ఫ్లిప్‌కార్ట్‌కు మరో షాక్!
మరో ముఖ్య అధికారి ఔట్
కొనసాగుతున్న మేధో వలస
కీలకమైన పండుగల సీజన్‌లో దేశంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ వెబ్‌సైట్ అయిన ఫ్లిప్‌కార్ట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ నుంచి ఉన్నతస్థాయి మేధో అధికారుల వలస కొనసాగుతున్నది. ఈ ఏడాది చివరినాటికి సంస్థ ప్రధాన ఆర్థిక అధికారి (సీఎఫ్‌వో) సంజయ్ బవేజా ఫ్లిప్‌కార్ట్‌ను వీడి వెళ్లనున్నారు. ఆయన రాజీనామా విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది.
కీలకమైన పండుగల సీజన్ ఉండటం, ఈ నేపథ్యంలో అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ నుంచి బిలియన్ డాలర్ల (రూ. 6600 కోట్ల) పెట్టుబడులు రాబట్టేందుకు ఫ్లిప్‌కార్ట్ ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. టాటా కమ్యూనికేషన్ సంస్థను వీడి 2014 సెప్టెంబర్‌లో బవేజా ఫ్లిప్‌కార్ట్‌లో చేరారు. రాబోయే డిసెంబర్ 31 ఆయన సంస్థలో పనిచేసే చివరిరోజని, ఆయన స్థానంలో కొత్త సీఎఫ్‌వోను నియమించే ప్రయత్నాలు మొదలయ్యాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
ఇటీవలికాలంలో ఫ్లిప్‌కార్ట్ నుంచి కీలకమైన ముఖ్య అధికారులు వెళ్లిపోవడం గమనార్హం. సంస్థ కామర్స్, అడ్వర్టైజింగ్ చీఫ్‌గా ఉన్న ముఖేష్ బన్సల్ ఇప్పటికే రాజీనామా చేశారు. ఆయన బాటలోనే చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నగోరి కూడా నడిచారు. అయితే, నగోరి క్రీడారంగంలో సొంత వెంచర్‌ను స్థాపించేందుకు ఫ్లిప్‌కార్ట్ కు రాజీనామా చేయగా.. ఆయన సంస్థలో ఫ్లిప్‌కార్ట్ సహా స్థాపకులైన సచిన్, బిన్నీ బన్సల్ పెట్టుబడులు పెట్టడం గమనార్హం. ఇక, ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పునిత్ సోనీ, వైస్ ప్రెసిడెంట్ మనీష్ మహేశ్వరీ గత ఏప్రిల్‌లో సంస్థకు రాజీనామా చేసి.. తమ దారి తాము చూసుకున్నారు.