దేశీయ ఈ-కామర్స్ దిగ్గజంగా పేరున్న ఫ్లిప్‌కార్ట్, అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ సొంతమైపోయింది. మెగా డీల్ ఖరారు కావడంతో, ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా వాల్‌మార్ట్ ఆధీనంలోకి వచ్చేసినట్టు సాఫ్ట్‌బ్యాంకు సీఈవో మయవోషి సన్ ధృవీకరించేశారు. ఈ నేపథ్యంలో భారత్ మార్కెట్‌లో ఫ్లిప్‌కార్ట్ జర్నీ ఎలా సాగిందో ఓ సారి తెలుసుకుందాం....
ఫ్లిప్‌కార్ట్ ప్రారంభం....
వ్యాపారవేత్తలుగా ఎదగాలనే కలలతో ఉన్న ఓ ఇద్దరు ఐఐటీ-ఢిల్లీ గ్రాడ్యుయేట్లు, అమెజాన్‌లో తమకున్న ఉద్యోగాన్ని వదిలేసి ఫ్లిప్‌కార్ట్‌ను ప్రారంభించారు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం అంటే 2007లో బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో డబుల్ బెడ్‌రూం అపార్ట్‌మెంట్‌లో ఈ సంస్థకు అంకురార్పణ చేశారు. వారే బిన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్‌లు. వీరిద్దరూ ఛండీఘర్‌కు చెందిన వారు. చివరి పేరు ఒకటే అయిన తెలిసిన వాళ్లేమీ కాదు. ఐఐటీ-ఢిల్లీలో చదువుకునే రోజుల నుంచే పరిచయం. అమెజాన్‌లో చేరిన తర్వాత ఈ ఇద్దరూ స్నేహితులుగా మారారు.
ఫ్లిప్‌కార్ట్ విస్తరణ....
2008లో బెంగళూరుతో తమ తొలి ఆఫీసును ప్రారంభించి అనంతరం, ఢిల్లీ, ముంబైలలో కూడా 2009లో ఫ్లిప్‌కార్ట్ ఆఫీసులను ఏర్పాటు చేశారు. డబుల్-బెడ్‌రూం అపార్ట్‌మెంట్‌లో ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం 8.3 లక్షల చదరపు అడుగులకు విస్తరించింది. ఇటీవలే బెంగళూరులో ఓ పెద్ద క్యాంపస్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించింది. బెంగళూరులో ఉన్న ఆఫీసులన్నింటిన్నీ ఒకే గూటికి కిందకి అంటే ఆ క్యాంపస్‌లోకి తరలించింది.
ఫ్లిప్‌కార్ట్ నాయకత్వ మార్పులు....
ప్రారంభించినప్పటి నుంచి తొమ్మిదేళ్ల పాటు ఫ్లిప్‌కార్ట్ సీఈవోగా సచిన్ బన్సాల్‌నే ఉన్నారు. 2016లో తొలిసారి సచిన్ బన్సాల్ నుంచి బిన్నీ బన్సాల్ సీఈవో పదవిని అలంకరించారు. అనంతరం సచిన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. గతేడాది ఫ్లిప్‌కార్ట్ సీఈవో పదవిని కల్యాణ్ కృష్ణమూర్తికి అప్పజెప్పారు. ప్రస్తుతం బిన్నీ బన్సాల్ మొత్తం గ్రూప్‌కు సీఈవోగా బాధ్యతలు చేపడుతున్నారు. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లో ఫ్యాషన్ పోర్టల్స్ మింత్రా జబాంగ్, పేమెంట్స్ యూనిట్ ఫోన్‌పే, లాజిస్టిక్ ఆర్మ్ ఈకార్ట్‌లు ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్ కొనుగోళ్లు...
2014లో ఫ్లిప్‌కార్ట్, ఆన్‌లైన్ అప్పీరల్ రిటైలర్ మింత్రాను 300 మిలియన్ డాలర్లకు తన సొంతం చేసుకుంది. అనంతరం జబాంగ్‌ను 2016లో 70 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఫోన్‌పేను 2016లోనే తన సొంతం చేసుకుంది.
ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడిదారులు...
వాల్‌మార్ట్ సొంతం చేసుకోక ముందు ఫ్లిప్‌కార్ట్ అతిపెద్ద పెట్టుబడిదారుగా జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంకు ఉండేది. 23-24 శాతం వాటాను కలిగి ఉంది. కానీ వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేయడంతో, పూర్తిగా ఆ కంపెనీ నుంచి సాఫ్ట్‌బ్యాంక్ వైదొలుగుతోంది. ఇంటర్నెట్ దిగ్గజం నాస్సర్స్ కూడా 13 శాతం వాటాను కలిగి ఉండేది. ఇది కూడా తన వాటాను విక్రయించేస్తోంది. ఇతర పెట్టుబడిదారులు న్యూయార్క్‌కు చెందిన హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్, అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అస్సెల్ పార్టనర్స్, చైనాకు చెందిన టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్, ఈబే ఇంక్, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment