ఫ్లిప్ కార్ట్ ఉద్యోగులకు లక్కీ ఛాన్స్
ఫ్లిప్ కార్ట్ ఉద్యోగులకు లక్కీ ఛాన్స్
Published Mon, Apr 24 2017 3:05 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
బెంగళూరు : ఒక్క రోజు సీఎం.. ఒక్క రోజు పోలీసు కమిషనర్ ఇలా చాలానే వినుంటాం మనం. ఈ-కామర్స్ రంగంలో దూసుకెళ్తున్న దేశీయ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సైతం తమ ఉద్యోగులకు ఈ లక్కీ ఛాన్స్ ను ప్రకటించింది. ఒక్క రోజు కోసం కంపెనీకి కొత్త సీఈవోను నియమించనున్నట్టు, ఉద్యోగులందరూ ఆ లక్కీ ఛాన్స్ కూడా పోటీపడాలని పేర్కొంది. 10వ వార్షికోత్సవంలో భాగంగా కంపెనీ ఒక్క రోజు సీఈవోను నియమించనున్నట్టు తెలిపింది.. ఆసక్తికరంగా దీనికోసం దరఖాస్తులను కూడా ఉద్యోగులకు పంపుతోంది. ఎందుకు వారు గుడ్ సీఈవో కావాలనుకుంటున్నారో తెలుపుతూ ఆ ఫామ్ ను నింపి మేనేజ్మెంట్కు పంపించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఒక్క రోజు సీఈవోగా పనిచేసే వారు, ప్రస్తుత సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి లాగా అన్ని మీటింగ్ హాజరుకావాలని, నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.
''సీఈవోగా కల్యాణ్ అటెండ్ అయ్యే అన్ని మీటింగ్ లకు మీరు హాజరుకావాల్సి ఉంటుంది. కల్యాణ్ తరుఫున నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్గనైజేషన్ మొత్తానికీ ఈ-మెయిల్స్ ను పంపించాల్సి ఉంటుంది. రోజంతా కల్యాణ్ లాగా వ్యవహరించాలి'' అని పేర్కొంటూ ఉద్యోగులకు కంపెనీ ఓ ఈ-మెయిల్ ను పంపింది. ఇప్పటికే సీఈవోగా తమకు ఆసక్తి ఉందంటూ ఓ 150 మేర దరఖాస్తులు కంపెనీ మేనేజ్మెంట్ ముందుకు వచ్చి చేరాయట. టాప్ మేనేజ్మెంట్ టీమ్కు కిందస్థాయి ఉద్యోగులకు మధ్య మంచి సమన్వయం ఏర్పరచడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని కంపెనీ ఆశిస్తోంది. ఉద్యోగుల నుంచి వచ్చిన స్పందనలను పరిశీలించడానికి ఓ ప్యానల్ కూడా ఏర్పాటైంది.
Advertisement