సాక్షి, బెంగళూరు: ఫ్లిప్‌కార్ట్ కో-ఫౌండర్ బిన్నీ బన్సల్ రాజీనామా అనంతరం మరో ఆసక్తికరమైన ట్విస్ట్. లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ సీఈవో పదవికి రాజీనామా చేసిన బిన్సీ ప్రతీకార చర్యలకు దిగినట్టు కనిపిస్తోంది. తనపై ఆరోపణలు చేసిన మహిళపై కేసును దాఖలు చేశారు. తప్పుడు ఆరోపణలు, బ్లాక్‌మెయిల్ ఆరోపణలతో కోరమంగళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే సదరు మహిళ క్షమాపణ చెప్పడంతో కేసును వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే తను కావాలనుకున్నపుడు కేసును రీ ఓపెన్ చేసే హక్కును రిజర్వ్ చేసుకున్నారట. ప్రస్తుతం ఈ వార్త పరిశ్రమ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
కొన్నాళ్లు ఫ్లిప్‌కార్ట్‌లో పనిచేసిన మహిళ బిన్సీపై లైంగిక ఆరోపణలు చేశారు. 2016లో వీరిద్దరి మధ్య సంబంధాలు కొనసాగాయని, అయితే కొన్ని నెలల తరువాత విభేదాలు రావడంతో విడిపోయారు. అలాగే ఈ సందర్భంగా ఆమె కొంత డబ్బు చెల్లించాలని కూడా డిమాండ్ చేసినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె సొంతంగా ఓ వెంచర్‌ను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే 2018లో వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో మేజర్ వాటాను కొనుగోలు చేసిన అనంతరం ఆమె డబ్బుల కోసం మళ్లీ బిన్నీని డిమాండ్ చేశారు. ఈ సారి కూడా బిన్నీ బన్సల్ ససేమిరా అనడంతో, 2018 జూలైలో ఆమె నేరుగా వాల్‌మార్ట్ సీఈవోకే లైంగిక ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. దీనిపై ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ సంయుక్తంగా అంతర్గత విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ గ్రూపు సీఈవో బిన్నీ బన్సల్ రాజీనామా చేశారనీ ఈ విచారణలో ఆరోపణలు రుజువు కానప్పటికీ, బిన్నీ రాజీనామాను ఆమోదిస్తున్నట్టు నవంబరు 13న వాల్‌మార్ట్ ప్రకటించింది. అయితే బన్సల్‌పై వచ్చిన తీవ్రమైన వ్యక్తిగత దుష్ప్రవర్తన ఆరోపణల విషయమై పూర్తి వివరాలను వాల్‌మార్ట్ వెల్లడి చేయని సంగతి విదితమే.
మరోవైపు బిన్నీ కంపెనీని వీడిన అనంతరం ఫ్లిప్‌కార్ట్ బోర్డు లండన్‌లో సమావేశం కానుంది. వచ్చే వారమే ఈ భేటీ జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ సమావేశానికి బోర్డులో కొనసాగుతానని ప్రకటించిన బిన్నీ హాజరవుతారా లేదా అనేది స్పష్టత లేదు.
Comments
Please login to add a commentAdd a comment