ఆసియాలో అపర కుబేరుడుగా అంబానీ | Mukesh Ambani tops Jack Ma as Asia richest person | Sakshi
Sakshi News home page

ఆసియాలో అపర కుబేరుడుగా అంబానీ

Apr 23 2020 10:33 AM | Updated on Apr 23 2020 10:55 AM

Mukesh Ambani tops Jack Ma as Asia richest person - Sakshi

సాక్షి, ముంబై : ఫేస్‌బుక్ , రిలయన్స్ జియో మెగా డీల్ అనేక సంచలనాలకు నాంది పలికింది.  అతిపెద్ద డీల్ గా నిలిచిన రిలయన్స్‌ జియోలో 10 శాతం వాటాను ఫేస్‌బుక్‌ రూ.43,574 కోట్లు(570 కోట్ల డాలర్లు) కొనుగోలు చేయనున్నదన్న వార్త రిలయన్స్ తోపాటు పలు రంగాల్లో జోష్ నింపింది. దీంతో బుదవారంనాటి మార్కెట్ లో రిలయన్స్ షేరు పది శాతానికి పైగా ఎగిసింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికే అపర కుబేరుల జాబితాలో నిలిచిన అంబానీ తాజా పరిణామంతో చైనా బిలియనీర్ అలీబాబా అధినేత జాక్ మాను అధిగమించి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు.  (అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌‌కు షాకివ్వనున్న జియో మార్ట్)

రిలయన్స్ అంబానీ సంపద 4.69 బిలియన్ డాలర్లు పెరిగి 49.2 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ గురువారం తెలిపింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం,  అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ యజమాని ముకేశ్ అంబానీ సంపద జాక్ మా కంటే  సుమారు 4 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. జాక్ మా సంపద 46 బిలియన్ డాలర్లు.  ఈ ఒప్పందానికి ముందు, 2020 లో అంబానీ సంపద 14 బిలియన్ డాలర్ల క్షీణతను చూసింది. ఇది ఆసియాలో ఎవరికైనా డాలర్ పరంగా అతిపెద్ద పతనం. దీన్ని బట్టే  ఫేస్‌బుక్, జియో డీల్ సృష్టించిన సునామీని అర్థం చేసుకోవచ్చు. అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ మంగళవారం నాటికి 1 బిలియన్ల డాలర్లను కోల్పోయింది. 29 సంవత్సరాలలో చమురు అతిపెద్ద పతనాన్ని నమోదు చేయడంతో మార్చి ప్రారంభంలో, జాక్ మా, అంబానీని అధిగమించి అత్యంత ధనవంతుడిగా నిలిచారు. క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు, మొబైల్ అనువర్తనాల డిమాండ్  తగ్గడంతో అలీబాబా హోల్డింగ్స్  నష్టాలను చవి చూస్తోంది. (కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త వ్యాపారాలు: అంబానీ)

మరోవైపు రిలయన్స్ జియోలో ఫేస్‌బుక్ పెట్టుబడులతో దేశంలోనే తొలి 5 సంస్థల్లో ఒకటిగా జియో స్థానం సంపాదించుకుంది. అంతేకాకుండా కొన్ని దేశాల జీడీపీ కన్నా జియో మార్కెట్ మూలధనం ఎక్కువ ఉండటం విశేషం. జింబాబ్వే జీడీపీ 19.4 బిలియన్ డాలర్లు, మారిషస్ జీడీపీ 14 బిలియన్ డాలర్లు, ఐలాండ్ జీడీపి 26.6 బిలియన్ డాలర్లు కాగా జియో కంపెనీ విలువ ఏకంగా 65.95 బిలియన్ డాలర్లు వుందని తాజా గణాంకాల ద్వారా  తెలుస్తోంది 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement