
Flipkart Co-Founder Binny Bansal Plans New Start-Up: ఈ-కామర్స్ వ్యాపారంలో అగ్రగామిగా దూసుకెళ్తోంది ఫ్లిప్‌కార్ట్. దాన్ని స్థాపించి విజయవంతంగా తీర్చిదిద్దిన బిన్నీ బన్సాల్ తాజాగా మరో ఈ-కామర్స్ బిజినెస్‌ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌లో తన మిగిలిన వాటాను కూడా విక్రయించిన సంగతి తెలిసిందే.
ఫ్లిప్‌కార్ట్ పూర్తిగా వాల్‌మార్ట్ యాజమాన్యంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో బిన్నీ బన్సాల్ ఈ-కామర్స్ మార్కెట్లో మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. భారతీయ, అంతర్జాతీయ ఈ-కామర్స్ సంస్థలకు డిజైన్, మర్చండైజ్, లేబర్ వంటి సహాయపడే వ్యాపారాన్ని స్థాపించాలని బన్సాల్ చూస్తున్నారు. ఇది స్టార్టప్ నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (KPO) కంపెనీగా పని చేస్తుంది. వాణిజ్య సంస్థలకు బ్యాకెండ్ కార్యకలాపాలతో సహాయం చేస్తుంది.
సీఈవో కోసం అన్వేషణ
సమాచార వర్గాల ప్రకారం, బిన్నీ బన్సాల్ తన కొత్త వ్యాపారంలో కేవలం తన సొంత డబ్బును మాత్రమే పెట్టుబడి పెడుతున్నారు. అయితే కంపెనీ రోజువారీ కార్యకలాపాలలో ఆయన నేరుగా పాల్గొనరు. వ్యాపారాన్ని పర్యవేక్షించడానికి సీఈవో కోసం అన్వేషిస్తున్నారు. వాల్‌మార్ట్ 2018లో 16 బిలియన్ డాలర్లకు ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసింది. దీంతో ఫ్టిప్‌కార్ట్‌కు బిన్నీ బన్సాల్ దూరమయ్యారు.
విక్రయ ఒప్పందంలో భాగమైన ఐదేళ్ల నాన్-కాంపిటేట్ నిబంధన గడువు ఈ సంవత్సరం ముగిసింది. ఫ్లిప్‌కార్ట్‌ను వీడిన తర్వాత బిన్నీ బన్సాల్ ఏంజెల్ ఇన్వెస్టర్‌గా చురుగ్గా ఉంటూ బహుళ వ్యాపారాలకు మద్దతు ఇస్తున్నారు. బన్సాల్ కొత్త వ్యాపారం స్వీయ-నిధులతో ఉంటుందని, బయటి నుంచి నిధులను స్వీకరించదని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ఉన్న ఈ-కామర్స్ సంస్థలకు కీలకమైన సహాయాన్ని అందించే గ్లోబల్ కంపెనీగా తన కొత్త సంస్థను బిన్నీ బన్సాల్ తీర్చిదిద్దనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment