలిటిక్స్ అండ్ డెసిషన్ సైన్సెస్ హెడ్లు ఆయనకు రిపోర్ట్ చేస్తూనే ఉంటారని ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. (పెట్రో ధరలకు వ్యాట్ షాక్ ) ఫ్లిప్‌కార్ట్‌లో అనేక కీలకమైన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించిన శ్రీరామ్ ఫ్లిప్‌కార్ట్ కామర్స్ సీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించడానికి బాగా సిద్ధంగా ఉన్నారని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. అలాగే చక్కని నాయకత్వం, మార్గదర్శకత్వంలో సమర్ధవంతమైన సేవలు అందించిన ఎమిలీ కు ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కల్యాణ్ కృష్ణమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. హైపర్‌లోకల్ ఫ్రెష్ ఫుడ్ సామర్థ్యాలను పెంపొందించే కీలకమైన పెట్టుబడులను నడిపించడంలో మెక్నీల్ కీలకపాత్ర పోషించారని, సంస్థ ప్రయాణంలో బలమైన భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. (లాక్డౌన్ సడలింపు : పసిడి వెలవెల) -
కరోనా : వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ భారీ విరాళం
సాక్షి, ముంబై: కరోనా పై పోరులో ముందుండి పోరాడుతున్న వారు, రైతులు, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రపంచ రీటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ఫౌండేషన్ , ఫ్లిప్‌కార్ట్ ముందుకొచ్చాయి. ఆరోగ్య సంరక్షణ కార్మికులకు కీలకమైన వ్యక్తిగత రక్షణ పరికరాలను (పీపీఈ), రైతులకు, చిన్నవ్యాపారాలకు అవసరమైన సహాయ సామగ్రిని, నిధులను అందించే సంస్థలకు నిధులు అందివ్వనున్నామని శనివారం ప్రకటించాయి. భారతదేశంల కోవిడ్-19 పోరాటానికి తమ మద్దతు అందిస్తామని, ఇందుకు 38.3 కోట్ల విరాళాలను అందిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి అదనంగా సుమారు 8 కోట్ల రూపాయలను స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ప్రకటించింది. (వాల్‌మార్ట్‌లో 50 వేల ఉద్యోగాలు ) ప్రభుత్వేతర సంస్థలు (ఎన్ జీఓలు) పబ్లిక్ హెల్త్ కేర్ కార్మికులకు పంపిణీ చేయడానికి ఎన్ 95 మాస్క్ లు, మెడికల్ గౌన్లు లాంటి పీపీఈలను అందించడంపై దృష్టి సారించినట్టు ఇరు సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి ఇప్పటికే 3లక్షల మాస్క్ లు, పది లక్షలమెడికల్ గౌన్లను అందించిన సంస్థ బలహీన వర్గాలకు మద్దతు ఇస్తున్న గూంజ్, శ్రీజన్ అనే స్వచ్ఛంద సంస్థకు తాజా 7.7 కోట్లను అదనంగా ఇస్తోంది. ఈ నిధులను రైతులు, గ్రామీణ సూక్ష్మ వ్యాపారాలకు అవసరమైన నిధుల సహాయంతో పాటు ఆహారం మందులు, పరిశుభ్రతకు అవసరమైన వస్తువుల పంపిణీకి ఉపయోగించనున్నారు.భారతదేశంలోని కస్టమర్లు, భాగస్వాములు కరోనాకు తీవ్రంగా ప్రభావితం మయ్యారని, ఈ సమయంలోవారికి తమ మద్దతు వుంటుందని వాల్‌మార్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు కాథ్లీన్ మెక్ లాఫ్లిన్ పేర్కొన్నారు. ఇలాంటి సమయాల్లో ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థల కృషికి మద్దతు ఇవ్వడానికి మనమందరం కలిసి రావాలన్నారు. కరోనా సంక్షోభంలో బాధితులను ఆదుకునేందుకు తమ బృందం 24 గంటలు కృషి చేస్తోందని, ఈ విషయంలో తమ నిబద్ధతలో భాగంగానే అత్యవసర సహాయక చర్యలపై భారతదేశంలోని ప్రైవేట్, ప్రభుత్వ రంగాలతో కలిసి పనిచేస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి అన్నారు. చదవండి : క్యూ4లో అదరగొట్టిన హెచ్డీఎఫ్సీ -
వాల్‌మార్ట్‌లో 50 వేల ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కల్లోలంతో మిలియన్ల మంది అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోతున్న సమయంలో రీటైల్ దిగ్గజం వాల్ మార్ట్ శుభవార్త చెప్పింది. రానున్నకాలంలో దాదాపు 50వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తున్నట్టు వెల్లడించింది.కరోనా వైరస్, లాక్ డౌన్ సమయంలో వినియోగదారుల నుండి కిరాణా, గృహ అవసరాలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ నియామకాలని వాల్‌మార్ట్ శుక్రవారం ప్రకటించింది. లక్షా 50 వేల మందిని నియమించుకోవాలన్న తమ మునుపటి లక్ష్యాన్ని ఆరువారాలముందే చేరుకున్నామని, సగటున రోజుకు 5,000 మంది చొప్పున తీసుకున్నామని వెల్లడించింది. (కరోనా : అమెజాన్‌లో 75 వేల ఉద్యోగాలు) తాజాగా వాల్‌మార్ట్ దుకాణాలు, క్లబ్బులు, కార్పొరేట్ కార్యాలయాలు, ఇతర పంపిణీ కేంద్రాలలో 50 వేల మంది కార్మికులను నియమించుకో నున్నామని వాల్‌మార్ట్ యుఎస్ ప్రెసిడెంట్ జాన్ ఫర్నర్ తెలిపారు. తమ ఉద్యోగలు మాస్క్ లు, శానిటైజేషన్ లాంటి నిబంధనలు పాటించాల్సి అవసరం వుందని పేర్కొన్నారు. అలాగే కంపెనీ అత్యవసర సెలవు విధానాన్ని మే చివరి దాకా పొడిగిస్తున్నట్టు వెల్లడించారు. కాగా కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో ప్రపంచ వ్యాప్తంగా కఠినమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. అత్యవసర సేవలు తప్ప మిగిలిన సేవలు ఎక్కడిక్కడ రద్దు అయ్యాయి. దీంతో వినిమయ డిమాండ్ క్షీణించి ఆర్థిక వ్యవస్థలు అతలాకుతవుతున్నాయి. దీంతో చాలా కంపెనీలు మూతపడే క్రమలో ఉన్నాయి. మరికొన్ని ఖర్చులను నివారించు కునేందుకు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో ఉన్నాయి. అయితే ఆహారం, హ్యాండ్ శానిటైజర్, టాయిలెట్ పేపర్, ఇతర గృహోపకరణాలకు డిమాండ్ భారీగా పుంజుకోవడంతో అమెజాన్ సంస్థ వేలాది మందిని నియమించున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
