దేశీయ ఈ-కామర్స్‌ మార్కెట్లోకి టెక్‌ దిగ్గజం | Google Plans Global E-Commerce Debut From India Market | Sakshi
Sakshi News home page

దేశీయ ఈ-కామర్స్‌ మార్కెట్లోకి టెక్‌ దిగ్గజం

Published Sat, Jun 23 2018 7:28 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

Google Plans Global E-Commerce Debut From India Market - Sakshi

టెక్‌ దిగ్గజం గూగుల్‌ కన్ను ఇప్పుడు ఈ-కామర్స్‌ మార్కెట్‌పై పడింది. అమెరికాకు చెందిన రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌లో వాటా కొనేసి మన ఈ-​కామర్స్‌ మార్కెట్‌లోకి ప్రవేశించిన తర్వాత.. టెక్‌ దిగ్గజం గూగుల్‌ సైతం ఈ-కామర్స్‌ మార్కెట్‌లోకి అరంగేట్రం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కంపెనీ తొలి స్టాప్‌ కూడా భారతేనట. ఈ ఏడాది దివాళి వరకు దేశీయ ఈ-కామర్స్‌ మార్కెట్‌లోకి గూగుల్‌ ప్రవేశించబోతుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. వాల్‌మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను కొనుగోలు చేసిన అనంతరం, ఈ టెక్‌ దిగ్గజం కూడా చర్చలు జరిపింది. ప్రస్తుతం సొంతంగానే గ్లోబల్‌ ఈ-కామర్స్‌ మార్కెట్‌లోకి ప్రవేశించాలని చూస్తోంది. 

2020 వరకు దేశీయ ఈ-కామర్స్‌ మార్కెట్‌ 100 బిలియన్‌ డాలర్లకు చేరుకోబోతుందని తెలిసింది. దీంతో భారత్‌లోనే తన తొలి ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ను లాంచ్‌ చేయాలని గూగుల్‌ చూస్తోంది. ‘గూగుల్‌ రెండో వైపు ఆలోచనలను ప్రారంభించింది’ అని ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు. అయితే ఈ విషయంపై గూగుల్‌ స్పందించడం లేదు. ఈ వారం ప్రారంభంలోనే ఈ-కామర్స్‌ మార్కెట్‌పై తనకు ఆసక్తి ఉందని గూగుల్‌ సంకేతాలు ఇచ్చింది. చైనీస్‌ ఈకామర్స్‌ కంపెనీ జేడీ.కామ్‌లో గూగుల్‌ 550 మిలియన్‌ డాలర్లను పెట్టుబడులుగా పెట్టింది. అక్కడ వాల్‌మార్ట్‌, జేడీ.కామ్‌లు వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఉన్నాయి. గూగుల్‌ ఇండియా ఈ-కామర్స్‌ ప్లాన్లు ఏడాది పట్టే అవకాశం ఉందని తెలిసింది. ఇతర ఎమర్జింగ్‌ మార్కెట్లలోకి వెళ్లే ముందు, భారత్‌లో వీటిని టెస్ట్‌ చేయాలనుకుంటోంది. దీని కోసం 2వేల వర్క్‌షాపులను నిర్వహించింది. గూగుల్‌ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ కోసం 15 వేల మందికి పైగా విక్రయదారులను గుర్తించిందని కూడా తెలిసింది. ఇలా గూగుల్‌ తన ఈ-కామర్స్‌ ప్లాన్స్‌ను అమల్లోకి తీసుకురావడానికి వేగవంతంగా ముందుకు సాగుతోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement