విలాసవంతమైన జీవనశైలితో తరచూ వార్తల్లోకి వచ్చే వ్యాపారవేత్తలు భారత్‌లో అనేక మంది ఉన్నారు. అయితే సంబంధిత వ్యాపార రంగాలలో ప్రముఖంగా ఉన్నప్పటికీ లో ప్రొఫైల్‌లో ఉండడానికి ప్రయత్నించేవారూ కొందరు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ (Vikas Oberoi). బాలీవుడ్ నటిని వివాహం చేసుకున్నప్పటికీ, ప్రజల దృష్టికి దూరంగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు.
ఎవరీ వికాస్ ఒబెరాయ్?
వికాస్ ఒబెరాయ్.. ఒబెరాయ్ రియాల్టీకి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఆయన తండ్రి రణవీర్ ఒబెరాయ్ ఈ రియల్-ఎస్టేట్ కంపెనీని స్థాపించారు. ఇది వికాస్ నాయకత్వంలో దేశంలోని అగ్రశ్రేణి రియల్-ఎస్టేట్ సంస్థలలో ఒకటిగా ఎదిగింది. ఆతిథ్యం, రిటైల్, కార్పొరేట్ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్‌తో సహా విభిన్న రంగాలలోకి ప్రవేశించింది.
ముంబైలో హై-ఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లు, వాణిజ్య స్థలాలనెన్నో అభివృద్ధి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రధాన పేరుగా మారింది. ఒబెరాయ్ రియాల్టీకి అధిపతి మాత్రమే కాకుండా వికాస్ ఒబెరాయ్ ముంబైలోని ఫైవ్ స్టార్ వెస్టిన్ హోటల్‌ను కూడా కలిగి ఉన్నారు. ప్రస్తుతం నగరంలోని మొదటి రిట్జ్-కార్ల్‌టన్ హోటల్‌తోపాటు విలాసవంతమైన నివాస సముదాయాన్ని నిర్మిస్తున్నారు.
వికాస్ ఒబెరాయ్ నేపథ్యం
ముంబైలో పుట్టి పెరిగిన వికాస్ ఒబెరాయ్ నగరంలోని జై హింద్ కళాశాలలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. తరువాత ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఓనర్/ప్రెసిడెంట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేశారు. విజయవంతమైన వ్యాపారవేత్తగానే కాకుండా, వివేక్ శిక్షణ పొందిన పైలట్ కూడా. ఆయనకు పైలట్ లైసెన్స్ కూడా ఉంది.
ప్రముఖ బాలివుడ్ నటి గాయత్రీ జోషిని వికాస్ ఒబెరాయ్ వివాహం చేసుకున్నారు. మోడల్ నుండి నటిగా మారిన ఆమె షారుఖ్ ఖాన్ నటించిన స్వదేశ్ చిత్రంలో గీత పాత్రను పోషించారు. 2005లో పెళ్లి చేసుకున్న ఈ జంట అప్పటి నుండి అందరి దృష్టికి దూరంగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు. వీరికి విహాన్ ఒబెరాయ్, యువన్ ఒబెరాయ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గతేడాది అక్టోబర్‌లో వీరు ఇటలీలోని సార్డినియాలో విహారయాత్ర చేస్తుండగా కారు ప్రమాదంలో చిక్కుకుని అదృష్టవశాత్తూ క్షేమంగా బయటపడ్డారు.
చదవండి: అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ జీతం ఇంతేనా?
వికాస్ ఒబెరాయ్ నెట్‌వర్త్
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. దేశంలోని అత్యంత ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలలో ఒకరైన వికాస్ ఒబెరాయ్ నెట్‌వర్త్ 6.5 బిలియన్ డాలర్లు (రూ. 45,000 కోట్లు).
Comments
Please login to add a commentAdd a comment