టాప్‌లోకి వాల్‌మార్ట్
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ రీటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకున్న అమెరికా రీటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ దేశంలో టాప్‌లోకి దూసుకొచ్చింది. ఇండియాలో అగ్రశ్రేణి రీటైలర్‌గా నిలిచింది. యూరోమానిటర్ ఇంటర్నేషనల్ ఆసియా అధ్యయనం ప్రకారం వాల్‌మార్ట్ 2018లో భారతదేశంలో రీటైల్ వ్యాపార ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు అనంతరం వాల్‌మార్ట్ ఈ ఘనతను సాధించడం విశేషం. మరో యుఎస్ దిగ్గజం ఆన్లైన్ రిటైలర్ అమెజాన్ రెండవ స్థానంలో నిలవగా, కిషోర్ బియానీ ఫ్యూచర్ గ్రూపు 3, రిలయన్స్ గ్రూపు 4 వ స్థానాన్ని దక్కించుకున్నాయి. టాప్-100 రిటైలర్స్ ఇన్ ఆసియా-2019 పేరుతో ఈ జాబితాను విడుదల చేసింది. వెస్ట్‌సైడ్, క్రోమా వంటి ఫార్మాట్లను నడుపుతున్న టాటా గ్రూప్ ఐదవ స్థానంలో ఉంది. అయితే గతంతో పోలిస్తే వీటి ర్యాంకింగ్స్‌లో ఎటువంటి మార్పు లేదు. భారతదేశపు మొదటి పది ర్యాంకింగ్స్‌లో వన్ 97 కమ్యూనికేషన్స్, డి-మార్ట్‌ను నడిపే అవెన్యూ సూపర్‌మార్ట్స్; ఆదిత్య బిర్లా గ్రూప్, ల్యాండ్‌మార్క్ గ్రూప్, కె రహేజా కార్ప్ నిలిచాయి. ఆసియా అంతటా, చైనా బిలియనీర్ జాక్‌మా ఆధ్వర్యంలోని అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ లిమిటెడ్ టాప్‌లో నిలవగా, జెడి.కామ్ ఇంక్, జపాన్‌కు చెందిన సెవెన్ అండ్ సెవెన్ ఐ హోల్డింగ్స్ కంపెనీ లిమిటెడ్ తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే, భారతదేశం ఇప్పటికీ పెద్ద సాంప్రదాయ రిటైల్ మార్కెట్‌గా నిలుస్తుందనీ, కానీ పట్టణ ప్రాంతాల్లోని కొనుగోలుదారులు మరింత అధునాతనమవుతున్నారని యూరోమోనిటర్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. గత దశాబ్దంలో వారి నెలవారీ షాపింగ్ కోసం పెద్ద పెద్ద షాపింగ్‌మాల్స్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. మారుతున్న జీవన శైలి, బిజీ షెడ్యూల్ కారణంగా, పట్టణ ప్రాంతాల్లోని చాలామంది వినియోగదారులు సాంప్రదాయ కిరాణా రిటైలర్లకు బదులుగా ఆధునిక కిరాణా రిటైలర్లలో నెలవారీ కొనుగోళ్లు చేయడానికి ఇష్టపడతారని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా బెంగుళూరు, ముంబై, పూణే, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లోఈ మార్పులు చోటుచేసుకున్నాయని తేల్చింది. అంతేకాదు ఆధునిక కిరాణా చిల్లర వ్యాపారులు వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త మార్కెటింగ్ పథకాలు, వ్యూహాలతో వ్యాపారశైలిని ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నారని చెప్పింది. డిజిటల్ చెల్లింపులు, అలాగే ఆన్లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్ లాంటి అవకాశాలతో ఆధునిక రిటైల్ ఫార్మాట్లకు భారతదేశంలో ప్రజాదరణ లభిస్తోందని తెలిపింది. -
‘థూ.. నువ్వసలు మనిషివేనా’
వాషింగ్టన్: ఇప్పటి వరకు విమానాల్లో, షాపింగ్ మాల్స్‌లో వికృత చర్యలకు పాల్పడిన మగ వారి గురించే చదివాం. కానీ తాజాగా ఓ యువతి వీరందరిని తలదన్నే వికృతమైన చర్యకు పాల్పడింది. వాల్‌మార్ట్ మాల్‌కు వెళ్లిన ఓ యువతి.. అక్కడే ఉన్న ఆలుగడ్డలపై మూత్ర విసర్జన చేసింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు ఈ వికార చర్యకు పాల్పడిన యువతి ఫోటోలను విడుదల చేశారు. ఈ సంఘటన పెన్సిల్వేనియా వాల్‌మార్ట్ స్టోర్‌లో జరిగింది. మాల్ సిబ్బందికి ఫ్లోర్లో ఎవరో మూత్రవిసర్జన చేసినట్లు అనుమానం రావడంతో.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. దాంతో యువతి చేసిన చండాలం వెలుగు చూసింది. ఈ సంఘటనపై మాల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సదరు యువతిని గ్రేస్‌గా గుర్తించారు పోలీసులు. అయితే ఆమెకు ఇలాంటి పనులు కొత్తేంకాదు అంటున్నారు పోలీసులు. పబ్లిక్ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించడం.. క్రమశిక్షణారాహిత్యం, అల్లర్లు సృష్టించడం వంటి కార్యక్రమాల్లో గ్రేస్ ఆరితేరిందంటున్నారు పోలీసులు. ఈ అంశాల్లో ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయని పేర్కొన్నారు. త్వరలోనే ఆమెను అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. అయితే గ్రేస్ చర్యలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ‘థూ.. నువ్వసలు మనిషివేనా.. నీ లాంటి వారికి మరణశిక్ష విధించాలి’ అంటూ కామెంట్ చేస్తున్నారు. -
బిన్నీబన్సల్ అనూహ్య నిర్ణయం
సాక్షి, ముంబై: ఫ్లిప్‌కార్ట్ మాజీ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో బిన్నీ బన్సల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్లిప్‌కార్ట్ అనూహ్యంగా తప్పుకున్న బిన్సీ తాజాగా ఫ్లిప్‌కార్ట్ షేర్లను మాతృసంస్థ వాల్‌మార్ట్ విక్రయించారు. 531 కోట్ల రూపాయల విలువైన 54 లక్షల ఈక్విటీ షేర్లను వాల్‌మార్ట్ లక్సెంబర్గ్ సంస్థ ఎఫ్ఐటి హోల్డింగ్స్ సార్ల్‌కు విక్రయించారు. దీంతో ఫ్లిప్‌కార్ట్‌లో బన్సల్ వాటా 3.85 శాతం నుంచి 3.52 శాతానికి పడిపోయింది. దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ లో మేజర్ వాటాను (77శాతం) గ్లోబల్ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన సుమారు ఏడాది తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ డీల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ మరో వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ సంస్థలో తన మొత్తం వాటాలను విక్రయించగా, బిన్సీ బన్సల్ మాత్రం ఫ్లిప్‌కార్ట్‌లో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ తరువాత కొంత కాలానికే లైంగిక ఆరోపణల నేపథ్యంలో బిన్నీ సంస్థనుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. -
రిలయన్స్ రిటైల్: ఆన్లైన్ దిగ్గజాలకు గుబులే
సాక్షి, ముంబై : వ్యాపార రంగంలో ఎదురులేకుండా దూసుకుపోతున్న ప్రముఖ బిలియనీర్ ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ రీటైల్ ఆన్లైన్ మార్కెట్లో కూడా సంచలనాలను నమోదు చేయనుంది. తద్వారా అమెజాన్, వాల్‌మార్ట్- ఫ్లిప్‌కార్ట్‌లకు పెద్ద సవాల్‌గా మారనుంది. జియో తరహాలోనే మార్కెట్లో విధ్వంసకర డిస్కౌంట్లకు తెరతీయనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ మార్కెట్ పరిశోధనా సంస్థ ఫోర్రెస్టర్ ప్రకారం 2023 నాటికి భారతదేశంలో ఆన్లైన్ రిటైల్ విక్రయాల మార్కెట్ విలువ 85 బిలియన్ డాలర్లకు(సుమారు రూ. 5,90,000 కోట్లు) చేరనుంది. వచ్చే ఐదేళ్లలో ఆన్లైన్ రిటైల్ సేల్స్ 25.8 శాతం వృద్ధిని సాధించనున్నాయి. అలాగే భారత్‌లో 2016లో నోట్ల రద్దు, 2017లో జీఎస్టీ అమలు, గత డిసెంబర్లో ఈ కామర్స్ పాలసీలో మార్పుల రూపంలో ఒడిదుడుకులు ఎదురైనా వృద్ధి కొనసాగుతుందని అంచనా వేసింది. 6,600 నగరాలు, పట్టణాల్లో 10,415 స్టోర్లు కలిగిన రిలయన్స్ రిటైల్ ఏటా 500మిలియన్ల కస్టమర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో భారీ డిస్కౌంట్లతో ముందుకొచ్చే రిలయన్స్ స్టోర్లకు ఆదరణ పెరుగుతుందని ఫోర్రెస్టర్ అంచనా వేస్తోంది. ఇది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్లకు పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని విశ్లేషించింది. అలాగే భారీ డిస్కౌంట్లతో రిలయన్స్ రిటైల్ మార్కెట్లోఅడుగు పెడితే ఆన్లైన్ రీటైల్ దిగ్గజాలకు నష్టాలు తప్పవని, దాదాపు టెలికాం మార్కెట్లోకి జియో ప్రవేశించిన అనంతరం ఏర్పడిన పరిస్థితులే పునరావృతం అవుతాయని ఫోర్రెస్టర్ సీనియర్ ఫోర్కాస్ట్ అనలిస్ట్ సతీష్ మీనా అభిప్రాయపడ్డారు. 2019 ఏప్రిల్‌లో రిలయన్స్ తన ఎంప్లాయిస్ కోసం ఫుడ్ అండ్ గ్రోసరీ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఉద్యోగుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ ఏడాదిలోనే యాప్‌ను కమర్షియల్‌గా లాంచ్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తద్వారా రిలయన్స్ గ్రూప్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ టూ ఆఫ్ లైన్ కామర్స్ ప్లాట్‌ఫాంను అందుబాటులో తేవడంతోపాటు, వినియోగదారులకు భారీ ప్రయోజనాలను అందించనుంది. కాగా 2019 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ రీటైల్ ఆదాయం 81 బిలియన్ డాలర్లుగానూ, లాభాలు 9.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అలాగే రూ. 620 కోట్ల భారీ పెట్టుబడితో ఇటీవల సొంతం చేసుకున్న గ్లోబల్ టాయ్స్ కంపెనీ హామ్లీస్తోపాటు 40 బ్రాండ్లు రిలయన్స్ పోర్ట్‌ఫోలియోలో భాగం. -
వాల్‌మార్ట్ భారీ పెట్టుబడులు : ఇక దిగ్గజాలకు దిగులే
