మీషో, ఫ్లిప్‌కార్ట్‌కు కేంద్రం భారీ షాక్‌..వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు | Sakshi
Sakshi News home page

మీషో, ఫ్లిప్‌కార్ట్‌కు కేంద్రం భారీ షాక్‌..వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు

Published Fri, Dec 16 2022 9:04 PM

Ccpa Sent Notices To Flipkart And Meesho For Acid Sales  - Sakshi

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజ సంస్థలు ఫ్లిప్‌కార్ట్‌, మీషోలకు భారీ షాక్‌ తగిలింది. యాసిడ్ అమ్మకాలపై విధించిన నిబంధనల్ని ఉల్లంఘించాయంటూ ఆ రెండు సంస్థలకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఢిల్లీలోని ద్వారకలో ఓ బాలికపై యాసిడ్‌ దాడి ఘటనలో నిందితుడు ఫ్లిప్‌కార్ట్‌ నుంచి యాసిడ్‌ కొనుగోలు చేసినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో నోటీసులు జారీ అయ్యాయి.

ప్లాట్‌ఫారమ్‌లపై యాసిడ్ అమ్మకాలను అనుమతించినందుకు రెండు ఈ-కామర్స్ సంస్థలకు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ-కామర్స్ సంస్థ నుంచి యాసిడ్‌ను సేకరించినట్లు గుర్తించిన ఢిల్లీ పోలీసులు ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు జారీ చేశారు.

కఠిన చర్యలు తప్పవ్‌
సీసీఏపీ యాసిడ్ విక్రయాల నిబందనల్ని ఆదేశాలు బేఖాతరు చేయడాన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫ్లిప్‌కార్ట్, ఫాష్‌నియర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (meesho.com) సంస్థలకు నోటీసులు పంపింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇ-కామర్స్ సంస్థలు సీసీపీఏ నోటీసుల ఆదేశాలను పాటించకపోతే, వినియోగదారుల రక్షణ చట్టం - 2019లోని నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

ఢిల్లీలో దారుణం
డిసెంబర్‌ 14 న దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది తన చెల్లెలితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న ఓ 17 ఏళ్ల బాలికపై ఇద్దరు దుండగులు యాసిడ్‌ దాడి చేశారు. ముసుగులు ధరించి బైక్‌పై వచ్చి యాసిడ్‌ దాడి చేయటంతో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.నిషేధం ఉన్నప్పటికీ మార్కెట్‌లలో యాసిడ్ లభ్యతపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. కాగా, యాసిడ్‌ దాడిలో పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. వారిలో ప్రధాన నిందితుడు సచిన్ అరోరా ఫ్లిప్‌కార్ట్ నుండి యాసిడ్‌ను సేకరించినట్లు గుర్తించారు. దీనిపై వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలపై సీసీపీఏ  చర్య తీసుకుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement