ఫ్లిప్కార్ట్ కు షాకిచ్చిన టాప్ ఎగ్జిక్యూటివ్స్
ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కు టాప్ లెవల్ ఎగ్జిక్యూటివ్ లు షాక్ ఇచ్చారు. ఫ్లిప్ కార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా కళ్యాణ్ కృష్ణమూర్తి నియామకం తరువాత ముగ్గురు ఉన్నత స్థాయి ఉద్యోగులు సంస్థను వీడారు. రెండు రోజుల క్రితం సీఈవో నియామకాన్ని ఇలా ప్రకటించారో లేదో అలా టాప్ లెవల్ ఎగ్జిక్యూటివ్ లు దేశంలోనే అతి పెద్ద కామర్స్ కు టాటా చెప్పేయడం మార్కెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఫ్లిప్‌కార్ట్‌లో చేరిన ఆరు నెలల్లోనే(గతేడాది జూన్) ప్రమోషన్ కొట్టేసిన కృష్ణమూర్తి ఆధ్వర్యంలో రానున్న కాలంలోమరికొంతమంది సీనియర్ టాప్ లెవల్ అధికారులు సంస్థ వీడటంగానీ, లేదా తన అనుయాయులను కృష్టమూర్తి నియమించడం గానీ జరగనుందని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇ- కార్ట్ అధిపతి సాయి కిరణ్ కృష్ణమూర్తి ;సీనియర్ వైస్ ప్రెసిడెంట్; సురోజిత్ చటర్జీ, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సమర్ దీప్ సుభాంద్ బుధవారం తమ పదవులకు రాజీనామా చేశారు. వీరు ముగ్గురు 2015 లో చేరారు. అయితే ఈ పరిణామాలపై స్పందించడానికి ఫ్లిప్ కార్ట్ ప్రతినిధి నిరాకరించారు.
కాగా ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యంలో భారీ మార్పుల్లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ సీఈవోగా వ్యవహరిస్తున్న బిన్నీ బన్సల్.. గ్రూపు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పదొన్నతి పొందారు. డిజైన్ ఆర్గనైజేషన్ హెడ్‌గా వ్యవహరిస్తున్న కళ్యాణ్ కృష్ణమూర్తి.. ఫ్లిఫ్‌కార్ట్ సీఈవోగా నియమితులయ్యారు. సహ-వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్..యథాతథంగా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగనున్నారు.
టెక్నాలజీ రంగంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా సంస్థను తీర్చిదిద్దడానికి యాజమాన్యంలో మార్పులు చేసినట్లు, నూతన నాయకత్వంలో కూడా మెరుగైన వృద్ధి సాధ్యమవుతుందని బిన్నీ ఒక ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే.