గతవారం బిజినెస్ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Jan 18 2016 12:11 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

Last week Business

నియామకాలు
మకాలు


⇒ఫ్లిప్‌కార్ట్ సీఈవోగా బిన్నీ బన్సల్ వ్యవహరించనున్నారు. ఇప్పటిదాకా ఆ స్థానంలో ఉన్న మరో వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ ఇకపై సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారు. బిన్నీ ఇప్పటిదాకా సీవోవోగా ఉన్నారు.

⇒వాణిజ్య నియంత్రణ సంస్థ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చైర్మన్‌గా దేవేందర్ కుమార్ సిక్రి పదవీ బాధ్యతలు చేపట్టారు.

⇒ఉక్కు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగా, ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్న భారతీ ఎస్ సిహగ్ తాజాగా ప్రభుత్వ రంగ అతిపెద్ద ఐరన్ ఓర్ కంపెనీ ఎన్‌ఎండీసీ సీఎండీగా అదనపు బాధ్యతలు చేపట్టారు.

⇒క్యాప్‌జెమిని భారత్ కార్యకలాపాల సీఈవోగా శ్రీనివాస్ కందుల నియమితులయ్యారు.
 
రిలయన్స్ సిమెంట్‌పై బిర్లా గ్రూప్ కన్ను
రిలయన్స్ ఇన్‌ఫ్రాలో భాగమైన రిలయన్స్ సిమెంటును కొనుగోలు చేసేందుకు పోటీపడుతున్న మూడు కంపెనీల్లో ఎంపీ బిర్లా గ్రూప్ సంస్థ బిర్లా కార్ప్ కూడా ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మిగతా రెండింటిలో ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలైన బ్లాక్‌స్టోన్, బేరింగ్ ఉన్నట్లు వివరించాయి. వీటితో రిలయన్స్ ఇన్‌ఫ్రా చర్చలు జరుపుతున్నట్లు తెలిపాయి.  సిమెంటు విక్రయం డీల్ దాదాపు రూ. 5,000 కోట్లు ఉండొచ్చని అంచనా.
 
మలేసియాలో ఓయో రూమ్స్

మలేసియాలో కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓయో రూమ్స్ సంస్థ వ్యవస్థాపక సీఈవో రితేష్ అగర్వాల్ తెలిపారు. మొబైల్స్, ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా ఉన్న మార్కెట్లలో ఒకటైనందున మలేసియాను ముందుగా ఎంచుకున్నట్లు వివరించారు. ఓయో రూమ్స్ ప్రస్తుతం దేశీయంగా 160 నగరాల్లో సర్వీసులు అందిస్తోంది.
 
తగ్గిన పారిశ్రామికోత్పత్తి
దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి తీవ్ర నిరాశను మిగుల్చుతోంది. 2015 నవంబర్ నెలలో అసలు ఉత్పత్తిలో వృద్ధి లేకపోగా (2014 నవంబర్‌తో పోల్చిచూస్తే...) -3.2 శాతం క్షీణత నమోదయ్యింది. 2014 నవంబర్‌లో ఉత్పత్తి వృద్ధి 5.2 శాతంగా నమోదయ్యింది.  ఇంతటి పేలవ పనితీరు గడచిన నాలుగేళ్లలో ఇదే తొలిసారి. అప్పట్లో అంటే అక్టోబర్ 2011లో ఐఐపీ క్షీణతలో -4.7  శాతంగా నమోదయ్యింది. కాగా ఆర్థిక సంవత్సరం నవంబర్ వరకూ గడచిన ఎనిమిది నెలల కాలంలో ఉత్పత్తి వృద్ధి రేటు 2.5 శాతం నుంచి 3.9 శాతానికి పెరిగింది.
 
పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
 వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్‌లో 5.61 శాతానికి పెరిగింది. అంటే 2014 డిసెంబర్‌తో పోల్చితే 2015 డిసెంబర్‌లో రిటైల్ ధరల బాస్కెట్ మొత్తం 5.61 శాతం ఎగసిందన్నమాట. గడచిన  ఐదు నెలలుగా ఈ రేటు పెరుగుతూ వస్తోంది. కూరగాయలు, పప్పు దినుసుల  ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం.  జనవరి 2016 నాటికి ఆర్‌బీఐ రిటైల్ ద్రవ్యోల్బణం వార్షిక సగటు లక్ష్యం 6 శాతం.
 
డాట్‌కు ఆర్‌కామ్ 5 వేల కోట్లు చెల్లింపు!
పదహారు సర్కిళ్లలో 800 మెగాహెట్జ్ స్పెక్ట్రంను ట్రేడింగ్, షేరింగ్ మొదలైన వాటికి ఉపయోగించుకునేందుకు వీలుగా షరతులు సడలించడం కోసం రూ. 5,600 కోట్లు చెల్లించాలని రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు (ఆర్‌కామ్) టెలికం విభాగం (డాట్) సూచించింది. అలాగే వన్ టైమ్ స్పెక్ట్రం చార్జ్ (ఓటీఎస్‌సీ) కింద రూ. 1,569 కోట్లకు బ్యాంకు గ్యారంటీని నెలరోజుల్లోగా సమర్పించాలని పేర్కొంది. రిలయన్స్ జియోతో స్పెక్ట్రం ట్రేడింగ్, షేరింగ్ ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు ఆర్‌కామ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
చమురు ధరలు మరింత కిందకు
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరింతగా తగ్గుతున్నాయి. మంగళవారం ఫ్యూచర్స్ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర దాదాపు 3.5 శాతం వరకూ పతనమై 30.43 డాలర్ల ధరను తాకింది. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ చమురు ధరలు 20 శాతం మేర పడిపోయాయి. గత ఏడాది జూన్ నుంచి చూస్తే ఈ ధరలు 70 శాతం వరకూ తగ్గాయి.  సరఫరాలు అధికంగా ఉండడం, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం, ఆ దేశ స్టాక్ మార్కెట్ క్షీణించడం, డాలర్ బలపడుతుండడం వంటి కారణాల వల్ల చమురు ధరలు తగ్గుతున్నాయి.
 
 భారత మార్కెట్‌పై బైదు కన్ను

 చైనాకు చెందిన ఇంటర్నెట్ సెర్చి దిగ్గజం బైదు.. తాజాగా భారత్‌లోకి ప్రవేశించడంపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రెస్టారెంట్ సర్వీసుల సంస్థ జొమాటో, ఆన్‌లైన్ సినిమా టికెట్ల సేవల సంస్థ బుక్‌మైషో, ఫుడ్ రిటైలర్ బిగ్ బాస్కెట్ మొదలైన వాటిల్లో వ్యూహాత్మక వాటాలు కొనుగోలు చేయాలని యోచిస్తోంది. చిన్న పట్టణాల్లో స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఆక ర్షించే దిశగా తెలుగు, హిందీ సహా పలు భారతీయ భాషల్లో యాప్‌లతో తమ మొబోమార్కెట్ యాప్ స్టోర్‌ను విస్తరించాలని భావిస్తోంది.
 
 భారీ రిఫైనరీ ఏర్పాటుకు సన్నాహాలు
 దేశంలోనే అత్యంత భారీ రిఫైనరీని పశ్చిమ తీరప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ఇందుకోసం చేతులు కలుపుతున్నాయి. ఇండియన్ ఆయిల్ డెరైక్టర్ (రిఫైన రీస్) సంజీవ్ సింగ్ ఈ విషయం తెలిపారు. ఈ రిఫైనరీ వార్షిక సామర్థ్యం 15 మిలియన్ టన్నుల పైగానే ఉంటుందని ఆయన వివరించారు.
 
 తెలంగాణలో 2 ఐటీ సెజ్‌లకు ఆమోదం
 తెలంగాణ రాష్ట్రంలో రెండు ఐటీ సెజ్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. తెలంగాణలో ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలం(సెజ్)ళ్ల ఏర్పాటు కోసం వేల్యూ ల్యాబ్స్ ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పీ, జీఏఆర్ కార్పొరేషన్ సంస్థల ప్రతిపాదనలకు సెజ్ వ్యవహారాలను చూసే బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్ పచ్చజెండా ఊపింది. దీంతో పాటు 13 మంది సెజ్ డెవలపర్లకు వారి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మరింత సమయం ఇచ్చింది.
 
 ఫిబ్రవరి 29న కేంద్ర బడ్జెట్
 కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 29న పార్లమెంటులో 2016-17 బడ్జెట్‌ను సమర్పించనుంది. ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న రెండు మూడేళ్లకూ మార్గనిర్దేశం చేసేలా ఈ బడ్జెట్ ఉంటుందని కూడా ఆయన వెల్లడించారు. భారత్-కొరియా వ్యాపార సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
 
 టోకున ఆహార ధరల భగ్గు
 టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 14వ నెలలోనూ అసలు పెరక్కపోగా... క్షీణత (మైనస్)లో కొనసాగింది. డిసెంబర్‌లో -0.73 శాతంగా నమోదయ్యింది. అంటే  2014 డిసెంబర్‌తో పోల్చితే 2015 డిసెంబర్‌లో టోకు బాస్కెట్ రేటు మొత్తంగా అసలు పెరక్కపోగా... క్షీణించిదన్నమాట. నవంబర్‌లో ఈ రేటు -1.99 శాతం. అయితే మొత్తం టోకు ధరల సూచీలో ఒక భాగమైన ఆహార ధరల విభాగం మాత్రం సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న వైనాన్ని గణాంకాలు ప్రతిబింబించాయి.
 
రెండేళ్ల కనిష్టానికి రూపాయి
దేశీ కరెన్సీ క్షీణత కొనసాగుతోంది. శుక్రవారం డాలరుతో రూపాయి మారకం విలువ 67.60 వద్ద ముగిసింది. ఇది రెండేళ్లకుపైగా కనిష్టస్థాయి కావడం గమనార్హం. 2013, సెప్టెంబర్ 3 తర్వాత(67.63) మళ్లీ ఈ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి. రూపాయి చరిత్రాత్మక కనిష్టస్థాయి 68.85 (2013, ఆగస్టు 28న).
 
ఆధార్‌తో ఏటా రూ.6,700 కోట్లు ఆదా

ఆధార్ వల్ల భారత ప్రభుత్వానికి ఏటా వంద కోట్ల డాలర్లు (రూ.6,700 కోట్లు)ఆదా అవుతాయని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ఆధార్ డిజిటల్ గుర్తింపు కార్డ్ వల్ల అవినీతి తొలగి ఈ స్థాయిలో ప్రభుత్వానికి సొమ్ములు ఆదా అవుతాయని ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త కౌశిక్ బసు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement