భారత్‌లో రిటైల్ కన్నా హోల్‌సేల్ బెటరు: వాల్‌మార్ట్
న్యూఢిల్లీ: అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్.. భారత్‌లో కార్యకలాపాలకు సంబంధించి హోల్‌సేల్‌లో మాత్రమే కొనసాగేందుకే ప్రాధాన్యమిస్తోంది. భారతీ ఎంటర్‌ప్రైజెస్‌తో తెగతెంపులు చేసుకున్న వాల్‌మార్ట్ ఇప్పుడప్పుడే రిటైల్ రంగంలో ప్రవేశించాలని భావిస్తున్నట్లుగా కనిపించడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం విదేశీ సంస్థలు రిటైలింగ్‌లో ప్రవేశించాలంటే దేశీయ భాగస్వామితో జట్టు కట్టాల్సి వస్తుంది.
అయితే, ప్రస్తుతం ఇది చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడంతో వాల్‌మార్ట్ దీనివైపు ఎక్కువగా మొగ్గు చూపడం లేదని పరిశీలకుల అభిప్రాయం. అటు, కంపెనీ వర్గాలు సైతం దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. పైగా.. భారత్‌లో బెస్ట్ ప్రైస్ టోకు ధరల వ్యాపారం బాగా క్లిక్ అయిందని, దీంతో ఈ మోడల్‌ని ఇతర వర్ధమాన దేశాల మార్కెట్లలోను పాటించాలని కంపెనీ భావిస్తున్నట్లు వాల్‌మార్ట్ వర్గాలు తెలిపాయి. బెస్ట్‌ప్రైస్ పేరిట భారతీ వాల్‌మార్ట్ జాయింట్ వెంచర్ 20 హోల్‌సేల్ స్టోర్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
మరోవైపు, జాయింట్ వెంచర్ నుంచి భారతీ-వాల్‌మార్ట్ విడిపోవడంతో బెస్ట్ ప్రైస్ స్టోర్స్‌లో పనిచేసే సుమారు 4,000 మంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది. ఒక్కో స్టోర్‌లో సుమారు 200 మంది ప్రత్యక్షంగాను.. దాదాపు అంతే సంఖ్యలో పరోక్షంగాను ఉపాధి పొందుతున్నారు. రిటైల్ రంగంలో కూడా ప్రవేశించాలనే ఉద్దేశంతో కూడా ఇందులో కొందరిని తీసుకుని ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే, భారతీతో విడిపోవడంతో పాటు ఇతర సంస్థలతో పోటీ పెరుగుతుండటం వంటి కారణాలతో కొన్ని స్టోర్స్ మూతబడొచ్చన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. దీంతో వాటిలో పనిచేసే ఉద్యోగుల భవితపై నీలినీడలు ముసురుకున్నాయి.