ఫ్లిప్‌కార్ట్ భారీ గిడ్డంగి హైదరాబాద్‌లో..
అమ్మకాల్లో టాప్-3లో భాగ్యనగరి
13 నుంచి బిగ్ బిలియన్ డేస్
కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇ-కామర్స్ మార్కెట్ ప్లేస్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ గిడ్డంగిని హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తోంది. కంపెనీకి ఇది 16వ గిడ్డంగి కాగా, తెలుగు రాష్ట్రాల్లో మొదటిది. 2.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మహబూబ్‌నగర్ జిల్లాలో ఇది రానుంది. నిర్మాణం పూర్తి అయితే రోజుకు 1.2 లక్షల వస్తువులను గిడ్డంగి నుంచి సరఫరా చేసే వీలుంది. అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఈ గిడ్డంగిని అక్టోబర్‌లోనే ప్రారంభించే అవకాశం ఉంది. 16 గిడ్డంగులకుగాను ఫ్లిప్‌కార్ట్ ఇప్పటి వరకు రూ.400 కోట్లు వెచ్చించింది. 2020 నాటికి మరో 50 నుంచి 100 గిడ్డంగులను ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. ఇందుకు రూ.3 వేల కోట్ల దాకా వెచ్చించే అవకాశం ఉంది. కొత్త గిడ్డంగి ద్వారా ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి కలగనుందని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నగోరి సాక్షి బిజినెస్ బ్యూరోకు సోమవారమిక్కడ తెలిపారు.
మూడో స్థానంలో హైదరాబాద్..
ఫ్లిప్‌కార్ట్ విక్రయాల్లో ఢిల్లీ, బెంగళూరు తర్వాతి స్థానాన్ని హైదరాబాద్ దక్కించుకుందని అంకిత్ వెల్లడించారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లిప్‌కార్ట్‌తో 3,000 మంది విక్రయదారులు చేతులు కలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో సంస్థకు 5 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. కస్టమర్ల సంఖ్య ప్రతి నెల 8 శాతం పెరుగుతోంది. కొనుగోళ్ల పరంగా భాగ్యనగరి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్, తూర్పు గోదావరి ముందంజలో ఉన్నాయి. విభాగాల వారీగా చూస్తే అపారెల్స్, హోం, మొబైల్, స్పోర్ట్స్, ఫిట్‌నెస్, పర్సనల్ కేర్ వరుసగా నిలిచాయి. విద్యార్థులు, ఉద్యోగస్తులైన యువత అధికంగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. ఇ-కామర్స్ పుంజుకోవడానికి గల కారణాల్లో సౌకర్యం, ఎంచుకోవడానికి విభిన్న రకాలు, విక్రయానంతర సేవ, ఆ తర్వాతే ధర నిలిచింది’ అని అన్నారు.
బిగ్ బిలియన్ డేస్..
అక్టోబర్ 13 నుంచి 17 వరకు బిగ్ బిలియన్ డేస్‌ను ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తోంది. 70 విభాగాల్లో 3 కోట్లకుపైగా ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. 40 వేల మంది విక్రయదారులు ఇందులో పాలుపంచుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 19 వేల మంది డెలివరీ బాయ్స్ సిద్ధంగా ఉన్నారని కంపెనీ తెలిపింది. ఆన్‌లైన్ లో వస్తువులను కొనుక్కునే వినియోగదార్లు దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది ఉన్నారని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ఇందులో తమ కస్టమర్లు 4.5 కోట్ల మంది ఉన్నారని వెల్లడించింది. 75 శాతం మంది మొబైల్ ద్వారా ఆర్డరు చేస్తున్నారని తెలిపింది. 4జీ విస్తృతి పెరిగితే ఇ-కామర్స్‌కు జోష్ వస్తుందని వివరించింది.