Binny Bansal
-
ఫోన్‌పేకు 'బిన్నీ బన్సాల్' గుడ్‌బై
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బోర్డు నుంచి బయటకు వచ్చిన సంస్థ కో-ఫౌండర్ 'బిన్నీ బన్సాల్'.. తాజాగా డిజిటల్ పేమెంట్స్ యాప్ 'ఫోన్‌పే' నుంచి కూడా బయటకు వచ్చేసారు. అయితే కంపెనీ నుంచి వైదొలగడానికి కారణం ఏమిటనే విషయాన్ని వెల్లడించలేదు.నిజానికి బిన్నీ బన్సాల్ ఆప్‌డోర్ ప్రారంభించిన తరువాత ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని వైరుధ్యాలు తలెత్తాయి. దీంతో ఈయన 2024 జనవరిలో సంస్థను వీడి బయటకు వచ్చేసారు. ఆ తరువాత ఫోన్‌పే బోర్డులో చేరారు. దానికిప్పుడు గుడ్ బై చెప్పేసారు.బిన్నీ బన్సాల్ ఫోన్‌పే నుంచి బయటకు వెళ్లడం గురించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ స్పందిస్తూ.. సంస్థ ఎదగటానికి ప్రారంభం నుంచి ఆయన ఎంతో మద్దతు తెలిపారని.. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. టీమ్‌లీజ్ సర్వీసెస్‌లో వైస్-ఛైర్మన్‌గా ఉన్న 'మనీష్ సబర్వాల్'ను స్వతంత్ర డైరెక్టర్, ఆడిట్ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. -
దిగ్గజ సంస్థలో చీలిక.. కోఫౌండర్ కొత్త కంపెనీ..!
ఈ-కామర్స్ వ్యాపారంలో ఫ్లిప్‌కార్ట్ అగ్రగామిగా దూసుకెళ్తోంది. దాన్ని స్థాపించి విజయవంతంగా తీర్చిదిద్దిన బిన్నీ బన్సాల్ తాజాగా మరో ఈ-కామర్స్ బిజినెస్‌ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ గతంలోనే ఫ్లిప్‌కార్ట్‌లో తన మిగిలిన వాటాను కూడా విక్రయించిన సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ పూర్తిగా వాల్‌మార్ట్ యాజమాన్యంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో కంపెనీను విడిచి బిన్నీ బన్సాల్ ఈ-కామర్స్ మార్కెట్లో మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త కంపెనీ పెడుతున్నట్లు బిన్నీ ఇప్పటికే చెప్పారు. జనవరి 2024 ప్రారంభంలో ఆయన తన కొత్త కంపెనీ ‘ఆప్‌డోర్’ OppDoorను ప్రకటించారు. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్ కంపెనీల అభివృద్ధి, విస్తరణకు ఎండ్ టూ ఎండ్ సోల్యూషన్స్‌ను అందించనుందని తెలిసింది. ‘ఆప్‌డోర్’ మొదట యూఎస్, కెనడా, మెక్సికో, యూకే, జర్మనీ, సింగపూర్, జపాన్ , ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ-కామర్స్ కంపెనీలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: బిన్నీ బన్సల్ కూడా.. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఫౌండర్లు ఇద్దరూ అవుట్! ఫ్లిప్‌కార్ట్ మరో కోఫౌండర్ సచిన్ బన్సాల్ నవీ అనే ఫిన్‌టెక్ వెంచర్ ఏర్పాటు కోసం కొన్ని సంవత్సరాల కిందటే ఫ్లిప్‌కార్ట్‌ను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. గత 16 సంవత్సరాలుగా ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సాధించిన విజయాల పట్ల బిన్నీ బన్సల్ గర్వాన్ని వ్యక్తం చేశారు. సమర్థవంతమైన నాయకత్వ బృందంతో కంపెనీ బలమైన స్థానంలో ఉందన్నారు. -
బిన్నీ బన్సల్ కూడా.. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఫౌండర్లు ఇద్దరూ అవుట్!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మరో పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ ఫ్లిప్‌కార్ట్ బోర్డు నుంచి అధికారికంగా రాజీనామా చేశారు. స్టార్టప్‌లో తన మిగిలిన వాటాను విక్రయించిన కొన్ని రోజుల తర్వాతే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. సచిన్ బన్సాల్ బాటలోనే.. నవీ అనే ఫిన్‌టెక్ వెంచర్ ఏర్పాటు కోసం కొన్ని సంవత్సరాల క్రితం ఫ్లిప్‌కార్ట్‌ను విడిచిపెట్టిన మరో సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ అడుగుజాడలనే బిన్నీ బన్సల్ కూడా అనుసరించనున్నారని ఇంతకు ముందే పలు నివేదికలు పేర్కొన్నాయి. ఆయన కూడా ఈ-కామర్స్ రంగంలో మరో వెంచర్‌ను ఏర్పాటు చేస్తారని, అందుకే ఆయన ఫ్లిప్‌కార్ట్ నుంచి తప్పుకొన్నారని భావిస్తున్నారు. గత 16 సంవత్సరాలుగా ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సాధించిన విజయాల పట్ల బిన్నీ బన్సల్ గర్వాన్ని వ్యక్తం చేశారు. సమర్థవంతమైన నాయకత్వ బృందంతో కంపెనీ బలమైన స్థానంలో ఉందన్నారు. "ఈ నమ్మకంతో, కంపెనీ సమర్థుల చేతుల్లో ఉందని తెలుసుకుని, నేను పక్కకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ బృందం కస్టమర్లకు మెరుగైన అనుభవాలను అందించడాన్ని ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను. సంస్థకు బలమైన మద్దతుదారునిగా కొనసాగుతాను" అని బిన్నీ బన్సల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్‌తో దేశంలో షాపింగ్ అనుభవాన్ని మెరుగ్గా మార్చిన బిన్నీ బన్సల్ గొప్ప ఆలోచనలను ఫ్లిప్‌కార్ట్ సీఈవో, బోర్డ్ మెంబర్ అయిన కళ్యాణ్ కృష్ణమూర్తి కొనియాడారు. అంకితభావంతో కూడిన టీమ్‌వర్క్ వల్లే ఫ్లిప్‌కార్ట్ ఈ స్థాయికి ఎదిగిందన్నారు. ఫ్లిప్‌కార్ట్‌ను బెంగళూరు ప్రధాన కేంద్రంగా 2007లో సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ ప్రారంభించారు. -
ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్ కొత్త బిజినెస్.. సీఈవో కోసం అన్వేషణ!
Flipkart Co-Founder Binny Bansal Plans New Start-Up: ఈ-కామర్స్ వ్యాపారంలో అగ్రగామిగా దూసుకెళ్తోంది ఫ్లిప్‌కార్ట్. దాన్ని స్థాపించి విజయవంతంగా తీర్చిదిద్దిన బిన్నీ బన్సాల్ తాజాగా మరో ఈ-కామర్స్ బిజినెస్‌ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌లో తన మిగిలిన వాటాను కూడా విక్రయించిన సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ పూర్తిగా వాల్‌మార్ట్ యాజమాన్యంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో బిన్నీ బన్సాల్ ఈ-కామర్స్ మార్కెట్లో మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. భారతీయ, అంతర్జాతీయ ఈ-కామర్స్ సంస్థలకు డిజైన్, మర్చండైజ్, లేబర్ వంటి సహాయపడే వ్యాపారాన్ని స్థాపించాలని బన్సాల్ చూస్తున్నారు. ఇది స్టార్టప్ నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (KPO) కంపెనీగా పని చేస్తుంది. వాణిజ్య సంస్థలకు బ్యాకెండ్ కార్యకలాపాలతో సహాయం చేస్తుంది. సీఈవో కోసం అన్వేషణ సమాచార వర్గాల ప్రకారం, బిన్నీ బన్సాల్ తన కొత్త వ్యాపారంలో కేవలం తన సొంత డబ్బును మాత్రమే పెట్టుబడి పెడుతున్నారు. అయితే కంపెనీ రోజువారీ కార్యకలాపాలలో ఆయన నేరుగా పాల్గొనరు. వ్యాపారాన్ని పర్యవేక్షించడానికి సీఈవో కోసం అన్వేషిస్తున్నారు. వాల్‌మార్ట్ 2018లో 16 బిలియన్ డాలర్లకు ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసింది. దీంతో ఫ్టిప్కార్ట్కు బిన్నీ బన్సాల్ దూరమయ్యారు. విక్రయ ఒప్పందంలో భాగమైన ఐదేళ్ల నాన్-కాంపిటేట్ నిబంధన గడువు ఈ సంవత్సరం ముగిసింది. ఫ్లిప్‌కార్ట్‌ను వీడిన తర్వాత బిన్నీ బన్సాల్ ఏంజెల్ ఇన్వెస్టర్‌గా చురుగ్గా ఉంటూ బహుళ వ్యాపారాలకు మద్దతు ఇస్తున్నారు. బన్సాల్ కొత్త వ్యాపారం స్వీయ-నిధులతో ఉంటుందని, బయటి నుంచి నిధులను స్వీకరించదని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ఉన్న ఈ-కామర్స్ సంస్థలకు కీలకమైన సహాయాన్ని అందించే గ్లోబల్ కంపెనీగా తన కొత్త సంస్థను బిన్నీ బన్సాల్ తీర్చిదిద్దనున్నారు. -
స్టార్టప్‌లో బిన్నీ బన్సల్ భారీ పెట్టుబడులు
బెంగుళూరు: ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు, బిన్నీ బన్సల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం స్టార్ట్ప్ సంస్థ మొబీకాన్ ఆహారం, రెస్టారెంట్ల పరిశ్రమలను టెక్నాలజీతో అనుసంధానం చేయడంతో బన్సల్ సైతం మోబీకాన్లో12.5మిలీయన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని నిశ్చయించుకున్నారు. బన్నీ సింగపూర్‌కు వెళ్లిన తర్వాత మొదటి సారి భారత్‌లో పెట్టుబడులు పెడుతుండడం విశేషం. కాగా, మొబీకాన్ వ్యవస్థాపకుడు సమీర్ ఖాదేపాన్ కూడా సింగపూర్‌కు చెందిన వ్యక్తి కావడం గమనార్హం. బన్నీ మొదటి సారిగా స్టార్ట్ప్ కంపెనీలలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే బన్సల్ స్పందిస్తూ రెస్టారెంట్ల వ్యాపారం భారత్‌లో క్రమక్రమంగా పుంజుకుంటుందని, భవిష్యత్తులో ఆస్ట్రేలియాలో సైతం విస్తరిస్తామని అన్నారు. ఇటీవల కాలంలో మొబీకాన్ 25మిలియన్ల పెట్టుబడులను ఆకర్షించిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా జంగల్ వెంచర్స్, స్ప్రింగ్ లాంటి సంస్థలలో భారీగా పెట్టుబడులు పెట్టారు. -
బిన్నీబన్సల్ అనూహ్య నిర్ణయం
సాక్షి, ముంబై: ఫ్లిప్‌కార్ట్ మాజీ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో బిన్నీ బన్సల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్లిప్‌కార్ట్ అనూహ్యంగా తప్పుకున్న బిన్సీ తాజాగా ఫ్లిప్‌కార్ట్ షేర్లను మాతృసంస్థ వాల్‌మార్ట్ విక్రయించారు. 531 కోట్ల రూపాయల విలువైన 54 లక్షల ఈక్విటీ షేర్లను వాల్‌మార్ట్ లక్సెంబర్గ్ సంస్థ ఎఫ్ఐటి హోల్డింగ్స్ సార్ల్‌కు విక్రయించారు. దీంతో ఫ్లిప్‌కార్ట్‌లో బన్సల్ వాటా 3.85 శాతం నుంచి 3.52 శాతానికి పడిపోయింది. దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ లో మేజర్ వాటాను (77శాతం) గ్లోబల్ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన సుమారు ఏడాది తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ డీల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ మరో వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ సంస్థలో తన మొత్తం వాటాలను విక్రయించగా, బిన్సీ బన్సల్ మాత్రం ఫ్లిప్‌కార్ట్‌లో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ తరువాత కొంత కాలానికే లైంగిక ఆరోపణల నేపథ్యంలో బిన్నీ సంస్థనుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. -
గతం గతః.. మరో కొత్త అధ్యాయం
సాక్షి, బెంగళూరు : ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులలో ఒకడైన బిన్నీ బన్సల్ (37) ఎట్టకేలకు మౌనం వీడారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఫ్లిప్‌కార్ట్ సీఈవోగా వైదొలగిన మూడు నెలల అనంతరం తొలిసారిగా ఆయన తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. గతం గతః..ఇక ముందుకే..తన జీవితంలో మరో అధ్యాయనాన్ని ప్రారంభించనున్నట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తన పాత సహచరుడు సాయి కిరణ్ కృష్టమూర్తితో కలిసి స్థాపించిన ఎక్స్ టూ 10 ఎక్స్ టెక్నాలజీ అనే స్టార్టప్‌పై దృష్టిపెట్టనున్నట్టు వెల్లడించారు. తద్వారా 10 స్టార్టప్ కంపెనీలకు ఊతమివ్వాలని నిర్ణయించామంటూ తన ఫ్యూచర్ ప్లాన్లను ప్రకటించారు. నిజానికి వీటి ద్వారా సుమారు 10 వేలకుపైగా మధ్యతరగతి వ్యాపారవేత్తలకు సాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే బృందంతోపాటు ఒక కార్యాలయాన్నికూడా ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు కొంతమంది ప్రముఖ స్టార్టప్ వినియోగదారులను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. కాగా గ్లోబల్ ఈ కామర్స్ దిగ్గజం వాల్‌మార్ట్ 1600 కోట్ల డాలర్లు చెల్లించి ఫ్లిప్‌కార్ట్‌ను టేకోవర్ చే సిన సంగతి తెలిసిందే. ఈ కొనుగోలు అనంతరం ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్లు ఒకరుసచిన్ బన్స్ల్ తన వాటాను మొత్తం విక్రయించు సంస్థను వీడగా, లైంగిక వేధింపుల ఆరోపణలతో బిన్నీ బన్సల్ ఫ్లిప్‌కార్ట్ సీఈవో పదవిగా రాజీనామా చేశారు. బన్సల్‌పై 'తీవ్ర వ్యక్తిగత దుష్ప్రవర్తన' ఆరోపణలపై ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూ లభించనప్పటికీ నిర్ణయాలు తీసుకోవడంలో లోపాలు, వివిధ సందర్భాలకు తగినట్లు స్పందించకపోవడం, పారదర్శకత లేమి బయటపడ్డాయని, అందుకే ఆయన రాజీనామాను ఆమోదించామని ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్‌లు ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. 4శాతం వాటాను కలిగి వున్నబిన్సీ బన్సల్ ఫ్లిప్‌కార్డ్ బోర్డులో ఇంకా కొనసాగుతున్నారు. -
బన్సల్‌పై లైంగిక ఆరోపణలు : న్యూ ట్విస్ట్
సాక్షి, బెంగళూరు: ఫ్లిప్‌కార్ట్ కో-ఫౌండర్ బిన్నీ బన్సల్ రాజీనామా అనంతరం మరో ఆసక్తికరమైన ట్విస్ట్. లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ సీఈవో పదవికి రాజీనామా చేసిన బిన్సీ ప్రతీకార చర్యలకు దిగినట్టు కనిపిస్తోంది. తనపై ఆరోపణలు చేసిన మహిళపై కేసును దాఖలు చేశారు. తప్పుడు ఆరోపణలు, బ్లాక్మెయిల్ ఆరోపణలతో కోరమంగళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే సదరు మహిళ క్షమాపణ చెప్పడంతో కేసును వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే తను కావాలనుకున్నపుడు కేసును రీ ఓపెన్ చేసే హక్కును రిజర్వ్ చేసుకున్నారట. ప్రస్తుతం ఈ వార్త పరిశ్రమ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కొన్నాళ్లు ఫ్లిప్‌కార్ట్‌లో పనిచేసిన మహిళ బిన్సీపై లైంగిక ఆరోపణలు చేశారు. 2016లో వీరిద్దరి మధ్య సంబంధాలు కొనసాగాయని, అయితే కొన్ని నెలల తరువాత విభేదాలు రావడంతో విడిపోయారు. అలాగే ఈ సందర్భంగా ఆమె కొంత డబ్బు చెల్లించాలని కూడా డిమాండ్ చేసినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె సొంతంగా ఓ వెంచర్‌ను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే 2018లో వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో మేజర్ వాటాను కొనుగోలు చేసిన అనంతరం ఆమె డబ్బుల కోసం మళ్లీ బిన్నీని డిమాండ్ చేశారు. ఈ సారి కూడా బిన్నీ బన్సల్ ససేమిరా అనడంతో, 2018 జూలైలో ఆమె నేరుగా వాల్‌మార్ట్ సీఈవోకే లైంగిక ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. దీనిపై ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ సంయుక్తంగా అంతర్గత విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ గ్రూపు సీఈవో బిన్నీ బన్సల్ రాజీనామా చేశారనీ ఈ విచారణలో ఆరోపణలు రుజువు కానప్పటికీ, బిన్నీ రాజీనామాను ఆమోదిస్తున్నట్టు నవంబరు 13న వాల్‌మార్ట్ ప్రకటించింది. అయితే బన్సల్‌పై వచ్చిన తీవ్రమైన వ్యక్తిగత దుష్ప్రవర్తన ఆరోపణల విషయమై పూర్తి వివరాలను వాల్‌మార్ట్ వెల్లడి చేయని సంగతి విదితమే. మరోవైపు బిన్నీ కంపెనీని వీడిన అనంతరం ఫ్లిప్‌కార్ట్ బోర్డు లండన్‌లో సమావేశం కానుంది. వచ్చే వారమే ఈ భేటీ జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ సమావేశానికి బోర్డులో కొనసాగుతానని ప్రకటించిన బిన్నీ హాజరవుతారా లేదా అనేది స్పష్టత లేదు. -
ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్స్‌కు ఐటీ నోటీసులు
ఈ కామర్స్ మార్కెట్లో అతిపెద్ద డీల్‌గా నిలిచిన వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ ఒప్పందంపై ఆదాయపన్ను శాఖ ఆరా తీస్తోంది. ఈ క్రమంలో ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు బిన్నీ బన్సల్, సచిన్ బన్సల్‌లకు ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. వాల్‌మార్ట్ ఒప్పందానికి సంబంధించి ఆదాయ వివరాలను వెల్లడించాల్సిందిగా కోరింది. అలాగే వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ ఒప్పందంలో భాగంగా చేతులు మారిన నగదు వివరాలు అందించాలని కోరింది. నికర లాభం, పన్ను చెల్లింపులకు సంబంధించిన వివరాలను కూడా ఐటీ శాఖ కోరినట్టు సమాచారం.వీరితోపాటు సంస్థలోని 35మంది వాటాదారులకు కూడా నోటీసులు జారీ చేసింది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం భారతీయులైన సచిన్,బిన్నీ బన్సల్ ద్వయం 20శాతం మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే వాటా అమ్మకం, పన్ను చెల్లింపులకు సంబంధించి ఐటీ శాఖ నుంచి కొన్ని నెలల క్రితమే నోటీసులు అందాయనీ, అయితే ఆ నోటీసులకు సంబంధించి మేము అప్పుడే వివరణ ఇచ్చామని కో ఫౌండర్ బిన్నీ బన్సల్ తెలిపారు. కాగా అంతర్జాతీయ ఈ కామర్స్ దిగ్గజం వాల్‌మార్ట్, దేశీయ దిగ్గజం ఫ్లిప్‌కార్టులో మేజర్ (77శాతం) వాటాను కొనుగోలు చేసింది. సెప్టెంబర్‌లో ప్రకటించిన ఈ డీల్ విలువు దాదాపు రూ.13750కోట్లు (16 బిలియన్ డార్లు). ఒప్పందంలో భాగంగా ఇప్పటికే సుమారు రూ.7439కోట్లు వాల్‌మార్ట్ చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను వెల్లడించాల్సిందిగా ఐటీ నోటీసులు జారీ అయ్యాయి. ఇది ఇలా ఉంటే ఈ డీల్ ముగిసిన అనంతరం ఫౌండర్లలో ఒకరైన సచిన్ బన్సల్ ఫ్లిప్‌కార్ట్‌లో తన 5-6శాతం వాటాను అమ్ముకొని సంస్థకు గుడ్ బై చెప్పారు. మరో ఫౌండర్ బిన్సీ బన్సల్ లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఈ నెలలో ఫ్లిప్‌కార్ట్ సీఈవో పదవికి రాజీనామా చేశారు. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో అతిపెద్ద వాటాదారుడుగా కొనసాగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఫ్లిప్‌కార్ట్ బిన్నీ రాజీనామా!!
న్యూఢిల్లీ: ‘తీవ్రమైన వ్యక్తిగత దుష్ప్రవర్తన’ ఆరోపణల కారణంగా దేశీ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ మంగళవారం గ్రూప్ సీఈవో పదవి నుంచి తప్పుకున్నారు. ఫ్లిప్‌కార్ట్‌ను ఇటీవలే కొనుగోలు చేసిన వాల్‌మార్ట్ మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడించింది. ఆరోపణలపై ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి స్వతంత్రంగా విచారణ జరిపామని, కానీ ఫిర్యాదుదారు ఆరోపణలను ధ్రువీకరించడానికి తగిన ఆధారాలు లభించలేదని పేర్కొంది. అయినప్పటికీ విచారణ అనంతరం బన్సల్ వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారని, సదరు ఆరోపణల మీద బిన్నీ స్పందించిన తీరులో పారదర్శకత లోపించడం కారణంగా ఆయన రాజీనామాను ఆమోదించామని వాల్‌మార్ట్ వివరించింది. ‘‘ఫిర్యాదు చేసిన వ్యక్తి ఆరోపణలపై క్షుణ్నంగా విచారణ చేశాం. బిన్నీకి వ్యతిరేకంగా చేసిన ఆరోపణలను బలపరిచే ఆధారాలేవీ కనిపించలేదు. కానీ ఆ వ్యవహారాన్ని సరిగ్గా అంచనా వేయడంలో బిన్నీ విఫలం కావడం, ఆయన స్పందించిన తీరులో పారదర్శకత లోపించడం వంటి అంశాలు బయటపడ్డాయి. దీంతో ఆయన రాజీనామాను ఆమోదించాం‘ అని వాల్‌మార్ట్ పేర్కొంది. తక్షణమే ఇది అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. ‘వ్యక్తిగత దుష్ప్రవర్తన ఆరోపణలు‘ అంటూ ప్రకటనలో పేర్కొన్నప్పటికీ, ఏమిటా ఆరోపణలన్నది మాత్రం వాల్‌మార్ట్ నిర్దిష్టంగా వివరించలేదు. అయితే ఈ ఆరోపణలు జూలైలో వచ్చాయని... వెంటనే వాల్‌మార్ట్ ఒక న్యాయవాద సంస్థతో వీటిపై విచారణ ఆరంభించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిర్యాదిదారు కొన్నాళ్ల క్రితం ఫ్లిప్‌కార్ట్‌లో బిన్నీతో కలిసి పనిచేశారని, ప్రస్తుతం ఆమె తన సొంత వెంచర్ నిర్వహించుకుంటున్నారని వివరించాయి. కానీ, వీటిని ధ్రువీకరించుకునేందుకు తగిన ఆధారాలు లభించలేదు. మరోవైపు, తనపై వచ్చిన ఆరోపణలను బిన్నీ బన్సల్ ఖండించారు. ఇకపైనా సంస్థలో వాటాదారుగా, బోర్డులో సభ్యుడిగా కొనసాగుతానని పేర్కొన్నారు. మరో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మాజీ ఉద్యోగులైన సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ కలిసి 2007లో ఫ్లిప్‌కార్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మేలో ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ 16 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసింది. ఈ డీల్‌లో భాగంగా సచిన్ బన్సల్ తన మొత్తం 5.5% వాటాను విక్రయించేసి తప్పుకోగా, బిన్నీ బన్సల్ మాత్రం కంపెనీలోనే కొనసాగుతున్నారు. కొత్త సారథి ఎంపిక వేగవంతం.. కొన్నాళ్లుగా బిన్నీ బాధ్యతలను బదలాయించే యోచనలో ఉన్నారని, వారసుల ఎంపికపై ఆయనతో కలిసి కొద్ది రోజులుగా తాము కూడా కసరత్తు చేస్తూనే ఉన్నామని వాల్‌మార్ట్ తెలిపింది. బిన్నీ నిష్క్రమణతో కొత్త సారథి నియామక ప్రక్రియ వేగవంతమైందని పేర్కొంది. మింత్రా, జబాంగ్‌తో కూడిన ఫ్లిప్‌కార్ట్ సీఈవోగా కళ్యాణ్ కృష్ణమూర్తి కొనసాగుతారని వివరించింది. అయితే, మింత్రా, జబాంగ్‌లు ప్రత్యేక సంస్థలుగానే కొనసాగుతాయని, వీటి సీఈవోగా అనంత్ నారాయణన్ కొనసాగుతారని వాల్‌మార్ట్ వివరించింది. కృష్ణమూర్తికి అనంత్ నారాయణన్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ పేమెంట్స్ విభాగం ’ఫోన్‌పే’ సీఈవోగా సమీర్ నిగమ్ కొనసాగుతారు. కృష్ణమూర్తి, నిగమ్ నేరుగా బోర్డుకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని వాల్‌మార్ట్ వివరించింది. పెట్టుబడుల ప్రక్రియ యథాప్రకారం.. దీర్ఘకాలంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని వాల్‌మార్ట్ తెలిపింది. భవిష్యత్‌లో ఐపీవోకి రావాలన్న ప్రస్తుత లీడర్షిప్ టీమ్‌కి పూర్తి మద్దతునిస్తామని పేర్కొంది. మరోవైపు, తాజా పరిణామాల నేపథ్యంలో సంస్థ భవిష్యత్‌పై ఉద్యోగులు ఆందోళన చెందరాదని సంస్థ సిబ్బందికి అంతర్గతంగా పంపిన ఈ–మెయిల్లో కృష్ణమూర్తి భరోసానిచ్చారు. ‘ఈ వార్తల కారణంగా కంపెనీ నిర్వహణ, లక్ష్యాల సాధనలో ఎలాంటి మార్పులు ఉండబోవు. ఫ్లిప్‌కార్ట్ ఇకపై కూడా కొంగొత్త టెక్నాలజీలు, నవకల్పనలు, సరఫరా వ్యవస్థలపై భారీగా పెట్టుబడులు కొనసాగిస్తుంది’ అని కృష్ణమూర్తి తెలిపారు. -
ఫ్లిప్‌కార్ట్‌కు బిన్నీ రాజీనామా..కొత్త సీఈవో
సాక్షి,ముంబై: ఫ్లిప్‌కార్ట్ కో ఫౌండర్, గ్రూప్ సీఈవో బిన్నీబన్సల్ (37)అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. తీవ్రమైన వ్యక్తిగత దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన పదవినుంచి తప్పుకున్నారు. బిన్నీ బన్సల్ రాజీనామాను ఆమోదించిన వాల్‌మార్ట్ ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. బిన్నీబన్సల్ వ్యక్తిగత ప్రవర్తన సరిగా లేదంటూ ఈ మధ్య కాలంలో ఆరోపణలతో వెల్లువెత్తాయి. కానీ ఈ ఆరోపణలను బిన్సీ బన్సాల్ తోసిపుచ్చారు. అయితే ఈ ఆరోపణలపై ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ సంయుక్తంగా స్వతంత్ర విచారణ చేపట్టాయి. బన్సల్ ఆరోపణలను తిరస్కరించినప్పటికీ తాము విచారణ చాలా జాగ్రత్తగా, నిశితంగా చేశామని వాల్‌మార్ట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అదే సమయంలో బిన్నీపై చెలరేగిన ఆరోపణలపై సాక్ష్యం కనుగొన లేకపోయినప్పటికీ, తీర్పులో ఇతర లోపాలను, ముఖ్యంగా బిన్నీ సమాధానంలో పారదర్శకత లేని కారణంగా బిన్నీ రాజీనామాను ఆమోదించామని తెలిపింది. అలాగే ఫ్లిప్‌కార్ట్ గ్రూపు సీఈవోగా కళ్యాణ్ కృష్ణమూర్తి కొనసాగుతారని ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక ప్లాట్‌ఫాంలుగా ఉన్న మింత్రా, జబాంగ్ను కలపనున్నామని తెలిపింది. కాగా అమెజాన్ మాజీ ఉద్యోగులైన సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రపంచ వ్యాపార దిగ్గజంవాల్మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో 77శాతం వాటాను కొనుగోలు చేయడంతో సచిన్ బన్సల్ తన పూర్తి వాటాను అమ్ముకొని వెళ్లిపోగా.. బిన్నీ బన్సల్ మాత్రం సీఈవోగా ఉన్నారు. ఈ-కామర్స్ మార్కెట్లో మెగాడీల్‌గా పేరొందిన ఈ ఒప్పందం జరిగిన కొన్ని నెలల వ్యవధిలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది. దీంతో ఫౌండర్లు ఇద్దరూ కంపెనీని వీడినట్టయింది. బిన్నీ బన్సల్ ప్రకటన మరో రెండు క్వార్టర్లు కంపెనీలో కొనసాగాలనుకున్నాను. కానీ వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే నాపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నాను. ఇది నాకు, కుటుంబానికి పరీక్ష సమయం. సీఈవోగా రాజీనామా చేసినా ఫ్లిప్‌కార్ట్‌లో వాటాదారుడిగా, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడిగా కొనసాగుతాను. -
నా భార్యను మాత్రం ఒప్పించలేకపోతున్నా : బిన్నీ
బెంగళూరు : దేశీయ ఈ- కామర్స్ దిగ్గజంగా పేరొందిన ఫ్లిప్‌కార్ట్, అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ సొంతమైన విషయం తెలిసిందే. 16 బిలియన్ డాలర్లతో కుదిరిన ఈ మెగా ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదం తెలిపింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన షేర్ల బదలాయింపు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలకు సంబంధించిన ప్రక్రియ మరికొన్ని రోజుల్లో పూర్తి కానుందని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బిన్నీ బన్సల్ తెలిపారు. ఎస్ఏపీ లాబ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న బిన్నీ బన్సల్ ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ స్థాపించడానికి దారి తీసిన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు. ఢిల్లీ ఐఐటీలో చదువుకున్న తాను మొదట సార్నాఫ్ కార్పొరేషన్‌లోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో పనిచేసినట్లు చెప్పారు. సాంకేతిక రంగంలో కొత్త ఒరవడి సృష్టించిన గూగుల్‌లో పని చేయాలని తనకెంతో ఆసక్తిగా ఉండేదని, అక్కడ ఉద్యోగం సంపాదించుకునేందుకు రెండుసార్లు అప్లై చేసినట్లు పేర్కొన్నారు. కానీ అక్కడి నుంచి బదులు రాకపోవడంతో తన పనిలో నిమగ్నమయ్యానని చెప్పుకొచ్చారు. తర్వాత అమెజాన్ కంపెనీలో తన సహోద్యోగి సచిన్ బన్సల్‌తో కలిసి పదకొండేళ్ల క్రితం ఫ్లిప్‌కార్ట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో డబుల్ బెడ్రూం అపార్ట్మెంట్లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం 8.3 లక్షల చదరపు అడుగులకు విస్తరించిందని పేర్కొన్నారు. నా భార్యను మాత్రం ఒప్పించలేకపోతున్నాను.. ఈ కామర్స్ రంగంలో పోటీ విపరీతంగా పెరిగిందన్న బిన్నీ.. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో వినియోగదారులను ఆకట్టుకోవాల్సి ఉంటుందన్నారు. వినియోగదారుల అభిరుచులకు తగినట్లుగా ఫీచర్లు డెవలప్ చేస్తేనే ఎక్కువ రోజులు మనుగడ సాధించగలమని పేర్కొన్నారు. కానీ అది చాలా సవాలుతో కూడుకున్న పని అంటూ.. ‘ నా భార్య దాదాపు ప్రతిరోజూ ఆన్లైన్ షాపింగ్ చేస్తుంది. బిగ్‌బాస్కెట్(ఆన్లైన్ కంపెనీ)లోనే కూరగాయలు కొంటుంది. అదేంటి మన కంపెనీ(ఫ్లిప్‌కార్ట్) నుంచే ఆర్డర్ చేయొచ్చుగా అంటే కొత్త ఫీచర్లు తీసుకురండి అప్పుడు చూద్దాం ఆలోచిస్తా అని చెప్పింది. కానీ ఇప్పటికీ కూడా ఆమెను ఒప్పించలేకపోతున్నా. అలా ఉంటుంది మన పరిస్థితి’ అంటూ ఆన్లైన్ కంపెనీల మధ్య ఉన్న పోటీ గురించి చెప్పుకొచ్చారు. కాగా వాల్‌మార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత సచిన్ బన్సాల్ కంపెనీ నుంచి వైదొలుగుతున్నప్పటికీ, బిన్నీ బన్సాల్ మాత్రం గ్రూప్ సీఈవోగా కంపెనీలోనే కొనసాగనున్న విషయం తెలిసిందే. -
మెగా డీల్‌తో సచిన్‌కు రూ.6700 కోట్లు
ముంబై : ఈ-కామర్స్ మార్కెట్ అతిపెద్ద డీల్ నేడు ఖరారైంది. గత ఎన్నో రోజులుగా చక్కర్లు కొడుతున్న ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ వశమైపోయింది. అమెరికాకు చెందినరిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్, దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను 16 బిలియన డాలర్లకు కొనుగోలు చేయబోతున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్లలో ఇదే అతిపెద్దది కావడం విశేషం. ఈ డీల్ నేపథ్యంలో 11ఏళ్ల క్రితం ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించిన వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్ బన్సాల్ కంపెనీ నుంచి పూర్తిగా వైదొలిగారు. ఫ్లిప్‌కార్ట్‌లో తనకున్న 5.5 శాతం వాటాను అమ్మేశారు. దీంతో సచిన్ బన్సాల్ రూ.6700 కోట్లకు పైగా(1బిలియన్ డాలర్లు) పొందారు. అంతేకాక సచిన్ మరోసారి తన బిలీనియర్ స్టేటస్‌ను పొందగలిగారు. మరో వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ కూడా ఈ డీల్‌లో భాగంగా ప్రస్తుతం తను కలిగి ఉన్న వాటాలో 10 శాతం అమ్మేశారు. దీంతో బిన్నీ బన్సాల్ వాటా 5.1 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గింది. ఈ వాటా విక్రయంతో బిన్నీ బన్సాల్ కూడా బిలీనియర్ అయ్యారు. సచిన్ బన్సాల్ కంపెనీ నుంచి వైదొలుగుతున్నప్పటికీ, బిన్నీ బన్సాల్ మాత్రం గ్రూప్ సీఈవోగా కంపెనీలోనే ఉండనున్నారు. మరోవైపు కంపెనీ బోర్డుపై వాల్‌మార్ట్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. టెన్సెంట్, టైగర్ గ్లోబల్ ఫ్లిప్‌కార్ట్ బోర్డులో కొనసాగనున్నాయని, కొత్త సభ్యులు వాల్‌మార్ట్ నుంచి వచ్చి చేరతారని తెలుస్తోంది. -
ఫ్లిప్‌కార్ట్ జర్నీ ఇలా సాగింది...
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజంగా పేరున్న ఫ్లిప్‌కార్ట్, అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ సొంతమైపోయింది. మెగా డీల్ ఖరారు కావడంతో, ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా వాల్‌మార్ట్ ఆధీనంలోకి వచ్చేసినట్టు సాఫ్ట్‌బ్యాంకు సీఈవో మయవోషి సన్ ధృవీకరించేశారు. ఈ నేపథ్యంలో భారత్ మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్ జర్నీ ఎలా సాగిందో ఓ సారి తెలుసుకుందాం.... ఫ్లిప్‌కార్ట్ ప్రారంభం.... వ్యాపారవేత్తలుగా ఎదగాలనే కలలతో ఉన్న ఓ ఇద్దరు ఐఐటీ-ఢిల్లీ గ్రాడ్యుయేట్లు, అమెజాన్‌లో తమకున్న ఉద్యోగాన్ని వదిలేసి ఫ్లిప్‌కార్ట్‌ను ప్రారంభించారు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం అంటే 2007లో బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో డబుల్ బెడ్రూం అపార్ట్మెంట్లో ఈ సంస్థకు అంకురార్పణ చేశారు. వారే బిన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్‌లు. వీరిద్దరూ ఛండీఘర్‌కు చెందిన వారు. చివరి పేరు ఒకటే అయిన తెలిసిన వాళ్లేమీ కాదు. ఐఐటీ-ఢిల్లీలో చదువుకునే రోజుల నుంచే పరిచయం. అమెజాన్‌లో చేరిన తర్వాత ఈ ఇద్దరూ స్నేహితులుగా మారారు. ఫ్లిప్‌కార్ట్ విస్తరణ.... 2008లో బెంగళూరుతో తమ తొలి ఆఫీసును ప్రారంభించి అనంతరం, ఢిల్లీ, ముంబైలలో కూడా 2009లో ఫ్లిప్‌కార్ట్ ఆఫీసులను ఏర్పాటు చేశారు. డబుల్-బెడ్రూం అపార్ట్మెంట్లో ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం 8.3 లక్షల చదరపు అడుగులకు విస్తరించింది. ఇటీవలే బెంగళూరులో ఓ పెద్ద క్యాంపస్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించింది. బెంగళూరులో ఉన్న ఆఫీసులన్నింటిన్నీ ఒకే గూటికి కిందకి అంటే ఆ క్యాంపస్‌లోకి తరలించింది. ఫ్లిప్‌కార్ట్ నాయకత్వ మార్పులు.... ప్రారంభించినప్పటి నుంచి తొమ్మిదేళ్ల పాటు ఫ్లిప్‌కార్ట్ సీఈవోగా సచిన్ బన్సాల్నే ఉన్నారు. 2016లో తొలిసారి సచిన్ బన్సాల్ నుంచి బిన్నీ బన్సాల్ సీఈవో పదవిని అలంకరించారు. అనంతరం సచిన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. గతేడాది ఫ్లిప్‌కార్ట్ సీఈవో పదవిని కల్యాణ్ కృష్ణమూర్తికి అప్పజెప్పారు. ప్రస్తుతం బిన్నీ బన్సాల్ మొత్తం గ్రూప్‌కు సీఈవోగా బాధ్యతలు చేపడుతున్నారు. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లో ఫ్యాషన్ పోర్టల్స్ మింత్రా జబాంగ్, పేమెంట్స్ యూనిట్ ఫోన్‌పే, లాజిస్టిక్ ఆర్మ్ ఈకార్ట్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ కొనుగోళ్లు... 2014లో ఫ్లిప్‌కార్ట్, ఆన్లైన్ అప్పీరల్ రిటైలర్ మింత్రాను 300 మిలియన్ డాలర్లకు తన సొంతం చేసుకుంది. అనంతరం జబాంగ్ను 2016లో 70 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఫోన్‌పేను 2016లోనే తన సొంతం చేసుకుంది. ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడిదారులు... వాల్‌మార్ట్ సొంతం చేసుకోక ముందు ఫ్లిప్‌కార్ట్ అతిపెద్ద పెట్టుబడిదారుగా జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంకు ఉండేది. 23-24 శాతం వాటాను కలిగి ఉంది. కానీ వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేయడంతో, పూర్తిగా ఆ కంపెనీ నుంచి సాఫ్ట్‌బ్యాంక్ వైదొలుగుతోంది. ఇంటర్నెట్ దిగ్గజం నాస్సర్స్ కూడా 13 శాతం వాటాను కలిగి ఉండేది. ఇది కూడా తన వాటాను విక్రయించేస్తోంది. ఇతర పెట్టుబడిదారులు న్యూయార్క్‌కు చెందిన హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్, అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అస్సెల్ పార్టనర్స్, చైనాకు చెందిన టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్, ఈబే ఇంక్, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్లు ఉన్నాయి. -
ఫ్లిప్‌కార్ట్‌కు సచిన్ బన్సాల్ గుడ్‌బై..?
బెంగళూరు : సచిన్ బన్సాల్ దాదాపు అందరికీ ఈ పేరు సుపరిచితమే. భారత్ ఈ-కామర్స్ దిగ్గజంగా ఎక్కువగా ప్రాచుర్యం పొందిన ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించిన వ్యవస్థాపకుల్లో ఈయన ఒకరు. అయితే ఈయన ఇప్పుడు తన సొంత సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు గుడ్‌బై చెబుతున్నారట. ఫ్లిప్‌కార్ట్‌ను, అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ తన సొంతం చేసుకుంటుండగా... ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సచిన్ బన్సాల్ వైదొలుగుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. దశాబ్దం క్రితం నుంచి అన్ని తానే అనుకుని ఫ్లిప్‌కార్ట్‌ను మార్కెట్లో అగ్రగామిగా ఉంచుతున్న సచిన్ బన్సాల్ కంపెనీని నుంచి బయటికి వచ్చేస్తుండటం గమనార్హంగా మారింది. ఫ్లిప్‌కార్ట్‌కు ఎక్కువ కాలం సీఈవోగా పనిచేసిన ఘనత కూడా ఇతనిదే. అయితే ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్‌కు అప్పగించిన తర్వాత మరో స్టార్టప్‌ను ఆయన ప్రారంభించబోతున్నట్టు, అంతేకాక పారిశ్రామిక వేత్తలకు మెంటర్‌గా నిర్వహించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాల్‌మార్ట్ డీల్‌తో, సచిన్ వైదొలిగే చర్చలు గత మూడు నాలుగు రోజుల నుంచి జరుగుతున్నాయని ఒకరు పేర్కొన్నారు. వచ్చే వారంలో ఫ్లిప్‌కార్ట్ నుంచి సచిన్ వెళ్లిపోయే నిర్ణయం వెలువడుతుందని, వాల్‌మార్టే బోర్డు ఆకృతులను నిర్ణయిస్తుందని మరో సంబంధిత వ్యక్తి పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్ నుంచి వెళ్లే సచిన్ బయటికి వెళ్లే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓగా ఉన్న బిన్నీ బన్సాల్, ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తిలను రోజువారీ కార్యకలాపాలను చూసుకోవాలనుకుంటున్నట్టు వాల్‌మార్ట్ చెప్పింది. ప్రస్తుతం 10 మంది సభ్యులున్న ఫ్లిప్‌కార్ట్ బోర్డులో సచిన్, బిన్నీ బన్సాల్‌లు కూడా సభ్యులే. కల్యాణ్ బోర్డులో సభ్యుడు కాదు. అయితే ఈ విషయంపై మాత్రం స్పందించడానికి సచిన్ బన్సాల్ నిరాకరించారు. వాల్‌మార్ట్ డీల్‌లో భాగంగా బిన్నీ బన్సాల్ తనకున్న షేర్లలో పదోవంతు అమ్మేస్తున్నారు. సచిన్ బన్సాల్ ఎంత విక్రయిస్తున్నారో ఇంకా తెలియరాలేదు. ఒకవేళ ఈ డీల్ కుదిరితే సచిన్ బన్సాల్ ఫ్లిప్‌కార్ట్‌లో 5.5 శాతం స్టేక్‌ను కలిగి ఉండనున్నారు. మరోవైపు ఆశ్చర్యకరంగా వాల్‌మార్ట్ డీల్‌కు బ్రేక్ వేసేందుకు ఫ్లిప్‌కార్ట్‌ను కొనేందుకు అమెజాన్ కూడా భారీ ఆఫర్‌ను ప్రకటిస్తోంది. అయితే అమెజాన్‌కు అమ్మేందుకు సంసిద్ధంగా లేని ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ టాప్ మేనేజ్మెంట్ మార్పులు పెద్ద కొత్త విషయమేమీ కాదని, కానీ వ్యవస్థాపకుల్లో ఒకరు వైదొలగడం కీలక పరిణామమే అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అమెజాన్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లైన బన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్‌లు కలిసి 2007లో ఈ కంపెనీని ప్రారంభించారు. 2016 జనవరి వరకు ఫ్లిప్‌కార్ట్ సీఈవోగా సచిన్ బన్సాల్నే ఉన్నారు. -
కొత్త వ్యాపారాల్లో ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడులు
కంపెనీ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ బెంగళూరు: ఇటీవలే సమకూర్చుకున్న నిధులను ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థలు, ఫోన్‌పే వంటి కొత్త వ్యాపార విభాగాల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ తెలిపారు. ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ విభాగంలో అవకాశాలు పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు. ‘ఇటీవలే టెన్సెంట్, మైక్రోసాఫ్ట్, ఈబే నుంచి భారీ స్థాయిలో నిధులు సమీకరించాం. వీటిని కొత్త వ్యాపారాలు.. ముఖ్యంగా ఫోన్‌పే, ఫిన్‌టెక్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తాం‘ అని ఆయన పేర్కొన్నారు. ఫోన్‌పే లాంటి ప్లాట్‌ఫాంల ద్వారా నగదు బదిలీ లావాదేవీలు గణనీయంగా జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ విభాగంలో వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని బన్సల్ చెప్పారు. అలాగే నిత్యావసరాలు, ఫర్నిచర్, ప్రైవేట్ లేబుల్స్ మొదలైన కొత్త వ్యాపార విభాగాల్లో కూడా భారీగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన వివరించారు. ఈబేతో భాగస్వామ్యంపై స్పందిస్తూ.. దేశీ విక్రేతలకు అంతర్జాతీయ వేదిక కల్పించేందుకు ఇది ఉపయోగపడగలదని బన్సల్ చెప్పారు. దీనితో లక్షల మంది భారతీయ వ్యాపారస్తులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయంగా విక్రయించుకోగలరని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌ను నాస్డాక్లో లిస్ట్ చేస్తారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యాల మీద నుంచి దృష్టి మరల్చుకునే యోచనేదీ లేదన్నారు. -
ఫ్లిప్‌కార్ట్ సంచలన నిర్ణయం!
బిన్నీ బన్సల్ ఔట్.. కొత్త సీఈవో నియామకం బెంగళూరు: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫ్లిప్‌కార్ట్ సహ స్థాపకుడు బిన్నీ బన్సల్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా తప్పించింది. ఆయన స్థానంలో టైగర్ గ్లోబల్ మాజీ అధికారి కల్యాణ్ కృష్ణమూర్తిని కొత్తగా నియమించింది. అదే సమయంలో బిన్నీ బన్సల్‌కు గ్రూప్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఒక పదవి కట్టబెట్టింది. దేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ మార్కెట్‌గా, దేశీయ మోస్ట్ వాల్యుబుల్ స్టార్టప్‌గా విశేషమైన పేరుప్రఖ్యాతలు ఉన్న ఫ్లిప్‌కార్ట్‌లో ఇది రెండో అత్యున్నత పదవి మార్పు కావడం విశేషం. కంపెనీని సమర్థంగా నడుపడంలో సహ స్థాపకులు తడబడుతున్న నేపథ్యంలో వారిని కీలక పదవుల నుంచి తప్పించడం గమనార్హం. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ సహా స్థాపకుడు సచిన్ బన్సల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవిలో కొనసాగిస్తుండగా.. తాజాగా బిన్నీ బన్సల్‌ను గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవికి మార్చారు. కంపెనీ కీలక పదవుల్లో తాజాగా జరిగిన మార్పులు కార్పొరేట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తే చర్య ఏమీ కాదని, గత నెలరోజులుగా ఫ్లిప్‌కార్ట్ మేనేజ్మెంట్లో మార్పుల గురించి ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి కంపెనీ వర్గాలు అంటున్నాయి. అయితే, తాజా మార్పులతో ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధిక పెట్టుబడులు కలిగిన టైగర్ గ్లోబల్ కంపెనీకి, సంస్థ గాడ్ ఫాదర్‌గా పేరొందిన లీ ఫిక్సెల్‌కు మేనేజ్మెంట్ స్థాయిలో పూర్తిస్థాయిలో నియంత్రణ దక్కినట్టు అయింది. భారతీయ కీలక ఈ-కామర్స్ కంపెనీ బోర్డు రూమ్‌లో ఈ కంపెనీలు నిర్ణయాత్మక స్థితికి చేరుకోవడం గమనార్హం. -
ఫ్లిప్‌కార్ట్‌కు మరో షాక్!
-
ఫ్లిప్‌కార్ట్‌కు మరో షాక్!
మరో ముఖ్య అధికారి ఔట్ కొనసాగుతున్న మేధో వలస కీలకమైన పండుగల సీజన్లో దేశంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ వెబ్సైట్ అయిన ఫ్లిప్‌కార్ట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ నుంచి ఉన్నతస్థాయి మేధో అధికారుల వలస కొనసాగుతున్నది. ఈ ఏడాది చివరినాటికి సంస్థ ప్రధాన ఆర్థిక అధికారి (సీఎఫ్‌వో) సంజయ్ బవేజా ఫ్లిప్‌కార్ట్‌ను వీడి వెళ్లనున్నారు. ఆయన రాజీనామా విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. కీలకమైన పండుగల సీజన్ ఉండటం, ఈ నేపథ్యంలో అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ నుంచి బిలియన్ డాలర్ల (రూ. 6600 కోట్ల) పెట్టుబడులు రాబట్టేందుకు ఫ్లిప్‌కార్ట్ ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. టాటా కమ్యూనికేషన్ సంస్థను వీడి 2014 సెప్టెంబర్‌లో బవేజా ఫ్లిప్‌కార్ట్‌లో చేరారు. రాబోయే డిసెంబర్ 31 ఆయన సంస్థలో పనిచేసే చివరిరోజని, ఆయన స్థానంలో కొత్త సీఎఫ్‌వోను నియమించే ప్రయత్నాలు మొదలయ్యాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఇటీవలికాలంలో ఫ్లిప్‌కార్ట్ నుంచి కీలకమైన ముఖ్య అధికారులు వెళ్లిపోవడం గమనార్హం. సంస్థ కామర్స్, అడ్వర్టైజింగ్ చీఫ్‌గా ఉన్న ముఖేష్ బన్సల్ ఇప్పటికే రాజీనామా చేశారు. ఆయన బాటలోనే చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నగోరి కూడా నడిచారు. అయితే, నగోరి క్రీడారంగంలో సొంత వెంచర్‌ను స్థాపించేందుకు ఫ్లిప్‌కార్ట్ కు రాజీనామా చేయగా.. ఆయన సంస్థలో ఫ్లిప్‌కార్ట్ సహా స్థాపకులైన సచిన్, బిన్నీ బన్సల్ పెట్టుబడులు పెట్టడం గమనార్హం. ఇక, ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పునిత్ సోనీ, వైస్ ప్రెసిడెంట్ మనీష్ మహేశ్వరీ గత ఏప్రిల్‌లో సంస్థకు రాజీనామా చేసి.. తమ దారి తాము చూసుకున్నారు. -
ఆ సీఈవో రూ.32 కోట్ల సౌధానికి యజమాని
బెంగళూరు: బిగ్గెస్ట్ ఆన్ లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్ సీఈవో బిన్నీబన్సల్ (32) టెక్ సిటీలోని విలాసవంతమైన ఏరియాలో ఓ బంగ్లాను కొనుగోలు చేశారు. దాదాపు రూ.32కోట్లు (5మిలియన్ డాలర్లు) ఖరీదు చేసే బెంగళూరులోని కోరమంగళ ప్రాంతలో ఓ విశాలమైన సౌధాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఇల్లు దాదాపు 10,000 చదరపు అడుగుల వైశాల్యంలో ఉంది. 32 సం.రాల వయసులో 32 కోట్ల రూపాయిల కలల సౌధానికి అధిపతిగా అవతరించాడు ఫ్లిప్ కార్ట్ బాస్. ఇటీవల బెంగళూరులో జరిగిన అతిపెద్ద గృహ కొనుగోలు డీల్స్‌లో ఇదీ ఒకటని అంచనా. తొమ్మిదేళ్ల క్రితం ఫ్లిప్‌కార్ట్‌ను ప్రారంభించిన ప్రదేశానికి ఇది సమీపంలోనే ఉండడం విశేషం. అన్నట్టు ఫ్లిప్‌కార్ట్ మరో సహవ్యవస్థాపకుడైన సచిన్ బన్సాల్ దీనికి పొరుగునే కొన్నేళ్ల క్రితం ఓ ఇల్లు కొనుగోలు చేశారు. అప్పట్లో ఆయన ఫ్లిప్‌కార్ట్‌లోని కొన్ని షేర్లను విక్రయించి వచ్చిన మొత్తంతో ఇక్కడ ఇల్లు కొన్నారు. ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని, క్రిస్ గోపాల కృష్ణన్, డాక్టర్ దేవిశెట్టి, రాజీవ్ చంద్రశేఖర్ తదితరులు నివసించే ఏరియాకి దగ్గరలోనే బన్సాల్ , ఆయన భార్య త్రిష కూడా చేరారు. కాగా బన్సాల్ రెండు ప్రైవేటు బ్యాంకుల్లో కొంత మొత్తం అప్పు తీసుకొని మరీ ఈ ఇంటిని సొంతం చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఇక్బాల్ కుటుంబంనుంచి దీన్ని కొనుగోలు చేశారు. దాదాపు కొన్ని వారాల క్రితమే రిజిష్ట్రేషన్ పూర్తయింది. అయితే దీనిపై స్పందించడానికి బిన్నీ బన్సల్ నిరాకరించారు. -
గతవారం బిజినెస్
నియామకాలు మకాలు ⇒ఫ్లిప్‌కార్ట్ సీఈవోగా బిన్నీ బన్సల్ వ్యవహరించనున్నారు. ఇప్పటిదాకా ఆ స్థానంలో ఉన్న మరో వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ ఇకపై సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారు. బిన్నీ ఇప్పటిదాకా సీవోవోగా ఉన్నారు. ⇒వాణిజ్య నియంత్రణ సంస్థ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చైర్మన్‌గా దేవేందర్ కుమార్ సిక్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. ⇒ఉక్కు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగా, ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్న భారతీ ఎస్ సిహగ్ తాజాగా ప్రభుత్వ రంగ అతిపెద్ద ఐరన్ ఓర్ కంపెనీ ఎన్ఎండీసీ సీఎండీగా అదనపు బాధ్యతలు చేపట్టారు. ⇒క్యాప్‌జెమిని భారత్ కార్యకలాపాల సీఈవోగా శ్రీనివాస్ కందుల నియమితులయ్యారు. రిలయన్స్ సిమెంట్‌పై బిర్లా గ్రూప్ కన్ను రిలయన్స్ ఇన్ఫ్రాలో భాగమైన రిలయన్స్ సిమెంటును కొనుగోలు చేసేందుకు పోటీపడుతున్న మూడు కంపెనీల్లో ఎంపీ బిర్లా గ్రూప్ సంస్థ బిర్లా కార్ప్ కూడా ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మిగతా రెండింటిలో ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలైన బ్లాక్‌స్టోన్, బేరింగ్ ఉన్నట్లు వివరించాయి. వీటితో రిలయన్స్ ఇన్ఫ్రా చర్చలు జరుపుతున్నట్లు తెలిపాయి. సిమెంటు విక్రయం డీల్ దాదాపు రూ. 5,000 కోట్లు ఉండొచ్చని అంచనా. మలేసియాలో ఓయో రూమ్స్ మలేసియాలో కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓయో రూమ్స్ సంస్థ వ్యవస్థాపక సీఈవో రితేష్ అగర్వాల్ తెలిపారు. మొబైల్స్, ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా ఉన్న మార్కెట్లలో ఒకటైనందున మలేసియాను ముందుగా ఎంచుకున్నట్లు వివరించారు. ఓయో రూమ్స్ ప్రస్తుతం దేశీయంగా 160 నగరాల్లో సర్వీసులు అందిస్తోంది. తగ్గిన పారిశ్రామికోత్పత్తి దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి తీవ్ర నిరాశను మిగుల్చుతోంది. 2015 నవంబర్ నెలలో అసలు ఉత్పత్తిలో వృద్ధి లేకపోగా (2014 నవంబర్‌తో పోల్చిచూస్తే...) -3.2 శాతం క్షీణత నమోదయ్యింది. 2014 నవంబర్‌లో ఉత్పత్తి వృద్ధి 5.2 శాతంగా నమోదయ్యింది. ఇంతటి పేలవ పనితీరు గడచిన నాలుగేళ్లలో ఇదే తొలిసారి. అప్పట్లో అంటే అక్టోబర్ 2011లో ఐఐపీ క్షీణతలో -4.7 శాతంగా నమోదయ్యింది. కాగా ఆర్థిక సంవత్సరం నవంబర్ వరకూ గడచిన ఎనిమిది నెలల కాలంలో ఉత్పత్తి వృద్ధి రేటు 2.5 శాతం నుంచి 3.9 శాతానికి పెరిగింది. పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్లో 5.61 శాతానికి పెరిగింది. అంటే 2014 డిసెంబర్‌తో పోల్చితే 2015 డిసెంబర్లో రిటైల్ ధరల బాస్కెట్ మొత్తం 5.61 శాతం ఎగసిందన్నమాట. గడచిన ఐదు నెలలుగా ఈ రేటు పెరుగుతూ వస్తోంది. కూరగాయలు, పప్పు దినుసుల ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం. జనవరి 2016 నాటికి ఆర్బీఐ రిటైల్ ద్రవ్యోల్బణం వార్షిక సగటు లక్ష్యం 6 శాతం. డాట్‌కు ఆర్‌కామ్ 5 వేల కోట్లు చెల్లింపు! పదహారు సర్కిళ్లలో 800 మెగాహెట్జ్ స్పెక్ట్రంను ట్రేడింగ్, షేరింగ్ మొదలైన వాటికి ఉపయోగించుకునేందుకు వీలుగా షరతులు సడలించడం కోసం రూ. 5,600 కోట్లు చెల్లించాలని రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు (ఆర్‌కామ్) టెలికం విభాగం (డాట్) సూచించింది. అలాగే వన్ టైమ్ స్పెక్ట్రం చార్జ్ (ఓటీఎస్‌సీ) కింద రూ. 1,569 కోట్లకు బ్యాంకు గ్యారంటీని నెలరోజుల్లోగా సమర్పించాలని పేర్కొంది. రిలయన్స్ జియోతో స్పెక్ట్రం ట్రేడింగ్, షేరింగ్ ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు ఆర్‌కామ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చమురు ధరలు మరింత కిందకు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరింతగా తగ్గుతున్నాయి. మంగళవారం ఫ్యూచర్స్ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర దాదాపు 3.5 శాతం వరకూ పతనమై 30.43 డాలర్ల ధరను తాకింది. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ చమురు ధరలు 20 శాతం మేర పడిపోయాయి. గత ఏడాది జూన్ నుంచి చూస్తే ఈ ధరలు 70 శాతం వరకూ తగ్గాయి. సరఫరాలు అధికంగా ఉండడం, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం, ఆ దేశ స్టాక్ మార్కెట్ క్షీణించడం, డాలర్ బలపడుతుండడం వంటి కారణాల వల్ల చమురు ధరలు తగ్గుతున్నాయి. భారత మార్కెట్‌పై బైదు కన్ను చైనాకు చెందిన ఇంటర్నెట్ సెర్చి దిగ్గజం బైదు.. తాజాగా భారత్‌లోకి ప్రవేశించడంపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రెస్టారెంట్ సర్వీసుల సంస్థ జొమాటో, ఆన్లైన్ సినిమా టికెట్ల సేవల సంస్థ బుక్‌మైషో, ఫుడ్ రిటైలర్ బిగ్ బాస్కెట్ మొదలైన వాటిల్లో వ్యూహాత్మక వాటాలు కొనుగోలు చేయాలని యోచిస్తోంది. చిన్న పట్టణాల్లో స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఆక ర్షించే దిశగా తెలుగు, హిందీ సహా పలు భారతీయ భాషల్లో యాప్‌లతో తమ మొబోమార్కెట్ యాప్ స్టోర్‌ను విస్తరించాలని భావిస్తోంది. భారీ రిఫైనరీ ఏర్పాటుకు సన్నాహాలు దేశంలోనే అత్యంత భారీ రిఫైనరీని పశ్చిమ తీరప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ఇందుకోసం చేతులు కలుపుతున్నాయి. ఇండియన్ ఆయిల్ డెరైక్టర్ (రిఫైన రీస్) సంజీవ్ సింగ్ ఈ విషయం తెలిపారు. ఈ రిఫైనరీ వార్షిక సామర్థ్యం 15 మిలియన్ టన్నుల పైగానే ఉంటుందని ఆయన వివరించారు. తెలంగాణలో 2 ఐటీ సెజ్‌లకు ఆమోదం తెలంగాణ రాష్ట్రంలో రెండు ఐటీ సెజ్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. తెలంగాణలో ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలం(సెజ్)ళ్ల ఏర్పాటు కోసం వేల్యూ ల్యాబ్స్ ఇన్ఫ్రా ఎల్ఎల్పీ, జీఏఆర్ కార్పొరేషన్ సంస్థల ప్రతిపాదనలకు సెజ్ వ్యవహారాలను చూసే బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్ పచ్చజెండా ఊపింది. దీంతో పాటు 13 మంది సెజ్ డెవలపర్లకు వారి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మరింత సమయం ఇచ్చింది. ఫిబ్రవరి 29న కేంద్ర బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 29న పార్లమెంటులో 2016-17 బడ్జెట్‌ను సమర్పించనుంది. ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న రెండు మూడేళ్లకూ మార్గనిర్దేశం చేసేలా ఈ బడ్జెట్ ఉంటుందని కూడా ఆయన వెల్లడించారు. భారత్-కొరియా వ్యాపార సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. టోకున ఆహార ధరల భగ్గు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 14వ నెలలోనూ అసలు పెరక్కపోగా... క్షీణత (మైనస్)లో కొనసాగింది. డిసెంబర్లో -0.73 శాతంగా నమోదయ్యింది. అంటే 2014 డిసెంబర్‌తో పోల్చితే 2015 డిసెంబర్లో టోకు బాస్కెట్ రేటు మొత్తంగా అసలు పెరక్కపోగా... క్షీణించిదన్నమాట. నవంబర్‌లో ఈ రేటు -1.99 శాతం. అయితే మొత్తం టోకు ధరల సూచీలో ఒక భాగమైన ఆహార ధరల విభాగం మాత్రం సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న వైనాన్ని గణాంకాలు ప్రతిబింబించాయి. రెండేళ్ల కనిష్టానికి రూపాయి దేశీ కరెన్సీ క్షీణత కొనసాగుతోంది. శుక్రవారం డాలరుతో రూపాయి మారకం విలువ 67.60 వద్ద ముగిసింది. ఇది రెండేళ్లకుపైగా కనిష్టస్థాయి కావడం గమనార్హం. 2013, సెప్టెంబర్ 3 తర్వాత(67.63) మళ్లీ ఈ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి. రూపాయి చరిత్రాత్మక కనిష్టస్థాయి 68.85 (2013, ఆగస్టు 28న). ఆధార్‌తో ఏటా రూ.6,700 కోట్లు ఆదా ఆధార్ వల్ల భారత ప్రభుత్వానికి ఏటా వంద కోట్ల డాలర్లు (రూ.6,700 కోట్లు)ఆదా అవుతాయని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ఆధార్ డిజిటల్ గుర్తింపు కార్డ్ వల్ల అవినీతి తొలగి ఈ స్థాయిలో ప్రభుత్వానికి సొమ్ములు ఆదా అవుతాయని ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త కౌశిక్ బసు చెప్పారు.