ఆన్‌లైన్‌లోకి మెట్రో క్యాష్ అండ్ క్యారీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హాల్‌సేల్ వ్యాపారంలో ఉన్న మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఆన్ లైన్ సౌకర్యాన్ని త్వరలో పరిచయం చేయనుంది. కస్టమర్ల సౌకర్యార్థం ఈ నిర్ణయానికి వచ్చినట్టు కంపెనీ తెలిపింది. ఆన్‌లైన్‌లో సరుకులను ఆర్డరు ఇచ్చే వెసులుబాటు కల్పించాలని గత కొంత కాలంగా కార్పొరేట్ కంపెనీలు, ఎస్‌ఎంఈ, హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి కంపెనీకి విజ్ఞప్తులు వచ్చాయి. వాస్తవానికి బిజినెస్ కస్టమర్లు ఎవరైనా మెట్రోకు చెందిన స్టోర్‌కు ప్రత్యక్షంగా వెళ్లి సరుకులను తెచ్చుకోవాల్సిందే. అయితే ఆన్‌లైన్‌లో ఆర్డరు ఇవ్వడం ద్వారా విలువైన తమ సమయం ఆదా అవుతుందన్నది కస్టమర్ల వాదన.
పైలట్ ప్రాజెక్టు కింద ఈ నెల నుంచే హైదరాబాద్‌తోసహా పలు నగరాల్లో ఎంపిక చేసిన స్టోర్లలో ఆన్‌లైన్ సౌకర్యాన్ని కంపెనీ పరిచయం చేస్తోందని సమాచారం. స్టోర్‌లోనూ, ఆన్‌లైన్‌లోనూ ఉత్పత్తుల ధర ఒకేలా ఉంటుందని మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా ఎండీ రాజీవ్ బక్షి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న 3 స్టోర్లతో క లిపి మెట్రోకు దేశవ్యాప్తంగా 17 కేంద్రాలున్నాయి. 2020 నాటికి ఔట్‌లెట్ల సంఖ్యను 50కి చేర్చాలన్నది కంపెనీ లక్ష్యం. ఈ విస్తరణలో మరో 3 కేంద్రాలు భాగ్యనగరిలో ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఒక్కో స్టోర్ ఏర్పాటుకు సంస్థ రూ.70 కోట్లు ఖర్చు చేస్తోంది.