Kalyan Krishnamurthy
-
రిటెన్షన్ బోనస్‌తో సీఈవో లగ్జరీ విల్లా: ఇపుడు ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్లిప్‌కార్ట్ తన ఉద్యోగులు దాదాపు 700 మిలియన్ డాలర్లు (రూ. 5780 కోట్లు) స్టాక్ ఆప్షన్స్‌ను ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ హెచ్ఆర్ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు, ఫ్యాషన్ విభాగం మింత్రా అర్హులైన న ఉద్యోగులకు ఇమెయిల్స్ పంపింది. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని సంస్థ వేలాది ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ బైబ్యాక్ అందింనుంది. కంపెనీ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి. నివేదికల ప్రకారం, ఈ (జూలై) నెలాఖరులోగా ఈ నగదును సదరు ఉద్యగులకు అందించనున్నారు. అర్హత ఉన్న ప్రస్తుత, మాజీ ఉద్యోగులు ఫ్లిప్‌కార్ట్‌లోని ప్రతి ESOP యూనిట్‌కు రూ. 3615 అందు కుంటారు. ఫ్లిప్‌కార్ట్‌లో 15వేల మంది ఉద్యోగులు ఉండగా ఇందులో మింత్రాలో దాదాపు 3500 మంది ఉద్యోగులున్నారని సమాచారం. (దేశంలో రిచెస్ట్ గాయని ఎవరో తెలుసా?ఏఆర్ రెహమాన్‌తో పోలిస్తే?) వాల్‌మార్ట్ 2018లో కంపెనీలో మెజార్టీ వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 2017లో ఫ్లిప్‌కార్ట్ సీఈఓ అయిన కళ్యాణ్ కృష్ణమూర్తి ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ డీల్‌లో కృష్ణమూర్తి కీలక పాత్ర పోషించారట. అందుకే 16 బిలియన్ డాలర్ల ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ డీల్ తరువాత అతనికి 2 మిలియన్ డాలర్ల రిటెన్షన్ బోనస్ ఆఫర్ చేసినట్టు బిజినెస్ టుడే నివేదించింది. ఈ నేపథ్యంలోనే గతేడాది ఈస్ట్ బెంగళూరులో కృష్ణమూర్తి ఓ విల్లా కొన్నాడు. విల్లా 4921 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లా ఖరీదు రూ.8 కోట్లు. ఇందులో నాలుగు బెడ్రూమ్లు, ఐదు బాత్రూమ్లు, డ్యూయల్ కిచెన్లు, పూజ, లివింగ్, డైనింగ్, ఆఫీస్, మీడియా, యుటిలిటీ రూమ్‌లు వ్యక్తిగత గ్యారేజీ కూడా ఉంది. మరోవైపు కంపెనీ త్వరలోనే ఐపీఓకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. (ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్) -
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ టాప్
దొండపర్తి/బీచ్‌రోడ్డు (విశాఖ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో స్థిరంగా కొనసాగుతోందని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి చెప్పారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ‘ఈ–కామర్స్ ద్వారా దేశంలో అంతరాన్ని తగ్గించడం’ అనే అంశంపై గురువారం విశాఖ కేంద్రంగా వర్చువల్ విధానంలో వార్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కృష్ణమూర్తి మాట్లాడుతూ పెట్టుబడుల ఆకర్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విధానాలు బాగున్నాయని, వ్యాపారాభివృద్ధికి బాటలు వేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు ప్రవేశపెట్టిన సింగిల్ విండో క్లియరెన్సుల విధానం అద్భుతంగా ఉందని కొనియాడారు. ప్రధానంగా ప్రభుత్వం రైతులకు మద్దతుగా నిలుస్తుండటం శుభ పరిణామంగా అభివర్ణించారు. రైతులు, చిన్న వ్యాపారులు, చేతి వృత్తిదారులతో పాటు ఎంఎస్ఎంఈలకు ఇక్కడి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని అన్నారు. చిన్న వ్యాపారుల శ్రేయస్సుకు ఈ కామర్స్ కీలకమన్నారు. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ ఏపీలో 3 వేలకుపైగా విక్రేతలను కలిగి ఉందని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ స్టోర్లు, 2.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 పెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను కలిగి ఉందని వివరించారు. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో రెండు మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు: మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రాష్ట్రంలో రెండు మల్టీమోడల్ లాజిసిక్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. సీఐఐ ఆంధ్రప్రదేశ్ వార్షిక సమావేశంలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. రాష్ట్రంలో మారిటైమ్ రంగం అభివృద్ధికి ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్డు మార్గాలకు కనెక్టివిటీ కల్పిస్తూ మెగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. తద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి అవకాశం కల్పిస్తున్నామన్నారు. కొత్త లాజిసిక్ పాలసీలు తీసుకువచ్చేందుకు తగిన సలహాలివ్వాలని పారిశ్రామికవేత్తలను కోరారు. సమావేశంలో సీఐఐ మాజీ చైర్మన్ రాకేష్, తిరుపతిరాజు, చందనచౌదరి తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లపై నివేదికను తిరుపతిరాజు, చందన చౌదరి తదితరులు విడుదల చేశారు. సీఐఐ ఏపీ చైర్మన్‌గా నీరజ్.. సీఐఐ ఆంధ్రప్రదేశ్ నూతన చైర్మన్‌గా సర్డ మెటల్స్ అండ్ అల్లాయిస్ సంస్థ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ సర్డ, వైస్ చైర్మన్‌గా సుజయ్ బయోటెక్ ఎండీ లక్ష్మీప్రసాద్‌ను ఎన్నుకున్నారు. వీరిని సభ్యులు, పలువురు పారిశ్రామికవేత్తలు అభినందించారు. -
విజనరీ సీఎం.. వైఎస్ జగన్: ఫ్లిప్‌కార్ట్ సీఈవో
సాక్షి, అమరావతి: రైతులు, ఎంఎస్ఎంఈలు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజన్ తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి చెప్పారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌లో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. గురువారం సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం బెంగళూరు చేరుకున్న కళ్యాణ్ కృష్ణమూర్తి వీడియో సందేశాన్ని విడుదల చేశారు. రైతులు, ఎంఎస్ఎంఈలకు సీఎం జగన్ అనేక అవకాశాలు కల్పిస్తున్నారని, వీటితో పాటు నైపుణ్యాభివృద్ధిపైనా దృష్టి పెట్టడాన్ని ఆయన అభినందించారు. చదవండి: 10th Class Exams: టెన్త్‌లో ఈ ఏడాదీ 7 పేపర్లే.. రానున్న కాలంలో ఈ మూడు అంశాలు రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ గ్రూపు సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్, ఈకార్ట్, క్లియర్ ట్రిప్ సంస్థల విస్తరణ ద్వారా రాష్ట్రంలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇదే విధంగా భవిష్యత్‌లోనూ పెట్టుబడులు కొనసాగిస్తామన్నారు. రాష్ట్రంలోని హస్తకళలు, చేతివృత్తులవారిని ప్రోత్సహించే విధంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. -
ఏపీలో ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడులు
సాక్షి, అమరావతి: ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. విశాఖపట్నంలో మరిన్ని పెట్టుబడులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి కళాశాలల్లో భాగస్వామి కావడానికి ఆసక్తి వ్యక్తం చేసింది. ఫ్లిప్‌కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి నేతృత్వంలో సంస్థ బృందం గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమైంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రైతుల ఉత్పత్తులకు మంచి ధర అందించడం, నైపుణ్యాభివృద్ధిపై విస్తృత చర్చలు జరిగాయి. రైతుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధికి చేపట్టిన విప్లవాత్మక చర్యలను సీఎం జగన్ íఫ్లిప్‌కార్ట్ట్ బృందానికి వివరించారు. రైతులకు ఉత్తమ టెక్నాలజీ అందిద్దాం: సీఎం జగన్ రాష్ట్ర వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యగా ఆర్బీకేలను ప్రారంభించాం. విత్తనం అందించడం దగ్గర నుంచి పంటల కొనుగోలు వరకూ ఆర్బీకేలు నిరంతరం రైతన్నలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. రైతులు పండించిన పంటలకు మంచి ధరలు లభించేలా ఫ్లిప్‌కార్ట్ కూడా ముందుకురావాలి. రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసి వినియోగదారులకు అందించడంలో పాలు పంచుకోవాలి. రైతులకు మంచి టెక్నాలజీని అందుబాటులోకి తేవడంలో సహాయపడాలి. ఎప్పటికప్పుడు ధరల పర్యవేక్షణకు సీఎం యాప్ తీసుకొచ్చాం. దీన్ని మరింత మెరుగుపరిచేందుకు తగిన తోడ్పాటు అందించాలి. విశాఖ మంచి వేదిక ఐటీ, ఇ–కామర్స్ పెట్టుబడులకు విశాఖపట్నం మంచి వేదిక. ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని ఫ్లిప్‌కార్ట్‌ను కోరుతున్నా. నైపుణ్యాలను పెంపొందించేందుకు విశాఖలో ఏర్పాటు చేస్తున్న హై ఎండ్ స్కిల్ యూనివర్సిటీలో పాలు పంచుకోవాలి. రాష్ట్రం నుంచి మత్స్య ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటిని మరింత పెంచేందుకు ఫ్లిప్‌కార్ట్ సహకారం అందించాలి. జగన్ దార్శనిక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై ఫ్లిప్‌కార్ట్ సీఈవో కృష్ణమూర్తి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి అని ప్రశంసించారు. తాము విస్తృతం చేస్తున్న సరుకుల వ్యాపారం ద్వారా రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇది ఉభయులకు ప్రయోజనమని, మంచి టెక్నాలజీని అందించేలా తమ వంతు కృషి చేస్తామన్నారు. విశాఖలో ఇప్పటికే తమ సంస్థ వ్యాపారాలు చురుగ్గా సాగుతున్నాయని, అక్కడ మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటామని, వచ్చే ఏడాది నుంచే ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పారు. వాల్‌మార్ట్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో మత్స్యఉత్పత్తుల కొనుగోళ్లు చేస్తున్నామని, దీన్ని మరింత పెంచుతామన్నారు. సీఎం దూరదృష్టి ఎంతో బాగుందని, రైతుల పంటలకు మంచి ధరలు లభించేలా అంకితభావంతో నిర్ణయాలు తీసుకుంటున్నారని అభినందించారు. సమావేశంలో ఫ్లిప్‌కార్ట్ సీసీఏవో రజనీష్ కుమార్, సీఎం కార్యదర్శి ఆరోఖ్యరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రి సీతారామన్‌తో ఫ్లిప్‌కార్ట్ సీఈవో భేటీ
ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఇరువురి భేటీకి సంబంధించిన ఫొటోను ట్విట్టర్‌పై కేంద్ర ఆర్థిక శాఖ పోస్ట్ చేసింది. సమావేశం వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు.. విక్రయదారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలతో(ఎంఎస్ఎంఈ) ఫ్లిప్‌కార్ట్‌కు ఉన్న భాగస్వామ్యం, హస్తకళాకారులకు తాము అందిస్తున్న మద్దతు గురించి కృష్ణమూర్తి వివరించారు. అలాగే, డిజిటల్ వేదికల ద్వారా మరింత మంది కొనుగోలుదారులకు చేరువ అవుతున్న తీరును కూడా తెలియజేశారు. ఫ్లిప్‌కార్ట్ వేదికపై మూడు లక్షలకు పైగా విక్రేతలు నమోదై ఉన్నారు. ఇందులో 60% మంది ద్వితీయ శ్రేణి, అంతకంటే చిన్న పట్టణాలకు చెందినవారే ఉం టారు. హోల్‌సేల్ వ్యాపారం ద్వారా 16లక్షల కిరాణా స్టోర్లతోనూ ఫ్లిప్‌కార్ట్‌కు భాగస్వామ్యం కొనసాగుతోంది. ఫ్లిప్‌కార్ట్‌కు 35 కోట్ల యూజర్లున్నారు. -
ఈ-కామర్స్‌పై ఫ్లిప్‌కార్ట్ గ్రూపు సీఈఓ అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే మూడు నాలుగేళ్లలో దేశీయ ఈ-కామర్స్ పరిశ్రమ 90-100 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. కరోనాకు ముందు ఈ-కామర్స్ వృద్ధి రేటు 26-27 శాతంగా ఉందని, కరోనా తర్వాత ఇది 30 శాతానికి పెరిగిందని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. చైనా ఆన్లైన్ మార్కెట్లో ఈ-కామర్స్ వాటా 25 శాతంగా ఉంటే.. ఇండియాలో 3.5 శాతంగా ఉందని, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో 10-25 శాతమని చెప్పారు. (పసిడి డిమాండ్‌కు కరోనా కాటు) రాబోయే కొన్నేళ్లలో దేశీయ ఈ-కామర్స్ మార్కెట్ ఆధునిక రిటైల్ మార్కెట్ల కంటే చాలా పెద్దగా ఉంటుందన్నారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో వినియోగదారులు కొనుగోలు ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వచ్చాయని.. ఇది ఈ-కామర్స్ రంగానికి వృద్ధి చోదకాలుగా మారుతాయని పేర్కొన్నారు. కరోనాతో వ్యాపారాలు ఎంత ప్రభావితం అయ్యాయో.. అంతే స్థాయిలో కొత్త అవకాశాలు కూడా తెరుచుకున్నాయని ఆయన పేర్కొన్నారు. కిరాణా వ్యవస్థలో అన్ని పరిమాణాల వ్యాపారాలకు ఆధునిక రిటైల్ మంచి బిజినెస్ అవకాశమని, స్మాల్ బిజినెస్, చేతివృత్తులు వంటివి డిజిటల్ రిటైల్‌తో మంచి చాన్స్‌లుంటాయని.. ఈ దిశలో ఫ్లిప్‌కార్ట్ కృషి చేస్తోందని ఆయన వివరించారు. 2019లో దేశ జనాభాలో 10 శాతం మంది ఆన్లైన్ కొనుగోళ్లు జరిపారని కృష్ణమూర్తి తెలిపారు. లాక్డౌన్ సమయంలో చాలా మంది ఇంట్లోనే ఉండాల్సి రావటంతో కిరాణా, నిత్యావసరాల కొనుగోళ్ల కోసం ఆన్లైన్ మీద ఆధారపడ్డారని.. లాక్డౌన్ తర్వాత కూడా ఇదే ధోరణిని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో వంద పిన్‌కోడ్స్‌లో ఈ-కామర్స్ ఆర్డర్లు వస్తున్నాయని.. 60 శాతానికి పైగా లావాదేవీలు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే జరుగుతున్నాయని చెప్పారు. -
ఫ్లిప్‌కార్ట్ డైరెక్టర్ల బోర్డులో మార్పులు
న్యూఢిల్లీ: వాల్‌మార్ట్‌కు చెందిన ఆన్లైన్ మార్కెట్ ప్లేస్, ఫ్లిప్‌కార్ట్ తన డైరెక్టర్ల బోర్డ్‌ను పునర్వ్యస్థీకరించింది. ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి, హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్, సీఈఓ, కేకీ మిస్త్రీలకు డైరెక్టర్ల బోర్డ్‌లో స్థానం కల్పించింది. నలుగురిని డైరెక్టర్ల బోర్డ్ నుంచి తప్పించింది. త్వరలో ఈ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానుండటంతో ఈ మార్పులు జరిగాయని సమాచారం. డైరెక్టర్ల బోర్డ్ పునర్వ్యస్థీకరణను ఫ్లిప్‌కార్ట్ ధ్రువీకరించింది. ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్లో ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కృష్ణమూర్తి డైరెక్టర్ల మార్పులు, చేర్పుల వివరాలను వెల్లడించారు. నలుగురు డైరెక్టర్లు–రాజేశ్ మాగౌ, రోహిత్ భగత్, స్టూవార్ట్ వాల్టన్, డిర్క్‌వాన్ డెన్ బెరేలను డైరెక్టర్లుగా తొలగిస్తున్నామని పేర్కొన్నారు. వీరి స్థానంలో కళ్యాణ్ కృష్ణమూర్తి, కేకీ మిస్త్రీలతో పాటు వాల్‌మార్ట్ నుంచి సురేశ్ కుమార్, లే హాప్కిన్స్ను డైరెక్టర్లుగా నియమిస్తున్నట్లు వివరించారు. ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను వాల్‌మార్ట్ కంపెనీ 1,600 కోట్ల డాలర్లకు 2018లో కొనుగోలు చేసింది. ఈ వాటా కొనుగోలుకు ముందు ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ సంస్థ 120 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. -
మాది దీర్ఘకాలిక ఒప్పందం.. దీటుగా నిలబడతాం!
సాక్షి, ముంబై : వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్ నుంచి వైదొలగుతుందా? అంటూ మార్కెట్లో వర్గాల్లో తీవ్ర సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈ వార్తలను ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తీవ్రంగా ఖండించారు. ప్రతికూల ప్రభావం కారణంగా ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ భారతీయ మార్కెట్లలో పెట్టుబడులు ఉపసంహరించుకోవచ్చన్న మోర్గాన్ స్టాన్లీ నివేదికను ఆయన తిరస్కరించారు. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ సీఈవో ఉద్యోగులకు అంతర్గత ఈ మెయిల్ సమాచారాన్ని అందించారు. మోర్గాన్ స్టాన్లీ రిపోర్టు అవాస్తమని భవిష్యత్తులో తేలిపోతుందని, భారతదేశంలో ఈ కామర్స్ వ్యాపారానికి వాల్‌మార్ట్ కట్టుబడి వుందని స్పష్టం చేశారు. భారతీయ ఈ కామర్స్ బిజినెస్‌లో ఫ్లిప్‌కార్ట్ ముందు వరుసలో నిలుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వాల్‌మార్ట్ ఒప్పందం దీర్గకాలిక దృష్టితో చేసుకున్నదని, ఈ నేపథ్యంలో స్వల్పకాలిక అడ్డంకులు సంస్థను ప్రభావితం చేయలేవని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కామర్స్ మార్కెట్లో అతిపెద్ద డీల్ గా నిలిచిన వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్డ్ ఒప్పందానికి సంబంధించిన మోర్గాన్ స్టాన్లీ సంచలన అంచనాలను వెల్లడించింది. దేశీయంగా ఈ-కామర్స్ కంపెనీలకు సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నూతన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో వాల్‌మార్ట్ ఈ డీల్ నుంచి వైదొలగనుంచి పేర్కొంది. 2017లో చైనాలో అమెజాన్‌కు దాపురించిన పరిస్థితే దేశీయంగా వాల్‌మార్ట్‌కు రానుందని నివేదించింది. అంతేకాదు ఫ్లిప్‌కార్ట్ నష్టాలు 20నుంచి 25శాతం దాకా పెరగొచ్చనీ, దీంతో వాల్‌మార్ట్ పలాయనం చిత్తగించక తప్పదని వ్యాఖ్యానించింది. కాగా ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్.. 16 బిలియన్ డాలర్లతో 77శాతం వాటాను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
ఫ్లిప్ కార్ట్ మెగా యాప్: అన్నింటికీ ఇది ఒక్కటే
బెంగళూరు : దేశీయ ఈ-కామర్స్ రంగంలో దూసుకెళ్తోన్న ఫ్లిప్ కార్ట్, మరో సరికొత్త సర్వీసులను ప్రారంభించబోతుంది. అన్నీ తానై అయ్యేందుకు ' ఎవ్రీథింగ్ యాప్' పేరుతో ఓ మెగా యాప్ ను లాంచ్ చేయబోతుంది. ఈ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, టూర్స్ ప్లానింగ్ ఇంకా నిత్యవాడుకలో అవసరమైన అన్ని వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ యాప్ లాంచ్ చేయడం కోసం ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ సన్నాహాలు ప్రారంభించేసింది. ఫుడ్, క్యాబ్, ట్రావెల్ అగ్రిగేటర్లను భాగస్వాములుగా చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఎలాగైనా ఈ ఏడాది చివరి కల్లా దీన్ని తీసుకురావాలని కంపెనీ ప్లాన్స్ వేస్తోంది. ఈ మెగా యాప్ తో వినియోగదారుల విధేయతను మరింత పెంచుకోనుంది. దీన్ని ఫ్లిప్ కార్ట్ యాప్ డిజైన్, ఇంజనీరింగ్ టీమ్ ఎగ్జిక్యూట్ చేస్తోంది. కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ కల్యాణ్ క్రిష్ణమూర్తి ప్రారంభించిన ఈ వ్యూహం, కంపెనీ ప్రకటనల వ్యాపారాలను మరింత ముందుకు తీసుకెళ్తోందని ఫ్లిప్ కార్ట్ భావిస్తోంది. విచాట్ మోడల్ ను తాము అనుసరిస్తున్నామని, ఈ యాప్ ను వాడుకుంటూ క్యాబ్, ఫుడ్ ను ఆర్డర్ చేసుకోవడంతో పాటు, ట్రావెల్ ను ప్లాన్ చేసుకోవచ్చని మోనిటైజేషన్ సీనియర్ డైరెక్టర్ ప్రకాశ్ సికారియా చెప్పారు. అచ్చం గూగుల్ ఇటీవల లాంచ్ చేసిన ఆరియో మాదిరి వినియోగదారుల సేవలనే ఫ్లిప్ కార్ట్ వాల్యు యాడెడ్ సర్వీసులు అందజేయనున్నాయి. రోజువారీ వస్తువుల కోసం, ఎలాంటి భాగస్వామ్యం లేకుండా ఫ్లిప్ కార్ట్ తన సొంత కార్యకలాపాలనే కలిగి ఉండనుంది. కంపెనీ త్వరలోనే గ్రోసరీ, ఫాస్ట్-మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ను ఆఫర్ చేయనుంది. ఈ వ్యూహం ఫలించడం కోసం ఈ యాప్ పై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్లను కూడా ఆఫర్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న స్నాప్ డీల్ కూడా గతేడాది ఇదే మాదిరి ప్లాన్స్ వేసిందని తెలిసింది. ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జుమోటో, టాక్సీ అగ్రిగేటర్ ఉబర్, ట్రావెల్ స్టార్టప్ క్లియర్ ట్రిప్ వంటి వాటితో భాగస్వామ్యానికి ప్రయత్నించింది. ప్రస్తుతం డిజిటల్ వ్యాలెట్ సేవల్లో అగ్రగామిగా ఉన్న పేటీఎం కూడా ఇదేమాదిరి సర్వీసులు అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్ కనుక ఈ మెగా యాప్ ను తీసుకొస్తే, పేటీఎంకు ఇది గట్టి పోటీని ఇవ్వనుంది. -
ఫ్లిప్ కార్ట్ సీఈవో ఛాన్స్ కొట్టేసిన లక్కీ గర్ల్!
ముంబై : దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తన పదవి నుంచి తప్పుకున్నారు. బిగ్ 10 సెలబ్రేషన్స్ లో భాగంగా కంపెనీ ప్రకటించిన ఒక్క రోజు సీఈవోగా పద్మిని పగడాల నియామకం కావడంతో ఆయన తన పదవి నుంచి వైదొలిగారు. ఫ్లిప్ కార్ట్ తన ఉద్యోగుల కోసం ఈ లక్కీ ఛాన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 10ఏళ్ల సెలబ్రేషన్స్ లో భాగంగా కంపెనీ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి స్థానంలో ఒక్క రోజు కోసం కొత్త సీఈవోను నియమించనున్నట్టు ప్రకటించింది. ఈ లక్కీ ఛాన్స్ కోసం పోటీపడాలని ఉద్యోగులకు పిలుపునిచ్చింది. కంపెనీ ప్రకటించిన ఈ లక్కీ ఛాన్స్ ను ఈ లక్కీ గర్ల్ పద్మిని పగడాల దక్కించుకుంది. ఒక్క రోజు సీఈవోగా నియామకం అయింది. కల్యాణ్ స్థానంలో ఒక్క రోజు సీఈవోగా పద్మిని పగడాలా అవకాశం దక్కించుకున్నారని, సీఈవో నిర్వహించబోయే అన్ని కీలక మీటింగ్ లను తానే నిర్వహిస్తారని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఒక్క రోజు సీఈవోలో భాగంగా ఫ్లిప్ కార్ట్ ను పద్మిని పగడాలా చేతిలో పెట్టడం చాలా ఆనందంగా ఉందని కల్యాణ్ కృష్ణమూర్తి ట్వీట్ చేశారు. ఆసక్తికరంగా ఒక్క రోజు సీఈవో కోసం ఉద్యోగులు దరఖాస్తులను నింపి కంపెనీ యాజమాన్యానికి పంపించాల్సి ఉంది. దీనిలో ఎందుకు వారు గుడ్ సీఈవో కావాలనుకుంటున్నారో తెలుపుతూ ఈ ఫామ్ నింపాలి. ఫ్లిప్ కార్ట్ సూచన మేరకు ఒక్క రోజు సీఈవో కోసం దరఖాస్తు చేసుకున్న వారందరిలో పద్మిని పగడాలను ఈ ఛాన్స్ వరించింది. ఒక్క రోజు సీఈవోగా పనిచేసే వారు, ప్రస్తుత సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి లాగా అన్ని మీటింగ్ హాజరుకావాలని, నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఫ్లిప్ కార్ట్ తెలిపిన సంగతి తెలిసిందే. -
ఫ్లిప్ కార్ట్ ఉద్యోగులకు లక్కీ ఛాన్స్
బెంగళూరు : ఒక్క రోజు సీఎం.. ఒక్క రోజు పోలీసు కమిషనర్ ఇలా చాలానే వినుంటాం మనం. ఈ-కామర్స్ రంగంలో దూసుకెళ్తున్న దేశీయ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సైతం తమ ఉద్యోగులకు ఈ లక్కీ ఛాన్స్ ను ప్రకటించింది. ఒక్క రోజు కోసం కంపెనీకి కొత్త సీఈవోను నియమించనున్నట్టు, ఉద్యోగులందరూ ఆ లక్కీ ఛాన్స్ కూడా పోటీపడాలని పేర్కొంది. 10వ వార్షికోత్సవంలో భాగంగా కంపెనీ ఒక్క రోజు సీఈవోను నియమించనున్నట్టు తెలిపింది.. ఆసక్తికరంగా దీనికోసం దరఖాస్తులను కూడా ఉద్యోగులకు పంపుతోంది. ఎందుకు వారు గుడ్ సీఈవో కావాలనుకుంటున్నారో తెలుపుతూ ఆ ఫామ్ ను నింపి మేనేజ్మెంట్కు పంపించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఒక్క రోజు సీఈవోగా పనిచేసే వారు, ప్రస్తుత సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి లాగా అన్ని మీటింగ్ హాజరుకావాలని, నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ''సీఈవోగా కల్యాణ్ అటెండ్ అయ్యే అన్ని మీటింగ్ లకు మీరు హాజరుకావాల్సి ఉంటుంది. కల్యాణ్ తరుఫున నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్గనైజేషన్ మొత్తానికీ ఈ-మెయిల్స్ ను పంపించాల్సి ఉంటుంది. రోజంతా కల్యాణ్ లాగా వ్యవహరించాలి'' అని పేర్కొంటూ ఉద్యోగులకు కంపెనీ ఓ ఈ-మెయిల్ ను పంపింది. ఇప్పటికే సీఈవోగా తమకు ఆసక్తి ఉందంటూ ఓ 150 మేర దరఖాస్తులు కంపెనీ మేనేజ్మెంట్ ముందుకు వచ్చి చేరాయట. టాప్ మేనేజ్మెంట్ టీమ్‌కు కిందస్థాయి ఉద్యోగులకు మధ్య మంచి సమన్వయం ఏర్పరచడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని కంపెనీ ఆశిస్తోంది. ఉద్యోగుల నుంచి వచ్చిన స్పందనలను పరిశీలించడానికి ఓ ప్యానల్ కూడా ఏర్పాటైంది. -
ఫ్లిప్‌కార్ట్ కు షాకిచ్చిన టాప్ ఎగ్జిక్యూటివ్స్
ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కు టాప్ లెవల్ ఎగ్జిక్యూటివ్ లు షాక్ ఇచ్చారు. ఫ్లిప్ కార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా కళ్యాణ్ కృష్ణమూర్తి నియామకం తరువాత ముగ్గురు ఉన్నత స్థాయి ఉద్యోగులు సంస్థను వీడారు. రెండు రోజుల క్రితం సీఈవో నియామకాన్ని ఇలా ప్రకటించారో లేదో అలా టాప్ లెవల్ ఎగ్జిక్యూటివ్ లు దేశంలోనే అతి పెద్ద కామర్స్ కు టాటా చెప్పేయడం మార్కెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఫ్లిప్‌కార్ట్‌లో చేరిన ఆరు నెలల్లోనే(గతేడాది జూన్) ప్రమోషన్ కొట్టేసిన కృష్ణమూర్తి ఆధ్వర్యంలో రానున్న కాలంలోమరికొంతమంది సీనియర్ టాప్ లెవల్ అధికారులు సంస్థ వీడటంగానీ, లేదా తన అనుయాయులను కృష్టమూర్తి నియమించడం గానీ జరగనుందని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇ- కార్ట్ అధిపతి సాయి కిరణ్ కృష్ణమూర్తి ;సీనియర్ వైస్ ప్రెసిడెంట్; సురోజిత్ చటర్జీ, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సమర్ దీప్ సుభాంద్ బుధవారం తమ పదవులకు రాజీనామా చేశారు. వీరు ముగ్గురు 2015 లో చేరారు. అయితే ఈ పరిణామాలపై స్పందించడానికి ఫ్లిప్ కార్ట్ ప్రతినిధి నిరాకరించారు. కాగా ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యంలో భారీ మార్పుల్లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ సీఈవోగా వ్యవహరిస్తున్న బిన్నీ బన్సల్.. గ్రూపు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పదొన్నతి పొందారు. డిజైన్ ఆర్గనైజేషన్ హెడ్‌గా వ్యవహరిస్తున్న కళ్యాణ్ కృష్ణమూర్తి.. ఫ్లిఫ్‌కార్ట్ సీఈవోగా నియమితులయ్యారు. సహ-వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్..యథాతథంగా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగనున్నారు. టెక్నాలజీ రంగంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా సంస్థను తీర్చిదిద్దడానికి యాజమాన్యంలో మార్పులు చేసినట్లు, నూతన నాయకత్వంలో కూడా మెరుగైన వృద్ధి సాధ్యమవుతుందని బిన్నీ ఒక ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఫ్లిప్‌కార్ట్ సంచలన నిర్ణయం!
బిన్నీ బన్సల్ ఔట్.. కొత్త సీఈవో నియామకం బెంగళూరు: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫ్లిప్‌కార్ట్ సహ స్థాపకుడు బిన్నీ బన్సల్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా తప్పించింది. ఆయన స్థానంలో టైగర్ గ్లోబల్ మాజీ అధికారి కల్యాణ్ కృష్ణమూర్తిని కొత్తగా నియమించింది. అదే సమయంలో బిన్నీ బన్సల్‌కు గ్రూప్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఒక పదవి కట్టబెట్టింది. దేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ మార్కెట్‌గా, దేశీయ మోస్ట్ వాల్యుబుల్ స్టార్టప్‌గా విశేషమైన పేరుప్రఖ్యాతలు ఉన్న ఫ్లిప్‌కార్ట్‌లో ఇది రెండో అత్యున్నత పదవి మార్పు కావడం విశేషం. కంపెనీని సమర్థంగా నడుపడంలో సహ స్థాపకులు తడబడుతున్న నేపథ్యంలో వారిని కీలక పదవుల నుంచి తప్పించడం గమనార్హం. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ సహా స్థాపకుడు సచిన్ బన్సల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవిలో కొనసాగిస్తుండగా.. తాజాగా బిన్నీ బన్సల్‌ను గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవికి మార్చారు. కంపెనీ కీలక పదవుల్లో తాజాగా జరిగిన మార్పులు కార్పొరేట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తే చర్య ఏమీ కాదని, గత నెలరోజులుగా ఫ్లిప్‌కార్ట్ మేనేజ్మెంట్లో మార్పుల గురించి ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి కంపెనీ వర్గాలు అంటున్నాయి. అయితే, తాజా మార్పులతో ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధిక పెట్టుబడులు కలిగిన టైగర్ గ్లోబల్ కంపెనీకి, సంస్థ గాడ్ ఫాదర్‌గా పేరొందిన లీ ఫిక్సెల్‌కు మేనేజ్మెంట్ స్థాయిలో పూర్తిస్థాయిలో నియంత్రణ దక్కినట్టు అయింది. భారతీయ కీలక ఈ-కామర్స్ కంపెనీ బోర్డు రూమ్‌లో ఈ కంపెనీలు నిర్ణయాత్మక స్థితికి చేరుకోవడం గమనార్హం.