ముంబై : ఈ-కామర్స్ మార్కెట్ అతిపెద్ద డీల్ నేడు ఖరారైంది. గత ఎన్నో రోజులుగా చక్కర్లు కొడుతున్న ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ వశమైపోయింది. అమెరికాకు చెందినరిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్, దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను 16 బిలియన డాలర్లకు కొనుగోలు చేయబోతున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్లలో ఇదే అతిపెద్దది కావడం విశేషం. ఈ డీల్ నేపథ్యంలో 11ఏళ్ల క్రితం ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించిన వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్ బన్సాల్ కంపెనీ నుంచి పూర్తిగా వైదొలిగారు. ఫ్లిప్‌కార్ట్‌లో తనకున్న 5.5 శాతం వాటాను అమ్మేశారు.
దీంతో సచిన్ బన్సాల్ రూ.6700 కోట్లకు పైగా(1బిలియన్ డాలర్లు) పొందారు. అంతేకాక సచిన్ మరోసారి తన బిలీనియర్ స్టేటస్‌ను పొందగలిగారు. మరో వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ కూడా ఈ డీల్‌లో భాగంగా ప్రస్తుతం తను కలిగి ఉన్న వాటాలో 10 శాతం అమ్మేశారు. దీంతో బిన్నీ బన్సాల్ వాటా 5.1 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గింది. ఈ వాటా విక్రయంతో బిన్నీ బన్సాల్ కూడా బిలీనియర్ అయ్యారు. సచిన్ బన్సాల్ కంపెనీ నుంచి వైదొలుగుతున్నప్పటికీ, బిన్నీ బన్సాల్ మాత్రం గ్రూప్ సీఈవోగా కంపెనీలోనే ఉండనున్నారు. మరోవైపు కంపెనీ బోర్డుపై వాల్‌మార్ట్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. టెన్సెంట్, టైగర్ గ్లోబల్ ఫ్లిప్‌కార్ట్ బోర్డులో కొనసాగనున్నాయని, కొత్త సభ్యులు వాల్‌మార్ట్ నుంచి వచ్చి చేరతారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment