నాలుగు ప్రధాన మార్కెట్లలో భారత్
♦ 8 లక్షల జనాభా ఉన్న నగరాల్లో ఔట్‌లెట్
♦ మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా ఎండీ రాజీవ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : హోల్‌సేల్ వ్యాపారంలో ఉన్న మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇప్పుడు భారత్‌పై ఫోకస్ చేసింది. సంస్థకు అంతర్జాతీయంగా ఉన్న నాలుగు ప్రధాన మార్కెట్లలో రష్యా, చైనా, టర్కీతోపాటు భారత్ కూడా నిలిచింది. 2020 నాటికి ఇక్కడ 50 స్టోర్లను ఏర్పాటు చేయాలన్నది సంస్థ లక్ష్యం. ప్రస్తుతం మెట్రోకు 17 విక్రయ కేంద్రాలున్నాయి. గత నాలుగేళ్లలో ఏకంగా 12 స్టోర్లు ప్రారంభించామని మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా ఎండీ రాజీవ్ బక్షి మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘ఇక్కడి కస్టమర్ల ఆదాయాలు పెరిగాయి. అభిరుచులు మారాయి. వెరైటీలు కోరుకుంటున్నారు. సాధారణ హోల్‌సేల్ స్టోర్లు అధిక మొత్తంలో ఉత్పత్తులను ఆఫర్ చేయలేవు. అందుకే భారీ స్టోర్లకు డిమాండ్ పెరుగుతోంది’ అన్నారు.
ఒక్కో స్టోర్‌కు రూ.70 కోట్ల వ్యయం...
భారత్‌లో ఈ ఏడాది మరిన్ని ఔట్‌లెట్లు రానున్నాయని రాజీవ్ వెల్లడించారు. 18వ స్టోర్ బెంగళూరులో ఏర్పాటు చేశామని, వారం రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు. 8 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో స్టోర్లను నెలకొల్పుతామని పేర్కొన్నారు. 2020 నాటికి భాగ్యనగరంలో మరో 2-3 ఔట్‌లెట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు సుమారుగా రూ.70 కోట్లు వ్యయం అవుతోందన్నారు. హైదరాబాద్ శంషాబాద్ వద్ద ఏర్పాటైన స్టోర్‌లో జూన్ 25 నుంచి కార్యకలాపాలు ప్రారంభం అవుతున్నాయి.