Wholesale Business
-
ఫ్లిప్‌కార్ట్.. ఇక హోల్‌సేల్
న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా హోల్‌సేల్ వ్యాపార విభాగంలోకి అడుగుపెడుతోంది. ఇందులో భాగంగా వాల్‌మార్ట్ ఇండియాను కొనుగోలు చేసింది. అయితే ఈ డీల్ విలువ ఎంతన్నది మాత్రం వెల్లడించలేదు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ పేరిట వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సంస్థ గురువారం తెలిపింది. ప్రధానంగా బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) విభాగంలో కార్యకలాపాల కోసం ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ ఏర్పాటైనట్లు వివరించింది. వాల్‌మార్ట్ సారథ్యంలోని ఇన్వెస్టర్ గ్రూప్ నుంచి 1.2 బిలియన్ డాలర్లు సమీకరించిన వారానికే ఫ్లిప్‌కార్ట్ తాజా ప్రకటన చేయడం గమనార్హం. ‘ఒకవైపు విక్రేతలు, తయారీదారులను మరోవైపు కిరాణా దుకాణదారులు, చిన్న మధ్యతరహా సంస్థలను (ఎంఎస్ఎంఈ) అనుసంధానం చేసేలా ఈ మార్కెట్‌ప్లేస్ ఉంటుంది‘ అని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆదర్శ్ మీనన్ చెప్పారు. కిరాణా దుకాణదారులు, ఎంఎస్ఎంఈల అవసరాలను తీర్చే సామర్థ్యాలను పెంచుకునేందుకు వాల్‌మార్ట్ ఇండియా కొనుగోలు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ‘ఫినిష్డ్ ఉత్పత్తులకు సంబంధించి బీ2బీ మార్కెట్ విలువ సుమారు 650 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఇందులో ముందుగా ఫ్యాషన్, నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ వంటి కేటగిరీలు ఉన్న సుమారు 140 బిలియన్ డాలర్ల మార్కెట్‌పై మేం దృష్టి సారిస్తున్నాం‘ అని మీనన్ చెప్పారు. భారత్‌లో వాల్‌మార్ట్ ఇలా.. ప్రపంచంలోనే అతి పెద్ద రిటైల్ సంస్థ అయిన అమెరికన్ కంపెనీ వాల్‌మార్ట్ గతంలో భారతీ ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్యంతో భారత్‌లో హోల్‌సేల్ కార్యకలాపాలు ప్రారంభించింది. 2013లో రెండు సంస్థలు విడిపోయినప్పటికీ వాల్‌మార్ట్ మాత్రం సొంతంగా బెస్ట్ ప్రైస్ పేరిట క్యాష్–అండ్–క్యారీ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ఇందులో సుమారు 3,500 మంది ఉద్యోగులు ఉన్నారు. బెస్ట్ ప్రైస్‌కు తొమ్మిది రాష్ట్రాల్లో 28 స్టోర్స్, 15 లక్షల పైచిలుకు సభ్యులు ఉన్నారు. త్వరలోనే తిరుపతిలో కొత్తగా క్యాష్–అండ్–క్యారీ స్టోర్ ఏర్పాటు చేస్తోంది. వాల్‌మార్ట్‌కి పూర్తి అనుబంధ సంస్థగా వాల్‌మార్ట్ ఇండియా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2018లో సుమారు 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ 77 శాతం వాటాలు కొనుగోలు చేసింది. కొత్త సంస్థ స్వరూపం..: ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ వ్యాపార విభాగానికి మీనన్ సారథ్యం వహిస్తారు. ప్రస్తుతం వాల్‌మార్ట్ ఇండియా సీఈవోగా వ్యవహరిస్తున్న సమీర్ అగర్వాల్.. బాధ్యతల బదలాయింపు సజావుగా పూర్తయ్యే దాకా ఉంటారు. ఆ తర్వాత వాల్మార్ట్లోనే మరో హోదాకు మారతారు. వాల్‌మార్ట్ ఇండియాలోని ఉద్యోగులు ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లోకి మారతారు. వాల్‌మార్ట్ టెక్నాలజీ విభాగం తమ వాల్‌మార్ట్ ల్యాబ్స్ ఇండియాను విడిగా నిర్వహించడం కొనసాగిస్తుంది. కిరాణా షాపులు కీలకం.. కరోనా వైరస్ పరిణామాల నేపథ్యంలో కిరాణా దుకాణదారులు గతంలో కన్నా మరిన్ని మార్గాల్లో కొనుగోళ్లు జరుపుతున్నారని, బెస్ట్ ప్రైస్ విషయానికొస్తే తమ ఈ–కామర్స్ వ్యాపార విభాగం లావాదేవీలు నాలుగు రెట్లు పెరిగాయని సమీర్ అగర్వాల్ తెలిపారు. కిరాణా దుకాణదారులు ఇటు ఆన్లైన్, అటు ఆఫ్‌లైన్ మార్గంలో కూడా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న సంగతి దీని ద్వారా తెలుస్తోందని పేర్కొన్నారు. రిటైల్ వ్యాపారంలో కిరాణాలు, సంఘటిత బీ2బీ సంస్థలు కీలకమని తెలిపారు. ఇందులో ఆన్లైన్ వ్యా పార విభాగం వృద్ధి గణనీయంగా ఉంటుందన్నారు. ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం ద్వారా కిరాణా దుకాణదారులు, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) సులభ రుణ సదుపాయాలు, వ్యాపారం.. ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు మరిన్ని లభించగలవని అగర్వాల్ చెప్పారు. -
జియోమార్ట్‌కు షాక్ : ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్
సాక్షి, ముంబై: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రూపు వాల్‌మార్ట్ ఇండియాలో 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. బిజినెస్-టు-బిజినెస్ విభాగాన్ని రివర్స్ అక్విజిషన్‌లో భాగంగా వాల్‌మార్ట్ ఇండియా హోల్‌సేల్ వ్యాపారాన్ని సొంతం చేసుకున్నట్టు గురువారం ప్రకటించింది. ఈ కొనుగోలు ద్వారా సరికొత్త డిజిటల్ ప్లాట్‌ఫాం‘ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్’ను ప్రారంభించినట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. తద్వారా భారతదేశంలో కిరాణా రీటైల్ వ్యాపార స్వభావాన్ని మార్చి వేయనున్నామని వెల్లడించింది. ప్రస్తుతం ఆన్లైన్ కిరణా వ్యాపారంలో ఉన్నపోటీ, జియోమార్ట్ పేరుతో రిలయన్స్ రీటైల్ రంగంలో దూసుకువస్తున్న తరుణంలో ఫ్లిప్‌కార్ట్ తాజా డీల్ విశేషంగా నిలిచింది. ‘ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్’ ను ఆగస్టులో లాంచ్ చేయనున్నామని, కిరాణా, ఫ్యాషన్ వర్గాలకు పైలట్ సేవలను అందిస్తామని పేర్కొంది. దీనికి ఫ్లిప్‌కార్ట్ మాజీ ఉద్యోగి, అనుభవజ్ఞుడు ఆదర్శ్ మీనన్ నేతృత్వం వహిస్తారు. అలాగే వాల్‌మార్ట్ ఇండియా సీఈఓ సమీర్ అగర్వాల్ కొంతకాలంవరకు సంస్థతోనే ఉంటారు. ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ సంస్థ కిరాణా దుకాణాలు, చిన్నవ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. భారతదేశ రిటైల్ వ్యాపారంలో కిరణాల దుకాణాలు, ఎంఎస్ఎంఈలు కీలకంగా ఉన్నాయని చెప్పారు. టెక్నాలజీ నైపుణ్యాలు, లాజిస్టిక్ అవసరాలు, ఆర్థికంగా చిన్న వ్యాపారాలకు ఊతమివ్వడంతోపాటు, వినియోగదారుల అవసరాలను తీర్చడంపై ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ దృష్టి సారిస్తుందని అని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి అన్నారు. ఇదొక కీలక ముందడుగు అని వాల్‌మార్ట్ ఇండియా సీఈవో జుడిత్ మెక్కెన్నా వ్యాఖ్యానించారు. ఒకరి బలాలు, నైపుణ్యాలు పరస్పరం పెంచుకోవడం ద్వారా, కొత్త ఒరవడికి నాంది పడుతుందని పేర్కొన్నారు. -
కమర్షియల్ కార్మికుల కష్టాలు!
సాక్షి, భవానీపురం (విజయవాడ పశ్చిమ): పేరుకు తగ్గట్లే అక్కడ అంతా హోల్‌సేల్‌గా కమర్షియలే. ఫక్తు వ్యాపార ధోరణే తప్ప వారికి మరో ధ్యాస ఉండదు. షాపులు తీశామా.. వ్యాపారం చేశామా.. నాలుగు డబ్బులు సంపాదించుకున్నామా.. అంతే. తమ సంక్షేమం కోసం ఒక సొసైటీ ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు వారి దగ్గర పనిచేసే ముఠా కార్మికుల సంక్షేమాన్ని మాత్రం గాలికి వదిలేశారు. పైగా కూలి రేట్లు పెంచాలని పోరాడక తప్పని దుస్థితి కార్మికులది. ముఠా పని చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి గాయాలపాలైతే కనీసం ప్రాథమిక వైద్య సౌకర్యం కల్పించని పరిస్థితి ఉంది. ఇదీ గొల్లపూడి గ్రామ పరిధిలోని మహాత్మా గాంధీ హోల్‌సేల్ కమర్షియల్ కాంప్లెక్స్‌లో పనిచేసే ముఠా కూలీల దయనీయ స్థితి. అన్ని రకాల వ్యాపారాలకు సంబంధించిన సంఘాలకు నాయకుడిగా వెలుగొందిన దివంగత గడ్డం సుబ్బారావు హోల్‌సేల్ వ్యాపారుల కోసం 2003లో గొల్లపూడిలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. ఈ కాంప్లెక్స్‌లో 489 షాపులు ఉన్నాయి. ప్రతి రోజూ కోట్లాది రూపాయాల వ్యాపారం జరుగుతుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సరుకు దిగుమతి, ఇక్కడి నుంచి వేరేచోటకు పంపించే సరుకు ఎగుమతి చేసే ముఠా కూలీలు సుమారు 1,500 మందికిపైనే ఉన్నారు. కాంప్లెక్స్ నిర్మాణ సమయంలో నిబంధనల మేరకు 10 శాతం చొప్పున రెండు కామన్ సైట్లను వదిలారు. ముఠా కూలీల కోసం ఒక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసే సదుద్దేశ్యంతో కాంప్లెక్స్ నిర్మాణ సారధి గడ్డం సుబ్బారావు ఓ స్థలాన్ని కేటాయించి శంకుస్థాపన చేశారు. ఆయన చనిపోయిన తర్వాత దాని గురించి పట్టించుకున్న నాధుడు లేడు. కొన్నేళ్లుగా ఆ స్థలాన్ని వ్యాపారులు డంపింగ్ యార్డ్‌గా వాడుకుంటున్నారు. అంతా ఆయనతోనే పోయింది!.. కాంప్లెక్స్ వైభవం అంతా గడ్డం సుబ్బారావుగారితోనే పోయిందని అక్కడ పనిచేసే ముఠా కూలీలు చెబుతున్నారు. సరుకుల ఎగుమతి, దిగుమతి సమయాల్లో ప్రమాదం జరిగితే వెంటనే ప్రథమ చికిత్స చేయించుకునే సౌకర్యం కాంప్లెక్స్‌లో లేదు. తమ కోసం ఓ హాస్పటల్ నిర్మించాలని అప్పట్లో సుబ్బారావు కాంప్లెక్స్‌లో స్థలం కేటాయించి శంకుస్థాపన కూడా చేశారు. ఆయన పోవటంతో అదికాస్తా మూలనపడింది. అయితే, యజమానులంతా కలిసి తమ సంక్షేమం కోసం విజయవాడ హోల్‌సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ మెంబర్స్ వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారుగానీ, వారి దగ్గర పని చేస్తున్న తమ సంక్షేమం కోసం ఎటువంటి ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఠా కార్మికులు. మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపు విశ్రాంతి తీసుకుందామంటే ఒక్క షెడ్ కూడా లేదు. దీంతో చెట్ల కిందో, షాపుల్లోనో సేద తీరుతున్నామని వాపోతున్నారు. లక్షల్లో పన్ను చెల్లిస్తున్నా.. గొల్లపూడి పంచాయతీకి తాము ఏటా రూ.9 లక్షలకుపైనే పన్నులు చెల్లిస్తున్నా అధికారులు సహకరించటం లేదని సొసైటీ అధ్యక్షుడు అన్నవరపు కోటేశ్వరరావు చెప్పుకొస్తున్నారు. కాంప్లెక్స్‌లోని చెత్తా చెదారాన్ని పంచాయతీ సిబ్బంది తీసుకువెళ్లకపోవడంతో హాస్పటల్ కోసం కేటాయించిన స్థలంలో వేసుకోవాల్సి వస్తోందని అంటున్నారు. తామే ట్రాక్టర్ కొనుగోలు చేసుకుంటామని, చెత్త డంప్ చేసే ప్రదేశాన్ని చూపమని అడిగినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. కాగా కాంప్లెక్స్‌లోని ఒక్కో షాపు నుంచి మెయింటినెన్స్ పేరుతో సొసైటీ రూ.1,600 వసూలు చేస్తుంది. ఆ షాపుపై మొదటి అంతస్తు ఉంటే మరో రూ.600 చార్జి చేస్తున్నారు. ఈ రకంగా సొసైటీకి నెలకు దాదాపు రూ.10 లక్షల వరకు వస్తుంది. అయితే కాంప్లెక్స్ మెయింటినెన్స్ అధ్వానంగా ఉంటుందని, లారీలు ఎక్కడపడితే అక్కడ పార్క్ చేయడం, రోడ్డుపైనే ఎగుమతి దిగుమతులు చేయడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వినియోగదారులు చెబుతున్నారు. -
ఆన్‌లైన్‌లోకి మెట్రో క్యాష్ అండ్ క్యారీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హాల్‌సేల్ వ్యాపారంలో ఉన్న మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఆన్ లైన్ సౌకర్యాన్ని త్వరలో పరిచయం చేయనుంది. కస్టమర్ల సౌకర్యార్థం ఈ నిర్ణయానికి వచ్చినట్టు కంపెనీ తెలిపింది. ఆన్లైన్లో సరుకులను ఆర్డరు ఇచ్చే వెసులుబాటు కల్పించాలని గత కొంత కాలంగా కార్పొరేట్ కంపెనీలు, ఎస్ఎంఈ, హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి కంపెనీకి విజ్ఞప్తులు వచ్చాయి. వాస్తవానికి బిజినెస్ కస్టమర్లు ఎవరైనా మెట్రోకు చెందిన స్టోర్‌కు ప్రత్యక్షంగా వెళ్లి సరుకులను తెచ్చుకోవాల్సిందే. అయితే ఆన్లైన్లో ఆర్డరు ఇవ్వడం ద్వారా విలువైన తమ సమయం ఆదా అవుతుందన్నది కస్టమర్ల వాదన. పైలట్ ప్రాజెక్టు కింద ఈ నెల నుంచే హైదరాబాద్‌తోసహా పలు నగరాల్లో ఎంపిక చేసిన స్టోర్లలో ఆన్లైన్ సౌకర్యాన్ని కంపెనీ పరిచయం చేస్తోందని సమాచారం. స్టోర్‌లోనూ, ఆన్‌లైన్‌లోనూ ఉత్పత్తుల ధర ఒకేలా ఉంటుందని మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా ఎండీ రాజీవ్ బక్షి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న 3 స్టోర్లతో క లిపి మెట్రోకు దేశవ్యాప్తంగా 17 కేంద్రాలున్నాయి. 2020 నాటికి ఔట్లెట్ల సంఖ్యను 50కి చేర్చాలన్నది కంపెనీ లక్ష్యం. ఈ విస్తరణలో మరో 3 కేంద్రాలు భాగ్యనగరిలో ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఒక్కో స్టోర్ ఏర్పాటుకు సంస్థ రూ.70 కోట్లు ఖర్చు చేస్తోంది. -
నాలుగు ప్రధాన మార్కెట్లలో భారత్
♦ 8 లక్షల జనాభా ఉన్న నగరాల్లో ఔట్లెట్ ♦ మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా ఎండీ రాజీవ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : హోల్‌సేల్ వ్యాపారంలో ఉన్న మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇప్పుడు భారత్‌పై ఫోకస్ చేసింది. సంస్థకు అంతర్జాతీయంగా ఉన్న నాలుగు ప్రధాన మార్కెట్లలో రష్యా, చైనా, టర్కీతోపాటు భారత్ కూడా నిలిచింది. 2020 నాటికి ఇక్కడ 50 స్టోర్లను ఏర్పాటు చేయాలన్నది సంస్థ లక్ష్యం. ప్రస్తుతం మెట్రోకు 17 విక్రయ కేంద్రాలున్నాయి. గత నాలుగేళ్లలో ఏకంగా 12 స్టోర్లు ప్రారంభించామని మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా ఎండీ రాజీవ్ బక్షి మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘ఇక్కడి కస్టమర్ల ఆదాయాలు పెరిగాయి. అభిరుచులు మారాయి. వెరైటీలు కోరుకుంటున్నారు. సాధారణ హోల్‌సేల్ స్టోర్లు అధిక మొత్తంలో ఉత్పత్తులను ఆఫర్ చేయలేవు. అందుకే భారీ స్టోర్లకు డిమాండ్ పెరుగుతోంది’ అన్నారు. ఒక్కో స్టోర్‌కు రూ.70 కోట్ల వ్యయం... భారత్‌లో ఈ ఏడాది మరిన్ని ఔట్లెట్లు రానున్నాయని రాజీవ్ వెల్లడించారు. 18వ స్టోర్ బెంగళూరులో ఏర్పాటు చేశామని, వారం రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు. 8 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో స్టోర్లను నెలకొల్పుతామని పేర్కొన్నారు. 2020 నాటికి భాగ్యనగరంలో మరో 2-3 ఔట్లెట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు సుమారుగా రూ.70 కోట్లు వ్యయం అవుతోందన్నారు. హైదరాబాద్ శంషాబాద్ వద్ద ఏర్పాటైన స్టోర్‌లో జూన్ 25 నుంచి కార్యకలాపాలు ప్రారంభం అవుతున్నాయి.