
సాక్షి, అమరావతి: రైతులు, ఎంఎస్‌ఎంఈలు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజన్ తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి చెప్పారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌లో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. గురువారం సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం బెంగళూరు చేరుకున్న కళ్యాణ్ కృష్ణమూర్తి వీడియో సందేశాన్ని విడుదల చేశారు. రైతులు, ఎంఎస్‌ఎంఈలకు సీఎం జగన్ అనేక అవకాశాలు కల్పిస్తున్నారని, వీటితో పాటు నైపుణ్యాభివృద్ధిపైనా దృష్టి పెట్టడాన్ని ఆయన అభినందించారు.
చదవండి: 10th Class Exams: టెన్త్‌లో ఈ ఏడాదీ 7 పేపర్లే..
రానున్న కాలంలో ఈ మూడు అంశాలు రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ గ్రూపు సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్, ఈకార్ట్, క్లియర్ ట్రిప్ సంస్థల విస్తరణ ద్వారా రాష్ట్రంలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇదే విధంగా భవిష్యత్‌లోనూ పెట్టుబడులు కొనసాగిస్తామన్నారు. రాష్ట్రంలోని హస్తకళలు, చేతివృత్తులవారిని ప్రోత్సహించే విధంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment