మొదటి భార్య ఇవానా, కూతురు ఇవాంకా, కొడుకు ఎరిక్‌లతో ట్రంప్ (ఫైల్)
‘కఠిన కాలాన్ని ఎదుర్కోవడం అద్భుతమైన అనుభవం. జీవితంలో ఒక్కసారైనా ఆ అనుభవం పొందాలి’– అమెరికా 45వ అధ్యక్షుడైన డొనాల్డ్ జాన్ ట్రంప్‌నకు ఇష్టమైన సొంత కొటేషన్ ఇది. ట్రంప్ జీవితాన్ని కొంతవరకు ఈ కొటేషన్ ప్రతిబింబిస్తుంది. ట్రంప్ జీవితంలో విజయాలు, వైఫల్యాలు, వివాదాలు.. ప్రశంసలు, విమర్శలు.. అవహేళనలు, ఆత్మీయతలు.. అన్నీ కనిపిస్తాయి. అదీ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అన్నింటినీ ఆయన ఒక్కలాగే తీసుకోవడం కూడా కనిపిస్తుంది. ‘డబ్బు కోసం నేను పనిచేయడం లేదు. నా దగ్గర కావల్సినంత డబ్బు ఉంది. అవసరమైన దానికన్నా ఎక్కువే ఉంది. పని చేయడం కోసమే పని చేస్తున్నాను. వ్యాపారం నా కళాత్మక విధానం’ అంటారు ట్రంప్.
తండ్రి ఫేమస్ రియల్టర్
డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో ఫ్రెడెరిక్ ట్రంప్, మేరీ మెక్‌లియడ్ దంపతులకు 1946 జూన్ 14 వ తేదీన జన్మించారు. ఫ్రెడెరిక్ ట్రంప్ క్వీన్స్‌లో పేరెన్నిక గన్న బిల్డర్, రియల్టర్. క్వీన్స్, స్టేటెన్ ఐలాండ్, బ్రూక్లిన్‌ల్లో మధ్యతరగతి వాసులకు చవకగా అపార్ట్‌మెంట్స్ నిర్మించి ఇచ్చేవాడు. మేరీ కుటుంబం స్కాట్‌లాండ్ నుంచి వలస వచ్చింది. ఫ్రెడ్, మేరీల వివాహం 1936లో జరిగింది. వారి ఐదుగురు పిల్లల్లో డొనాల్డ్ ట్రంప్ నాలుగవ వాడు. ఫోర్డమ్ యూనివర్సిటీ, వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్, న్యూయార్క్ మిలటరీ అకాడమీల్లో ట్రంప్ విద్యనభ్యసించారు. మిలటరీ అకాడెమీలో స్టార్ అథ్లెట్‌గా, విద్యార్థి నాయకుడిగా ట్రంప్ నిలిచారు.
ఆ తరువాత తన తండ్రి వారసత్వంగా రియల్టీ బిజినెస్‌లోకి దిగారు. కొద్ది కాలంలోనే అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు. మన్‌హటన్‌లో భారీ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేశారు. 1980లో న్యూయార్క్‌లో ప్రారంభించిన ‘గ్రాండ్ హయత్ న్యూయార్క్’ ప్రాజెక్టు ఆయనకు డెవలపర్‌గా గొప్ప పేరు తీసుకువచ్చింది. రియాలిటీ టీవీ స్టార్ గానూ ట్రంప్ ప్రఖ్యాతి గాంచారు. ‘ది అప్రెంటిస్’ పేరుతో ఆయన ప్రారంభించిన రియాలిటీ షో బాగా పాపులర్ అయింది. ఆ తరువాత రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ట్రంప్.. రిపబ్లికన్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. 2015లో మెజారిటీ ప్రైమరీల్లో, కాకస్‌ల్లో విజయం అనంతరం రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా 2016 ఎన్నికల బరిలో నిలిచి, గెలిచారు.
సోదరుడి ప్రభావం
మద్యం వ్యసనానికి లోనై చనిపోయిన తన సోదరుడు ఫ్రెడ్ ట్రంప్ జూనియర్ ప్రభావం డొనాల్డ్ ట్రంప్‌పై ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం ట్రంప్ పలు సందర్భాల్లో స్వయంగా చెప్పారు. సోదరుడి మరణం తరువాత తాను ఆల్కహాల్ ముట్టనని, డ్రగ్స్ తీసుకోనని ట్రం ప్ శపథం చేశారు. మతపరంగా, ట్రంప్‌ను ఆయన తల్లి ప్రెస్బిటేరియన్‌గా పెంచినప్పటికీ.. తనను తాను మెయిన్‌లైన్ ప్రొటెస్టెంట్‌నని ఆయన చెప్పుకుంటారు. ట్రంప్ వ్యాపారాల్లో ముఖ్యమైనవి ట్రంప్ ఆర్గనైజేషన్, అట్లాంటిక్‌లో కేసినోలు, టీవీ షోలు.
ద ఆర్ట్ ఆఫ్ ద డీల్
1987లో టోనీ ష్వాజ్‌తో కలిసి ట్రంప్ ‘ద ఆర్ట్ ఆఫ్ ద డీల్’ అనే పుస్తకం రాశారు. అందులో తన వ్యాపార విజయరహస్యాలను వివరించారు. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ లిస్ట్‌లో ఆ పుస్తకం నిలిచింది. కానీ, ఎన్ని కాపీలు అమ్ముడయ్యాయనే విషయంలో కచ్చితమైన సమాచారం లేదు. ‘క్రిపుల్డ్ అమెరికా: హౌ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అనే పుస్తకం కూడా ట్రంప్ రాశారు. 2005లో ఆయన ‘ట్రంప్ యూనివర్సిటీ’ని స్థాపించారు. అందులో రియల్ ఎస్టేట్ వ్యాపార మెళకువలను కోర్సులుగా నేర్పించేవారు.
ఇవానా.. మేపుల్స్.. మెలానియా
ట్రంప్ మొదట 1977లో ఇవానాను వివాహం చేసుకున్నారు. ఇవానా అప్పటికే ప్రముఖ ఫ్యాషన్ మోడల్. వారికి ముగ్గురు పిల్లలు. వారు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంకా, ఎరిక్. 1992లో ట్రంప్, ఇవానా విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత, 1993లో ట్రంప్ మార్లా మేపుల్స్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆమె నటి. వారికి టిఫానా అనే కూతురు ఉంది. 1999లో మేపుల్స్‌కు 20 లక్షల డాలర్ల పరిహారం చెల్లించి ట్రంప్ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత 2005లో మెలానియాను ట్రంప్ వివాహమాడారు. ఆమె స్లొవేనియాకు చెందిన మాజీ మోడల్. ట్రంప్ కన్నా వయసులో 23 ఏళ్లు చిన్న. ట్రంప్, మెలానియాల సంతానం బారన్ విలియమ్. డొనాల్డ్ ట్రంప్ పిల్లల్లో డొనాల్డ్ జూనియర్, ఎరిక్‌లు వారి కుటుంబ వ్యాపార సామ్రాజ్యం ‘ట్రంప్ ఆర్గనైజేషన్’లో వైస్ ప్రెసిడెంట్స్‌గా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment