ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ (ఫైల్ ఫోటో)
బెంగళూరు : సచిన్ బన్సాల్ దాదాపు అందరికీ ఈ పేరు సుపరిచితమే. భారత్ ఈ-కామర్స్ దిగ్గజంగా ఎక్కువగా ప్రాచుర్యం పొందిన ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించిన వ్యవస్థాపకుల్లో ఈయన ఒకరు. అయితే ఈయన ఇప్పుడు తన సొంత సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు గుడ్‌బై చెబుతున్నారట. ఫ్లిప్‌కార్ట్‌ను, అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ తన సొంతం చేసుకుంటుండగా... ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సచిన్ బన్సాల్ వైదొలుగుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. దశాబ్దం క్రితం నుంచి అన్ని తానే అనుకుని ఫ్లిప్‌కార్ట్‌ను మార్కెట్‌లో అగ్రగామిగా ఉంచుతున్న సచిన్ బన్సాల్ కంపెనీని నుంచి బయటికి వచ్చేస్తుండటం గమనార్హంగా మారింది. ఫ్లిప్‌కార్ట్‌కు ఎక్కువ కాలం సీఈవోగా పనిచేసిన ఘనత కూడా ఇతనిదే. అయితే ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్‌కు అప్పగించిన తర్వాత మరో స్టార్టప్‌ను ఆయన ప్రారంభించబోతున్నట్టు, అంతేకాక పారిశ్రామిక వేత్తలకు మెంటర్‌గా నిర్వహించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
వాల్‌మార్ట్ డీల్‌తో, సచిన్ వైదొలిగే చర్చలు గత మూడు నాలుగు రోజుల నుంచి జరుగుతున్నాయని ఒకరు పేర్కొన్నారు. వచ్చే వారంలో ఫ్లిప్‌కార్ట్ నుంచి సచిన్ వెళ్లిపోయే నిర్ణయం వెలువడుతుందని, వాల్‌మార్టే బోర్డు ఆకృతులను నిర్ణయిస్తుందని మరో సంబంధిత వ్యక్తి పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్ నుంచి వెళ్లే సచిన్ బయటికి వెళ్లే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓగా ఉన్న బిన్నీ బన్సాల్, ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తిలను రోజువారీ కార్యకలాపాలను చూసుకోవాలనుకుంటున్నట్టు వాల్‌మార్ట్ చెప్పింది. ప్రస్తుతం 10 మంది సభ్యులున్న ఫ్లిప్‌కార్ట్ బోర్డులో సచిన్, బిన్నీ బన్సాల్‌లు కూడా సభ్యులే. కల్యాణ్ బోర్డులో సభ్యుడు కాదు. అయితే ఈ విషయంపై మాత్రం స్పందించడానికి సచిన్ బన్సాల్ నిరాకరించారు.
వాల్‌మార్ట్ డీల్‌లో భాగంగా బిన్నీ బన్సాల్ తనకున్న షేర్లలో పదోవంతు అమ్మేస్తున్నారు. సచిన్ బన్సాల్ ఎంత విక్రయిస్తున్నారో ఇంకా తెలియరాలేదు. ఒకవేళ ఈ డీల్ కుదిరితే సచిన్ బన్సాల్ ఫ్లిప్‌కార్ట్‌లో 5.5 శాతం స్టేక్‌ను కలిగి ఉండనున్నారు. మరోవైపు ఆశ్చర్యకరంగా వాల్‌మార్ట్ డీల్‌కు బ్రేక్ వేసేందుకు ఫ్లిప్‌కార్ట్‌ను కొనేందుకు అమెజాన్ కూడా భారీ ఆఫర్‌ను ప్రకటిస్తోంది. అయితే అమెజాన్‌కు అమ్మేందుకు సంసిద్ధంగా లేని ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ టాప్ మేనేజ్‌మెంట్ మార్పులు పెద్ద కొత్త విషయమేమీ కాదని, కానీ వ్యవస్థాపకుల్లో ఒకరు వైదొలగడం కీలక పరిణామమే అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అమెజాన్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లైన బన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్‌లు కలిసి 2007లో ఈ కంపెనీని ప్రారంభించారు. 2016 జనవరి వరకు ఫ్లిప్‌కార్ట్ సీఈవోగా సచిన్ బన్సాల్‌నే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment