సాక్షి, ముంబై: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రూపు వాల్‌మార్ట్ ఇండియాలో 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. బిజినెస్-టు-బిజినెస్ విభాగాన్ని రివర్స్ అక్విజిషన్‌లో భాగంగా వాల్‌మార్ట్ ఇండియా హోల్‌సేల్ వ్యాపారాన్ని సొంతం చేసుకున్నట్టు గురువారం ప్రకటించింది. ఈ కొనుగోలు ద్వారా సరికొత్త డిజిటల్ ప్లాట్‌ఫాం‘ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్’ను ప్రారంభించినట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. తద్వారా భారతదేశంలో కిరాణా రీటైల్ వ్యాపార స్వభావాన్ని మార్చి వేయనున్నామని వెల్లడించింది. ప్రస్తుతం ఆన్‌లైన్ కిరణా వ్యాపారంలో ఉన్నపోటీ, జియోమార్ట్ పేరుతో రిలయన్స్ రీటైల్ రంగంలో దూసుకువస్తున్న తరుణంలో ఫ్లిప్‌కార్ట్ తాజా డీల్ విశేషంగా నిలిచింది.
‘ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్’ ను ఆగస్టులో లాంచ్ చేయనున్నామని, కిరాణా, ఫ్యాషన్ వర్గాలకు పైలట్ సేవలను అందిస్తామని పేర్కొంది. దీనికి ఫ్లిప్‌కార్ట్ మాజీ ఉద్యోగి, అనుభవజ్ఞుడు ఆదర్శ్ మీనన్ నేతృత్వం వహిస్తారు. అలాగే వాల్‌మార్ట్ ఇండియా సీఈఓ సమీర్ అగర్వాల్ కొంతకాలంవరకు సంస్థతోనే ఉంటారు.
ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ సంస్థ కిరాణా దుకాణాలు, చిన్నవ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. భారతదేశ రిటైల్ వ్యాపారంలో కిరణాల దుకాణాలు, ఎంఎస్‌ఎంఈలు కీలకంగా ఉన్నాయని చెప్పారు. టెక్నాలజీ నైపుణ్యాలు, లాజిస్టిక్ అవసరాలు, ఆర్థికంగా చిన్న వ్యాపారాలకు ఊతమివ్వడంతోపాటు, వినియోగదారుల అవసరాలను తీర్చడంపై ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ దృష్టి సారిస్తుందని అని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి అన్నారు. ఇదొక కీలక ముందడుగు అని వాల్‌మార్ట్ ఇండియా సీఈవో జుడిత్ మెక్కెన్నా వ్యాఖ్యానించారు. ఒకరి బలాలు, నైపుణ్యాలు పరస్పరం పెంచుకోవడం ద్వారా, కొత్త ఒరవడికి నాంది పడుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment