75–80 శాతం తగ్గిన నల్లధనం లావాదేవీలు ∙తుది వినియోగదారులతో గృహాలకు డిమాండ్: అనరాక్ కన్సల్టెన్సీ పెద్ద నోట్ల రద్దు అనే చెట్టు ఫలాలు చేతికొస్తున్నాయి. డీమానిటైజేషన్ తర్వాత దేశీయ గృహ విభాగం గతుకుల రోడ్ల మీద ప్రయాణంలా మొదలై.. నేడు హైవే మీద దూసుకెళుతోంది. ఊహాజనిత కొనుగోళ్లు, విక్రయాలు పూర్తిగా తొలగిపోయాయి. దేశీయ గృహ విభాగంలో నల్లధనం లేదా నగదు లావాదేవీలు 75–80 శాతం మేర క్షీణించాయి. తుది వినియోగదారులతో గృహ విభాగంలో అసలు డిమాండ్ ఏర్పడింది. ఇంటిని ఎందుకు కొంటున్నాం.. ఎందుకు విక్రయిస్తున్నామనే ప్రాథమిక అంశాలను నిర్ధారించుకున్నాకే నిర్ణయం తీసుకునేలా నోట్ల రద్దు మార్చేసింది.
సాక్షి, హైదరాబాద్: దేశంలో 2016 నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) అమల్లోకి వచ్చింది. రియల్టీ రంగాన్ని డీమానిటైజేషన్‌కు ముందు, తర్వాత అని విభజించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నోట్ల రద్దు తర్వాత కొత్త గృహాల ప్రారంభాలు క్షీణించగా.. విక్రయాలు పెరిగాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నివేదిక తెలిపింది. తొలి ఏడాది కాలం పాటు గందరగోళం, అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ప్రధాన నగరాల్లోని రియల్టీ మార్కెట్ ప్రతికూలంలోకి వెళ్లిపోయింది. దీంతో గృహాల ప్రారంభాలు గణనీయంగా తగ్గిపోయాయి. డీమానిటైజేషన్‌కు ముందు ((2013 నుంచి 2016 మూడో త్రైమాసికం– క్యూ3) దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సుమారు 16.15 లక్షల యూనిట్లు లాంచింగ్ కాగా.. డీమో తర్వాత (2016 క్యూ4 నుంచి 2021 క్యూ3) 9.04 లక్షల యూనిట్లకు తగ్గాయి. సుమారు 44 శాతం లాంచింగ్‌లు క్షీణించాయి.
విక్రయాలలో వృద్ధి..
పెద్ద నోట్ల రద్దుకు ముందు 11.78 లక్షల గృహాలు అమ్ముడుపోగా.. నోట్ల రద్దు తర్వాత 10.37 లక్షల గృహాలు సేలయ్యాయి. తుది వినియోగదారుల కొనుగోళ్లతో ప్రధాన నగరాల్లో రియల్టీ మార్కెట్ బలపడింది. డీమానిటైజేషన్ తర్వాత లగ్జరీ మార్కెట్ కూడా కాసింత ప్రభావానికి లోనైనప్పటికీ.. కరోనా మహమ్మారితో సానుకూల డిమాండ్‌ను కొనసాగిస్తుంది. డెవలపర్లు సప్లయి, డిమాండ్‌లను నిశితంగా పరిశీలిస్తున్నారని.. విక్రయాలను బట్టి కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తున్నారని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. సరఫరా కంటే విక్రయాలకు డిమాండ్ ట్రెండ్ కొనసాగుతుందని పేర్కొన్నారు.
రీసేల్‌పై ఎక్కువ ప్రభావం..
ప్రాథమిక మార్కెట్ కంటే సెకండరీ, రీసేల్ ప్రాపర్టీలపై డీమానిటైజేషన్ ఎక్కువ ప్రభావాన్ని చూపించింది. ఈ విభాగంలోని లగ్జరీ ప్రాపర్టీలు కూడా నగదు లావాదేవీలను ఎక్కువగా కలిగి ఉండటమే ఇందుకు కారణం. డెవలపర్లు విక్రయించే అఫర్డబుల్, మధ్యస్థాయి గృహాలకు (ప్రాథమిక ప్రాపర్టీలు) డిమాండ్ పెరిగింది. అయితే దేశీయ రియల్టీ మార్కెట్లో నల్లధన లావాదేవీలు పూర్తి స్థాయిలో తగ్గిపోలేదు. కాకపోతే గతంలో మాదిరిగా కాకుండా చాలా మంది తుది వినియోగదారులు ఆస్తి లావాదేవీలను పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నారు. చిన్న పట్టణాలు, పెరీ అర్బన్ ఏరియాలలో నేటికీ నల్లధన లావాదేవీలు
జరుగుతున్నాయి.
బ్రాండెడ్ గృహాలకు డిమాండ్..
పెద్ద నోట్ల తర్వాత బ్రాండెడ్, లిస్టెడ్ రియల్టీ కంపెనీలు గృహ విక్రయాలపై మెజారీటీ వాటాను కైవసం చేసుకున్నాయి. దీంతో ప్రధాన నగరాల్లో నల్లధన లావాదేవీలు క్షీణించాయి. మరోవైపు డీమానిటైజేషన్, రెరా, జీఎస్‌టీ తర్వాత గృహ కొనుగోలుదారులు బ్రాండెడ్ డెవలపర్ల ప్రాపర్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో లగ్జరీ ప్రాపర్టీలపై దృష్టి పెట్టిన డెవలపర్లు.. ప్రస్తుతం అఫర్డబుల్, మధ్యస్థాయి గృహాల వైపు దృష్టిని మళ్లించారు. దీంతో ఈ తరహా గృహాల సప్లయి కంటే డిమాండ్ పెరిగింది. దేశంలోని 8 ప్రధాన మార్కెట్లలో 2017 ఆర్థిక సంవత్సరంలోని ప్రాపర్టీ విక్రయాలలో లిస్టెడ్ డెవలపర్ల విక్రయాల వాటా 6 శాతంగా ఉండగా.. గతేడాది ఏప్రిల్–డిసెంబర్ నాటికి 22 శాతానికి పెరిగింది. అలాగే ప్రముఖ నాన్ లిస్టెడ్ డెవలపర్ల వాటా 11 శాతం నుంచి 18 శాతానికి వృద్ధి చెందింది.
బ్లాక్‌మనీ తగ్గింది
Published Sat, Nov 20 2021 4:50 AM | Last Updated on Sat, Nov 20 2021 4:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment