ఫ్లిప్‌కార్ట్ సంచలన నిర్ణయం!
- బిన్నీ బన్సల్ ఔట్.. కొత్త సీఈవో నియామకం
బెంగళూరు: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫ్లిప్‌కార్ట్ సహ స్థాపకుడు బిన్నీ బన్సల్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా తప్పించింది. ఆయన స్థానంలో టైగర్ గ్లోబల్ మాజీ అధికారి కల్యాణ్ కృష్ణమూర్తిని కొత్తగా నియమించింది. అదే సమయంలో బిన్నీ బన్సల్‌కు గ్రూప్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఒక పదవి కట్టబెట్టింది.
దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ మార్కెట్‌గా, దేశీయ మోస్ట్ వాల్యుబుల్ స్టార్టప్‌గా విశేషమైన పేరుప్రఖ్యాతలు ఉన్న ఫ్లిప్‌కార్ట్‌లో ఇది రెండో అత్యున్నత పదవి మార్పు కావడం విశేషం. కంపెనీని సమర్థంగా నడుపడంలో సహ స్థాపకులు తడబడుతున్న నేపథ్యంలో వారిని కీలక పదవుల నుంచి తప్పించడం గమనార్హం. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ సహా స్థాపకుడు సచిన్ బన్సల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవిలో కొనసాగిస్తుండగా.. తాజాగా బిన్నీ బన్సల్‌ను గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవికి మార్చారు. కంపెనీ కీలక పదవుల్లో తాజాగా జరిగిన మార్పులు కార్పొరేట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తే చర్య ఏమీ కాదని, గత నెలరోజులుగా ఫ్లిప్‌కార్ట్ మేనేజ్‌మెంట్‌లో మార్పుల గురించి ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి కంపెనీ వర్గాలు అంటున్నాయి.
అయితే, తాజా మార్పులతో ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధిక పెట్టుబడులు కలిగిన టైగర్ గ్లోబల్ కంపెనీకి, సంస్థ గాడ్ ఫాదర్‌గా పేరొందిన లీ ఫిక్సెల్‌కు మేనేజ్‌మెంట్ స్థాయిలో పూర్తిస్థాయిలో నియంత్రణ దక్కినట్టు అయింది. భారతీయ కీలక ఈ-కామర్స్ కంపెనీ బోర్డు రూమ్‌లో ఈ కంపెనీలు నిర్ణయాత్మక స్థితికి చేరుకోవడం గమనార్హం.