న్యూఢిల్లీ: వందకుపైగా వర్తక సంఘాలు 16 బిలియన్ డాలర్ల వాల్‌మార్ట్–ఫ్లిప్‌కార్ట్ డీల్‌కు వ్యతిరేకంగా గళంవిప్పాయి. డీల్ వల్ల చిన్న వర్తకులకు పూడ్చలేని నష్టం వాటిల్లుతుందని, కొన్ని వేల ఉద్యోగాలకు ముప్పు ఉందని ఉందోళన వ్యక్తంచేశాయి. వాల్‌మార్ట్–ఫ్లిప్‌కార్ట్ డీల్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు పొంచి ఉన్న ప్రమాదాలను తెలియజేస్తూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ), ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) సహా ఈ వర్తక సంఘాలన్నీ బహిరంగ ప్రకటన చేశాయి.
డీల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ఒకవేళ డీల్‌ను అనుమతిస్తే ఇండియన్ రిటైల్ రంగంలో అమెరికా కంపెనీల (వాల్‌మార్ట్, అమెజాన్) అధిపత్యం పెరుగుతుందని, అలాగే ఈ సంస్థలు కన్సూమర్ డేటాను నియంత్రించే అవకాశముందని హెచ్చరించాయి. ‘వాల్‌మార్ట్‌కు అంతర్జాతీయంగా సప్లై చైన్ గుర్తింపుంది. ఇది చైనా నుంచి సరఫరా చేసే చౌక ధర సరుకు వల్ల దేశీ తయారీదారులు, సప్లయర్లు నష్టపోతారు’ అని చాంబర్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ ప్రెసిడెంట్ మోహన్ గుర్నాని తెలిపారు.
చిన్న చిన్న రిటైల్ స్టోర్లు, ఎస్‌ఎంఈలు, సప్లయర్లు ఎక్కువగా ఇబ్బందికి గురౌతారని పేర్కొన్నారు. కాగా దాదాపు 127 వర్తక సంఘాలు ఇప్పుడు వాల్‌మార్ట్–ఫ్లిప్‌కార్ట్ డీల్‌ను వ్యతిరేకిస్తున్నాయి. ఇక ఇప్పటికే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్, ఆల్ ఇండియా ఆన్‌లైన్ వెండర్స్ అసోసియేషన్ వంటివి ఈ డీల్‌కు వ్యతిరేకంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తలుపు తట్టాయి.
మరోవైపు వాల్‌మార్ట్ ఇండియా చీఫ్ కార్పొరేట్ వ్యవహారాల అధికారి రజ్‌నీష్ కుమార్ మాట్లాడుతూ.. ‘భారత్‌లో మేం దాదాపు దశాబ్ద కాలం నుంచి క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ చేస్తున్నాం. చిన్న కిరాణాదారులు అభివృద్ధికి సాయమందిస్తున్నాం. దేశంలోని రైతులు, సప్లయర్ల నుంచే 95 శాతానికిపైగా సరుకు సమీకరిస్తున్నాం. స్థానికంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం’ అని పేర్కొన్నారు. డీల్ వల్ల కొత్తగా లక్షల ఉద్యోగాలు వస్తాయని, వేలమంది స్థానిక సప్లయర్లు లబ్ది పొందుతారని తెలిపారు. అలాగే వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు రెండూ విడివిడిగా కార్యకలాపాలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment