ఆ సీఈవో రూ.32 కోట్ల సౌధానికి యజమాని
బెంగళూరు: బిగ్గెస్ట్ ఆన్ లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్ సీఈవో బిన్నీబన్సల్ (32) టెక్ సిటీలోని విలాసవంతమైన ఏరియాలో ఓ బంగ్లాను కొనుగోలు చేశారు. దాదాపు రూ.32కోట్లు (5మిలియన్ డాలర్లు) ఖరీదు చేసే బెంగళూరులోని కోరమంగళ ప్రాంతలో ఓ విశాలమైన సౌధాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఇల్లు దాదాపు 10,000 చదరపు అడుగుల వైశాల్యంలో ఉంది.
32 సం.రాల వయసులో 32 కోట్ల రూపాయిల కలల సౌధానికి అధిపతిగా అవతరించాడు ఫ్లిప్ కార్ట్ బాస్. ఇటీవల బెంగళూరులో జరిగిన అతిపెద్ద గృహ కొనుగోలు డీల్స్‌లో ఇదీ ఒకటని అంచనా. తొమ్మిదేళ్ల క్రితం ఫ్లిప్‌కార్ట్‌ను ప్రారంభించిన ప్రదేశానికి ఇది సమీపంలోనే ఉండడం విశేషం. అన్నట్టు ఫ్లిప్‌కార్ట్ మరో సహవ్యవస్థాపకుడైన సచిన్ బన్సాల్ దీనికి పొరుగునే కొన్నేళ్ల క్రితం ఓ ఇల్లు కొనుగోలు చేశారు. అప్పట్లో ఆయన ఫ్లిప్‌కార్ట్‌లోని కొన్ని షేర్లను విక్రయించి వచ్చిన మొత్తంతో ఇక్కడ ఇల్లు కొన్నారు.
ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని, క్రిస్ గోపాల కృష్ణన్, డాక్టర్ దేవిశెట్టి, రాజీవ్ చంద్రశేఖర్ తదితరులు నివసించే ఏరియాకి దగ్గరలోనే బన్సాల్ , ఆయన భార్య త్రిష కూడా చేరారు. కాగా బన్సాల్ రెండు ప్రైవేటు బ్యాంకుల్లో కొంత మొత్తం అప్పు తీసుకొని మరీ ఈ ఇంటిని సొంతం చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఇక్బాల్ కుటుంబంనుంచి దీన్ని కొనుగోలు చేశారు. దాదాపు కొన్ని వారాల క్రితమే రిజిష్ట్రేషన్ పూర్తయింది. అయితే దీనిపై స్పందించడానికి బిన్నీ బన్సల్ నిరాకరించారు.