నా భార్యను మాత్రం ఒప్పించలేకపోతున్నా : బిన్నీ | Binny Bansal Says Google Rejected Him 2 Times | Sakshi
Sakshi News home page

నా భార్యను మాత్రం ఒప్పించలేకపోతున్నా : బిన్నీ

Published Fri, Aug 10 2018 12:26 PM | Last Updated on Fri, Aug 10 2018 12:43 PM

Binny Bansal Says Google Rejected Him 2 Times - Sakshi

ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బిన్నీ బన్సాల్‌

బెంగళూరు : దేశీయ ఈ- కామర్స్‌ దిగ్గజంగా పేరొందిన ఫ్లిప్‌కార్ట్‌, అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ సొంతమైన విషయం తెలిసిందే. 16 బిలియన్‌ డాలర్లతో కుదిరిన ఈ మెగా ఒప్పందానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ఆమోదం తెలిపింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన షేర్ల బదలాయింపు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలకు సంబంధించిన ప్రక్రియ మరికొన్ని రోజుల్లో పూర్తి కానుందని ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బిన్నీ బన్సల్‌ తెలిపారు.

ఎస్‌ఏపీ లాబ్‌ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న బిన్నీ బన్సల్‌ ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ స్థాపించడానికి దారి తీసిన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు. ఢిల్లీ ఐఐటీలో చదువుకున్న తాను మొదట సార్నాఫ్‌ కార్పొరేషన్‌లోని రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో పనిచేసినట్లు చెప్పారు.

సాంకేతిక రంగంలో కొత్త ఒరవడి సృష్టించిన గూగుల్‌లో పని చేయాలని తనకెంతో ఆసక్తిగా ఉండేదని, అక్కడ ఉద్యోగం సంపాదించుకునేందుకు రెండుసార్లు అప్లై చేసినట్లు పేర్కొన్నారు. కానీ అక్కడి నుంచి బదులు రాకపోవడంతో తన పనిలో నిమగ్నమయ్యానని చెప్పుకొచ్చారు. తర్వాత అమెజాన్‌ కంపెనీలో తన సహోద్యోగి సచిన్‌ బన్సల్‌తో కలిసి పదకొండేళ్ల క్రితం ఫ్లిప్‌కార్ట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో డబుల్‌ బెడ్‌రూం అపార్ట్‌మెంట్‌లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం 8.3 లక్షల చదరపు అడుగులకు విస్తరించిందని పేర్కొన్నారు.

నా భార్యను మాత్రం ఒప్పించలేకపోతున్నాను..
ఈ కామర్స్‌ రంగంలో పోటీ విపరీతంగా పెరిగిందన్న బిన్నీ.. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో వినియోగదారులను ఆకట్టుకోవాల్సి ఉంటుందన్నారు. వినియోగదారుల అభిరుచులకు తగినట్లుగా ఫీచర్లు డెవలప్‌ చేస్తేనే ఎక్కువ రోజులు మనుగడ సాధించగలమని పేర్కొన్నారు. కానీ అది చాలా సవాలుతో కూడుకున్న పని అంటూ.. ‘ నా భార్య దాదాపు ప్రతిరోజూ ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తుంది. బిగ్‌బాస్కెట్‌(ఆన్‌లైన్‌ కంపెనీ)లోనే కూరగాయలు కొంటుంది. అదేంటి మన కంపెనీ(ఫ్లిప్‌​కార్ట్‌) నుంచే ఆర్డర్‌ చేయొచ్చుగా అంటే కొత్త ఫీచర్లు తీసుకురండి అప్పుడు చూద్దాం ఆలోచిస్తా అని చెప్పింది. కానీ ఇప్పటికీ కూడా ఆమెను ఒప్పించలేకపోతున్నా. అలా ఉంటుంది మన పరిస్థితి’ అంటూ ఆన్‌లైన్‌ కంపెనీల మధ్య ఉన్న పోటీ గురించి చెప్పుకొచ్చారు. కాగా వాల్‌మార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత సచిన్‌ బన్సాల్‌ కంపెనీ నుంచి వైదొలుగుతున్నప్పటికీ, బిన్నీ బన్సాల్‌ మాత్రం గ్రూప్‌ సీఈవోగా కంపెనీలోనే కొనసాగనున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement