న్యూఢిల్లీ: దేశ ఈ కామర్స్ మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. 48 శాతం మార్కెట్ వాటాతో వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ మొదటి స్థానంలో ఉన్నట్టు అలియన్స్ బెర్న్‌స్టీన్ తాజా నివేదిక వెల్లడించింది. అదే సమయంలో జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు కలిగిన మీషో వేగంగా చొచ్చుకుపోతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్‌కార్ట్ 21 శాతం మేర యూజర్లను పెంచుకోగా, మీషో 32 శాతం కొత్త యూజర్లను జోడించుకుంది.
అదే సమయంలో అమెజాన్ యూజర్ల వృద్ధి 13 శాతానికే పరిమితమైంది. ‘2022–23 సంవత్సరంలో భారత ఈ–కామర్స్‌లో 48 శాతం వాటాతో ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ లీడర్‌గా ఉంది. పరిశ్రమ కంటే వేగంగా ఫ్లిప్‌కార్ట్ వృద్ధి చెందుతోంది. మొబైల్స్, వ్రస్తాలు ఫ్లిప్‌కార్ట్‌కు రెండు పెద్ద విభాగాలుగా ఉన్నాయి. మొబైల్స్‌లో 50 శాతం, వ్రస్తాల్లో 30 శాతం వాటా కలిగి ఉంది. ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్లలో 48 శాతం, ఆన్‌లైన్ ఫ్యాషన్ విభాగంలో 60 శాతం చొప్పున మార్కెట్ వాటా ఫ్లిప్‌కార్ట్ కలిగి ఉంటుందని అంచనా’ అని ఈ నివేదిక తెలిపింది.
చిన్న పట్టణాలపై మీషో గురి
జీరో కమీషన్ నమూనాలో ద్వితీయ శ్రేణి, చిన్న పట్టణాలపై మీషో వ్యూహాత్మకంగా దృష్టి సారించడం ద్వారా మార్కెట్ వాటాను వేగంగా పెంచుకుంటున్నట్టు బెర్న్‌స్టీన్ నివేదిక వెల్లడించింది. భారత్‌లో ఈ కామర్స్ యాప్ డౌన్‌లోడ్‌లలో 48 శాతం మేర మీషోనే ఉంటున్నట్టు పేర్కొంది. ‘గడిచిన 12 నెలల్లో మీషో ఆర్డర్ల పరిమాణం 43 శాతం మేర పెరిగింది. ఆదాయంలో 54 శాతం వృద్ధి నెలకొంది. మళ్లీ, మళ్లీ కొనుగోలు చేసే కస్టమర్లు 80 శాతంగా ఉన్నారు. మీషోలో 80 శాతం విక్రేతలు రిటైల్ వ్యాపారవేత్తలు కాగా, ప్లాట్‌ఫామ్‌పై 95 శాతం కొనుగోళ్లు అన్‌బ్రాండెడ్‌వే ఉంటున్నాయి. నెలవారీ 12 కోట్ల సగటు యూజర్లతో మీషో భారత్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఈ–కామర్స్ కంపెనీ. ప్రస్తుతం మీషో స్థూల వాణిజ్య విలువ (జీఎంవీ) 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ’అని ఈ నివేదిక వెల్లడించింది.
ఫ్యాషన్‌లో మింత్రా టాప్...
ఫ్యాషన్ ఈ–కామర్స్‌లో రిలయన్స్‌కు చెందిన అజియో 30 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నట్టు బెర్న్‌స్టీన్ నివేదిక తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సంస్థ మింత్రా ఈ విభాగంలో 50% మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో ఉంది. 2023 డిసెంబర్‌లో పోటీ సంస్థల కంటే మింత్రాయే మెరుగ్గా 25 శాతం మేర వృద్ధిని నమోదు చేసింది. ఈ–గ్రోసరీలో బ్లింకిట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. ఉత్పత్తుల శ్రేణి, కస్టమర్లకు చేరువ విషయంలో జెప్టో బ్లింకిట్‌తో పోలిస్తే వెనుకనే ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. బ్లింకిట్ 40 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంటే, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 37–39% వాటా, జెప్టో 20% వాటాతో తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment