భారత్‌లో అమెజాన్ రూ.12 వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: తీవ్ర పోటీతో వేడెక్కుతున్న దేశీ ఈ-కామర్స్ మార్కెట్లో విదేశీ దిగ్గజాలు దూకుడు పెంచుతున్నాయి. అంతర్జాతీయ అగ్రగామి సంస్థ అమెజాన్.. భారత్‌లో 2 బిలియన్ డాలర్ల(సుమారు రూ.12,000 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు బుధవారం ప్రకటించింది. దేశీ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్... ఇన్వెస్టర్ల నుంచి రూ.6,000 కోట్లను సమీకరించినట్లు వెల్లడించిన మర్నాడే అమెజాన్ భారీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకటన వెలువడటం గమనార్హం.
అమెజాన్.ఇన్ పేరుతో ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఏడాది క్రితం భారత్ మార్కెట్లోకి అమెజాన్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ ఒకటని.. ఇక్కడ తమ స్థూల అమ్మకాలు బిలియన్ డాలర్ల(దాదాపు రూ.6,000 కోట్లు) స్థాయికి చేరువవుతున్నాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘తొలి ఏడాది వ్యాపారంలో కస్టమర్లు, చిన్న, మధ్యస్థాయి వ్యాపారుల నుంచి స్పందన మా అంచనాలను మించింది.
ఇక్కడి ఆర్థిక వ్యవస్థతో పాటు ఈ-కామర్స్ రంగంలో కూడా అపారమైన అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణలో భాగంగా మరింత వినూత్న ఆలోచనలు, మెరుగైన సదుపాయాలతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ 2 బిలియన్ డాలర్ల నిధులను వెచ్చించనున్నాం’ అని అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్ పేర్కొన్నారు. బుక్స్, అపారెల్, ఎలక్ట్రానిక్స్ ఇలా విభిన్న విభాగాల్లో అమెజాన్ 1.7 కోట్లకుపైగా ఉత్పత్తులను భారత్‌లో విక్రయించినట్లు అంచనా.