ప్రపంచ ఆన్‌లైన దిగ్గజం వాల్‌మార్ట్.. పేటీఎం, అమెజాన్, గూగుల్‌కు షాకిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశీయ ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మెజార్టీ వాటాను కొనేసిన వాల్‌మార్ట్ తాజాగా ఫ్లిప్‌కార్ట్ సొంతమైన ఆన్లైన్, ఆఫ్‌లైన్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పేలో భారీ పెట్టుబడులను పెడుతోంది. సమీర్ నిగమ్ నేతృత్వంలోని కంపెనీ 500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని, ప్రత్యేకించి రానున్న ఐపిఎల్ సీజన్లో ప్రకటనలు, ప్రమోషన్లపై వెచ్చించాలని భావిస్తున్న సమయంలో తాజా నిధులు అందడం విశేషం. డిజిటల్ పేమెంట్ మార్కెట్లో రానున్న విప్లవాత్మక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వాల్‌మార్ట్ ఈ పెట్టుబడులను పెడుతోంది. ఫోన్ పేలో 763 కోట్ల రూపాయలు (సుమారుగా 111 మిలియన్ డాలర్లు) సమకూర్చింది. 2019లో కంపెనీకి మొట్టమొదటి పెట్టుబడి నిధిగా భావిస్తున్నారు. బెంగళూరుకు చెందిన సమీర్ నిగమ్ స్థాపించిన మొబైల్ పేమెంట్ సంస్థ ఫోన్‌పేను ఫ్లిప్‌కార్ట్ 2016లో కొనుగోలు చేసింది. 2017లో 500మిలియన్ డాలర్ల నిధులు సమకూర్చింది. దీంతో డిజిటల్ చెల్లింపుల రంగంలో మార్కెట్ లీడర్‌గా దూసుకుపోతోంది. 50 మిలియన్లకు పైగా నెలవారీ వినియోగదారులతో, ప్రత్యర్థులకు ధీటుగా దూసుకుపోతోంది. పేటీఎం, గూగుల్ పే, అమెజాన్ పే, వాట్సాప్ పేమెంట్స్, జియోతో పాటు కొత్తగా షావోమి ఎంఐ పే ఇటీవల డిజిటల్ చెల్లింపుల రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. -
మాది దీర్ఘకాలిక ఒప్పందం.. దీటుగా నిలబడతాం!
సాక్షి, ముంబై : వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్ నుంచి వైదొలగుతుందా? అంటూ మార్కెట్లో వర్గాల్లో తీవ్ర సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈ వార్తలను ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తీవ్రంగా ఖండించారు. ప్రతికూల ప్రభావం కారణంగా ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ భారతీయ మార్కెట్లలో పెట్టుబడులు ఉపసంహరించుకోవచ్చన్న మోర్గాన్ స్టాన్లీ నివేదికను ఆయన తిరస్కరించారు. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ సీఈవో ఉద్యోగులకు అంతర్గత ఈ మెయిల్ సమాచారాన్ని అందించారు. మోర్గాన్ స్టాన్లీ రిపోర్టు అవాస్తమని భవిష్యత్తులో తేలిపోతుందని, భారతదేశంలో ఈ కామర్స్ వ్యాపారానికి వాల్‌మార్ట్ కట్టుబడి వుందని స్పష్టం చేశారు. భారతీయ ఈ కామర్స్ బిజినెస్‌లో ఫ్లిప్‌కార్ట్ ముందు వరుసలో నిలుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వాల్‌మార్ట్ ఒప్పందం దీర్గకాలిక దృష్టితో చేసుకున్నదని, ఈ నేపథ్యంలో స్వల్పకాలిక అడ్డంకులు సంస్థను ప్రభావితం చేయలేవని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కామర్స్ మార్కెట్లో అతిపెద్ద డీల్ గా నిలిచిన వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్డ్ ఒప్పందానికి సంబంధించిన మోర్గాన్ స్టాన్లీ సంచలన అంచనాలను వెల్లడించింది. దేశీయంగా ఈ-కామర్స్ కంపెనీలకు సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నూతన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో వాల్‌మార్ట్ ఈ డీల్ నుంచి వైదొలగనుంచి పేర్కొంది. 2017లో చైనాలో అమెజాన్‌కు దాపురించిన పరిస్థితే దేశీయంగా వాల్‌మార్ట్‌కు రానుందని నివేదించింది. అంతేకాదు ఫ్లిప్‌కార్ట్ నష్టాలు 20నుంచి 25శాతం దాకా పెరగొచ్చనీ, దీంతో వాల్‌మార్ట్ పలాయనం చిత్తగించక తప్పదని వ్యాఖ్యానించింది. కాగా ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్.. 16 బిలియన్ డాలర్లతో 77శాతం వాటాను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్స్‌కు ఐటీ నోటీసులు
ఈ కామర్స్ మార్కెట్లో అతిపెద్ద డీల్‌గా నిలిచిన వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ ఒప్పందంపై ఆదాయపన్ను శాఖ ఆరా తీస్తోంది. ఈ క్రమంలో ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు బిన్నీ బన్సల్, సచిన్ బన్సల్‌లకు ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. వాల్‌మార్ట్ ఒప్పందానికి సంబంధించి ఆదాయ వివరాలను వెల్లడించాల్సిందిగా కోరింది. అలాగే వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ ఒప్పందంలో భాగంగా చేతులు మారిన నగదు వివరాలు అందించాలని కోరింది. నికర లాభం, పన్ను చెల్లింపులకు సంబంధించిన వివరాలను కూడా ఐటీ శాఖ కోరినట్టు సమాచారం.వీరితోపాటు సంస్థలోని 35మంది వాటాదారులకు కూడా నోటీసులు జారీ చేసింది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం భారతీయులైన సచిన్,బిన్నీ బన్సల్ ద్వయం 20శాతం మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే వాటా అమ్మకం, పన్ను చెల్లింపులకు సంబంధించి ఐటీ శాఖ నుంచి కొన్ని నెలల క్రితమే నోటీసులు అందాయనీ, అయితే ఆ నోటీసులకు సంబంధించి మేము అప్పుడే వివరణ ఇచ్చామని కో ఫౌండర్ బిన్నీ బన్సల్ తెలిపారు. కాగా అంతర్జాతీయ ఈ కామర్స్ దిగ్గజం వాల్‌మార్ట్, దేశీయ దిగ్గజం ఫ్లిప్‌కార్టులో మేజర్ (77శాతం) వాటాను కొనుగోలు చేసింది. సెప్టెంబర్‌లో ప్రకటించిన ఈ డీల్ విలువు దాదాపు రూ.13750కోట్లు (16 బిలియన్ డార్లు). ఒప్పందంలో భాగంగా ఇప్పటికే సుమారు రూ.7439కోట్లు వాల్‌మార్ట్ చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను వెల్లడించాల్సిందిగా ఐటీ నోటీసులు జారీ అయ్యాయి. ఇది ఇలా ఉంటే ఈ డీల్ ముగిసిన అనంతరం ఫౌండర్లలో ఒకరైన సచిన్ బన్సల్ ఫ్లిప్‌కార్ట్‌లో తన 5-6శాతం వాటాను అమ్ముకొని సంస్థకు గుడ్ బై చెప్పారు. మరో ఫౌండర్ బిన్సీ బన్సల్ లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఈ నెలలో ఫ్లిప్‌కార్ట్ సీఈవో పదవికి రాజీనామా చేశారు. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో అతిపెద్ద వాటాదారుడుగా కొనసాగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఫ్లిప్‌కార్ట్‌కు బిన్నీ రాజీనామా..కొత్త సీఈవో
సాక్షి,ముంబై: ఫ్లిప్‌కార్ట్ కో ఫౌండర్, గ్రూప్ సీఈవో బిన్నీబన్సల్ (37)అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. తీవ్రమైన వ్యక్తిగత దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన పదవినుంచి తప్పుకున్నారు. బిన్నీ బన్సల్ రాజీనామాను ఆమోదించిన వాల్‌మార్ట్ ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. బిన్నీబన్సల్ వ్యక్తిగత ప్రవర్తన సరిగా లేదంటూ ఈ మధ్య కాలంలో ఆరోపణలతో వెల్లువెత్తాయి. కానీ ఈ ఆరోపణలను బిన్సీ బన్సాల్ తోసిపుచ్చారు. అయితే ఈ ఆరోపణలపై ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ సంయుక్తంగా స్వతంత్ర విచారణ చేపట్టాయి. బన్సల్ ఆరోపణలను తిరస్కరించినప్పటికీ తాము విచారణ చాలా జాగ్రత్తగా, నిశితంగా చేశామని వాల్‌మార్ట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అదే సమయంలో బిన్నీపై చెలరేగిన ఆరోపణలపై సాక్ష్యం కనుగొన లేకపోయినప్పటికీ, తీర్పులో ఇతర లోపాలను, ముఖ్యంగా బిన్నీ సమాధానంలో పారదర్శకత లేని కారణంగా బిన్నీ రాజీనామాను ఆమోదించామని తెలిపింది. అలాగే ఫ్లిప్‌కార్ట్ గ్రూపు సీఈవోగా కళ్యాణ్ కృష్ణమూర్తి కొనసాగుతారని ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక ప్లాట్‌ఫాంలుగా ఉన్న మింత్రా, జబాంగ్ను కలపనున్నామని తెలిపింది. కాగా అమెజాన్ మాజీ ఉద్యోగులైన సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రపంచ వ్యాపార దిగ్గజంవాల్మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో 77శాతం వాటాను కొనుగోలు చేయడంతో సచిన్ బన్సల్ తన పూర్తి వాటాను అమ్ముకొని వెళ్లిపోగా.. బిన్నీ బన్సల్ మాత్రం సీఈవోగా ఉన్నారు. ఈ-కామర్స్ మార్కెట్లో మెగాడీల్‌గా పేరొందిన ఈ ఒప్పందం జరిగిన కొన్ని నెలల వ్యవధిలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది. దీంతో ఫౌండర్లు ఇద్దరూ కంపెనీని వీడినట్టయింది. బిన్నీ బన్సల్ ప్రకటన మరో రెండు క్వార్టర్లు కంపెనీలో కొనసాగాలనుకున్నాను. కానీ వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే నాపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నాను. ఇది నాకు, కుటుంబానికి పరీక్ష సమయం. సీఈవోగా రాజీనామా చేసినా ఫ్లిప్‌కార్ట్‌లో వాటాదారుడిగా, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడిగా కొనసాగుతాను. -
ఫ్లిప్‌కార్ట్ డీల్ : నేడు భారత్ బంద్‌కు పిలుపు
పుణే : అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్, దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేయడాన్ని మొదట్నుంచి దేశీయ వర్తకులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ ప్రభావం వర్తకులపై, చిన్న వ్యాపారాలపై తీవ్ర చూపనుందని ఆరోపిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ డీల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్లు(సియాట్) నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు చెందిన స్వదేశీ జాగ్రన్ మంచ్ కూడా భారత్ బంద్‌కు మద్దతు తెలిపింది. ఈ డీల్‌తో మల్టి-బ్రాండ్ రిటైల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బ్యాక్‌డోర్ నుంచి దేశంలోకి ప్రవేశిస్తాయని ట్రేడర్లు చెబుతున్నారు. ‘ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ డీల్ దేశీయ ఎఫ్‌డీఐ పాలసీకి వ్యతిరేకంగా ఉంది. ఇది ఏడు కోట్ల ట్రేడర్లు, దేశంలోని చిన్న వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది’ అని సియాట్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్వాల చెప్పారు. భారత్‌లోకి ఎఫ్‌డీఐల ప్రవేశాన్ని తాము అడ్డగించడం లేదని, కానీ వాల్‌మార్ట్, అమెజాన్‌తో పోటీపడేలా బలవంతం చేసేముందు, భారతీయ ట్రేడర్లకు కూడా ఆ స్థాయిలో మైదానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్టు సియాట్ కోఆర్డినేటర్ అజిత్ సేథియా అన్నారు. స్వదేశీ జాగ్రన్ మంచ్ కూడా మల్టి-బ్రాండ్ రిటైల్‌లో ఎఫ్‌డీఐను వ్యతిరేకిస్తోంది. అంతేకాక ఫ్లిప్‌కార్ట్ ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరిపించాలని డిమాండ్ కూడా చేస్తోంది. నేషనల్ కంపెనీ లా అప్పీలెంట్ ట్రిబ్యునల్‌లో వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ డీల్‌కు చెందిన కేసు విచారిస్తున్న సందర్భంగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. వాల్‌మార్ట్ ట్రిబ్యునల్ ముందు తన స్పందనలు కూడా తెలిపింది. ఈ విషయంపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఈడీని, ఆర్బీఐని, సీసీఐని డిమాండ్ చేస్తున్నామని స్వదేశీ జాగ్రన్ మంచ్ కో-కన్వీనర్ అశ్వాని మహాజన్ అన్నారు. మల్టి బ్రాండులో ఎఫ్‌డీఐలు, ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌ను దెబ్బతీస్తాయని, వ్యవసాయదారులకు వ్యతిరేకంగా ఉంటాయని, ఉద్యోగాల సృష్టిని కూడా హరింపజేస్తాయని స్వదేశీ జాగ్రన్ మంచ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
మిలియనీర్లుగా మారనున్న ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు
న్యూఢిల్లీ : దేశీయ ఈ- కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ సొంతమైన విషయం తెలిసిందే. 16 బిలియన్ డాలర్లతో కుదిరిన ఈ మెగా ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కూడా ఇటీవలే ఆమోదం తెలిపింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన షేర్ల బదలాయింపు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలకు సంబంధించిన ప్రక్రియ మరికొన్ని రోజుల్లో పూర్తి కానుందని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బిన్నీ బన్సల్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎంప్లాయి స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ కింద 126- 128 డాలర్ల(ఒక్కో యూనిట్) విలువైన షేర్లను విక్రయించేందుకు అనుమతినిస్తూ లేఖ రాసింది. దీంతో ఫ్లిప్‌కార్టు ఉద్యోగులు మిలియనీర్లుగా మారనున్నారు. ఎకనమిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్.. ఫ్లిప్‌కార్ట్‌లోని 6, 242, 271 షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందులో ఈఎస్ఓపీ కింద ఉన్న షేర్లవిలువ సుమారు 1.5 బిలియన్ డాలర్లు. దీంతో ఒక్కో యూనిట్ 126- 128 డాలర్ల చొప్పున వాల్‌మార్ట్ కొనుగోలు చేయనుంది. ఈ నేపథ్యంలో ‘ఈఎస్ఓపీ కింద ఉన్న షేర్లను నగదుగా మార్చుకునేందుకు ఉద్యోగులకు అవకాశం దక్కింది. మా ఉద్యోగుల శ్రమకు ఫలితంగా ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు అందిస్తాం. ప్రస్తుతం ఈ కొనుగోలు ద్వారా ఉద్యోగులు సుమారు 800 మిలియన్లు ఆర్జించనున్నారు’ అని ఫ్లిప్‌కార్ట్ కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ రెండు ఆన్లైన్ దిగ్గజాల మధ్య లావాదేవీలు పూర్తయ్యే రెండేళ్లలోగా ఉద్యోగులు ఈఎస్ఓపీ కింద 100 శాతం వాటాను విక్రయించవచ్చు. అయితే ఈ ఏడాది 50 శాతం, వచ్చే ఏడాది 25 శాతం, 2020లో మరో 25 శాతం వాటాను నగదుగా మార్చుకునే వీలు కల్పించింది కంపెనీ యాజమాన్యం. కాగా తాము పనిచేస్తున్న కంపెనీలో షేర్లను ఉద్యోగులు కొనుగోలుచేసేందుకు ఈఎస్ఓపీ అనేది ఒక ప్రయోజనకర ప్లాన్. -
వాల్‌మార్ట్‌లో వెయ్యి ఉద్యోగాలు : భారీ వేతనం
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచ రీటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ భారతదేశంలో తన ఇ-కామర్స్ బిజినెస్‌ను మరో అడుగుపైకి తీసుకెళ్లాలని భావిస్తోంది. టెక్నాలజీ ఆపరేషన్స్ విస్తరణకోసం భారీగా టెకీలను నియమించుకునేందుకు సిద్దపడుతోంది. దేశీయంగా దాదాపు వెయ్యిమంది ఉద్యోగులను నియమించుకోనుంది. తద్వారా రీటైల్ బిజినెస్ రంగంలో మరింత దూసుకుపోవాలని ప్రణాళికలు రచించింది. ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం ప్రపంచంలోని అతి పెద్ద రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ తన ప్రతిభను మరింత ఇనుమడింప చేసేందుకు ప్లాన్చేస్తోంది. ఇలా ఎంపిక చేసిన టెకీలకు 6 లక్షలనుంచి 22 లక్షల రూపాయల దాకా వేతనాలను ఆఫర్ చేయనుంది. ముఖ్యంగా ఇ-కామర్స్ రంగ దిగ్గజం అమెజాన్‌కు దీటుగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి ఆధారితంగా సంస్థగా ఉండేందుకు, ప్రధానంగా భారతీయ ఉత్పత్తులకు ప్రోత్సాహమిచ్చేలా కొత్త ప్రాజెక్టులు చేపట్టామని వాల్‌మార్ట్ ముఖ్య సమాచార అధికారి క్లే జాన్సన్ వెల్లడించారు. కాగా గురగావ్, బెంగళూరు ద్వారా సేవలను అందిస్తున్న సంస్థలో ప్రస్తుతం 1800 మంది ఉద్యోగులున్నారు. సంవత్సరానికి సుమారు 10 బిలియన్ డాలర్ల ఆదాయంతో అమెరికా వెలుపల వాల్‌మార్ట్ ల్యాబ్స్ పేరుతో ఇండియాలో అతిపెద్ద వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. -
దేశీయ ఈ-కామర్స్ మార్కెట్లోకి టెక్ దిగ్గజం
టెక్ దిగ్గజం గూగుల్ కన్ను ఇప్పుడు ఈ-కామర్స్ మార్కెట్‌పై పడింది. అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌లో వాటా కొనేసి మన ఈ-కామర్స్ మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత.. టెక్ దిగ్గజం గూగుల్ సైతం ఈ-కామర్స్ మార్కెట్లోకి అరంగేట్రం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కంపెనీ తొలి స్టాప్ కూడా భారతేనట. ఈ ఏడాది దివాళి వరకు దేశీయ ఈ-కామర్స్ మార్కెట్లోకి గూగుల్ ప్రవేశించబోతుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను కొనుగోలు చేసిన అనంతరం, ఈ టెక్ దిగ్గజం కూడా చర్చలు జరిపింది. ప్రస్తుతం సొంతంగానే గ్లోబల్ ఈ-కామర్స్ మార్కెట్లోకి ప్రవేశించాలని చూస్తోంది. 2020 వరకు దేశీయ ఈ-కామర్స్ మార్కెట్ 100 బిలియన్ డాలర్లకు చేరుకోబోతుందని తెలిసింది. దీంతో భారత్‌లోనే తన తొలి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేయాలని గూగుల్ చూస్తోంది. ‘గూగుల్ రెండో వైపు ఆలోచనలను ప్రారంభించింది’ అని ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. అయితే ఈ విషయంపై గూగుల్ స్పందించడం లేదు. ఈ వారం ప్రారంభంలోనే ఈ-కామర్స్ మార్కెట్‌పై తనకు ఆసక్తి ఉందని గూగుల్ సంకేతాలు ఇచ్చింది. చైనీస్ ఈకామర్స్ కంపెనీ జేడీ.కామ్‌లో గూగుల్ 550 మిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టింది. అక్కడ వాల్‌మార్ట్, జేడీ.కామ్లు వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఉన్నాయి. గూగుల్ ఇండియా ఈ-కామర్స్ ప్లాన్లు ఏడాది పట్టే అవకాశం ఉందని తెలిసింది. ఇతర ఎమర్జింగ్ మార్కెట్లలోకి వెళ్లే ముందు, భారత్‌లో వీటిని టెస్ట్ చేయాలనుకుంటోంది. దీని కోసం 2వేల వర్క్‌షాపులను నిర్వహించింది. గూగుల్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ కోసం 15 వేల మందికి పైగా విక్రయదారులను గుర్తించిందని కూడా తెలిసింది. ఇలా గూగుల్ తన ఈ-కామర్స్ ప్లాన్స్‌ను అమల్లోకి తీసుకురావడానికి వేగవంతంగా ముందుకు సాగుతోంది. -
అమెజాన్ మెగా సేల్, భారీ డిస్కౌంట్లు!
న్యూఢిల్లీ : వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్‌లు ఒకటైపోయాయి. ఈ రెండు జతగా ఇక దేశీయ ఈ-కామర్స్ రాజ్యాన్ని ఏలాలనుకుంటున్నాయి. కానీ వీటికి ఎలాగైనా చెక్ పెట్టాలని మరోవైపు నుంచి అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చూస్తోంది. వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి పోటీ ఇచ్చేందుకు అమెజాన్ త్వరలోనే ప్రైమ్ డే సేల్‌ను నిర్వహించబోతుంది. 30 గంటల పాటు ఈ సేల్ ఈవెంట్‌ను నిర్వహించాలని అమెజాన్ చూస్తోంది. ప్రైమ్ షాపర్స్ ఆధారంగా చేసుకుని భారీ డిస్కౌంట్లను అమెజాన్ ప్రకటించబోతుందని అమెజాన్ ఇండియాలో టాప్ సెల్లర్స్ చెప్పారు. జూలై 7 నుంచి జూలై 15 మధ్యలో అమెజాన్ ఇండియా ఈ సేల్‌ను నిర్వహించాలని ప్లాన్చేస్తుందని నలుగురు టాప్ విక్రయదారులు తెలిపారు. అంతకముందు ఎన్నడూ చూడని డిస్కౌంట్లను ఈ 30 గంటల సేల్‌లో వినియోగదారులు చూస్తారని పేర్కొన్నారు. అంతేకాక ఫ్లిప్‌కార్ట్ నుంచి కస్టమర్లను తమవైపు తిప్పుకోవడంలో కూడా ఈ సేల్ దోహదం చేయనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సేల్‌తో ఎక్కువ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను కూడా పొందాలని అమెజాన్ చూస్తోంది. నెలవారీ రెవెన్యూ అంతా ఈ 30 గంటల్లోనే అమెజాన్ ఆర్జిస్తుందని విక్రయదారులు చెప్పారు. అమెరికా తర్వాత అమెజాన్‌కు, వాల్‌మార్ట్‌కు.. 672 బిలియన్ డాలర్లు కలిగిన భారత రిటైల్ మార్కెటే అత్యంత ప్రాధానమైనది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన అనంతరం ఈ పోటీ మరింత తీవ్రతరమైంది. ఎక్కువగా డీల్స్ అందించేందుకు కేటగిరీలన్నింటిలో ప్రైవేట్ లేబుల్స్ అమెజాన్ ఎక్కువగా దృష్టిసారించిందని తెలిసింది. అదేవిధంగా వేర్‌హౌజ్‌ల సామర్థ్యాన్ని పెంచి, ఆర్డర్లను వెంటనే డెలివరీ చేయాలని చూస్తోంది. ఈ సేల్ ద్వారా కస్టమర్లను ప్రైమ్‌కు మార్చేందుకు ఓ గొప్ప అవకాశంగా భావిస్తుందని టాప్ విక్రయదారుడు ఒకరు చెప్పారు. -
వాల్‌మార్ట్–ఫ్లిప్‌కార్ట్ డీల్ రద్దు చేయండి
న్యూఢిల్లీ: వందకుపైగా వర్తక సంఘాలు 16 బిలియన్ డాలర్ల వాల్‌మార్ట్–ఫ్లిప్‌కార్ట్ డీల్‌కు వ్యతిరేకంగా గళంవిప్పాయి. డీల్ వల్ల చిన్న వర్తకులకు పూడ్చలేని నష్టం వాటిల్లుతుందని, కొన్ని వేల ఉద్యోగాలకు ముప్పు ఉందని ఉందోళన వ్యక్తంచేశాయి. వాల్‌మార్ట్–ఫ్లిప్‌కార్ట్ డీల్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు పొంచి ఉన్న ప్రమాదాలను తెలియజేస్తూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ), ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) సహా ఈ వర్తక సంఘాలన్నీ బహిరంగ ప్రకటన చేశాయి. డీల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ఒకవేళ డీల్‌ను అనుమతిస్తే ఇండియన్ రిటైల్ రంగంలో అమెరికా కంపెనీల (వాల్‌మార్ట్, అమెజాన్) అధిపత్యం పెరుగుతుందని, అలాగే ఈ సంస్థలు కన్సూమర్ డేటాను నియంత్రించే అవకాశముందని హెచ్చరించాయి. ‘వాల్‌మార్ట్‌కు అంతర్జాతీయంగా సప్లై చైన్ గుర్తింపుంది. ఇది చైనా నుంచి సరఫరా చేసే చౌక ధర సరుకు వల్ల దేశీ తయారీదారులు, సప్లయర్లు నష్టపోతారు’ అని చాంబర్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ ప్రెసిడెంట్ మోహన్ గుర్నాని తెలిపారు. చిన్న చిన్న రిటైల్ స్టోర్లు, ఎస్ఎంఈలు, సప్లయర్లు ఎక్కువగా ఇబ్బందికి గురౌతారని పేర్కొన్నారు. కాగా దాదాపు 127 వర్తక సంఘాలు ఇప్పుడు వాల్‌మార్ట్–ఫ్లిప్‌కార్ట్ డీల్‌ను వ్యతిరేకిస్తున్నాయి. ఇక ఇప్పటికే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్, ఆల్ ఇండియా ఆన్లైన్ వెండర్స్ అసోసియేషన్ వంటివి ఈ డీల్‌కు వ్యతిరేకంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తలుపు తట్టాయి. మరోవైపు వాల్‌మార్ట్ ఇండియా చీఫ్ కార్పొరేట్ వ్యవహారాల అధికారి రజ్నీష్ కుమార్ మాట్లాడుతూ.. ‘భారత్‌లో మేం దాదాపు దశాబ్ద కాలం నుంచి క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ చేస్తున్నాం. చిన్న కిరాణాదారులు అభివృద్ధికి సాయమందిస్తున్నాం. దేశంలోని రైతులు, సప్లయర్ల నుంచే 95 శాతానికిపైగా సరుకు సమీకరిస్తున్నాం. స్థానికంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం’ అని పేర్కొన్నారు. డీల్ వల్ల కొత్తగా లక్షల ఉద్యోగాలు వస్తాయని, వేలమంది స్థానిక సప్లయర్లు లబ్ది పొందుతారని తెలిపారు. అలాగే వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు రెండూ విడివిడిగా కార్యకలాపాలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. -
వారి కోసం ఫ్లిప్‌కార్ట్ వెతుకులాట
న్యూఢిల్లీ : అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్, ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకున్న అనంతరం ఈ-రిటైల్ స్పేస్‌లో మరింత పోటీ పెరిగింది. ఈ పోటీ నేపథ్యంలో అమెజాన్‌కు చెక్ పెట్టేందుకు ఫ్లిప్‌కార్ట్ తన లీడర్షిప్ టీమ్‌ను బలోపేతం చేసుకుంటోంది. దీని కోసం ఫ్లిప్‌కార్ట్ మార్కెట్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను వెతుకుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం నాలుగు పోస్టులకు కంపెనీ వెతుకులాట చేపట్టిందని సంబంధిత వర్గాలు చెప్పాయి. వాటిలో ఒకటి హెడ్ ఆఫ్ ఇంజనీరింగ్, రెండు చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, మూడు చీఫ్ హెచ్ఆర్, నాలుగు సప్లై చైన్, మార్కెటింగ్ సీనియర్ అని పేర్కొన్నాయి. వాల్‌మార్ట్ డీల్ అనంతరం ఫ్లిప్‌కార్ట్ ఈ నియమకాలు చేపడుతోంది. ఈ సెర్చింగ్లతో అమెజాన్‌కు గట్టి పోటీ ఇస్తూ.. మరింత ముందుకు దూసుకెళ్తూ.. పెద్ద మొత్తంలో మార్కెట్‌ను తన సొంతం చేసుకోవాలని ఫ్లిప్‌కార్ట్ చూస్తున్నట్టు ఓ దిగ్గజ సెర్చ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ అనుభవమున్న వారిని ప్రొడక్ట్ కేటగిరీలు, మిషన్ టెర్నింగ్ వంటి హైఎండ్ టెక్నాలజీల కోసం నియమించుకుని, ఫ్లిప్‌కార్ట్ విస్తరణ చేపడుతుందని ఈ-కామర్స్ మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ మెగా డీల్‌తో ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ సపోర్టుతో అమెజాన్‌పై పోటీకి దిగనుంది. దీని కోసం కూడా ఫ్లిప్‌కార్ట్‌కు బలమైన, అతిపెద్ద టీమ్ అవసరమని ఈఎంఏ పార్టనర్స్ ఇంటర్నేషనల్ సీనియర్ పార్టనర్ ఎం రామచంద్రన్ అన్నారు. అయితే ఈ విషయంపై స్పందించానికి ఫ్లిప్‌కార్ట్ నిరాకరించింది. అమెజాన్‌కు వ్యతిరేకంగా తన కంపెనీని మరింత విస్తరించేందుకు ఈ లీడర్షిప్ టీమ్ ఎంతో అవసరమని మార్కెట్ నిపుణులు కూడా పేర్కొన్నారు. వాల్‌మార్ట్ కొనుగోలుతో ఫ్లిప్‌కార్ట్ గ్లోబల్ జర్నీ ప్రారంభమైందని, ప్రస్తుతం ఈ-కామర్స్ మార్కెట్లో చోటు చేసుకున్న ఈ కొనుగోలు, టెలికాం మార్కెట్ కొనుగోలు లాంటిది కాదని పీపుల్‌స్ట్రాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంకజ్ బన్సాల్ అన్నారు. ఆన్లైన్ పరంగా ఫ్లిప్‌కార్ట్‌కు బలమైన టెక్నాలజీ ఉందని ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఓ ఎగ్జిక్యూటివే అన్నారు.