సరితా కోమటిరెడ్డి
ట్రంప్ నోటి వెంట తెలుగు పేరు.. ఒక్కసారిగా కరోనా లాక్‌డౌన్ దిగులు పోయి ఉత్సాహం పొంగింది.. ఆ పేరు... సరితా కోమటిరెడ్డి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమెను ఫెడరల్ కోర్టు జడ్జిగా నియమించారు. ఇప్పుడు ఆమె న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి. అమెరికాలోని తెలుగు సంతతికి చెందిన మహిళ సాధించిన ఈ గౌరవం కరోనా తెచ్చిన నిరాశను మరిపించింది.. ఉత్సాహాన్ని పంచింది..
సరిత తలిదండ్రుల స్వస్థలం తెలంగాణలోని నల్లగొండ జిల్లా చిట్యాల. తల్లి గీతారెడ్డి రుమటాలజిస్ట్. తండ్రి హనుమంత్ రెడ్డి కార్డియాలజిస్ట్. అమెరికాలో స్థిరపడ్డారు. సరిత పుట్టి పెరిగింది అమెరికాలోనే. చిన్నప్పటి నుంచి ఆమె ప్రతిభ గల విద్యార్థినే. బీఏ డిగ్రీలోనూ హార్వర్డ్ లా స్కూల్ నుంచి న్యాయశాస్త్రంలోనూ డిస్టింక్షన్ సాధించింది. లాయర్‌గా కొలంబియా సర్క్యూట్ అప్పీల్స్ కోర్ట్ జడ్జి బ్రెట్ కెవనా దగ్గర అసిస్టెంట్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది.
ఆ తర్వాత అమెరికాలోని అతి పెద్ద చమురు ఉత్పత్తి కంపెనీ అయిన ‘బీపీ డీప్‌వాటర్ హారిజన్ ఆయిల్ స్పిల్ అండ్ ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్’పై ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్‌లో న్యాయసలహాదారుగా పనిచేసింది. 2018లో ‘ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ అండ్ మనీ లాండరింగ్’ డిప్యూ్యటీ చీఫ్‌గా, కంప్యూటర్ హ్యాకింగ్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కోఆర్డినేటర్‌గానూ ఉన్నారు. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జిగా నియామకానికి ముందువరకూ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులోని అమెరికా అటర్నీ ఆఫీస్ జనరల్ క్రైమ్స్ విభాగానికి డిప్యూటీ చీఫ్‌గా పనిచేశారు.
కొలంబియా లా స్కూల్‌లో న్యాయశాస్త్రం బోధిస్తున్నారు. సరితా తొలి బాస్ అయిన జడ్జి బ్రెట్ కెవనా సిఫారసు మేరకే సరితను న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జిగా నియమించారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఈ నియామకం ఫిబ్రవరిలోనే జరగాల్సింది. కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడి ఇప్పుడు సాధ్యమైంది. ఒకవైపు భారతీయుల అమెరికా వీసాల పట్ల కఠినంగా ఉంటూనే ఇంకోవైపు భారత సంతతి ప్రతిభను ఆస్థానంలో చేర్చుకుంటున్నాడు ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటిదాకా భారత సంతతికి చెందిన మహిళలకు కీలకపదవులు ఇచ్చి భారతీయ మహిళల ప్రజ్ఞాపాటవాల పట్ల తనకున్న గౌరవాన్ని ఇలా చాటుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment