ఈ–కామర్స్‌ దూకుడు | report by Anarock and ETRetail India ecommerce market is expected to reach USD 550 billion by 2035 | Sakshi
Sakshi News home page

ఈ–కామర్స్‌ దూకుడు

Published Fri, Feb 21 2025 8:25 AM | Last Updated on Fri, Feb 21 2025 11:32 AM

report by Anarock and ETRetail India ecommerce market is expected to reach USD 550 billion by 2035

ఈ–కామర్స్‌(e-commerce) రంగం ఆకాశమే హద్దుగా విస్తరించనుంది. వచ్చే పదేళ్లలో ఇది 2035 నాటికి నాలుగు రెట్లు పెరిగి 550 బిలియన్‌ డాలర్లకు (రూ.47.30 లక్షల కోట్లు) చేరుకుంటుందని అనరాక్, ఈటీ రిటైల్‌ సంయుక్త నివేదిక వెల్లడించింది. 2024 చివరికి ఇది 125 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు తెలిపింది. ఏటా 15 శాతం కాంపౌండెడ్‌ వృద్ధిని చూడనుందని అంచనా వేసింది.

ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ల వినియోగం విస్తరణ, డిజిటల్‌ చెల్లింపుల సదుపాయాలు, యువతరం, టెక్నాలజీ తెలిసిన జనాభా ఈ–కామర్స్‌ వృద్ధికి కీలకంగా పనిచేస్తాయని తెలిపింది. ప్రభుత్వ కార్యక్రమమైన డిజిటల్‌ ఇండియాతోపాటు లాజిస్టిక్స్, సరఫరా నెట్‌వర్క్‌ సదుపాయాల విస్తరణ ఈ వృద్ధిని మరింత వేగవంతం చేయనున్నట్టు వివరించింది. మెట్రోలతోపాటు చిన్న పట్టణాల్లోనూ పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేందుకు ఈ–కామర్స్‌ సంస్థలు ప్రయత్నం చేస్తున్నట్టు అనరాక్‌ సీఈవో, ఎండీ అనుజ్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. మొత్తానికి భారత రిటైల్‌ మార్కెట్‌ పరిమాణం 2035 నాటికి 2500 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని, 2019 నాటితో పోల్చి చూస్తే మూడు రెట్లు వృద్ధి చెందనుందని చెప్పారు. ఖర్చు చేసే ఆదాయంలో పెరుగుదల, పట్టణీకరణ, పెరుగుతున్న మధ్యతరగతి వర్గీయులు.. ఇవన్నీ రిటైల్‌ మార్కెట్‌ విస్తరణకు దోహదం చేసేవిగా ఈ నివేదిక తెలిపింది.  

5 స్టార్టప్స్‌లో ఫ్లిప్‌కార్ట్‌ వెంచర్స్‌ పెట్టుబడులు

ఫ్లిప్‌కార్ట్‌ లీప్‌ ఎహెడ్‌ (ఎఫ్‌ఎల్‌ఏ) ప్రోగ్రాంలో భాగంగా మూడో విడత కోసం అయిదు స్టార్టప్‌లను ఎంపిక చేసినట్లు ఫ్లిప్‌కార్ట్‌ వెంచర్స్‌ వెల్లడించింది. వీటిలో ఎక్స్‌పోర్టెల్, ఫ్యాక్టర్స్‌డాట్‌ఏఐ, ఎక్స్‌పర్టియాడాట్‌ఏఐ, భారత్‌ కృషి సేవా, వీసా2ఫ్లై ఉన్నాయి. ప్రారంభ దశలో ఉన్న ఈ అంకుర సంస్థలకు ఎఫ్‌ఎల్‌ఏ కింద 5,00,000 డాలర్ల వరకు ఈక్విటీ పెట్టుబడులు, మెంటార్‌íÙప్‌ లభిస్తాయి. బిజినెస్‌ మోడల్, వృద్ధి అవకాశాలు, విజన్‌ తదితర అంశాల ప్రాతిపదికన అంకుర సంస్థలు ఎంపికవుతాయి.

ఇదీ చదవండి: ద్వితీయార్ధంలో ఎకానమీ జోరు 

ఫ్లిప్‌కార్ట్‌ వెంచర్స్‌ ఇప్పటివరకు డీప్‌ టెక్, ఫిన్‌టెక్, హెల్త్‌ టెక్, జనరేటివ్‌ ఏఐ తదితర విభాగాల్లో 20 పైచిలుకు స్టార్టప్‌లకు తోడ్పాటునిచ్చింది. ఎక్స్‌పోర్టెల్‌ సీమాంతర ఈ–కామర్స్‌ లాజిస్టిక్స్‌ సేవల రంగానికి సంబంధించిన అంకుర సంస్థ. ఫ్యాక్టర్స్‌డాట్‌ఏఐ అనేది ఏఐ ఆధారిత మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫాం. ఎక్స్‌పర్టియాడాట్‌ఏఐ అనేది ఏజెంటిక్‌ ఏఐ రిక్రూటింగ్‌ ప్లాట్‌ఫాం కాగా, భారత్‌ కృషి సేవా సంస్థ అగ్రిటెక్‌ స్టార్టప్‌గా, వీసా2ఫ్లై ట్రావెల్‌ టెక్‌ ప్లాట్‌ఫాంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement