న్యూఢిల్లీ : దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను తన సొంతం చేసుకుంటున్నట్టు మెగా డీల్‌ను ప్రకటించిన అనంతరం అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ భారత్‌లో తన స్టోర్ల విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. వచ్చే నాలుగు-ఐదేళ్లలో కొత్తగా 50 స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు గురువారం తెలిపింది. తన హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ బిజినెస్‌లను వృద్ధి చేయడం కొనసాగించనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం వాల్‌మార్ట్‌కు భారత్‌లో 21 స్టోర్లు ఉన్నాయి. వచ్చే నాలుగు నుంచి ఐదేళ్లలో మరో 50 కొత్త స్టోర్లను ఏర్పాటు చేస్తాం అని వాల్‌మార్ట్ ఇండియా అధ్యక్షుడు, సీఈవో క్రిష్ అయ్యర్ ప్రకటించారు. ఈ ఏడాది 5 స్టోర్లను ఏర్పాటు చేయనున్నామని, క్రమంగా వృద్ధి చెందుతూ ఏడాదికి 12 నుంచి 15 స్టోర్లను ప్రారంభించనున్నట్టు తెలిపారు.
వాల్‌మార్ట్ 9 రాష్ట్రాల్లో 19 నగరాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. అవే భౌగోళిక ప్రాంతాల్లో భవిష్యత్తులో తమ స్టోర్లను విస్తరించనున్నట్టు అయ్యర్ చెప్పారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్‌ను సొంతం చేసుకున్న నేపథ్యంలో కంపెనీ పేరులో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టంచేసింది. నిన్ననే(బుధవారం) ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను తాము కొనుగోలు చేయబోతున్నట్టు వాల్‌మార్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం 16 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.1,05,000 కోట్లు) చెల్లించడానికి వాటాదారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. ప్రస్తుత డీల్ ప్రకారం చూస్తే... ఫ్లిప్‌కార్ట్ కంపెనీ విలువ(వేల్యుయేషన్) 20.8 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1,40,000 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment