చదరపు అడుగు ధర రూ.7,050
ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 57% పెరుగుదల
సెప్టెంబర్ త్రైమాసికంపై ప్రాప్‌టైగర్ నివేదిక
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో సగటున 7 శాతం పెరిగినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్‌టైగర్ తెలిపింది. దేశవ్యాప్తంగా టాప్–8 పట్టణాల్లో ఇళ్ల ధరలు 7– 57 శాతం మధ్య పెరిగాయని.. అతి తక్కువ వృద్ధి హైదరాబాద్‌లోనే నమోదైనట్టు ప్రకటించింది. హైదరాబాద్ మార్కెట్లో చదరపు అడుగు ధర రూ.7,050కు పెరిగింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.6,580గా ఉంది.
అత్యధికంగా ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లో ధరల పెరుగుదల 57 శాతంగా ఉంది. అక్కడ చదరపు అడుగు ధర రూ.8,017కు చేరింది. డిమాండ్ పెరగడమే ధరల వృద్ధికి కారణమని వివరించింది. ‘‘ఆర్‌బీఐ గడిచిన 10 పాలసీ సమీక్షల్లో రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగించడం ధరలపై మరింత ఒత్తిడికి దారితీసింది. రేట్ల తగ్గింపు లేకపోవడంతో డెవలపర్లు రుణాలపై అధిక వడ్డీ చెల్లింపులు చేయాల్సి వచి్చంది. ఇది ఇళ్ల ధరల అందుబాటుపై ప్రభావం చూపించింది’’అని ప్రాప్‌టైగర్ నివేదిక తెలిపింది.
ఇతర పట్టణాల్లో ధరల పెరుగుదల..
→ బెంగళూరులో ఇళ్ల ధరలు సెప్టెంబర్ త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 15 శాతం పెరిగి చదరపు అడుగు రూ.7,512కు చేరింది.
→ చెన్నైలో 22 శాతం మేర ధరలు పెరిగాయి. చదరపు అడుగు రూ.7,179కు చేరుకుంది.
→ కోల్‌కతాలో ఇళ్ల ధరలు చదరపు అడుగు రూ.5,844కు పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలోని ధరతో పోల్చి చూస్తే 22 శాతం అధికం.
→ ముంబైలో ధరలు 21 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.12,590గా నమోదైంది.
→ పుణెలో 18 శాతం వృద్ధితో చదరపు అడుగుకు రూ.6,953కు చేరింది.
→ అహ్మదాబాద్ పట్టణంలో ధరలు 21 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.4,736గా నమోదైంది.
బలంగా రియల్ ఎస్టేట్ మార్కెట్
ఇళ్ల ధరలు స్థిరంగా పెరుగుతుండడం దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో బలాన్ని, వృద్ధి అవకాశాలను తెలియజేస్తున్నట్టు బీపీటీపీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్) హరీందర్ దిల్లాన్ పేర్కొన్నారు. నాణ్యమైన ప్రాపరీ్టలకు అధిక డిమాండ్ నెలకొనడం ఢిల్లీ ఎన్‌సీఆర్, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లో ధరల పెరుగుదల అధికంగా ఉండడానికి కారణమని చెప్పారు. దక్షిణాది మార్కెట్లలో కొత్త ఇళ్ల ప్రారం¿ోత్సవాలు తగ్గడం మార్కెట్‌లో దిద్దుబాటును సూచిస్తున్నట్టు బీసీడీ గ్రూప్ సీఎండీ అంగద్ బేదీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment