ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మరో పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ ఫ్లిప్‌కార్ట్ బోర్డు నుంచి అధికారికంగా రాజీనామా చేశారు. స్టార్టప్‌లో తన మిగిలిన వాటాను విక్రయించిన కొన్ని రోజుల తర్వాతే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
సచిన్ బన్సాల్ బాటలోనే..
నవీ అనే ఫిన్‌టెక్ వెంచర్ ఏర్పాటు కోసం కొన్ని సంవత్సరాల క్రితం ఫ్లిప్‌కార్ట్‌ను విడిచిపెట్టిన మరో సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ అడుగుజాడలనే బిన్నీ బన్సల్ కూడా అనుసరించనున్నారని ఇంతకు ముందే పలు నివేదికలు పేర్కొన్నాయి. ఆయన కూడా ఈ-కామర్స్ రంగంలో మరో వెంచర్‌ను ఏర్పాటు చేస్తారని, అందుకే ఆయన ఫ్లిప్‌కార్ట్ నుంచి తప్పుకొన్నారని భావిస్తున్నారు.
గత 16 సంవత్సరాలుగా ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సాధించిన విజయాల పట్ల బిన్నీ బన్సల్ గర్వాన్ని వ్యక్తం చేశారు. సమర్థవంతమైన నాయకత్వ బృందంతో కంపెనీ బలమైన స్థానంలో ఉందన్నారు. "ఈ నమ్మకంతో, కంపెనీ సమర్థుల చేతుల్లో ఉందని తెలుసుకుని, నేను పక్కకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ బృందం కస్టమర్‌లకు మెరుగైన అనుభవాలను అందించడాన్ని ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను. సంస్థకు బలమైన మద్దతుదారునిగా కొనసాగుతాను" అని బిన్నీ బన్సల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఫ్లిప్‌కార్ట్‌తో దేశంలో షాపింగ్ అనుభవాన్ని మెరుగ్గా మార్చిన బిన్నీ బన్సల్ గొప్ప ఆలోచనలను ఫ్లిప్‌కార్ట్ సీఈవో, బోర్డ్ మెంబర్ అయిన కళ్యాణ్ కృష్ణమూర్తి కొనియాడారు. అంకితభావంతో కూడిన టీమ్‌వర్క్ వల్లే ఫ్లిప్‌కార్ట్ ఈ స్థాయికి ఎదిగిందన్నారు. ఫ్లిప్‌కార్ట్‌ను బెంగళూరు ప్రధాన కేంద్రంగా 2007లో సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment