కొత్త వ్యాపారాల్లో ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడులు
కంపెనీ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్
బెంగళూరు: ఇటీవలే సమకూర్చుకున్న నిధులను ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థలు, ఫోన్‌పే వంటి కొత్త వ్యాపార విభాగాల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ తెలిపారు. ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ విభాగంలో అవకాశాలు పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు. ‘ఇటీవలే టెన్సెంట్, మైక్రోసాఫ్ట్, ఈబే నుంచి భారీ స్థాయిలో నిధులు సమీకరించాం. వీటిని కొత్త వ్యాపారాలు.. ముఖ్యంగా ఫోన్‌పే, ఫిన్‌టెక్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తాం‘ అని ఆయన పేర్కొన్నారు.
ఫోన్‌పే లాంటి ప్లాట్‌ఫాంల ద్వారా నగదు బదిలీ లావాదేవీలు గణనీయంగా జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ విభాగంలో వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని బన్సల్ చెప్పారు. అలాగే నిత్యావసరాలు, ఫర్నిచర్, ప్రైవేట్ లేబుల్స్ మొదలైన కొత్త వ్యాపార విభాగాల్లో కూడా భారీగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన వివరించారు. ఈబేతో భాగస్వామ్యంపై స్పందిస్తూ.. దేశీ విక్రేతలకు అంతర్జాతీయ వేదిక కల్పించేందుకు ఇది ఉపయోగపడగలదని బన్సల్ చెప్పారు. దీనితో లక్షల మంది భారతీయ వ్యాపారస్తులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయంగా విక్రయించుకోగలరని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌ను నాస్‌డాక్‌లో లిస్ట్ చేస్తారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యాల మీద నుంచి దృష్టి మరల్చుకునే యోచనేదీ లేదన్నారు.