సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద చైనా షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ కొనుగోలు రేసులో అమెరికాకు చెందిన మరో దిగ్గజ సంస్థ నిలిచింది. ప్రముఖసోషల్ వీడియో ప్లాట్‌ఫామ్ ట్రిల్లర్ చైనాకు చెందిన బైట్‌డాన్స్‌ను సంప్రదించినట్టు తెలుస్తోంది. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రసిద్ధ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ సెంట్రికస్ ద్వారా 20 బిలియన్ డాలర్ల బిడ్‌తో సంప్రదించినట్లు రాయిటర్స్ శనివారం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారతదేంలోని టిక్ టాక్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు యోచిస్తున్నట్టు పేర్కొంది. (టిక్‌టాక్ : రేసులో మరో దిగ్గజం)
టిక్‌టాక్ కాకుండా టిక్‌టాక్ యజమాన్య సంస్థ బైట్‌డాన్స్‌కు నేరుగా బిడ్ చేసినట్లు ట్రిల్లర్ వెల్లడించింది. సెంట్రికస్ ద్వారా బైట్‌డాన్స్ ఛైర్మన్‌కు నేరుగా ఆఫర్‌ను సమర్పించామనీ, స్వీకరణ ధృవీకరణ కూడా తమకు చేరిందని ట్రిల్లర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాబీ సర్నెవెష్ట్ చెప్పారు. డైరెక్టుగా ఛైర్మన్‌తోనే సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అయితే, ఈ వార్తలను టిక్‌టాక్ తోసిపుచ్చింది. అలాంటి ఆఫర్‌ను అందుకోలేదని తెలిపింది. దీంతో ఈ వ్యవహారంలో గందరగోళం నెలకొంది. (వీచాట్ బ్యాన్ : డ్రాగన్ టిట్ ఫర్ టాట్ వార్నింగ్)
టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ తన అమెరికా, కెనడియన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కార్యకలాపాలను విక్రయించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన 90 రోజుల గడువు లోపల ఒక ఒప్పందానికి రావాలని భావిస్తోంది. సుమారు. 20-30 బిలియన్ల డాలర్ల పరిధిలో డీల్ ఖాయం చేసుకోవాలని భవిస్తోంది. అటు రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ మైక్రోసాఫ్ట్ తో జతకడుతున్నట్లు ధృవీకరించింది. దీంతో మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, వాల్ మార్ట్ మూడు దిగ్గజ కంపెనీలతో బైట్‌డాన్స్ చర్చలు జరుపుతోంది.
కాగా జాతీయ భద్రతా సమస్యలరీత్యా టిక్‌టాక్ ను నిషేధిస్తామని ఇప్పటికే హచ్చరించిన ట్రంప్ అమెరికా కార్యకలాపాలను విక్రయించాలని ఒత్తిడి పెంచారు. ఇందుకు 45 రోజుల్లోపు అమెరికాలో బైట్‌డాన్స్ ఎటువంటి లావాదేవీలు జరపకుండా నిషేధిస్తూ ట్రంప్ ఆగస్టు 6న ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తరువాత దీన్ని 90 రోజులకు పెంచుతూ ఆగస్టు 14 న మరో ఉత్తర్వుపై సంతకం చేశారు. మరోవైపు ట్రంప్ మొదటి ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై టిక్‌టాక్ దావా వేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment