భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో దక్షిణాసియాలో అతిపెద్ద నిర్మాణ పరికరాల ప్రదర్శన ‘ఎక్స్‌కాన్-2023’ను బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో డిసెంబర్ 12 నుంచి 16 వరకు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా మంగళవారం కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రదర్శనను ప్రారంభించారు.
నైపుణ్యాభివృద్ధికి పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక వృద్ధిని సాధించాలని మంత్రి అన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా వాహనాల నుంచి వచ్చే కార్బన్‌ను తగ్గించి కార్బన్ న్యూట్రల్ దేశం కోసం కృషిచేయాలని కోరారు. దాంతోపాటు ఉద్యోగాల కల్పన జరుగుతోందని చెప్పారు.
‘బిల్డింగ్ ఇండియా టుమారో’ పేరిట అయిదు రోజులపాటు జరగనున్న ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన 1200 మంది ప్రదర్శనకారులు హాజరయ్యారు.
రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతీయ నిర్మాణ సామగ్రి తయారీదారుల సంఘం ఈ ఈవెంట్‌లో భాగస్వాములుగా ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లతో దేశంలో నిర్మాణ రంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనుంది. దాదాపు రూ.10 వేల కోట్లను విశాఖకు కేటాయించనుంది. మౌలిక సదుపాయాలు, ఆర్థిక పురోగతి, పోటీతత్వానికి అనుకూలమైన వాతావరణాన్ని ఈ పెట్టుబడులు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
అత్యాధునిక సాంకేతికతతో కూడిన వినూత్న పరికరాలకు ఈ ప్రదర్శన వేదికగా నిలుస్తుంది. నిర్మాణ సామగ్రి పరిశ్రమ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 26% వృద్ధి సాధించింది. ఎక్స్‌కాన్ 2023లో భాగంగా హైడ్రోజన్, డీజిల్ ఇంజిన్లను సైతం ప్రదర్శించారు.
ఇదీ చదవండి: ఐదు రోజుల్లో రూ.20 వేలకోట్ల సంపాదన..!
Comments
Please login to add a commentAdd a comment