Large banknotes
-
బ్లాక్‌మనీ తగ్గింది
75–80 శాతం తగ్గిన నల్లధనం లావాదేవీలు ∙తుది వినియోగదారులతో గృహాలకు డిమాండ్: అనరాక్ కన్సల్టెన్సీ పెద్ద నోట్ల రద్దు అనే చెట్టు ఫలాలు చేతికొస్తున్నాయి. డీమానిటైజేషన్ తర్వాత దేశీయ గృహ విభాగం గతుకుల రోడ్ల మీద ప్రయాణంలా మొదలై.. నేడు హైవే మీద దూసుకెళుతోంది. ఊహాజనిత కొనుగోళ్లు, విక్రయాలు పూర్తిగా తొలగిపోయాయి. దేశీయ గృహ విభాగంలో నల్లధనం లేదా నగదు లావాదేవీలు 75–80 శాతం మేర క్షీణించాయి. తుది వినియోగదారులతో గృహ విభాగంలో అసలు డిమాండ్ ఏర్పడింది. ఇంటిని ఎందుకు కొంటున్నాం.. ఎందుకు విక్రయిస్తున్నామనే ప్రాథమిక అంశాలను నిర్ధారించుకున్నాకే నిర్ణయం తీసుకునేలా నోట్ల రద్దు మార్చేసింది. సాక్షి, హైదరాబాద్: దేశంలో 2016 నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) అమల్లోకి వచ్చింది. రియల్టీ రంగాన్ని డీమానిటైజేషన్‌కు ముందు, తర్వాత అని విభజించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నోట్ల రద్దు తర్వాత కొత్త గృహాల ప్రారంభాలు క్షీణించగా.. విక్రయాలు పెరిగాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నివేదిక తెలిపింది. తొలి ఏడాది కాలం పాటు గందరగోళం, అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ప్రధాన నగరాల్లోని రియల్టీ మార్కెట్ ప్రతికూలంలోకి వెళ్లిపోయింది. దీంతో గృహాల ప్రారంభాలు గణనీయంగా తగ్గిపోయాయి. డీమానిటైజేషన్‌కు ముందు ((2013 నుంచి 2016 మూడో త్రైమాసికం– క్యూ3) దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సుమారు 16.15 లక్షల యూనిట్లు లాంచింగ్ కాగా.. డీమో తర్వాత (2016 క్యూ4 నుంచి 2021 క్యూ3) 9.04 లక్షల యూనిట్లకు తగ్గాయి. సుమారు 44 శాతం లాంచింగ్‌లు క్షీణించాయి. విక్రయాలలో వృద్ధి.. పెద్ద నోట్ల రద్దుకు ముందు 11.78 లక్షల గృహాలు అమ్ముడుపోగా.. నోట్ల రద్దు తర్వాత 10.37 లక్షల గృహాలు సేలయ్యాయి. తుది వినియోగదారుల కొనుగోళ్లతో ప్రధాన నగరాల్లో రియల్టీ మార్కెట్ బలపడింది. డీమానిటైజేషన్ తర్వాత లగ్జరీ మార్కెట్ కూడా కాసింత ప్రభావానికి లోనైనప్పటికీ.. కరోనా మహమ్మారితో సానుకూల డిమాండ్‌ను కొనసాగిస్తుంది. డెవలపర్లు సప్లయి, డిమాండ్లను నిశితంగా పరిశీలిస్తున్నారని.. విక్రయాలను బట్టి కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తున్నారని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. సరఫరా కంటే విక్రయాలకు డిమాండ్ ట్రెండ్ కొనసాగుతుందని పేర్కొన్నారు. రీసేల్‌పై ఎక్కువ ప్రభావం.. ప్రాథమిక మార్కెట్ కంటే సెకండరీ, రీసేల్ ప్రాపర్టీలపై డీమానిటైజేషన్ ఎక్కువ ప్రభావాన్ని చూపించింది. ఈ విభాగంలోని లగ్జరీ ప్రాపర్టీలు కూడా నగదు లావాదేవీలను ఎక్కువగా కలిగి ఉండటమే ఇందుకు కారణం. డెవలపర్లు విక్రయించే అఫర్డబుల్, మధ్యస్థాయి గృహాలకు (ప్రాథమిక ప్రాపర్టీలు) డిమాండ్ పెరిగింది. అయితే దేశీయ రియల్టీ మార్కెట్లో నల్లధన లావాదేవీలు పూర్తి స్థాయిలో తగ్గిపోలేదు. కాకపోతే గతంలో మాదిరిగా కాకుండా చాలా మంది తుది వినియోగదారులు ఆస్తి లావాదేవీలను పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నారు. చిన్న పట్టణాలు, పెరీ అర్బన్ ఏరియాలలో నేటికీ నల్లధన లావాదేవీలు జరుగుతున్నాయి. బ్రాండెడ్ గృహాలకు డిమాండ్.. పెద్ద నోట్ల తర్వాత బ్రాండెడ్, లిస్టెడ్ రియల్టీ కంపెనీలు గృహ విక్రయాలపై మెజారీటీ వాటాను కైవసం చేసుకున్నాయి. దీంతో ప్రధాన నగరాల్లో నల్లధన లావాదేవీలు క్షీణించాయి. మరోవైపు డీమానిటైజేషన్, రెరా, జీఎస్టీ తర్వాత గృహ కొనుగోలుదారులు బ్రాండెడ్ డెవలపర్ల ప్రాపర్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో లగ్జరీ ప్రాపర్టీలపై దృష్టి పెట్టిన డెవలపర్లు.. ప్రస్తుతం అఫర్డబుల్, మధ్యస్థాయి గృహాల వైపు దృష్టిని మళ్లించారు. దీంతో ఈ తరహా గృహాల సప్లయి కంటే డిమాండ్ పెరిగింది. దేశంలోని 8 ప్రధాన మార్కెట్లలో 2017 ఆర్థిక సంవత్సరంలోని ప్రాపర్టీ విక్రయాలలో లిస్టెడ్ డెవలపర్ల విక్రయాల వాటా 6 శాతంగా ఉండగా.. గతేడాది ఏప్రిల్–డిసెంబర్ నాటికి 22 శాతానికి పెరిగింది. అలాగే ప్రముఖ నాన్ లిస్టెడ్ డెవలపర్ల వాటా 11 శాతం నుంచి 18 శాతానికి వృద్ధి చెందింది. -
ఇక చెల్లవు
ఆసిఫాబాద్ : పెద్ద నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేం దుకు శుక్రవారంతో గడువు ముగిసింది. ప్రధాని మోడీ ఇచ్చిన యాభై రోజుల గడువు చివరి రోజు జిల్లాలోని బ్యాంకులు వినియోగదారులతో కిటకిటలాడాయి. బ్యాంకుల వద్ద భద్రత పెంచినా ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చిం ది. మార్చి 31 వరకు పాత నోట్లు రిజర్వ్ బ్యాం కుల్లో మాత్రమే జమ చేసుకోవచ్చు. కానీ డిపాజిట్ చేసే వారు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అనుమానం వస్తే చర్యలు తప్పవు. గత యాభై రోజులుగా నగదు కోసం సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆర్బీఐ బ్యాంకుల్లో నగదు విత్‌డ్రాపై ఆంక్షలు విధిం చడం, ఏటీఎంలు పని చేయకపోవడంతో ప్రజ లు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. వినియోగదారుల సౌలభ్యం కోసం జిల్లా కేం ద్రం ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీతో పాటు రెబ్బెన, వాంకిడి, సిర్పూర్(టి) మండల కేంద్రాల్లో ఎస్బీహెచ్, ఎస్బీఐ, ఆంధ్రాబ్యాం కు, లక్ష్మీవిలాస్ బ్యాంకులు ఏటీఎంలు ఏర్పాటు చేశాయి. కానీ అవి పని చేయక పోవడంతో నగదుకోసం గంటల తరబడి బ్యాంకుల ఎదుట నిరీక్షించాల్సి వచ్చింది. నిత్యావసరా వస్తువుల కోసం డబ్బు దొరక్క ఇబ్బందులు పడ్డారు. దీంతో పాటు యాభై రోజులుగా బ్యాంకుల్లో సాధారణ లావాదేవీలు జరగలేదు. వినియోగదారుల పాట్లు కరెన్సీ కోసం అల్లాడుతున్న వినియోగదారులు బ్యాంకు వద్ద రద్దీతో అసహనంతో వెనుతిరిగిపోయారు. పెద్ద నోట్ట రద్దు ప్రభావంతో యాభై రోజులుగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసరాలకోసం తాము దాచుకున్న నగదు కోసం వచ్చిన వినియోగదారులు సిబ్బంది పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించి ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ ఎస్బీహెచ్ బ్యాంకు వద్ద కంప్యూటర్లు మొరాయించడంతో కొంత సేపు లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. నగదు విత్‌డ్రా కోసం బ్యాంకులకు వచ్చిన ఉద్యోగులు, రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బ్యాంకు సిబ్బంది పనితీరుపై ముఖ్యంగా మహిళలు, సీనియర్ సిటిజన్లు అవస్థలు పడ్డారు. దీంతో అత్యవసరాల కోసం వినియోగదారులు అవస్థలు పడ్డారు. శనివారం ప్రధాని మోడీ జాతినుద్దేశించి ఎలాంటి ప్రకటన చేస్తారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాల్లో నల్లధనం నుంచి డబ్బులు వేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రధాని ఇచ్చిన యాభై రోజుల గడువు ముగియడంతో ఇక మంచి రోజులు వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు పాత నోట్లు, పెద్ద నోట్ల డిపాజిట్ల వివరాలు చెప్పకుండా బ్యాంకు అధికారులు గోప్యత పాటించారు. -
ఇవి కష్టాల బారులు
సాయంత్రం వరకు తెరుచుకోని ఏటీఎంలు అయినా ఆశతో క్యూ కట్టిన జనం మొరాయించిన సర్వర్లు.. కొద్దిసేపటికే మూత బ్యాంకులకు రెండోరోజూ అదే తాకిడి వృద్ధులు, వికలాంగులు, మహిళల పాట్లు జన్‌ధన్ ఖాతాలపై బడాబాబుల గురి తిప్పికొడుతున్న బ్యాంకు అధికారులు {పభుత్వ సంస్థల్లో పాత నోట్ల స్వీకరణపై వెసులుబాటు స్వీకరణ గడువు 14 అర్ధరాత్రి వరకు పొడిగింపు గురువారం అర్ధరాత్రికే తెరుచు కోవాల్సిన ఏటీఎంలు శుక్రవారం సాయంత్రానికి గానీ తెరుచుకోలేదు.. వాటిలో కూడా చాలావరకు సర్వర్లు మొరాయించడంతో మూతపడ్డాయి.. ఫలితంగా రెండోరోజూ జనం బ్యాంకులకు పోటెత్తారు. చల్లర చికాకులూ వీడ లేదు.. రోజువారీ అవసరాలకు డబ్బుల్లేక కొందరు.. దండిగా పెద్దనోట్లున్నా చెల్లుబాటు కాక ఇంకొందరు కటకటలాడిపోయారు. పనులన్నీ మానుకొని గంటల తరబడి బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల వద్ద నిలువుకాళ్లపై నిరీక్షించారు. మరోవైపు చిల్లర వ్యాపారాలతోపాటు పెద్ద పెద్ద షాపుల్లోనూ పాత నోట్లు తీసుకోకపోవడం.. బ్యాంకుల నుంచి వచ్చిన రూ.2వేల నోట్లకు చిల్లర లేకపోవడంతో వ్యాపారాలు 60 నుంచి 70 శాతం పడిపోయాయి. ఎవరి గోల వారిదన్నట్లు.. నల్లడబ్బున్న బడాబాబులు, ఏవో అవసరాల కోసం పెద్దమొత్తంలో డబ్బులు తెచ్చి ఇళ్ల వద్ద పెట్టుకున్నవారు.. చిరుజీవుల వెంట పడ్డారు. పాత నోట్ల మార్పిడికి వెంపర్లాడారు. బాబ్బాబు.. మా డబ్బు మీ అకౌంట్లోజమ చేయించండి.. అని వేడుకోవడం పలు చోట్ల కనిపించింది. పేదలకు ఉద్దేశించిన జన్‌ధన్ అకౌంట్లలోనూ పెద్ద నోట్లను జమ చేయించేందుకు పలు చోట్ల ప్రయత్నాలు జరిగినా.. అధికారులు అడ్డుకట్ట వేశారు. మొత్తం మీద రెండు మూడు రోజులుగా పేద ధనిక అన్న తేడా లేకుండా అందరికీ పైసాలో పరమాత్మ కనిపిస్తున్నాడు. 14వ తేదీ వరకు పొడిగింపు పెట్రోల్ బంకులు, పాలబూత్‌లు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో పాత పెద్ద నోట్ల చెలామణీ గడువును కేంద్రం పొడిగించింది. వాస్తవానికి ఈ నెల 11 వరకే ఈ కేంద్రాల్లో పాత నోట్లను స్వీకరిస్తారని మొదట ప్రభుత్వం స్పష్టం చేసినా.. పరిస్థితి ఇంకా పూర్తిగా చక్కబడకపోవడంతో ఈ గడువును ఈ నెల 14వ తేదీ అర్థరాత్రి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇది కాస్త ఊరటనిచ్చినప్పటికీ పెద్ద నోట్లకు చిల్లర లేక ఆయా కార్యాలయాలు, బంకుల్లో వాటిని తీసుకునే పరిస్థితి లేక ప్రజలు నరకం చూస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ ఆస్పత్రులు, మీసేవా కేంద్రాలు, రైతుబజార్లు, సూపర్బజార్లు, పెట్రోల్ బంకుల్లో చిల్లర సాకుతో పాత నోట్లను తీసుకోవడం లేదు.